బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్ రూపకర్త- యు వి .వర్లు
కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో16-12-1927 న జన్మిచిన శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వర్లు ‘’యు. వి .వర్లు.’’గా సుప్రసిద్ధులు .ఘంటసాలలో సెకండరి విద్య పూర్తి చేసి, బందరు హిందూ కాలేజి లో బి. ఎస్. సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఐ. ఐ .టి. లో చేరి ,ఈ నాడు బి .టెక్. తో సమానమైన ‘’డి .ఎం.,ఐ .టి.ఆనర్స్ డిగ్రీ డిస్టింక్షన్ తో సాధించారు .సాధారణ రైతు కుటుంబం లో జన్మించిన వర్లుగారు ఇంతటి ఉన్నత విద్య అభ్యసి౦చారు అంటే ఆయన ఎన్ని కస్టాలు కన్నీళ్లు అనుభవించారో ,తాను అనుకున్నది ఎలా సాధించాగాలిగారో మనకు అర్ధమౌతోంది .కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అనటానికి ఈయనే సాక్షం .
1954 లో బాంబే లో ట్రా౦బే టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఫండ మెంటల్ రిసెర్చ్ సెంటర్ లో వర్లు అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేరారు .తనకిష్టమైన పరిశోధన పై దృష్టిపెట్టి న్యూక్లియర్ సాధన సంపత్తి పై అధ్యయనం చేశారు .1955 లో కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లో ఉన్న అటామిక్ ఎనర్జీ శాఖలో చేరారు.తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం లో చేరి ,అనేక అణుశక్తి పరిశోధనలలో పాల్గొన్నారు .అత్యుత్తమ శిక్షణ కోసం జపాన్ ,అమెరికా ,జపాన్ దేశాలలో పర్య టించారు .భారత తొలి అణు రియాక్టర్ ‘’అప్సర ‘’రూప కల్పన లో భాగస్వాములైన ముగ్గురు అత్యున్నత సాంకేతిక నిపుణులలో వర్లు గారు కూడా ఒకరు అవటం విశేషం .1957-58 లో అమెరికా , ,ఇంగ్లాండ్ లలో అణు శక్తి పై గాఢ మైన అధ్యయనం చేసిన ఫలితాలు అణు రియాక్టర్ రూప కల్పనకు బాగా తోడ్పడాయి .’’జర్లీనా ‘’అణు రియాక్టర్ తయారీ బృందానికి వర్లు సారధ్యం వహించారు .తారాపూర్ కేంద్రం లో 12 ఏళ్ళపాటు సేవ లందించారు .ఈ కాలం లో రెండు విభాగాల ఏర్పాటు కూ చాల దోహదపడ్డారు .1965 నుండి ఆయన ఆలోచనలన్నీ అణుఉత్పత్తి రంగం పై కేంద్రీకరించారు .కార్బన్ ఫిలిమ్స్ , రెసిస్టర్స్ ల ఉత్పత్తి లో వాటిని దేశీయ పరిజ్ఞానం తో తయారు చేయటానికి ప్రాధమిక స్థాయి ప్రాజెక్ట్ రూపొందించారు ..
