సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు .

సరసభారతికి, నాకు అత్యంత  ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి డాక్టర్ బావగారు ,ఆయన అక్కగారు డా శ్రీమతి అన్నపూర్ణ గారి భర్తగారు ,’’లంపెన్ ప్రోలి టేరియట్’’ కథా శిల్పి శ్రీ రావి శాస్త్రిగారి తమ్ములు౦ గారు అయిన ,  డా శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఎం.డి. గారు .నేను రాసి,  మైనేనిగారు స్పాన్సర్ చేసి ,సరసభారతి   ప్రచురించిన ‘’పూర్వాంగ్లకవుల ముచ్చట్లు ‘’ను 90 వ జన్మ దినోత్సవం 28-8-14  నాడు  అంకితం అందుకున్న ఆంగ్లాంధ్ర కవిత్వ సవ్య సాచి .’’విశాఖ అందానికి  ఏరాడ కొండ  సాహిత్యానికి రాచకొండ ‘’అని లబ్ధ ప్రతిస్టులైన వారు  యవ్వనం లో పట్టిన కాలాన్ని 95 వ ఏట కూడా దించని సాహితీ భిషగ్వరులు ..ఇప్పటికే ‘’సంధ్యా రాగం ‘’ ‘’అయితే ‘’అనురాగాలు –ఆత్మీయతలు ‘’వగైరా వండి  వడ్డించిన కవి .రావి శాస్త్రి కథలకు ఆంగ్లానువాదం చేసిన నేర్పరి .ఇప్పుడు తాజాగా తమ 95 వ జన్మ దినోత్సవ కానుకగా ఆంగ్లం లో విశిస్టకవి రాబర్ట్ బ్రౌనింగ్ భార్య ,ఆయనకంటే ప్రసిద్ధ కవయిత్రి  ‘’ఎలిజబెత్ బెరెట్ బ్రౌనింగ్ ‘’రాసిన పోస్ట్ చెయ్యని ఉత్తరాలవంటి ప్రేమలేఖల లాంటి 44 సానెట్ లను శర్మగారు  తమ అనుభావాన్ని , విద్వత్తును ,తమకున్న ప్రేమ లోతులను కలిపి త్రివేణీ సంగమంగా అనువదించి పుస్తక రూపం తెచ్చి  నాకు ఆత్మీయంగా పంపగా ఇవాళ ఉదయం 11 గంటలకు పోస్ట్ లో చేరింది .అందిందని వారికి తెలియజేద్దామని వారి ఫోన్ ,సెల్ లకు ఫోన్ చేశాను .కాని వారు ఎత్తలేదు . భోజనం చేశాక ఆ పుస్తకం చదివేసి అందులోని మేలిమి ముత్యాలను మీకు తెలియ జేద్దామని కూర్చున్నాను .ఈ పుస్తకాన్ని శర్మగారు ‘’ద్వాదశ భాషా ప్రవీణ ,మేధావి ,సహృదయ గురు తుల్యులు ,వదాన్యులు ,ఇందులోని 20 సోనెట్ ల పరిష్కర్త  బ్రహ్మశ్రీ కోట సుందర రామ శర్మ గారి దివ్య స్మృతిగా  అంకితమిచ్చారు .ఈ పుస్తకం పై’’అవతరణిక ‘’పేరిట విపుల సమీక్ష చేశారు ఆచార్య సార్వభౌమ డా.వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .అది గొప్ప కరదీపిక గా భాసించింది .

