117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య
శ్రీ ఆకునూరి రామయ్య ,20 మంది బృందం కలిసి 2010 లో పీరియాడిక్ టేబుల్ లో 11 7 వ మూలకం కనిపెట్టారు .ఇటీవలే దానికి ‘’టేన్నేస్సిన్ ‘’అని నామకరణం చేశారు .దీని సింబల్ ‘’Ts’’.ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ రామయ్యగారు వాండర్ బిల్ట్ యూనివర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఈ ఆవిష్కరణకు ఆయనను, ఆయన తోపాటు పనిచేసిన జోసెఫ్ హామిల్టన్ నూ టెన్నెస్సీ కాంగ్రెస్ మన్ జిమ్ కూపర్ ఈ మధ్యనే ఘనంగా సత్కరించారు .వారు పని చేస్తున్న యూనివర్సిటి టెన్నెస్సీ రాష్ట్రం లో ఉన్నందున అ మూలకానికి ఆ రాష్ట్ర గౌరవార్ధం ‘’టేన్నేస్సిన్ ‘’అని పేరు పెట్టి తమకూ, తమ రాష్ట్రానికి ఘనకీర్తి నార్జి౦చి పెట్టారు .
ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బాచిలర్, మాస్టర్ డిగ్రీలు పొంది శ్రీ ఆకునూరి రామయ్య,అమెరికా వెళ్లి ఇండియానా యూని వర్సిటి లో 1960 లో పి. హెచ్ .డి. సాధించారు .అతిభార మూలకాల ఉనికిపై అత్యంత ఆసక్తి కల ఆయన నిరంతర పరిశోధనల ఫలితమే తాను ఈ ఘన విజయాన్ని సాధించగలిగానని చెప్పారు .ఓక్ రిడ్జ్ నేషనల్ లాబొరేటరి ,రష్యాలోని ఫియర్రోవ్ లాబరేటరి ఫర్ న్యూక్లియర్ రియాక్షన్స్ ,కాలి ఫోర్నియాలోని లారెన్స్ లివర్ మోర్ నేషనల్ లాబరేటరి ,నాక్స్ విల్ లోని యూని వర్సిటి ఆఫ్ టెన్నెస్సీ కి చెందిన రామయ్య ,హామిల్టన్ ,20 మంది రిసేర్చర్స్ కలిసి సాధించిన అతి నూతన మూలకం ఆవిష్కరణ ఇది .ఈ పరిశోధన ఎక్కువ భాగం రష్యాలో సాగిందని కారణం అక్కడ సైక్లోట్రాన్,రీకాయిల్ మాస్ సర్క్యులేటర్ లు ఉండటమేనని రామయ్య చెప్పారు .ఒకటిన్నర సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనాఫలితం ఇది అన్నారు .
ఈ ఏడాది జులై లో ‘’టేన్నేస్సిన్ ‘’ గా నామకరణం పొందిన ఈ కొత్త మూలకం జీవితకాలం 100 మిల్లి సెకన్లు .రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఉన్న ఈ కొత్తమూలకాన్ని ‘’హై ఎక్సైటేడ్ స్టేట్ ‘’లోఅంటే అత్యధిక ఉత్తేజిత స్థితి లో తయారు చేశామని రామయ్య ఉవాచ .ఈ ఆవిష్కరణ 2000 సంవత్సరం లో సూపర్ హెవీ ఎలిమెంట్ ఉండవచ్చు ,దాన్ని కనుగొనవచ్చు అనే ముందస్తు ఊహ అంటే ప్రేడిక్షన్ తో ప్రారంభమైంది .కాని రామయ్యగారి బృందం ఇటీవలి సంవత్సరాలలోనే దీనిపై పరిశోధించి సాధించారు .’’వర్క్ ఎథిక్’’అయిన తన భర్తకు ఇది అసాధ్యమేమీకాదని రామయ్యగారి భార్య అన్నారు .తమ 51 ఏళ్ళ వైవాహిక జీవితం లో రామయ్యగారిని ఎప్పుడూ సీరియస్ సైంటిస్ట్ గానే చూశానని భార్య శ్రీమతి కృష్ణ తెలియ జేశారు .రామయ్యగారు తెల్లవారుజామున 2 గంటలకే లేచి లాబరేటరికి వెడతారని ,పరిశోధనలకోసం ప్రపంచమంతా పర్యటిస్తారని ముఖ్యంగా జర్మనికి చాలా సార్లు వెళ్ళారని ,19 82 లో స్ప్రింగ్ సెమిస్టర్ అంతా అక్కడే గడిపారని గుర్తు చేసుకున్నారామే .తమ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కనుక తానిప్పుడు భర్తతో రిసెర్చ్ ట్రిప్ లకు వెడుతున్నానన్నారు.ఈ ట్రిప్ లలో అనేక దేశాలు చూసే వీలు కలుగుతోందని తనకు చాలా ఉత్తేజంగా ఉంటున్నాయని రామయ్యగారు పని అంటే తీవ్రమైన భావావేశం, అభిరుచి ఉన్నవారని అంటారు .
