శ్రావణమాస విశిష్టత

  శ్రావణమాస విశిష్టత

   శ్రావణ శుక్రవార వరలక్ష్మీ పూజ

శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం .  మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి  చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ చీర కట్టుకొని  ముచ్చటగా దర్శనమిచ్చి మనశ్శాంతి కల్గిస్తుంది .వర్షాలు విపరీతంగా కురిసి నదులన్నీ  నిండు గర్భిణీ స్త్రీలు లాగా నిండుగా ప్రవహిస్తాయి .  శ్రావణ మంగళవారాలలో స్త్రీలు మంగళ గౌరీ నోము నోస్తారు . .ప్రతి శుక్రవారం పవిత్రమైందే .రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి ము౦దు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం .ముత్తైదువలు అత్యంత భక్తీ శ్రద్ధలతో దీర్ఘ సౌమాంగల్యం కోసం అమ్మవారిని పూజిస్తారు ..కొబ్బరి కాయకు పసుపు కు౦కుమపెట్టి  కలశంపై ఉంచి పైన రవికముక్కను అందంగా అలంకరించి అమ్మవారికి కళ్ళూ ముక్కు చెవులు నోరు ఏర్పరచి ,ఆభరణాలు తొడిగి ,పుష్పహారాలతో శోభిల్లజేసి తమ ఇంట లక్ష్మీదేవి వెలసినట్లు పరవశిస్తారు .అమ్మవారిని ఈ రకంగా చూసి మురిసిపోయి ధన్యులవుతారు . వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తారు కథ చెప్పుకొని తొమ్మిది పోగుల  తోరపూజ చేసి ,మంత్రపూతంగా చేతికి కట్టుకుంటారు .అనేక భక్ష్య లేహ్య చోహ్యాలను ప్రసాదంగా చేసి నైవేద్యం పెడతారు .ముఖ్యంగా తొమ్మిది రకాల ప్రసాదాలు చేయటం పరిపాటి .వాటిలో  పూర్ణబ్బూరెలు ,పులిహార  గారెలు తప్పని సరి ముత్తైదువులకు పూర్ణబ్బూరెలు వాయనంగా ఇవ్వటం ఆనవాయితీ . అమ్మవారి కి మంగళహారతులు పాడుతారు .సెనగలు నానపెట్టి వాయనంగా తాంబూలం పళ్ళు తో ఇవ్వటం రివాజు .అయిదేళ్ళు నోములు నోచి ఉద్యాపన చేస్తారు .వరలక్ష్మీ వ్రతానికి కొత్త అల్లుళ్ళను ఆహ్వానించి వారికి నూతనవస్త్రాలు పెట్టి కోరిన కోరికలు తీరుస్తారు మామగార్లు . అందుకే కొత్త అల్లుళ్ళు మాంచి జోష్ గా వస్తారు అత్తారింటికి .కొందరు సాయం వేళ అయిదుగురు ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలాలు ఇస్తారు .కొందరు ఇళ్లకే వెళ్లి ఇస్తారు ఎవరి అనుకూలం వారిది. శ్రావణ మాస పేరంటాలంటే మహిళలకు మహా క్రేజు .ఈ శ్రావణమాస మూత్తైదువులను చూస్తే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా కనిపిస్తారు .కొత్తనగలు కొనుక్కొంటారు .కొత్తకోడలికి అత్తవారు కూడా అలానే చేస్తారు .రెండవ శుక్రవారం ఏ కారణం చేతనైనా వ్రతం చేయలేక పోయినవారు తర్వాత వచ్చే శుక్రవారం చేస్తారు .శ్రావణమాసం లో లక్ష్మీ దేవిని పూజిస్తే వ్రత కధలో చెప్పినట్లు అమ్మవారు నట్టింట్లో గల్లుగల్లు  గజ్జెల సవ్వడితో ప్రవేశించి సకల సౌభాగ్యాలు దీర్ఘ సౌభాగ్యం ,సత్సంతానం ,దీర్ఘాయుస్సు ప్రసాదిస్తుందని అనాదిగా అందరి విశ్వాసం .

