ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”  

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”

ఢిల్లీ లో మేక  చర్మాలు అంటే తోళ్ళ తో పంది ఆకారపు సంచులలో నీళ్ళు నింపుకొని  వీపుకు  లేక బుజానికి  వ్రేలాడ దీసుకొని  ఇళ్ళకు నీళ్ళు చేర్చే వారిని ‘’భిస్టీలు ‘’అంటారు .వీళ్ళు ముస్లిం తెగకు చెందినవారు .మేక తోలును చాలా శుభ్రం చేసి  ఎక్కడా వాసన రాకుండా  నీటి సంచీలు తయారు చేసుకొంటారు .అదొక గొప్ప ప్రక్రియ వాళ్లకు .భిస్టీలను బిరదారీలు అనీ పిలుస్తారు .ఉత్తర భారతం లో ,పాకిస్తాన్ ,నేపాల్ లోని టేరై ప్రాంతం లో ఎక్కువగా ఉంటారు .వీరికి షేక్ అబ్బాసి ,ధుండ్ అబ్బాసి ,సక్వా అనే ఇంటి పేర్లు కూడా ఉన్నాయి .మహారాష్ట్ర లో వీరిని పఖాలి అంటారు .వీరంతా అరబ్ తెగ కు చెందిన వాళ్ళు .వీరిని అబ్బాసి ఆరబ్బులు అంటారు .వీరిది సున్నీ మతం .ప్రముఖ ఆంగ్ల కవి  రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘’గంగా దిన్ ‘’కవిత లో ముఖ్యపాత్ర ఒక  భిస్టీయే .

భిస్టీలు తరతరాలుగా దక్షిణ ఆసియాలో ‘’జలవాహకులు ‘’అనే నీళ్ళు మోసేవారు .భిస్టి అనే మాట పర్షియన్ పదం. ‘’బెహెస్ట్ ‘’నుంచి వచ్చింది .అంటే స్వర్గం అని అర్ధం .యుద్ధాలలో ముస్లిం సైనికులకు నీళ్ళు మోసుకొని వెళ్లి దాహార్తులకు అందించేవారు .అది పవిత్రమైన పని కనుక గౌరవంగా వారిని ఆ పేరుతొ పిలిచేవారు .వీళ్ళు ముఖ్యంగా మేక తోలు సంచీలలో నీరు  తీసుకు వెళ్ళేవారు .ఈ సంచీలను మష్క్ లు   లేక మషక్ లు అంటారు .

గుజరాత్ లోని భిస్టీ లు తాము అక్బర్ పాలనలో ఉత్తరభారతం నుంచి వచ్చామని చెబుతారు .వీళ్ళను కూడా అబ్బాసి ఆరబ్బులు అంటారు .గుజరాత్ ను జయించిన మొఘల్ రాజ సైన్యానికి వీళ్ళు నీళ్ళు మోసుకు వెళ్లి అందించేవారు . భూములు లేని వీరంతా దినకూలి చేసి బ్రతుకు తున్నారు .కొందరు రిక్షాలు లాగుతూ, మరికొందరు బీడీలు చుడుతూ , సిగరెట్ పరిశ్రమలో పని చేస్తూ   సంపాదిస్తున్నారు .గుజరాతీ మాట్లాడతారు ఎక్కువ మంది అహమ్మదాబాద్ లో ఉన్నారు .వీరూ సున్నీలే .ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకొన్నారు .ఎక్కువమంది డియో బిందీ ఉప తెగకు చెందిన వాళ్ళే .

మహారాష్ట్రలో సాంగ్లి, షోలాపూర్,కొల్హాపూర్, పూనా జిల్లాలో కూడా ఉన్నారు .వీరంతా ఉర్దూ భాషలోని ‘’దఖాని ‘’మాండలీకం లోనూ, మరాఠీ భాష లోనూ  మాట్లాడతారు .ఢిల్లీ లోని షేక్ అబ్బాసీలు భారత విభజన సమయం లో పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు .పాకిస్తాన్ లోని కరాచీలో వీరి సంఖ్య ఎక్కువ .మొహాజిర్ అనే పెద్ద తెగలో ఉప తెగ గా అక్కడ ఉంటున్నారు .