1967 లో స్వ రాష్ట్రానికి తిరిగి వచ్చి హైదరాబాద్ లో ఇ .సి .ఎల్ .లో నియమింప బడ్డారు . .ఈ సంస్థను బొంబాయి నుంచి ఇక్కడికి తరలించటానికి వర్లు విశేష కృషి చేశారు.రెసిస్టర్స్ కెపాసిటర్స్ విభాల పర్య వేక్షణ చేశారు .ఎలెక్ట్రానిక్ రంగం లో నిరంతర కృషి కొన సాగిస్తూనే ఉన్నారు .తన అనుభవాన్ని ఆచరణలో పెట్టి ఇక్కడ నాలుగు ప్రత్యేక విభాగాలను నెలకొల్పి వాటి అధిపతి అయ్యారు .అప్పుడు డా .ఎ ఎస్. రావు దీనికి చైర్మన్ .ఆయన ప్రోత్సాహం తో వర్లు ఎలెక్ట్రానిక్ సాంకేతిక రంగం లో అవిశ్రాంత కృషి సల్పారు .కేవలం ఏడేళ్ళ వ్యవధిలో వీరి రెసిస్టర్స్ కెపాసిటర్స్ కోటి రూపాయల ఉత్పత్తి సాధించి కేంద్ర ప్రభుత్వ బంగారు పతాకాన్ని ఈ విభాగం పొందటం వర్లు గారి అమోఘ కృషి ఫలితమే .ఆయన పని చేసిన కాలం సంస్థకూ స్వర్ణయుగమే అయింది .
అమెరికాలో అంతరిక్ష పరిశోధనా సంస్థలో శాటిలైట్ వ్యవస్థను అధ్యయనం చేసిన వర్లు గారికి ఇ.సి. ఐ .ఎల్ ,లో టి.వి. సాంకేతిక అభి వృద్ధి చేయటం నల్లేరు పై బండీ అయింది .ఇక్కడ ప్రత్యేక టి .వి .విభాగం నెలకొల్పారు .ఆంద్ర రాష్ట్ర౦ లోమొదటి శ్రేణి బ్లాక్ అండ్ వైట్ టి. వి.లను రూపొందించిన ఘనత ఉప్పలపాటి వెంకటేశ్వర్లు గారిదే .ఇది ఎలెక్ట్రానిక్ రంగం లో విప్లవం సృష్టించి ,అద్భుతాలు సాధించి సంస్థ కు భారీ లాభాలు తెచ్చి పెట్టింది . .తర్వాత ఉత్తర ప్రదేశ్ సెంట్రల్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు .ఇందులోనూ తన పరిశోధనలు నిరంతరం చేస్తూ ,’’సోలార్ సెల్స్’’ ఉత్పత్తి పై దృష్టి పెట్టారు .ఈ రోజు సౌర శక్తి రంగం లో ప్రపంచ౦ లో ఆగ్రగామి గా ఉన్న ఆరు దేశాలలో భారత దేశం ఒకటి అవటం వర్లు గారి దూర దృష్టికి గొప్ప నిదర్శనం .
న్యూక్లియర్ ఇంజనీరింగ్ లో 1957 లో బ్రిటన్ ,1958 లో అమెరికా లో అత్యుత్తమ శిక్షణ పొందిన వర్లుగారు 1963లో ఇటలీ లో ‘’బేర్ సంస్థ ‘’తరఫున ఒక ఇంజనీరింగ్ ప్రదర్శన నిర్వహించి భారతదేశ కీర్తి ప్రతిష్టలకు పతాకమై నిలిచారు .అధ్యయనం, శిక్షణ కోసం అనేక దేశాలు పర్యటించి ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి సమర్ధతకు మెరుగులు దిద్దుకున్నారు .1974లో ఎలక్ట్రానిక్స్ చైర్మన్ తో పాటు విదేశాలు పర్యటించి విశేష అనుభవం గడించారు . .కేంద్ర ప్రభుత్వం తరఫున విదేశాలతో అనేక ఒప్పందాలను కుదర్చటానికి , భారత్ లో నూతన వ్యవస్థలను నెలకొల్పటానికి వర్లు గారు చేసిన కృషి అద్వితీయం.
1984 నుండి 89 వరకు అయిదేళ్ళు ఎలెక్ట్రానిక్స్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న వర్లు గారు 100 కోట్ల పెట్టుబడి తో ,100 ఎలెక్ట్రానిక్ పరిశ్రమలను స్థాపించటం లో ఘనత పొందారు .రాష్ట్ర ప్రభుత్వ నిధులున్న సంస్థలలో ఉత్పత్తి 30 కోట్ల నుంచి ,400 కోట్లకు భారీగా పెరగటం లో రావు గారి అనన్య సదృశ కృషి ఉంది .1989-90 లో ఉత్పత్తి గరిష్టంగా 500 కోట్లకు పెరగటం విశేషం .
బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ల రూప కల్పనకు విశేష కృషి చేసిన వర్లు కలర్ టి.వి.ట్యూబ్ ల ఉత్పత్తికి అనుమతి సంపాదించటానికి విశ్వ ప్రయత్నం చేశారు .కాని అనుమతి పొందలేక పోవటం ఆయనను తీవ్రంగా కలచి వేసింది .1986 లోనే జపాన్, జర్మని ,అమెరికా దేశాల పర్యటనలో కలర్ ట్యూబ్ ల ఉత్పత్తికి అనుమతులకోసం ఒప్పందాలు సాధించారు .అయినా ఇప్పుడు పరాజయం పొందారు .సాంకేతిక శాస్త్ర వేత్తగా,అణు రియాక్టర్ల రూప కర్తగా ,అనేక కీలక రంగాలలో బహుముఖ ప్రజ్న చూపిన వర్లు గారికి ఏ డాక్టరేట్ లేదు అంటే అవాక్కౌతాం . .అయినా ఐ .ఐ. టి .డాక్టరేట్ విద్యార్ధులకు ఇన్విజి లేటర్ గా ఉన్నారు .
తమ కృషికి తగిన పలు పురస్కారాలు వర్లు పొందారు .1986 లో డా యలవర్తి నాయుడమ్మ అవార్డ్ , రఘుపతి వెంకట రత్నం అవార్డ్ అందుకున్నారు రాష్ట్రం లో సాంకేతిక విద్యా వ్యాప్తి కోసం ‘’వర్లు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ‘’సంస్థ స్థాపించి స్వగ్రామం ఘంట శాలలో సాంకేతిక శిక్షణా సంస్థ ,సాంకేతిక విద్యా బోధనా సంస్థలను గ్రామస్తుల సహకారం తో ఏర్పాటు చేసి సామాజిక వేత్తగా మానవతా మూర్తి గా కూడా వెలుగొందారు ,విజయవాడ కు దగ్గర లో ఉన్న నిడమానూరు గ్రామం లో ‘’ఇన్ కాప్’’సంస్థను ఏర్పరచి ,చైర్మన్ గా ఉన్నారు . ఎపెక్స్ ఫోరం ఆఫ్ ఐ .ఇ. టి.ఇ .కు 2003-04కాలం లో ‘’వైస్ ప్రెసిడెంట్ కం చైర్మన్’’ గా ఉన్నారు .1996 లో ఆయన పేరుమీద ఎండోమెంట్ లెక్చర్ ను ప్రారంభించి ఇప్పటికి 9 ఉపన్యాసాలు హైదరాబాద్ ఐ .ఇ .టి .ఇ .లో జరిపించారు .12ప్రముఖ సంస్థ లకు చైర్మన్ గా ఉన్నారు .అనేక కమిటీలు ,పానల్స్ కు చైర్మన్ గా వ్యవహరించారు . ఎలెక్ట్రానిక్స్ , ఎనర్జీ సబ్జెక్ట్ లపై 12 టెక్నికల్ పేపర్లు ,20 పాలసి పేపర్స్ రచించి ప్రచురించారు . .
పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ లోని ‘’ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్’’సంస్థ కార్యకలాపాలను తీర్చి దిద్దారు . హైదరాబాద్ కాప్రా మునిసి పాలిటి లోని’’ అణుపురం ‘’అని పిలువబడే డా.ఎ .ఎస్. రావు నగర్ లో శేషజీవితాన్ని గడిపారు .2-10-2004 శనివారం శ్రీ వర్లు గారు 77 వ ఏట పరమపదించారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-18 –ఉయ్యూరు