ఎవరీ చిత్రరథుడు?
భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ –
‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు ఎవర్రాబాబూ అని చిన్న ఫ్లాష్ ఆలోచన వచ్చింది . తెలుసుకొనే ప్రయత్నం చేసి, తెలిసింది తెలుసుకొన్నది మీము౦దు ఉంచే ప్రయత్నం చేశా . .
మనం గీత ను పారాయణం చేస్తాం .మనవాళ్ళు కొందరు దానిలోని గొప్పతనాన్ని ఉపన్యాసాలలో వివరిస్తారు .దానిలోని ధర్మ సూక్షాలు తెలియ జేస్తారు .చదివే మనం కాని ,చెప్పే వాళ్ళు కాని శ్లోకం లో ఉన్న పేర్లలోని విశేషాల గురించి ఆలోచించం .తెలుసుకోవాలనే ధ్యాస జిజ్ఞాసా కూడా ఉండదు .ఇది లోక సహజం .ముక్కస్య ముక్కః గా ‘’పరమాత్మ ఏం చెప్పాడంటే వృక్షాలలో తాను అశ్వత్ధ వృక్షాన్నని ,దేవ మునులలో నారడదుడనని గంధర్వ్వులలో చిత్ర రథుడ నని ,సిద్దులలో కపిల ముని నని చెప్పాడు .’’అనిముగిస్తాం .కనుక నాయనలారా అశ్వత్ధ వృక్షాన్ని ,నారదుడిని ,చిత్ర రథుడిని ,కపిల మహర్షి ని పూజిస్తే ఆయన్ను పూజించినట్లే అంటాం .రావి చెట్టు దేవాలయాలలో, గ్రామాలలో రచ్చబండ వద్ద ఉంటాయికనుక వాటికి పసుపు కుంకుమలు పెట్టి కాదుకాదు రుద్ది వీలయితే కోరికలు తీరటానికి ఉట్లు కట్టి పూజిస్తాం .లేక అనంతపురం దగ్గరున్న ‘’విదురాశ్వత్ధం’’వెళ్లి చూసి ఆహో ఇక్కడే విదురుడు ఈ చెట్టు కింద తపస్సు చేశాడని చెప్పుకొంటాం .పనిలో పనిగా లేపాక్షి వెళ్లి అక్కడి జగత్ప్రసిద్ద నందిని చూసి మురిసిపోతాం .అక్కడి వీరన్న విరూపాక్ష సోదరుల కధ తెలుసుకొంటాం .విరూపన్న కళ్ళను గోడకేసి కొట్టిన చోటు చూసి అయ్యో పాపం అనుకొంటాం .కాని శ్లోకం లో ఉన్న చిత్ర రథుడి గురించి పట్టించుకోం .ఎవరోలే ఎవరైతే నేమిలె అని ఉదాసీనం గా ఉంటాం . కృష్ణ పరమాత్మ అతని పేరు చెప్పాడు అంటే అందులో ఏదో గొప్పతనం ఉండి ఉండాలి అన్న స్పృహ సహజంగా మనకు రాదు .నాకు తెలిసినంత వరకు తెలుసుకోన్నంత వరకు తెలియ జేస్తా .
భారతం లో చిత్ర రధుని పాత్ర వస్తుంది .అతనికి అంగార పర్ణుడు అనే పేరుంది .గంధర్వ రాజు .కుబేరునికి పరమ మిత్రుడుకూడా .ద్రుపద నగరానికి పాండవులు వెడుతున్నప్పుడు ఒక రోజు రాత్రి ,అతడు తన స్త్రీలతో విహరిస్తుండగా వాళ్ల పాద ధ్వనిని విని ‘’ఎవరుమీరు ?ఎక్కడికి వెడుతున్నారు ?’’ఇది నాకు చెందిన అడవి .నా అనుమతి లేకుండా నిస్సంకోచంగా రాత్రి వేళ సంచరిస్తున్నారు .ఈ అరణ్యం ,ఇక్కడున్న గంగానది అంగార పర్ణుడివి అని మీకు తెలియదా ‘’అనికోపం తో కేకలు వేస్తూ అడిగాడు .అప్పుడు అర్జునుడు ‘’ఈ నదిలో ఎవరు స్నానం చేస్తే వాళ్ళది అవుతు౦ది కాని నీకుగుత్తాదిపత్యం కాదు .సముద్రం, నది, పర్వతాలు, అడవులు ఎవరో ఒక్కరికి చెందినవికావు .సమస్త జనులకు వాటిపై అనుభవించే హక్కు ఉంది .నువ్వు వద్దన్నమాత్రాన మేము వెనక్కి పోతామనుకొన్నావా ?.గంధర్వులంటే భయపడి శక్తిలేని సామాన్య మానవులు పూజిస్తారు కాని వీరులు కాదు . మమ్మల్ని అడ్డగించటానికి , ఆపటానికి నీకు హక్కులేదు .గంగానది దివిజగంగ .పాపాలను క్షాళనం చేస్తుంది .శాశ్వతమైనది .ఆపవిత్ర నదీమ తల్లి పై హక్కు ఉందనటం మూర్ఖత్వం ‘’అని జవాబు ఘాటుగానే ఇచ్చాడు .