                    మంగళ గౌరీ నోము

 పెళ్లిళ్లకు శ్రావణ మాసం శ్రేష్టమైనది .కొత్తగా పెళ్ళైన అమ్మాయి శ్రావణ మంగళ వార నోము  పట్టి అన్ని మంగళ వారాలు గౌరీ దేవికి పూజలు చేసి నానబోసిన సెనగలు పళ్ళు తాంబూలం లో పెట్టి ముత్తైదువులకు వాయనమిస్తారు .పసుపు తోరణాలు తయారు చేసుకొని వాటిని కలశం పై ఉంచి పూజ చేసి  మంత్ర విదిగా కట్టుకొంటారు .కుడుములు చేసి నైవేద్యం పెడతారు .ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి తలలో పెట్టుకోవటానికి పూలమాల తో సత్కరించి ఆశీస్సులు అందుకుంటారు .కత్తికి గంధం రాసి ,ఆవునేతితో  జ్యోతులు వెలిగించి ,పాటపాడుతూ ,ఆ కత్తి జ్యోతులపై ఉంచి మసిబారేట్లు చేసి ,కాటుక తయారు చేసి తాము కళ్ళకు  పెట్టుకొని ముత్తైదువులకూ ఇవ్వటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం .  ఏ దేశం లో ఉన్నా  ఆంద్ర మహిళలు  ఈ నోము వరలక్ష్మీ వ్రతం తప్పక పాటిస్తూనే ఉన్నారు .వారికి హాట్స్ ఆఫ్ .ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా గమనించాలి .గౌరీ దేవికి యెంత ప్రాధాన్యముందో లక్ష్మీ దేవికీ అంతే ప్రాధాన్యం ఉండటం శివ కేశవ ,లక్ష్మీ గౌరీ అభేదానికి నిదర్శనం కూడా .

                      నాగుల చవితి

  శ్రావణ మాసం పండగలతోనే ప్రారంభమౌతుందని పై విషయాలను బట్టి మనకు అర్ధమౌతోంది .ఇవి స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి .అందరికీ చెందిన పండగల నెల శ్రావణం .శ్రావణ శుద్ధ చవితి నాగ చతుర్ధి లేక నాగుల చవితి .ఈనెల 14మంగళవారం . .పుట్టలోపాలు పోసి నాగేంద్రుని కొలవటం మన సంప్రదాయం .పుట్టమన్ను చెవులకు పెట్టుకొంటే సర్ప దోషా లు౦డవని నమ్మకం .పుట్టలో ఆవుపాలు పోసి చలిమిడి, వడపప్పు, పళ్ళు నైవేద్యం పెడతారు .ఓపికున్నవారు నాగదేవత ఉన్న మోపిదేవి ,సింగరాయకొండ  మొదలైన  దేవాలయాలకు వెళ్లి దర్శించి పూజిస్తారు  .స్త్రీలు తప్పకుండా ఉపవాస ముంటారు .నాగేశ్వరస్వామికి అభిషేకం జరిపిస్తారు .నాగ దోష నివారణ దీనివలన  తొలగిపోతుంది .పిల్లలకు చెవికి సంబంధిన వ్యాదులుంటే తప్పక నాగుల చవితికి పూజలు చేస్తూంటారు .మోపిదేవి మొక్కులు తీర్చుకుంటారు .

                    నాగ పంచమి

శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి 15 వ తేదిబుధవారం …పాతాళం లో నాగ లోకం ఉంది .నాగ జాతికి చెందిన కద్రువ ను కశ్యపప్రజాపతి వివాహ మాడటం వలన ఆమెకు కలిగిన కుమారులను నాగులు అన్నారు .ఆయనభార్య వినతకు దేవతలతోపాటు గరుత్మంతుడు జన్మించి విష్ణుమూర్తి వాహనమయ్యాడు . పాములను పూజించటం మనకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం . నాగజాతి పరిపాలకులల రాష్ట్రం నాగాలాండ్ .నాగ ప్రార్ధన –