‘’ లేడీబ్రౌనింగ్ రాసిన ఈ సానెట్స్ కు ఆంగ్లం లో ‘’పోర్చు గీస్ సానెట్స్’’అంటారు .అంటే పోర్చుగీసు భాషలో  రాసినవి కావు. ఆంగ్లం లో  రాసినవే .వీటిని చదివిన భర్త బ్రౌనింగ్ కవి షేక్స్ పియర్ తర్వాత అంత అద్భుతమైన సానెట్స్ రాసిన వారు లేరని భార్యకు కితాబిచ్చి ,ఆమె చామన చాయలో ఉండటం వలన ‘’పోర్చ్ గీస్ ప్రిన్సెస్ ‘’అని తను ముద్దుగా పిలుస్తూ ఉండటం చేతనూ,ఆమె కిష్టమైన  ‘’కేటరినా టు కామో వెన్స్’’  అనే పోర్చుగీసు ప్రేమ కవితల్లాగా  లయబద్దం గా, తూగు తో ఉండటం వలన ,ఆయన వీటికి ‘’పోర్చు గీస్ సానెట్స్’’అనే అందమైన పేరు పెట్టాడని డా శర్మగారు ఉవాచ .  ఆంగ్లం లో ఈ కవితలు 1806 –నుండి 1846 మధ్యాకాలం లో రాసినవి .సొనెట్ లేక సానెట్ అనేది 14 పంక్తుల ఆంగ్ల కవిత . ఎడమ వైపు ఆంగ్ల కవిత ,కుడివైపు తెలుగు అనువాదం కవిత ఉండటం తో బేరీజు వేసుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది .. ఈ కవిత్వ పొత్తం’’ మొగలి పొత్తు’’ లాగా సువాసన భరితం  .స్కాలిత్యం లేని ముద్రణ ,స్వచ్ఛ తెలుపు మిసిమి పుటలతో  లోపలి కవితలకు సొబగు కూర్చింది .లేడీ బ్రౌనింగ్ ఆంగ్లం లో పెట్టిన వివిధ అర్ధవంతమైన శీర్షికల కవిత్వ డాక్టర్ శర్మగారు దీటైన నామకరణం చేసి అచ్చ తెలుగు కవితలేమో ననిపించారు . నేను ఆ కవితలలోని నాకు నచ్చిన భావాలు,అందాలు ‘’ శర్మగారి మాటలలో

కాకుండా ‘’ నా భాషలో’’ అంది.స్తాను . ప్రేమికుడితో ప్రేయసి అంటున్న మాటలు ఇవి ,పంపిన సందేశాలివి ,గాఢ ప్రేమకు చిహ్నాలివి .ప్రేమికుల భాష తెలిసిన వారికే ఇందులోని ప్రేమైక సౌందర్యం తెలుస్తుంది, అర్ధమౌతుంది . నాకు అంత సీను లేదు కనుక ఏమాత్రం కృతక్రుత్యుడనౌతానో అనే  సందేహం నాకుంది .శర్మగారికి అర్ధాంగి అన్నపూర్ణ గారిపై ఉన్నగాఢ ప్రేమానురాగాలు  ఈకవితల అనువాదానికి బాగా అచ్చి వచ్చాయేమోనని పించింది                              .‘’నీ గుండె నా కూర్మి కి ప్రేమ మూలం అయి ,దోష రహితమైన  నీ కటాక్షం లభించి,ఫలం లభించక పోయినా ప్రేమిస్తూ జీవిస్తాను .నీరసం తో మూర్చ పోయిన నా ఆత్మను ఉద్ధరించి,నిన్నొక్కడినే ప్రేమించే నా ప్రేమను స్వర్ణ సింహాసనం పై నీ ప్రక్కనే కూర్చో బెట్టావు .నా గుండెను యేది తాకినా దుఖం పొంగిపోతుంది కనుక నా జీవిత వస్త్రాన్ని నిర్భయంగా సహన నీరవం తో చించి పారేస్తాను .ప్రేమ  అడుగంటేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను కనుక ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది .నేను ప్రేమ అనే స్వర్గం లో సురక్షితంగా ఉండటం వల్ల  స్పటికం లోని తుమ్మెద లాగా చింత లేకుండా నన్ను చూస్తూ నే ఉంటావు .నా ప్రేమ పెరగటానికి నీ ప్రేమ విశాలం చేయి .సామాన్య ఘోషలు ,ఆదుర్దాల నుండి నువ్వు ప్రశాంత శ్రావ్య గానం ప్రసరించగలవు .మానవ విషమాతి విషమ వ్యాధులకు నీ గానం పరిహారం .అనంతంగా పాటపాడి అలసిన నీకు నీడ నిచ్చే చెట్టు కాని ,విశ్రాంతి నిచ్చే  సమాధి కాని ఔతాను .