తనను ఎదిరించే వాడువచ్చాడన్న కోపం అసూయతో వాడు అర్జునిపై బాణాలు వేసి గాయపర్చాడు .సర్పాస్త్రాన్ని వాడు సంధిస్తే ,అర్జునుడు కూడా వెనువెంటనే శర సంధానం చేసి వాడిని తీవ్రమైన బాణాలతో నొప్పించి అగ్ని అస్త్రం ప్రయోగించాడు .కొంత సేపు ఇద్దరిమధ్య భీకర పోరాటమే జరిగింది .’’శస్త్రాస్త్ర ప్రయోగం తెలిసిన వీరుడిపై ,తెలియని అస్త్రాలు ప్రయోగించటం తెలివి తక్కువ పని, వ్యర్ధం కూడా.అగ్ని తత్త్వం తెలుసుకోకుండా అంగార పర్ణుడు అనే పేరు పెట్టుకొని కులుకుతున్నావు .అంటే అగ్ని హోత్రునికే ద్రోహం చేస్తున్నావు కనుక నువ్వు శిక్షార్హుడవే ‘’అని హెచ్చరించి చెప్పాడు గాండీవి . కాని అంగారపర్ణుడు అర్జునుని ధాటికి నిలవలేక ఓడిపోయాడు . ఫల్గుణుడు ఆ గ౦ధర్వ ని జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటూ అన్న ధర్మరాజు పాదాల చెంత పడేశాడు .ఇంతలో విషయం తెలిసిన అంగార పర్ణు ని భార్య గోడుగోడున విలపిస్తూ వచ్చి తనకు పతి భిక్ష పెట్టమని యుదిస్టిరుని వేడుకొన్నది .ఆమె పై జాలిపడి ఆతడిని వదిలేయమని తమ్ముడికి చెప్పాడు . అర్జునుని శౌర్య బలపరాక్రమాలు గ్రహించి మెచ్చుకొన్న అంగార పర్ణుడు ,అప్పటినుంచి తాను అంగార పర్ణుడుగా పిలువబడనని,తన రధం చిత్ర గతులతో నడుస్తుంది కనక చిత్ర రధుడనే పేరు వచ్చిందని దాన్నికూడా అర్జునుడు ధ్వంసం చేశాడుకనుక ఆపేరూ ఇక ఉపయోగించుకోనని చెప్పాడు . అర్జునునితో స్నేహం చేయాలని అభిలషించాడు .అంతేకాదు పార్దుడికి ‘’చాక్షుషి ‘’అనే గ౦ధర్వ విద్య ఉపదేశించాడు . ఈ విద్యను ఇస్తూ అతడు ‘’ మనువు సోముడు అంటే చంద్రునికి బోధించాడు .సోముడు అంతరిక్ష దేవత .అగ్ని పృథ్వి దేవత .ఇంద్రుడు దేవతలకు అధిపతి .చంద్రుడు విశ్వావసు అనే గాంధర్వ రాజుకు ఉపదేశించాడు .విశ్వావసు గంధర్వ రాజు నైననాకు ఆ విద్య నిచ్చాడు .చాక్షుషి విద్యవలన దివి ,భువి అంతరిక్షాలలో దేన్ని చూడాలనుకొంటే దాన్ని, ఏ రూపం లో కావాలంటే ఆ రూపం లో చూడగలుగుతారు ..ఈ విద్య స్వాధీనం కావాలంటే ఆరునెలలు కఠోర అనుష్టానం చేయాలి .ఈ విద్యవలననే మా గంధర్వులు మనుష్యులకంటే ఉత్తమజాతి వారయ్యారు .దేవతలకు సములయ్యారు .’’అని వివరించాడు .