‘’నాగ ప్రీతా భవంతి –శా౦తిమాప్నోతి –సశాంతి లోక మా సాధ్య మేదతే-సస్థిత శమః ‘’

నాగ పంచమినే ‘’భ్రాతృ పంచమి ‘’అంటారు.స్త్రీలుసోదరులతోకలిసి పుట్టలో పాల్లుపోసి నాగ పూజ చేస్తారు .దీనివలన పాము కాటు భయం ఉండదని మమ్మిక . దీనికీ ఒక  కథ ఉంది .ఒకప్పుడు ఒక రైతు కు ఇద్దరుకొడుకులు, ఒక కూతురు ఉన్నారు .ఒక కొడుకు పొలం దున్నుతుండగా నాగలి కి౦దనలిగి మూడు పాములు చచ్చాయి. వాటి తల్లి పగబట్టి ఆ రాత్రే ఆ రైతును, భార్యను ,ఇద్దరుకొడుకులను కరచి  చంపి పగ తీర్చుకున్నది .వాళ్ల మరణాన్ని జీర్ణించుకోలేని కూతురు తల్లి పామున్న పుట్టదగ్గరకు వెళ్లి పాలు నైవేద్యం పెట్టి ప్రార్ధించి చనిపోయిన తనవారిని బ్రతికించమని కోరింది ఆమే అమాయకత్వానికి, భక్తికి మెచ్చిన ఆనాగు వాళ్లను బ్రతికించింది . అందుకే ఇది బ్రాతృ పంచమి అయింది .మనదేశం లో అన్ని ప్రాంతాలలోని వారు నాగపంచమి తప్పని సరిగా పాటిస్తారు. నాగపంచమి సినిమా కూడా వచ్చినట్లు జ్ఞాపకం .నేపాల్ లోనూ చేస్తారు .అక్కడ చెంగూ నారాయన దేవాలయం లో గరుడ విగ్రహం ఉంది . గరుత్మంత పూజ చేస్తారు

                   స్వాతంత్ర్య దినోత్సవం

  ఆగస్ట్ 15బుధ వారం  భారత స్వాతంత్ర్య దినోత్సవం .యావద్భారత జాతి జాతిపండుగ. జెండాపండగ .ఎందరెందరో త్యాగధనుల ఆత్మబలిదానంతో లభించిన స్వాతంత్ర్యం మనది .

                జంధ్యాల పౌర్ణమి, రాఖీ ,రక్షాబంధన్

  శ్రావణ పౌర్ణమి 26 వ తేది ఆదివారం .పాత జంధ్యాలు తీసి కొత్త జంధ్యాలువేసుకొనే జంధ్యాల పూర్ణిమ .కొత్తగా ఉపనయనం చేసుకున్నవారు జంధ్యానికికున్న ‘’మౌంజి ‘’అంటే జింక తోలుముక్కను (అసలు అప్పటిదాకా ఉంచుకుంటే )తీసేసే రోజు. దీనికే ఉపాకర్మఅంటారు

 .రాఖీ పండగ కూడా .దీనినే రక్షాబంధనం అంటారు. స్త్రీలు తమ సోదరులకు రక్ష కట్టి వారికి అన్నిరకాల విజయాలు కలగాలని కోరుకుంటారు .సోదరులు  వారి కోరికలు తీరుస్తారు .

                   స్వయం సేవకుల రక్షా బంధన్

రాస్త్రీయస్వయం సేవక్ సంఘ్ ఈ రోజు రక్షాబంధన దినోత్సవాన్ని పరమ పవిత్రంగా నిర్వహిస్తుంది . ధ్వజానికి   పూజ చేసిన రక్షలనుకట్టి స్వయంసేవకులు ఒకరికొకరు రక్ష కట్టుకొని దేశం కోసం సర్వాన్ని త్యాగం చేస్తామని శపథం చేస్తారు. ఆర్. ఎస్. ఎస్. నిధికోసం తమకు తోచిన ధనాన్ని కవర్లలో పెట్టి గుప్తంగా ధ్వజం దగ్గర ఉంచుతారు .ఇవన్నీ రాష్ట్రానికి అక్కడినుంచి నాగపూర్ లోని  కేంద్ర సంస్థకు  చేరుతాయి .ఇందులో నిర్బంధ వసూలు ఉండదు స్వచ్చందంగా యెంత ఇవ్వాలనిపిస్తే తమ శక్తిని బట్టి సమర్పిస్తారు .ఎవరెంత సమర్పించారో మిగిలినవారికి తెలీదు

