దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు
మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొడుకు ,ఆరవ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు జీవితం లో ఎక్కువభాగం అంటే చివరి 27 ఏళ్ళు దక్షిణాపధం లో నే యుద్దాలలోనే గడిపాడు .ఔరంగజేబ్ అంటే’’ సింహాసనానికి వన్నె తెచ్చేవాడు ‘’అని అర్ధం అతనికి ‘’ఆలంగీర్’’ అనే పేరు ఉంది దీనర్ధం ‘ప్రపంచాధినేత ‘’..అతని 48ఏళ్ళ పాలన లో సామ్రాజ్యం దక్షిణాన కర్నాటక ,తమిళనాడు వరకు బాగా విస్తరించింది .అంతకు ముందెప్పుడూ ఇంత విశాల మొఘల్ సామ్రాజ్యం లేనేలేదు .అతని ఏలుబడిలో 158 మిలియన్ల ప్రజలు౦డేవారు .సామ్రాజ్య సాలుసరి ఆదాయం 2,879,469,894 రూపాయలు .అప్పటి దాకా ప్రపంచం లో చైనా ఆర్ధిక వ్యవస్థ అత్యంత గరిష్టంగా ఉండేది జేబు కాలం లో చైనా ను అధిగమించింది భారత ఆర్ధిక వ్యవస్ధ . అయితే ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యానికి గండికొట్టాడు .షాజహాన్ ముంతాజ్ బేగం ల మూడవ కొడుకైన ఔరంగజేబు గుజరాత్ రాష్ట్రం లో దాహోడ్ నగరం లో 1618 నవంబర్ 3 పుట్టాడు .1707 మార్చి 3 న 88 ఏళ్ళ వయసులో మరణించాడు. అతని సమాధి మహారాష్ట్రలో ఖుల్దాబాద్ గ్రామం లో ఉంది .
మొఘల్ చక్రవర్తుల పరమత సహనానికి ప్రసిద్ధులు .దీనివలన తిరుగు బాట్లు రాకుండా సామ్రాజ్యాన్ని కాపాడుకొన్నారు. కాని ఔరంగ జేబు దానికి విరుద్ధం ఇతరమతాలను అష్టకష్టాలు పెట్టాడు .హిందూ సిక్కులపై జుట్టుపన్ను ‘’జిజియా ‘’విధించి కొరివితో తలగోక్కున్నాడు .రాజనీతిజ్ఞుడు అయినా ముస్లిం మతావేశం అతన్ని రెచ్చగొట్టి దెబ్బతీసింది .’’హిందువుల ఆదర సౌఖ్యాలపై మొఘల్ సామ్రాజ్యసౌధం నిర్మించాలి ‘’అన్న అక్బర్ చక్రవర్తి విశాల దృక్పధం’’ జేబు ‘’మొండితనం తో ‘’జేబు’’ లో దూరి ఇరుక్కు పోయింది .ప్రజలంతా సున్నీలు కాలని , రాజ్యాంగం ఖురాను ననుసరించి నడవాలని శాసించాడు .ఇతరమతస్తులను బలవంతంగా ముస్లిం మతం లోకి మార్పించాడు .తొమ్మిదవ సిక్కు గురువు’’ గురు తేజబహదూర్’’ను ఉరితీయించాడు .దీనికి ఆయన దేవాలయాలు నిర్మించాడన్న ఒకే ఒక కారణం . అతని మూర్ఖ ,క్రోధ, కోపతాపాలకు వేలాది హిందూ దేవాలయాలు 1669 లో ధ్వంసమై నేలమట్టమయ్యాయి .అందులో ముఖ్యంగా కాశీ విశ్వనాధ దేవాలయం ,మధురలో రాజా వీర సింగ్ 30 లక్షలతో అత్యంత సుందరంగా నిర్మించిన కృష్ణ దేవాలయం ఉన్నాయి .ఎన్నో మత గ్రంధాలు నాశనం చేయించాడు ,పరమత సహనం లేకపోవటం వలన మొఘల్ సామ్రాజ్య పతనం ఔరంగ జేబు తో ప్రారంభమైంది . మహమ్మదీయ విద్యకు ఎన్నో పాఠశాలలు కళాశాలాలూ నిర్మించాడు .సుప్రసిద్ధ పండితులను ఉపాధ్యాయులుగా నియమించి మంచి జీతాలు ఇచ్చి విద్యార్ధులకు పారితోషికాలందించి ప్రోత్సహించాడు .బానిసల అభివృద్ధికీ పాటుపడ్డాడు .గుజరాత్ లోని బోహ్రానులు అనే బానిసలకు చదువు చెప్పించి ఫిరోజ్ షా తుఘ్లక్ లాగా బానిసల ఉద్ధరణ చేశాడు . .గ్రంధాలయాలు నిర్మంచి వివిధ విషయ గ్రందాలు వాటికి తెప్పించి విస్తృత పరచాడు .కాని అతనిది స్ప్లిట్ పర్సనాలిటి .అందుకే లలితకళలు ,శిల్ప, గాన అలంకారాలను జనసామాన్యానికి దూరం చేసి తప్పు చేశాడు .అంతకు ముందు రోజుకొక కావ్యం తో విలసిల్లిన దేశం పూర్తిగా నిస్తేజమైపోయింది .అతడు ఒక సన్యాసిగా జీవించటం తో రాజ్యం నిర్వీర్యమైంది .కళలు సర్వతోముఖాభి వృద్ధి చెందినచోట వాటికి గోరీకట్టి చెడ్డపేరు తెచ్చుకున్నాడు .
