ఎవరీ అర్యముడు ?
దీన్తస్సాదియ్యా ఏదైనా మనసు లో పడితే అదేమిటో తెలుసుకొనే దాకా తోచదు .మళ్ళీ ఇవాళ గీత విభూతి యోగం లో శ్లోకమొకటి ఆలోచనకు పదును పెట్టింది –
‘’అన౦తశ్చాస్మి నాగానాం ,వరుణోయాదసామహం –పిత్రూణామర్యమా చాస్మి యమః సంయతామహం ‘’
నాగులలో అనంతుడు అంటే ఆదిశేషు డను ,జలం ఇచ్చే వాళ్ళలో వరుణుడను ,పితృ దేవతలలో అర్యముడను ,అణచి ఉ౦ఛేవాళ్ళలో యముడను నేను అని భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ .
అందరూ మనకు కొద్దో గొప్పో పరిచయమున్నవాళ్ళే.కాని అర్యముడి గురించి నాకు పెద్దగా తెలియదు .కనుక తిరగేయాల్సి వచ్చింది .తెలిసిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను .అర్యముడు వేదకాలం నాటి దేవత .ఆపేరు లో దగ్గర స్నేహితుడు అని ,సహచరుడు అని అర్ధాలున్నాయి .ఆదిత్యులకు తల్లి అయిన అదితి కుమారుడే అర్యముడు .తండ్రి కశ్యప ప్రజాపతి .’’మధ్యోదయ సూర్య చక్ర౦ ‘’గా కూడా వర్ణిం బడ్డాడు .
ఋగ్వేద సంహితలో ఆడ జాతి గుర్రాల సంరక్షకుడుగా చెప్ప బడ్డాడు .ఋగ్వేదం ఆదిత్యులు –వరుణ ,మిత్ర ,సూర్య ,చంద్ర ,కామదేవ ,అగ్ని ఇంద్రులనే ఏడుగురినే చెప్పింది .ఎనిమిదవ వాడైన మార్తా౦డుని అదితి అంగీకరించలేదు కనుక సంఖ్య 7 మాత్రమే ..కానీ యజుర్వేద సంహిత 8 గా పేర్కొన్నది .ఎనిమిదవవాడు వివస్వుడు .కాని ఋగ్వేదం లోని మరోంత్రం తొమ్మిది మంది ఆదిత్యులున్నట్లు చెప్పింది .ఎనిమిదవవాడు మార్తా౦డుడు అన్నది .ఇతడే తర్వాత వివస్వుడు అయ్యాడు .తన ఏడుగురు కొడుకులతోకలిసి అదితి పూర్వ వయసు పొందింది .మార్తా౦డునికి జన్మనిచ్చి మళ్ళీ చనిపోయింది .రుగ్వేదాదిత్యులు దేవతలు .వీళ్ళు మరుత్తులు లేక విశ్వే దేవులకంటే ఉన్నతులు .
భాగవత పురాణం విష్ణు ,ఆర్యమ ,ఇంద్ర ,త్వష్ట ,వరుణ ,ధాత ,భగ ,పర్జన్య లేక సవిత్రు ,వివస్వ ,అంశుమాన్,మిత్ర ,పూష అనే 12 మంది ఆదిత్యులను చెప్పింది . వీరే ద్వాదశాదిత్యులు.ఒక్కో నెలలో ఒక్కో ఆదిత్యుడు సూర్యుడుగా ప్రకాశిస్తాడు .ఇంద్ర ,సూర్యులు దేవతల శత్రువులసంహారం చేస్తారు .ధాతగా ప్రాణుల సృష్టి చేస్తాడు .పర్జన్యుడిగా వర్షాలు కురిపిస్తాడు .త్వష్ట గా మొక్కలలో వృక్షాలలో ,ఔషదులలో ఉంటాడు .పూషగా ఆహార పదార్ధాల ను వృద్ధి చేస్తాడు .అర్యముడిగా వాయువు అవుతాడు .భగుడుగా ప్రాణుల శరీరాలలో ఉంటాడు .వివస్వతుడుగా ఆహారపదార్ధాల పచనానికి సహకరిస్తాడు .అంటే వంటకుపయోగాపడుతాడు .విష్ణువుగా దేవతలశతృ సంహారం చేస్తాడు .అంశు మంతుడుగా వాయువు చేసేపనే చేస్తాడు .వరుణుడు గా వర్షాలు కురిపిస్తూ నీటికి అధిదేవతగా ఉంటాడు .మిత్రుడుగా చంద్రునిలో ,సముద్రాలలో ఉంటాడు .
అంతరిక్షం లో పాలపుంత అర్యముడి మార్గం.వరుణ ,మిత్ర ,భగ, బృహస్పతి మొదలైన ద్వాదసాదిత్యులతో పాటు అర్యముని సంస్మరించి ప్రార్ధిస్తారు .అర్యముడు మిత్ర, వరుణులతో సమాన స్థాయి ఉన్న ఉత్తమ దేవత గా ఋగ్వేదం చెప్పింది .స్వర్గాధిపతి ,వేద దేవత అయిన ఇంద్రుడుకూడా అర్యముని వరాలకోసం ,కానుకలకోసం ప్రార్ధిస్తాడని ఋగ్వేదం అంటోంది .కనుక దేవేంద్రునికంటే అర్యముడు గొప్పవాడన్నమాట .హిందూ వివాహాలలో వివాహానికి సాక్షిగా అర్యముడు ఉంటాడనే మంత్రాలున్నాయి .అందుకే కృష్ణుడు అర్యముని ఉటంకించి ఉంటాడని అతనీలో తన విభూతి ఉందని చెప్పిఉ౦టాడని పిండితార్ధం .
ఇంకా ఎవరికైనా దీనిపై విశేష అభిప్రాయాలు తెలిస్తే జత చేసి వెలుగు నింపమని కోరిక .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-18 –ఉయ్యూరు
—