ఉత్తర ప్రదేశ్  భిస్టీలు భూమిలేని వారు .జలవాహనం తోపాటు రోజు కూలీలుగా పని చేస్తారు .పండుగ పబ్బాలలో మంచినీటిని సప్లై చేస్తారు .వీరిలో అంతర్వివాహాలు ఎక్కువ అంటే వారిలో వారే పెళ్ళిళ్ళు చేసుకొంటారు .ఉర్దూ తో పాటు ఖరి బోలి మాండలికం మాట్లాడతారు.ఉత్తరప్రదేశ్ అంతటావిస్తరించి  ఉన్నా, వీరు ఎక్కువగా మీరట్, ఆలిఘర్  జిల్లాలో అత్యధికంగా ఉంటారు .

ఢిల్లీ లోని అబ్బాసీలు ఢిల్లీ మునిసిపాలిటీకి వాటర్ సప్లైయర్స్ గా ఉన్నారు .కొందరు మోటార్ మెకానిక్స్ ,కార్పెంటర్స్ , వెల్డర్స్ ,టర్నర్స్ ,ఫిట్టర్స్ ,పెయింటర్స్ గా కూడా పని చేస్తున్నారు .వీరంతా సున్నీ ముస్లిం లే .భారత దేశంలో ఉన్న భిస్టీ లంతా కలిసి  ‘’ఆల్ ఇండియా జమాయిత్ ఉల్ అబ్బాస్ ‘’ అనే సంఘం ఏర్పరచుకున్నారు.ఇది వారి సంక్షేమానికి అభివృద్ధికి హక్కుల  కోసం  పోరాడే సంస్థగా ఉంది .వీరికి ప్రభుత్వం ‘’ఇతర వెనుకబడిన తరగతుల హోదా ‘’ఇచ్చింది . తరతరాలుగా వస్తున్ననీరు మోసే పని క్రమంగా తగ్గి పోవటం తో, బతుకు తెరువుకు ఏదో ఒక పని చేయాల్సి వస్తోంది .వీరందరిలో సంఘీభావం బాగా ఎక్కువ .సమైక్య పోరాటానికి సిద్ధంగా ఉంటారు .ఇప్పటికీ ఢిల్లీ మీనా బజార్ లో మంచినీటి సరఫరా పైపులద్వారా జరగటం లేదు .అంతటి మురికి కూపం ఢిల్లీ మొత్తం మీద లేదు .ఇక్కడి దర్గా దగ్గరున్న 450 ఏళ్ళ బావి ఒక్కటే అందరికి మంచినీటికి ఆధారం .దీనిలో నీళ్ళు 80 అడుగుల లోతులో ఉంటాయి .మెట్రో లైన్ తో ఈ బావి పూర్తిగా ఎండిపోయింది కాని కొద్దికాలం లోనే మళ్ళీ మంచి నీళ్ళు ఊరి దాహార్తి తీరుస్తోంది .అందుకని ఈ బావి ఇక్కడి వారి పాలిట పవిత్ర మైన బావి .భిస్టీ కుటుంబానికి చెందినవారు ఈ పవిత్రమైన నీరు తోడి దాహార్తులకు గ్లాసులలో ఉచితంగా అంద జేసి పుణ్యం మూటకట్టుకొంటారు .

ఏ రాష్ట్రం లో ఎక్కడ ఉన్నా వీరంతా దాదాపు నిరక్షరాస్యులు ,స్వంత భూమి ఒక్క గజం కూడా లేని నిర్భాగ్యులే .జనావాసాలకు చాల దూరం గా దుర్గంధ భూయిష్ట ప్రదేశాలలో జీవిస్తున్నారు . సరైన జీవన సదుపాయాలేమిటో వారికి తెలియదు . ప్లాస్టిక్ గుడ్డ గుడారాలలో ,పొలిమేరల్లో,స్మశానాలలో మురికి వాడలలో  వీరి ఆవాసం అంటే ఆశ్చర్య పోనక్కరలేదు .రాత్రిళ్ళు వారు తాగే బీడీలే వారికి దీపాలు .సమాజం వీరిపట్ల చాల చిన్న చూపు చూస్తూ ఉదాసీనంగా ఉండటం వారిని మరీ కలచి వేస్తోంది .

ఇలా  అత్య౦త పేదరికం లో తరతరాలుగా జీవిస్తున్న భిస్టీ లకూ చరిత్ర లో ఒకే ఒక్క రోజు మహర్దశ ప్రాప్తించింది . ‘’అమృతం’’ సీరియల్ ఫేం ‘’గుణ్ణం గంగ రాజు ‘’తీసిన  ‘’ఏమో గుర్రం ఎగరా వచ్చు ‘’అనే  సినిమాలో లాగా వీరిలో ఒకరికి ఎక్కడో తేనె తుట్ట పట్టి ఆ అదృష్టం  దక్కింది . .