తమ ప్రాంతం లో సమావేశాలు జరిగినపుడు వచ్చేవారికి ఆతిధ్యం ఇవ్వటం తమ దంపతులకు ఎంతో ఇష్టంగా ఉంటుందని ,అలాగే ఇతర దేశాలలోనూ తమకు ఆత్మీయ ఆతిధ్యం లభిస్తుందని చెప్పారు పాక్షిక రిటైర్మెంట్ లో ఉన్న 76 ఏళ్ళ ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ ను , వా౦డర్ బిల్ట్ సహచరుడు హామిల్టన్ నూ కలిపి ఈ యునివర్సిటి నూతన మూలకా ఆవిష్కకరణకు గాను ఆగస్ట్ లో జిమ్ కూపర్ ,డి .టేన్న్ లచేత ఘనంగా సత్కరి౦పజేసింది .దీనితోపాటు ఇండియన్ అమెరికన్ సంఘమూ గుర్తించి సన్మా నించింది .ఇటీవలే ‘’ఇండియా దినోత్సవం ‘’నాడు నాష్ విల్ ఇండియన్ అసోసియేషన్ కూడా సత్కారం చేసింది . . ఆసందర్భంగా ఐ. .ఎ .యెన్ .ప్రెసిడెంట్ హెటేల్ మెహతా’’మాసమక్షం లో ఇంతగొప్ప సైంటిస్ట్ ఉన్నందుకు మేము అదృష్టవంతులం .ఇక్కడి భారతీయ సంతతి కి గర్వకారణం డా రామయ్య గారు .అతి సాధారణ౦ గా ,నిరాడంబర౦తో మూర్తీభవించిన వినయ సౌజన్య సద్గుణ మూర్తి మత్వం తో అందరి హృదయాలను ఆకర్షిస్తారు ,గెలుస్తారు ,స్పర్శిస్తారు ‘’అని శ్లాఘించారు . ఇండియన్ కమ్యూనిటి సీనియర్ సపోర్ట్ సర్వీసెస్ సంస్థ కూడా రామయ్యగారి కృషికి అభినందన సత్కారం చేసింది .ఐ .సి .ఎస్ .ఎస్ .ఎస్ .సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డా.ప్రమోద్ వాసుదేవ్ ‘’వృత్తిలో నిబద్ధత రామయ్యగారి సుగుణం .వృత్తికి ఎంతటి న్యాయం చేస్తారో మిగిలిన విషయాలలోనూ అలాగే ఉంటారు .పదేళ్ళ క్రితం తండ్రిగారు మరణిస్తే, కుటుంబ బాధ్యత తీసుకొని తమ్ముళ్ళ అభి వృద్ధికి కృషి చేశారు .తమ మనోభావాలకు తగిన అతి సాధారణ జీవితం గడుపుతూ ,వృత్తికీ, కుటుంబానికి అంకిత భావం తో సేవలందిస్తున్న సత్పురుషులు డా రామయ్య ‘’అని మెచ్చుకున్నారు . తాము ఆవిష్కరించిన కొత్తమూలకం టేన్నేస్సిన్ అత్యంత అస్థిర మూలకం అయినందున ,పీరియాడిక్ టేబుల్ లో స్థిర అటామిక్ నంబర్ ఉన్న హీలియం ,ఆక్సిజన్ లాంటి మూలకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం లో ఉన్న నిర౦తర ప్రయోగ, పరిశోధన శీలి రామయ్యగారు .’’ఎంతకాలం లో కనుక్కోగలుగుతారు ‘’అని ప్రశ్నిస్తే , ‘’మరి కొన్నేళ్ళ లోనే ‘’అని ఆశావహం గా బదులిచ్చారు .’’ఇలాంటి ఆవిష్కరణలకు నిర్దేశ కాలపరిమితి అంటూ ఉండదు .నేనూ నా బృందం 120 వ మూలకం తయారు చేసే ప్రయత్నం లో ఉన్నాం’.దీనికీ టైం టేబుల్ లేదు .ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ‘’అన్నారు చిరునవ్వుతో.తాను ఇప్పుడు కొందరు గ్రాడ్యుయేట్ విద్యార్ధులతో కలిసి పని చేస్తున్నానని కానీ 2018 స్ప్రింగ్ సెమిస్టర్ తర్వాత పూర్తిగా రిటైరౌతానని తన మనో నిశ్చయాన్ని నిస్సంకోచంగా తెలిపారు .మన దేశం రామయ్యగారు విదేశాలలో అద్భుతాలు సాదిస్తున్నదుకు గర్వపడదాం .వారు త్వరలో కొత్తగా ఆవిష్కరించ బోయే మూలకం కోసం ఎదురు చూస్తూ స్వాగ తీద్దాం .’’లాంగ్ లివ్ డా .రామయ్య ‘’
ఆధారం –ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారు ఈ ఉదయమే మెయిల్ లో పంపిన ‘’‘’ Latest Periodic Table Element Found by Akunuri Ramayya-led Research Team Gets Name ‘’
అన్న అమెరికాలోని ‘’ఇండియా –వెస్ట్ ‘’పత్రికలో ప్రచురింపబడిన ఆర్టికల్ . ఒక భారతీయ ,ఆంద్ర సైంటిస్ట్ అయిన డా. శ్రీ ఆకునూరి రామయ్య గారి నూతన ఆవిష్కరణ విషయాన్ని సరసభారతి సాహితీ బంధువులకు తెలియాలనే సదుద్దేశం తో శ్రీ గోపాల కృష్ణ గారు పంపినదుకు వారి సౌజన్యానికి ధన్యవాదాలతో కృతజ్ఞతలు .ఈ ఆర్టికల్ వారు పంపి ఉండక పొతే ,ఇంత అతి నూతన మూలకా విష్కరణ గురించి మనకెవ్వరికీ ఇంత త్వరగా, ఇంత విపులంగా తెలిసేదే కాదు . నాకూ ఇలాంటి ప్రతిభామూర్తి గురించి రాసే అదృష్టం కలిగినందుకు గర్వంగా ఉంది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-18 –ఉయ్యూరు