మాతృభాషలోనే విద్య నేర్పించాలని ఔరంగ జేబు దృఢంగా నిశ్చయించి అమలు పరచాడు .చరిత్ర ,భూగోళం వంటి మానవ విజ్ఞాన వికాస విషయాలను తప్పని సరిగా బోధించేట్లు చేశాడు .పాఠశాల విద్య ,వారికి జీవిత విద్య కావాలని ,వృత్తివిద్యా నైపుణ్యం ఇక్కడే ప్రారంభంయ్యేట్లు చేశాడు .విద్య బ్రతుకు తెరువు కలిగించేది గా ఉండాలని కోరాడు .ఇతరభాషలలో విద్య నేర్పటం వలన విద్యార్దిమనోవికాసం దెబ్బతింటుందని అతని సృజన కు అడ్డు అవుతుందని నిష్కర్షగా చెప్పాడు .దీనికి ఉదాహరణగా ఔరంగజేబుకు పారశీక విద్య నేర్పిన గురువుకు నిర్మొహమాటంగా రాసిన ఒక లేఖ సాక్ష్యంగా ఉంది .ఆ లేఖ ఎలా ఉందో చూడండి –
–‘’ నాకు చిన్నతనంలో మతవిద్య, తత్త్వవిద్య, పారశీక భాష వంటివి నేర్పినందుకు మిమ్మల్ని తీవ్రంగా గర్హిస్తున్నాను . పైగా ప్రపంచంలోని ముఖ్యమైన సామ్రాజ్యానికి భావిసామ్రాట్టుకు భూగోళం, ఇతర రాజ్యాల స్థితిగతులు,రాజనీతి, ఆర్థిక విషయాలు వంటివి బోధించకుండా జీవితంపై వైరాగ్యం పొంది సన్యసించవలసిన దశలో నేర్వాల్సిన విషయాలు బోధించారు ఇది దారుణం . మీ వలన . మీ విద్యావిధానం వల్ల నా జీవితంలో అత్యంత ముఖ్యమై వ్యక్తిత్వాన్ని సంతరించుకునే బాల్యదశ, యువత అంతా వ్యర్థమైన విషయాల్లో గడచిపోయింది. విద్యను అభ్యసించేందుకు బాలలకు మాతృభాషే సరైనది, అలాకాక వేరే భాషను మాధ్యమంగా స్వీకరించి విద్య నేర్పితే ఆ భాష నేర్చుకుని, ఆపైన ఆ భాషలో విద్య నేర్చుకునేందుకు చాలా శ్రమపడ వలసి వస్తుంది .నా మాతృభాషలోనూ, రాజ్యంలోని వాడుకలో ఉన్న భాషల్లో కాక విదేశీభాషలో విద్య నేర్పినందుకూ ,నేను బాగా ఈసడిస్తున్నాను .నా కొలువులో సర్దారుగా నియమించాలని మీరు చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ సికిందర్ (అలెగ్జాండర్) కు ఆయన గురువు అరిస్టాటిల్ బోధించినట్లు జీవితానికి ఉపకరించే విద్యను, వికాసాన్ని కలిగించే పద్ధతిలోనూ నేర్పివుంటే సర్దారుగానే కాక అంతకు వేయిరెట్లు గౌరవాన్ని ఇచ్చేవాడిని, ఇప్పటికి మాత్రం మీరు నా గురువన్న విషయం నా కొలువులోని మరెవరికైనా తెలియడం కూడానాకు ఇష్టంలేదు .తిరిగి మీ ఊరు చేరుకోమని ఆదేశిస్తున్నాను ‘’