‘’నా జుట్టు శోకభారం తో పాలిపోయిన నా చెక్కిళ్ళ  కన్నీటి  చారికలను దాచే కేశాలుగా మిగిలిందేమో ?గిరికి ,ఝరికి,వనాలకు కోయిల కలకూజితం లేనిదే వసంతం హసించదు .మన భావాలు అర్ధం చేసుకోలేని జనం మృత్యు ఘంటికలు వినేదాకా భూమి మీదే చీకట్లో నైనా ఉందాం .స్వర్గ మాదుర్యాన్నే కాదు నీతో ఉండటానికి నా గోరీ ని కూడా వదిలేస్తా .స్వర్గం నుంచి జారిన మంచు బిందువులను తాగటం వలన మన జీవన మల్లికలు అత్యంత తెల్లగా శోభిస్తున్నాయి .పూలకు నమ్మకం మూలమే కదా .శాంత గంభీరమైన నీ అంతరాత్మ లో ,నా హృదయం తెచ్చి జార్చమని ఆజ్న ఇచ్చావు . నెరవేరని విధికి , నక్షత్రాలకు  మధ్యవర్తిగా ఉంటూ ,నీ హృదయం  సహజంగా ,వేగంగా జారి పోయే నా హృదయాన్ని ఎగిసి పట్టుకో .మృత్యువు లాగానే ప్రేమకూడా అతి శక్తి వంతమైనది అని ,మళ్ళీ పుడుతుందని నేను సాక్షమిస్తాను  . నువ్వు నన్ను ప్రేమిస్తాను అనగానే ఎంతో సంతోషించా .కాని నేను నీవాడనే అని రాసిన ప్రేమలేఖ ,వేగంగా కొట్టుకొనే నా గుండెలపై ఉంచటం వలన అందులో సిరా పాలిపోయి అక్షరాలు  కనిపించటం లేదు .నీ మాటలు, వాగ్దానాలు వినీ వినీ మూర్చ పోయాను .మళ్ళీ ఆకాంతి శాంతి నాకు వస్తాయా? .పూర్వపు కూర్మి ,ఇప్పుడూ లభిస్తుందా ? అప్పటి ఆర్ద్రత తోనే పిలు .బదులు పలకటానికి సిద్ధమౌతా .ప్రియతమా సర్వోత్తమా !నీ చెయ్యి నా ఎదపై చేర్చి ఊరట కలిగించు .నీ గుండె విశాలంగా తెరచి .ప్రేమతో తడిసిన పావురపు రెక్కలను పొదవి కొని సమాశ్వాస కల్గించు .కలసిన మన చేతులు విడిపోతాయేమో ననే భయం తో వణికి పోతున్నా .నీసాత్విక దివ్యత్వాన్ని నమ్మిన నేను ఇప్పుడు నమ్మకం కోల్పోయి ఇసక బొమ్మలా అయ్యాను .క్షమించు.  తలపై నుదుటిపై పెదవులపై నువ్వు పెట్టిన మూడు ముద్దులు నన్ను ముకుళిం జేశాయ్ .నన్ను నేనే మర్చి ‘’నాప్రియతమా ,నా స్వకీయ ‘’అని మురిసిపోయాను .ప్రేమ ,విశ్వాసం నీకే ఉన్నాయ్ .నా ఆత్మను పరీక్షలో విసిగించేది ఏదీ నిన్ను మరల్చలేదు .నువ్వు మంచిని మించిన వాడివి . ‘’నిజమైన ప్రేమ ‘’అంటే ఏమిటో చెబుతూ దుఖం లో ,దురవస్థ లో వేచి ఉండటం .ఎదలు రెండూ ఏకమయ్యేదాకా ఓపికపట్టటం నిజమైన ప్రేమ లక్షణాలు .కన్నీటిలో, చిరునవ్వులో, ప్రాణం పోయిన తర్వాత, దైవం  అనుమతిస్తే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’అని చివరి 44 వ సానెట్ ను పూర్తి  చేశారు  .

అందర్నీ ప్రేమించే మనస్తత్వం ఉన్న శర్మగారు ఈ సానెట్ లతో తమ కవితా విశ్వరూపాన్ని ప్రదర్శించారు .తెలుగులో ‘’మరో ప్రేమ లేఖలు ‘’అందించారు .ప్రేమకు శాశ్వతత్వం కలిగించారు .చలం ‘’మ్యూజింగ్స్ ‘’చదివిన అనుభూతి ,వెంకట పార్వతీశ్వర  కవుల’’ ఏకాంత సేవ’’ ,టాగూర్ ‘’గీతాంజలి ‘’భావనకు వస్తాయి  .డా.శ్రీ శర్మగారు డా.శ్రీమతి అన్నపూర్ణ గార్ల దాంపత్యం అన్యోన్యంగా కలకాలం  ఇతోధిక ఆరోగ్యం తో సాగాలని భగవంతుని ప్రార్దిస్తున్నా .  వారినుండి మరిన్ని ఆణిముత్యాలు జాలువారాలని ఆశిస్తున్నాను .వారు అపూర్వ అనురాగ ఆత్మీయతలతో  ఈ  ‘’సానెట్ ‘’ల పుస్తకం నాకు పంపినందుకు కృతజ్ఞతలతో ధన్యవాదాలు,  నమస్సులు తెలుపు కొంటున్నాను .వీరి పరిచయ భాగ్యం శ్రీ  మైనేని గోపాలకృష్ణ గారి చలవే అని మరొక మారు తెలియ జేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-18 –ఉయ్యూరు

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.