      అలెక్జాండర్ ప్రాణం  కాపాడిన రాఖీ

   అలెక్జా౦ డర్ పురుషో త్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు  గ్రీసు దేశం నుండి అతనితో పాటు వచ్చిన అతడి ప్రియురాలు రుక్సానా భారత వీరుడైన పురుషోత్తమ పరాక్రమం ముందు గ్రీకు వీరుడు నిలువ లేడని గ్రహించి ,మారువేషం లో వచ్చి పురుషోత్తముడికి రక్షబంధనం కట్టి సోదరిగా తనభర్త ఓడిపోయినా చంపవద్దని కోరింది .అలేగ్జాండర్ పురుషోత్తముడి చేతికి చిక్కి అతనిపై కత్తి ఎత్తగా చేతికున్న రాఖీ కనబడి చంపకుండా వదిలేశాడు .ఆతర్వాత జరిగిన కథ మనకు తెలిసిందే .

                   ఇంద్రుని విజయానికి రక్ష కట్టిన శచీదేవి

 భవిష్య పురాణం  ఇంద్రుడు బలి చక్రవర్తిపై యుద్ధానికి వెడుతున్నప్పుడు భార్య శచీ దేవి విష్ణు మూర్తిని ప్రార్ధించి  ఆయన సలహాతో లక్ష్మీ దేవి ఇచ్చిన  దారపు రక్షకట్టి విజయ౦ కలగాలని కోరిందని ,దాని వలన బలిని ఓడించాడని చెబుతోంది .అప్పటి నుంచే రక్షాబంధనం లోకం లో ఆనవాయితీగా వస్తోందన్నమాట .

             వినాయకుని కుమారులులకు రక్ష కట్టిన కూతురు సంతోషిమాత

  వినాయకుడికి శుభుడు లాభుడు అనే ఇద్దరు కొడుకులు .తమతో ఆడుకోవటానికి ,రక్షాబంధనం కట్టటానికి ఒక చెల్లెలు ఉంటే బాగుండును అనుకొని తండ్రికి చెప్పారు .అది జరగనిఅపని అన్నాడాయన .నారదమహర్షి వచ్చి కుమార్తె ఉంటేనే ఇంటికి మంగళ ప్రదం కనుక వారి కోర్కె తీర్చమన్నాడు .సరేనని ‘’సంతోషి మాత’’ను సృష్టించి తనభార్యలు రిద్ధి, సిద్ధిలకు ఇచ్చాడు  .గణేశ పుత్రులు తమ చిట్టి చెల్లెలు సంతోషి చేత  రక్షాబంధనం కట్టించుకొని కోరిక తీర్చుకున్నారు .

                   బలికి రక్షకట్టి ‘’హరి’’కి పాతాళ  చెర విడిపించిన ‘’ సిరి’’

  భాగవతం లో విష్ణుమూర్తి వామనావతార మెత్తి మూడడుగులదానం పుచ్చుకొని ,త్రివిక్ర ముడై ముల్లోకాలను ఆక్రమి౦చాడని ,దీనికి ప్రతిఫలంగా బాలి ఆయనను పాతాళం లో తనదగ్గరే ఉండి పొమ్మని వరం కోరితేసరే నని అక్కడే ఉన్నాడని .భర్త శ్రీ మహా విష్ణువు లేని వైకుంఠం లో ఉండలేక ఎలాగైనా భర్తను తెచ్చుకోవాలని లక్ష్మీదేవి  పాతాళం చేరి, బలికి సోదరిగా రక్షాబంధన్ కట్టి వరం గా తనభర్తకు  స్వేచ్చ కలిగి౦చమని కోరగా అంగీ కరించి విష్ణువుకుపాతాళం చెర విడిపించాడని ఉంది .