అతేకాడు చిత్ర రధుడు పాండవులకు ఒక్కొక్కరికి 100 వాజీ లు అనే ప్రత్యేక గంధర్వలోకం లో ఉపయోగించే అశ్వాలను ఇచ్చాడు .వీటిని దేవగంధర్వ అశ్వాలు అంటారు .అత్యుత్తమ జాతి గుర్రాలివి .అవి కృశించినా, బలహీనమైనా వాటి వేగం ఏమాత్రమూ తగ్గదని చిత్రరథుడు చెప్పాడు . ఈ వాజీ లు ఏరంగుకావాలంటే ఆ రంగును, యెంత వేగం కావాలంటే అంతవేగం పొందగల ప్రత్యేక లక్షణాలు కల దివ్యాశ్వాలు .యజమాని అనతరంగాన్ని అర్ధం చేసుకొని ప్రవర్తించే ప్రత్యేక లక్షణం వీటిది .గంధర్వులలో ఉత్తమ జాతి వారు దేవతలతో సమానమైనవారు ,కొంచెం తక్కువజాతివారు సామాన్య మానవులతో సమానమై’’ నరులు ‘’అని పిలవబడుతారని చెప్పాడు.
అర్జునుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి తనకు చాక్షుషి విద్య , వాజీలు అవసరం లేదని చెప్పాడు .కాని అతడు తనకు ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతగా తీసుకోవాల్సిందేనని బ్రతిమిలాడాడు .అర్జునుడు కూడా దీనికి బదులుగా తన అగ్ని అస్త్రాన్ని అతడిచ్చిన వాజీలకు బదులుగా ఇచ్చాడు .పాండుకుమారుల జన్మ రహస్యాలు తనకు తెలుసునని ,వారు యమ ,ఇంద్ర వాయు అశ్వినీ దేవతల వర జన్ములని ,వారి పౌరుష పరాక్రమాలూ తనకు అవగతమేనని చెప్పాడు .గంధర్వులకు రాత్రివేళ పరాక్రమం ఎక్కువ అని ,అర్జునుని బ్రహ్మ చర్యం,ధర్మ వర్తనం వలననే తాను అతని చేతిలో ఓడిపోయానని అన్నాడు .అర్జునుని మాటిమాటికీ ‘’తాపత్యా ‘’అని సంబోధిస్తుంటే ఎందుకు అలా అంటున్నావో చెప్పమని అడిగాడు .అప్పుడు అతడు ‘’దేవలోకం లో తపతి సౌందర్య రాశి .ఆమె చిన్నతనం లోనే ఆమెను వివాహమాడాలని దేవ గాంధర్వ యక్ష రాక్షసులు ఉవ్విళ్ళూ రారు .యుక్త వయసు రానిదే పెళ్లి చేయనని తండ్రి వివస్వుడు అన్నాడు .సంవర్ణు డు అనే అందమైన వినయవిదేయతలు ధర్మపాలన ఉన్న యువ మహారాజు తనకూతురుకు తగిన వరుడు అని నిశ్చయించాడు .అతడు క్షత్రియ కన్యకు బ్రాహ్మణుడికి జన్మించాడు .క్షత్రియ విద్యలలో ఆరితేరినవాడు .నర్మదానదికి ఉత్తర ,దక్షిణభాగాలన్నీ అతని ఏలుబడి ఉన్నాయి .ఒక రోజు వనవిహారం లో తపతి కన బడి అతని మనసు లాగేసింది .ఎవరు నువ్వు అని అడిగేలోపు సిగ్గుతో అదృశ్యమైంది .మళ్ళీకనబడితే గాంధర్వ వివాహం చేసుకొందామని అంటే ఆమె తాను తండ్రి సంరక్షణలో ఉన్నానని ఆయన అనుమతి అవసరమని చెప్పింది .
తపతిపై గాఢ ప్రేమలో పడి ,అదే ధ్యాసగా ఉన్న అతడిని వశిస్టమహర్షి కలిసి ఉపాయంగా తపతిని అతనికి పెళ్లి చేసి రాజ్యపాలన మంత్రికి అప్పగింప జేసి , నర్మదానది పర్వతాలలపై విహరి౦చమన్నాడు .కాని రాజ్యం లో 12 ఏళ్ళు వర్షాలు లేక కరువుకాటకాలేర్పడ్డాయి ..అప్పుడు మహర్షి ,నూతన దంపతులను రాజ్యానికి రమ్మని కోరాడు .వారురావటం తో వర్షాలు కురిసి భువి సస్య శ్యామలమైంది .సంవర్ణ ,తపతుల కుమారుడే కురు అంటే మీ వంశ పూర్వీకుడు .అందుకే నిన్ను తాపత్యా అన్నాను ‘’అని వివరంగా చెప్పాడు అర్జునునికి చిత్ర రధుడు .తన పూర్వీకుని వృత్తాంతం సవిస్తరంగా తెలియ జేసినందుకు కృతజ్ఞత తెలిపాడు .
