లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్ రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ
ఒరిస్సా రాష్ట్రం బరం పురం లోతెలుగు బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ కోట హరినారాయణ 194 3లో జన్మించారు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై ,బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరి ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు .బొంబాయి ఐ .ఐ .టి.లో పి.హెచ్ .డి .చేశారు .ఉన్నతవిద్య నంతా మనదేశం లోనే పూర్తి చేసి దేశీయంగా ఎదిగిన ఉత్తమశ్రేణి శాస్త్రవేత్త శ్రీ హరి నారాయణగారు .
దేనికీ విదేశాలపై ఆధారపడరాదన్ననిశ్చల మనోరధమున్నవారు .1967 లో హిందూస్థాన్ ఏరో నాటికల్ లో ఉద్యోగం లో చేరారు .1970 రక్షణ పరిశోధన సంస్థ ‘’డి. ఆర్. డి .వో.కు బదిలీ అయి ,సుమారు 12 ఏళ్ళు అనేక కీలక పదవులలో రాణిస్తూ తనకిష్టమైన పరిశోధనలు చేస్తూ ఎదిగారు .1982 లో మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న హిందూస్థాన్ ఏరో నాటికల్ ( హెచ్. ఏ .ఎల్ )లో చీఫ్ డిజైనర్ గా గురుతర బాధ్యతలు చేబట్టారు .మిగ్ -21 విమాన ఆయుర్దాయాన్ని పెంచటం లో సఫలీ కృతులయ్యారు . అంతే కాక దాని సామర్ధ్యాన్ని పెంచి ,బరువు తగ్గించటం లో విజయం సాధించారు .దీనివల్ల మనదేశం మిగ్ -21 విమానాల విడిభాగాల ఉత్పత్తి చేసే సామర్ధ్యం సాధించి ప్రగతిపధం లో దూసుకు వెళ్ళింది .
డా నారాయణ 1985 లో బెంగుళూరు ఏరో నాటికల్ డెవలప్ ఎస్టాబ్లిష్ మెంట్ లో డైరెక్టర్ అయ్యారు .అప్పటికే ఆయన లైట్ ఎయిర్ క్రాఫ్ట్ నిర్మాణం లో బహు పరిశోధనలు చేసి దాన్ని ఎల్ .ఎ .సి .ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సాకారం చేశారు .తన శక్తియుక్తులు సామర్ధ్యం ,సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలబోసి ‘’లైట్ కా౦బట్ ఏర్ క్రాఫ్ట్’’అంటే LCA అనగా తేలికపాటి యుద్ధ విమానం తయారు చేసే ప్రోగ్రాం డైరెక్టర్ అయ్యారు .ఎల్. సి.ఎ. విమానం తయారు చేసి విజయవంతంగా ఫ్లైట్ పరీక్షలు నిర్వహించారు .పరిమిత ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది .హరి నారాయణగారి మేధో వికసనం వలన భారత దేశం తేలిక పాటి యుద్ధ విమాన ఉత్పత్తి లో ప్రపంచ దేశాల స్థాయిన నిలబడింది. ‘’హాట్స్ ఆఫ్ టు నారాయణ్ జీ’’.. ఈ ఘనత ఆయన సాధించినట్లు మనకు తెలియనే తెలియదు .
LC A విజయం తో ప్రముఖ శాస్త్ర వేత్తగా గుర్తింపుపొందిన హరి గారు దేశ గౌరవ ప్రతిష్టలకు అత్యున్నత స్థానం సాధించి పెట్టారు .ఆధునిక కాలం లో విజయాలకు యుద్ధ విమానాలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నమ్మకం . నెహ్రూ కాలం లో మనదేశం చైనా యుద్ధంలో దారుణంగా ఓడిపోవటానికి కారణం శత్రువు పై ప్రయోగించే అత్యాధునిక ఆయుధ సామగ్రి మనకు లేకపోవటమే .తర్వాత పాకిస్తాన్ పై యుద్ధ విజయానికి మన యుద్ధ విమానాలే కీలకమయ్యాయి .వీటిని ఇతర దేశాలనుంచి కొని తెచ్చుకొంటే తడిసి మోపెడౌతుంది కనుక స్వదేశీ యుద్ధ విమానాలకే మొగ్గు చూపారు .అన్నిరకాల యుద్ధ విమానాల తయారీకి నడుం కట్టారు .దీనికి తగినట్లుగా స్పందించి కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలను మంజూరు చేసింది .