  ద్రౌపది కుంతీ యమధర్మరాజులకు రక్షాబంధనం

  భారతం లో ద్రౌపది శ్రీ కృష్ణునికి ,కుంతీదేవి మనవడు అభి మన్యుడికి రక్ష కట్టినట్లుంది .యముడు తన సోదరి ‘’యమున’’ను చూసి 12 ఏళ్ళు అయింది .ఆమె చాలాబాధపడి గంగను సంప్రదించింది .ఆమె యముడికి విషయం తెలియజేసింది యముడు యమునవద్దకు వచ్చి సంతోషం కలిగించి వరం కోరుకోమనగా   వీలైనప్పుడు వచ్చి సోదరి క్షేమ సమాచారాలు కనుక్కోమని కోరింది .ఆమె నిష్కల్మష  భ్రాతృ భక్తి కి  సంతసించి ఆమె శాశ్వ తమైన యమునానదిగా మారిపోయే వరం కూడా ప్రసాదించాడు .ఈ పండుగను కొన్నిప్రాంతాలలో ‘’భాయ్ దుజ్ ‘’పేరిట రక్షాబంధన దినోత్సవంగా నిర్వహిస్తారు .ఇక్కడ మరొక్క ముఖ్య విషయం ఉంది .ఆడపిల్ల  పుట్టింటికి తప్పని సరిగా 12 ఏళ్ళలోపు మళ్ళీ వెళ్ళాలి .అలాగే సోదరుడుకూడా సోదరి ఇంటికి పన్నెండు  ఏళ్ళు దాటకుండా మళ్ళీ వెళ్ళాలనే సంప్రదాయం కూడా ఉంది .ఏ కాగితానికైనా గడువుకూడా 12 ఏళ్ళు .తర్వాత లిమిటేషన్ దాటింది కనుక చెల్లదు అంటారు .

                  రవీంద్రుడు భారీ ఎత్తున నిర్వహించిన రక్షా బంధన్

  1905 లో బ్రిటిష్ ప్రభుత్వం  బెంగాల్ విభజన చేసింది .అప్పుడు రవీంద్రనాధ టాగూర్ బెంగాల్ లోని హిందూ ముస్లిం ల నందరినీ సమావేశ పరచి ‘’రక్షాబంధన దినోత్సవం ‘’పెద్ద ఎత్తున జరిపి ,అందరూకలిసి కలిసికట్టుగా అన్నదమ్ములలాగా మెలగుతూ బ్రిటిష్ పాలనను ఎదిరించాలని పిలుపు నిచ్చాడు .ప్రజల మనోభావాలకు దెబ్బతగిలిందని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజన ను 1911 లో  ఆరేళ్ళ తర్వాత  వెనక్కు తీసుకున్నది .కానీ దీన్ని ముస్లిం లు వ్యతిరేకించగా పాపం ఇంత శ్రమపడిన టాగూర్ ప్రయత్నం విఫలమైంది .మళ్ళీ బెంగాల్ విభజన చేసి తూర్పు బెంగాల్ అంటే బంగ్లాదేశ్ ఏర్పరచి ముస్లిం డామి నేషన్ కు  బలం కూర్చింది .మిగిలినదానికి పశ్చిమబెంగాల్ అన్నది .అయినా టాగూర్ రక్షాబంధన మహోత్సవాలను భారీ జనసమూహాలతో క్రమ౦  తప్పకుండా నిర్వహిస్తూ ఐక్యత కోసం శ్రమించాడు .ఇప్పటికీ అక్కడ రక్షాబంధన్ మహోత్సవంగా జరుగుతూనే ఉంది .రవీంద్రుడు ‘’రాఖీ పై ఒక దివ్య కవిత కూడా రాశాడు –చూడండి

The love in my body and heart
For the earth’s shadow and light
Has stayed over years.