చిత్ర రథుడు ధర్మరాజుతో లోక హితము ,ధర్మ సూక్ష్మాలు తెలియ జెప్పే పురోహితుని ఏర్పాటు చేసుకో మని సూచించాడు .అలాంటి వారెవరున్నారని అడిగితే ‘’ధౌమ్యుడు ‘’ఉత్తమజాతిబ్రాహ్మణుడ ని ఆయనను పురోహితునిగా చేసుకోమని సలహా ఇచ్చాడు .కనుక సకల ధర్మ శాస్త్రాలు తెలిసిన నీతి కోవిదుడు గా చిత్ర రధుడు మనకు కన్పిస్తాడు .గ౦ధర్వ రాజులలో ఇంతటి బుద్ధి సూక్ష్మత ఉన్న వారులేరు .కనుకనే శ్రీ కృష్ణుడు ‘’గంధర్వాణా౦ చిత్రరదః ‘’అని నొక్కి వక్కాణించాడు .’’ఇంట లెక్ట్’’ ఎక్కడ ఉంటే పరమాత్మ అక్కడ ఉంటాడుకదా .
రామాయణం లో ఒక చిత్ర రథుడున్నాడు .ఈయన దివి రథుని కుమారుడు .ధర్మ రధుని పుత్రుడు .ఇతని మొదటి పేరు చిత్రరథుడు .అంగ దేశ రాజు .ఇతడినే రోమపాదుడు అంటారు దశరధమహారాజుకు మంచి మిత్రుడు .దశరధుడు తనకూతురు శాంతను రోమపాదునికిచ్చి వివాహం చేశాడు .చాలాకాల౦ సంతానం లేకపోవటం తో దానధర్మాలు విరివిగా చేశాడు భార్యతోకలిసి .ఒకసారి ఒక బ్రాహ్మణుడు దానం పుచ్చుకొని, ఇంటికి వెళ్లి కొడుకును కూడా తెచ్చి అతడికి ఆవును దానం ఇమ్మని కోరాడు. బ్రాహ్మణుడి ఆశాపాతాన్ని చూసి రోమపాదుడు నవ్వగా ఆయన రాజ్యంలో అనావృస్టి కలగాలని శపించాడు .బ్రాహ్మణ అవమానానికి విప్రులు దేశంవదిలి వెళ్ళిపోయారు . అంగ దేశం అనా వృష్టి తో కుంగిపోయింది .ఏరకమైన కల్మష కాపట్యాలు లేని బ్రహ్మచారి అయిన ఋష్యశృంగుడు వస్తేనే వర్షాలు పడతాయని గ్రహించి ఆయన్ను తీసుకురావటానికి వేశ్యలను పంపాడు .ఆడవాళ్ళు అనే వారు ఉంటారని అస్సలు తెలియని ఆయన ,వాళ్ల ఆకర్షణకు లోనై వాళ్ళతో వెళ్ళగా సు వృష్టి కురిసి పంటలుబాగా పండి కరువు నశించింది .రోమపాదుడికి సంతానం కలగటానికి ఋష్యశృంగుడు ఇంద్రుని గూర్చి ఇష్టి నిర్వహించాడు .చతురంగుడు అనే కుమారుడు పుట్టాడు .
కురు కుమారులలో ఒక చిత్ర రథుడున్నాడు .అంగరాజు. చిత్ర రధుని భార్య ,దేవ శర్మ అనే బ్రాహ్మణుడి భార్య అక్కా చెల్లెళ్ళు .మరో చిత్రరథుడు లక్ష మంది భార్యలున్న ఒక రాజు శశి బిందుని కొడుకు .ఒక్కోపెళ్ళానికి అనేకమంది కొడుకులు .
ఇందరిలో చుక్కల్లో చంద్రుడు అర్జునునికి చాక్షుషి విద్యనూ వాజీ లను ఇచ్చిన అంగార పర్ణ చిత్ర రధుడే మనకు కావలసినవాడు కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-18 –ఉయ్యూరు