మొట్టమొదట బెంగుళూరు HAL లో ఏటా 8 LCA ల ఉత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేసింది.నౌకాదళ తీర సంరక్షణలో కీలకం కనుక దానికి ఉపయోగ పడేట్లు ఒకే ఇంజన్ ఉన్న LCA లను కూడా తయారీ చేసింది వీటికి ”తేజస్” అని పెట్టారు . .ప్రపంచం లోనే ఇలాంటి వాటి తయారీలో భారత దేశమే ముందుంది .దీనికి ముఖ్యకారణం తెలుగు బిడ్డ డా కోట హరినారాయణ గారు అని మనం గర్వపడాలి .తేలిక యుద్ధ విమానాల తయారీ లో 300 పరిశ్రమలు ,40 విద్యా సంస్థలు ,ఎన్నో పరిశోధనా సంస్థల భాగస్వామ్యముంది .దాదాపు మూడు దశాబ్దాలవరకు LCA కు దీటైన యుద్ధ విమానం రాదు, రాలేదు, రాబోదు అని హరినారాయణ పాంచజన్యం పూరించి చెప్పినట్లు చెప్పారు .అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ,ప్రతిభ , పోరాట పటిమ ,నైపుణ్యం దృష్ట్యా ప్రపంచం లో దీన్ని’’ బీటౌట్ ‘’చేసే ‘’కాంబట్ ప్లేన్’’ లేదని అభిజ్నులంటారు .ఈ విజయం అంతసులువుగా లభించలేదు .అమెరికా పెట్టె ఎన్నో ఆంక్షలు ,రూపకల్పనలో అడ్డంకులు అధిగమించి,దీక్ష ,దక్షత , ముందుచూపు ,లక్ష్యసాధన , అంకితభావం లతో విజయ శిఖరాలకు చేరారు .అందుకే వీరికి 2002 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది ‘.
దీనికి ముందే డా హరి గారికి DRDOవారి టెక్నాలజీ నేతృత్వ బహుమానం ,డా యలవర్తి నాయుడమ్మ అవార్డ్ ,శాస్త్ర సాంకేతిక రంగ రూప కల్పనకు ఇచ్చే జి. డి .మోడీ. అవార్డ్( 20 06) మొదలైన పురస్కారాలెన్నో పొందారు .ఏరో నాటికల్ ఇండియా లో దాని అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం సేవ చేసి ,20 02 లో అబ్దుల్ కలాం గారిలాగా స్వచ్చంద పదవీ విరమణ చేశారు.హైదరాబాద్ లో సెంట్రల్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా విద్యార్ధుల భవితవ్యాన్ని తీర్చి దిద్దుతూ, వారిని భవిషత్ శాస్త్ర వేత్తలుగా మలిచే ప్రయత్నం చేశారు .లాక్(LCA) రూప శిల్పి అయిన డా . హరినారాయణగారిని ‘’లాక్ మాన్ ‘’గా సంబోధిస్తారు .కలాం గారిని’’మిసైల్ మాన్ ‘’అన్నట్లే. ఇదికూడా సార్ధకం అయింది.నారాయణ గారి పరిశోధనలు LCA కు మాత్రమె పరిమితం కాలేదు .ఏవియోనిక్స్ ,ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ మొదలైన అత్యాధునిక ఏరో నాటికల్ టెక్నాలజీ అభివృద్ధికి కూడా అనితరసాధ్యమైన కృషి చేశారు .భారత దేశపు మొదటి సూపర్ సానిక్ ఫైటర్ఏర్ క్రాఫ్ట్ సృష్టికర్త ,యుద్ధ విమాన నిర్మాణం లో భారత్ ను అగ్రదేశాల సరసన కూర్చో బెట్టిన ప్రతిభామూర్తి డా కోట హరినారాయణగారు .శ్రీ మన్నానారాయణుడైన శ్రీహరికి సుదర్శన చక్రం అలంకారం శత్రు సంహార ఆయుధం అయినట్లు ,డా హరినారాయగారికి మిగ్ , లాక్ సూపర్ సానిక్ లు కీర్తికి అలంకారాలు , భారత దేశ భద్రతకు దివ్యాస్త్రాలు .,
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-10-8-18 –ఉయ్యూరు
—