మాతృభాష పై ఇంతటి మమకారం ,గౌరవం కనబర్చినందుకు ఔరంగ జేబుకు మనం రుణ పడి ఉన్నాం .మనపాలకులకు, తలిదండ్రులకు ఈ లేఖ కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నాను .ఈ లేఖ ను 1910 లో శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు సేకరించి ‘’ఔరంగ జేబు తన గురువుకు వ్రాసిన యుత్తరము ‘’గా ప్రచురించగా ,దీన్ని 1957 ఆంద్ర పత్రిక సంవత్సరాది సంచికలో ముద్రితమైంది .లక్ష్మణరావు గారికి ఏమిచ్చి ఈ జాతి ఋణం తీర్చుకోగలదు ?మన మాతృభాషోద్యమకారులకు ఈ లేఖ విషయం తెలియనట్లే ఉంది .వారెప్పుడూ ఈ లేఖను ఉల్లేఖించిన దాఖలాలు నాకు కనిపించ లేదు .మీకెవరికైనా తెల్సిఉంటే నా అజ్ఞానానికి మన్నించండి .
అతి సాధారణ జీవితం గడుపుతూ ,తన జీవిక కోసం టోపీలు కుట్టి అమ్ముతూ నిరుపేద గా గడిపిన సామ్రాట్టు ఔరంగజేబు .ఇదీ మోడీ లాంటి పాలకులకు ఆదర్శం కావాలి .కొందరు చరిత్రకారులు రాసిన దాని ప్రకారం అతడు అలహాబాద్ సోమేశ్వర దేవాలయ నిర్మాణానికి ,స్థలాన్ని ఇచ్చాడు .ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ,చిత్రకూట్ బాలాజీ ఆలయం ,గౌహతిలోని శత్రు౦జయ ,ఉమానంద జైన దేవాలయాలకు అనేక గురుద్వారాలకు నిధులు సమకూర్చాడని రాశారు ‘
గోల్కొండ తానీషా ప్రజలనుంచికోట్లాది రూపాయలు శిస్తులు వసూలు చేసి ఢిల్లీ పాదుషా కు పంపించకుండా భూమిలో పాతిపెట్టి ,ఎవరికీ తెలియకుండా ఉండటానికి దానిపై’’ జామా మసీదు ‘’కట్టించాడు .ఈ విషయం తెలుసుకొన్న ఔరంగజేబు మసీదు పడగొట్టించి ,నిధిని బయటికి తీయించి ,ప్రజోపకార్యాలకు విని యోగించాడని తెలుస్తోంది . ఇప్పుడు దక్కన్ లో ఔరంగజేబు సుబేదారుగా ఉన్నప్పుడు తన పరిపాలనకు సంబంధించిన లక్షన్నర వ్రాతప్రతులను అతి భద్రంగా జాగ్రత్త చేశాడు .తెలంగాణా ఆర్కైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో చేతితో తయారైన పేపర్ లపై ఉన్న లక్షన్నర డాక్యుమెంట్ లున్నాయి .అందులో 1628-1658 నాటి షాజహాన్ చక్రవర్తి కాలం నాటి 5,000, ,1658 -1707 నాటి ఔరంగజేబ్ చక్రవర్తి కాలంనాటి లక్షన్నర డాక్యుమెంట్లు ఉన్నాయి .ఢిల్లీ లోని నేషనల్ ఆర్కైవ్స్ లోకాని ,మరెక్కడా కాని ఇన్ని డాక్యుమెంట్లు లేవు అంటే అవాక్కవ్వాల్సిందే .వీటివలన దక్కన్ లోని మొఘల్ లుల మునసబు దారి వ్యవస్థ ,సైనిక పాలన వ్యవస్థ ,రెవెన్యూ వ్యవస్థ విషయాలు కళ్ళముందు కనిపిస్తాయి .ఇవన్నీ పర్సియన్ భాషలో ‘’షికస్తా’’లిపిలో ఉన్నాయి .గొలుసుకట్టు గా రాయబడ్డాయి ,కాలక్రమానుసారంగా అంటే క్రానలాజికల్ ఆర్డర్ లో ఉన్నాయి .తేది ,నెల సంవత్సరాలతో సహా నమోదై ఉన్నాయి .