పాత ఢిల్లీ లోని అతి పురాతన భిస్టీ లలో చివరి తరం వాడు మొహమ్మద్ తరతరాలుగా  ఢిల్లీ ఏర్పడటానికి చాలా ముందుకాలం నుంచే  నీళ్ళు మోసే తెగకు చెందినవాడు .1897 లో బ్రిటిష్ నాచురలిస్ట్ ఎడ్వర్డ్ యైత్కెన్ తన ‘’బిహైండ్ ది బాంగలోస్ అనే పుస్తకం లో వీరిని గురించి విపులంగా చర్చించాడు . యూఫ్రటేస్ నదీ తీరం లో క్రీ శ.680 లో జరిగిన  ‘’కర్బాలా ‘’ అనే పౌరాణిక ,పవిత్ర యుద్ధం లో శత్రువు వేసిన బాణం   మహమ్మద్ ప్రవక్త  మనవడు హుస్సేన్ నీటి సంచీని చీల్చేసింది  .గొంతు తడుపుకోవటానికి కూడా చుక్క నీరు  లేక పోవటం తో  ఒంట్లో ఓపిక అంతా నశించి, అతడు పోరాడలేని పరిస్థితిలోఉంటె  శత్రువు అతడిని జయించి చంపేశాడు .హుస్సేన్ ఓటమి, వీర మరణానికి  స్మారకంగా సున్నీ మతస్తులు  మొహర్రం పండుగ దినాలలో ఊరేగింపు చేసి రక్తతర్పణం చేస్తారు .నీటి సంచులు మోయటానికి ముందు భిస్టీలు వీధులలో పారిన రక్తాన్ని, వాటి మరకలను శుభ్రం చేసేవారు ..సరే బాబూ నువ్వు పెట్టిన  హెడ్డింగ్ ఏమిటి ? ఈ సోది ఏమిటి అనుకొంటున్నారా ? దానికే వస్తున్నానిప్పుడు .

రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్  జీవితాన్ని కాపాడి ఒక భిస్టీ చరిత్ర సృస్టించాడు.ఒకరకంగా మలుపే తిప్పాడు .ఎలా అంటారా  ? చరిత్ర పుట తిరగేద్దాం .ఒక సారి హుమాయూన్ ఆఫ్ఘన్ లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రమాద వశాత్తు గంగానదిలో పడి మునిగిపోయాడు .అక్కడే ఉన్న ‘’నిజాం అనే భిస్టి’’ తన మంచి నీటి మేక తోలు సంచీ’’మషక్ ‘’లో ఉన్న నీటిని పారబోసి ,సంచీ  లోకి నోటితో బలంగా గాలి  ఊది ,పూర్తిగా నింపి  హుమాయూన్ కు అందించి దాన్ని  పడవ గా చేసుకొని  నీటిపై తేలుతూ ,నీటి నుంచి ఈదుకొని ఒడ్డుకు చేర్చాడు. తనను కాపాడి ,ప్రాణ భిక్ష పెట్టిన ఆ ‘’భిస్టీ నిజాం’’ కు కృతజ్ఞతగా ఆగ్రా సింహాసనాన్ని ఒక రోజు అధిస్టించి పరిపాలించే అవకాశమిచ్చాడుచక్రవర్తి హుమాయూన్ . .భిస్టీ నిజాం పాలించిన ఆ ఒక్క రోజులో తన నీటి తోలు సంచి ముషాక్ ను చించి, చిన్నచిన్న  ముక్కలు చేసి, వాటికి బంగారు పూత పూయించి తన పేరు ,తాను సామ్రాజ్యాన్ని పాలించిన రోజు లతో ముద్రించి కరెన్సీ గా చలామణి చేశాడు .ఇలా ఒక్క రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించి’’ ఏక్ దిన్ కా సుల్తాన్’’ అని చరిత్ర సృష్టించాడు భిస్టీ నిజాం .ఈ విషయాన్ని భిస్టీ లందరూ చెప్పుకొని తెగ గర్వ పడతారు ,

ఆధారం -5-8-18 ఆదివారం  హిందూ పత్రికలో అమితాంగ్ షు ఆచార్య  రాసిన ‘’ఎ భిస్టి రూల్డ్ యాన్ ఎంపైర్ వన్స్’’ ఆర్టికల్ లో కొద్దిభాగం . మిగిలింది వీకీ పీడియా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-18 –ఉయ్యూరు

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.