ఈ సాక్ష్యాధారపత్రాలలలో 1-చక్రవర్తి ఆజ్ఞలు అంటే ఫర్మానాలు 2- రాచకుటుంబాలవారి ఆజ్ఞలు అంటే నిషాన్ లు ,3- ఇంపీరియల్ అజ్నలకు సంబంధించిన నివేదికలు అంటే ‘’యద్దాస్ట్ ఇ ఆహ్కం ఇ ముకద్దాస్ ‘’4 –ఉన్నతాధికారులు జారీ చేసిన ఆజ్ఞలు అంటే’’ పర్వానా ‘’ లు ,5- ప్రాంతీయ న్యాయస్థానాల విచారణ ప్రక్రియలు అంటే ‘’సియాహ హుజూర్ ‘’లు 6- దినవారీ వార్తాల నివేదికలు అంటే ‘’రోజ్ఞా౦చయివ కాయ్ ‘’7-నగదు చెల్లింపు లు అంటే ‘’క్వబ్జుల్ వసీల్ లు 8-సిబ్బంది, గుర్రాల పత్రాలు అంటే ‘’అర్జ్ వో చిహ్ర ‘’లు ఉన్నాయి .
తండ్రి షాజహాన్ చక్రవర్తి ఢిల్లీ సామ్రాజ్య నిర్వహణలో ఉండగా ఔరంగజేబు దక్కన్ లో ఉన్నకాలం లో రాజకీయ రాజకీయేతర విషయాలలో గొప్ప అనుభవం సంపాదించాడు.1658 జులై 25 న చక్రవర్తిగా ఢిల్లీ సింహాసం అది ష్టించి నప్పుడు ,దక్కన్ పై ఒక కన్ను వేసే ఉంచి అక్కడ జరుగుతున్న విషయాలను గమనిస్తూ కొడుకు మహమ్మద్ అక్బర్ తిరుగుబాటు ధోరణి గమనిస్తూ బిజాపూర్ గోల్కొండ లను1687 లో వశపరచుకొన్నాడు .
1916 లో స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జరీనా పర్వీన్ చె ప్పినదానిప్రకారం పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర అక్కౌంటెంట్ జనరల్ సయ్యద్ ముహిబుద్దీన్ మొగలుల హెడ్ క్వార్టర్ ఔరంగాబాద్ కు తనిఖీ కోసం వెడితే ,అక్కడ ఫోర్ట్ ఆర్క్ ‘’లో నేలమాళిగలలో (వాల్ట్స్)ఎన్నో పాత డాక్యు మెంట్ లు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గమనించాడు.పై అధికారులకు ఈ విషయం తెలియ జేసి వాటిని భద్రంగా హైదరాబాద్ ఆర్కైవ్స్ కు చేర్చాడు .పర్షియా భాషలో నిధి ఐన పర్వీన్ ఆ డాక్యుమెంట్ లను క్రమపద్ధతిలో ఏర్పరచి ఆమ్ల రహిత డాకేట్స్ లో భద్రపరచినది ఈ డాక్యుమెంట్ లలో ఔరంగజేబ్ పరిపాలనా సామర్ధ్యం ,నైపుణ్యం అవగతమవుతాయి .అందులో ఉన్న ‘’యద్దాస్ట్ ఇ ఆహ్కం ఇ ముకద్దాస్ ‘’లో అతడు తన సిబ్బందికి జీతాల పెంపు విషయం లో చక్రవర్తికి పంపిన రికమండేషన్ పత్రాలు కూడా ఉండటం విశేషం . విధులలో నిర్లక్షయం ,ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఆలోచనలను కనిపెట్టటానికి ఔరంగజేబు గూద చారులను నియమించాడు .
ఇలా సగం మంచి సగం, చెడు, ఉన్న స్ప్లిట్ పర్సనాలిటి ఔరంగ జేబులో కనిపిస్తుంది’.
ఆధారం -12-8-18 హిందూ పత్రికలో ఎం. రాజీవ్ రాసిన ‘’డెక్కన్ పేపర్స్ షైన్ ది లైట్ ఆన్ ఔరంగ జేబ్ రూల్ ‘’అనే ఆర్టికల్ లో కొంతమేరకు మాత్రమే.
శ్రావణమాస శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు
.