With its cares and its hope it has thrown
A language of its own
Into blue skies.

It lives in my joys and glooms
In the spring night’s buds and blooms
Like a Rakhi-band
On the Future’s hand..

 సిక్కులు జరిపిన రాఖీ పండగ

 18 వ శతాబ్దం లో శిఖ్ ఖాల్సా సైన్యం రాఖీ అంటే రక్షాబంధన్ ను ప్రవేశపెట్టి ఆఫ్ఘన్ చొరబాటు దారుల నుండి రైతుల రక్షణకు వారికి రక్షకట్టి కాపాడారు .వారికి పలువిధాల పొలంకోతలు వగైరాలకు సాయం చేశారు ‘

 సిక్కు సామ్రాజ్య స్థాపక పాలకుడు రాజా రంజిత్ సింగ్ రాఖీ బంధనోత్సవాన్ని జరిపేవాడు .ఆయన భార్య మహారాణి ‘’జిందా ‘’నేపాల్ రాజుకు రక్షా బంధనాన్ని పంపింది .ఆమెను అతడు సోదరిగా భావించి సిక్కు సామ్రాజ్య పతనం తర్వాత ఆమెకు నేపాల్ లో ఆశ్రయం కలిగించాడు .సిక్కులు రాఖీని ‘’రఖార్డ్డి’’అంటారు అంటే రిస్ట్ బాండ్ అంటే మోచేతికి కట్టేది అని అర్ధం .దీన్ని కానుకల దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తారు .

 మనదేశం లో మహిళలు ముఖ్యమంత్రులకు ప్రధాని రాష్ట్రపతి మొదలైన వారికి రాఖీలు  విజయం చేకూర్చాలని కోరు తారు .ఫోటోలు దిగుతారు ఫేస్ బుక్కుల్లో అ౦టిస్తారు .

    శ్రీ కృష్ణాష్టమి

ఇలా శ్రావణ శుక్ల పక్షమంతా నోములు వ్రతాలు పండగలతో గడిచిపోతుంది .శ్రావణ కృష్ణ అష్టమి శ్రీ కృష్ణాష్టమి శ్రీ కృష్ణుడు జన్మించిన కృష్ణాష్టమి .జన్మాష్టమి .రోహిణీ నక్షత్రం లో కృష్ణుడు దేవకీ దేవికి సకల విధ ఆయుధాలు ఆభరణాలలతో కారాగారం లో అంటే ఈనాటి మధుర లో పుట్టాడు .ఆసమయం లో కృష్ణ జననం పారాయణ చేస్తారు .సెప్టెంబర్ ౩సోమవారం జన్మాష్టమి .వైష్ణవాలయాలన్నీ మహా సంబరంగా జరుపుతాయి .వీధులలో ఉట్టి వేలాడ దీసి కొట్టటం ఒక పెద్ద వేడుక ..ఆలయాలలో  బాలింతరాల్లకు పెట్టె కట్టె కరం చేసి  నైవేద్యం పెడతారు .గోపికా కృష్ణ వేషాలు దరించి జనాలకు ఆనందం కలిగిస్తారు .అన్నమయ్య ‘’సఖులాలా సఖులాలా చూడరో శ్రావణ బహులాస్టమి ‘’అనే కీర్తాన రాసి చరితార్ధం చేశాడు .బాలకృష్ణ లీలలకు మురుస్తాం యవ్వన కృష్ణ లీలలకు పరవశమౌతా౦.పెద్ద కృష్ణుని రాజకీయ చాత్రుర్యానికి అబ్బో అంటాం .ఏ దశలోనైనా కృష్ణుడు మనోహరుడు .అందుకే ఆయనను ‘’లార్డ్ ఆఫ్ ఆటం మూన్స్ ‘’అంటే ‘’శరత్ చంద్ర ప్రభువు ‘’అన్నారు  .మీరాబాయ్వంటి మహాభక్తులెందరో   శ్రీ క్రష్ణభక్తులు జన్మ చరితార్ధం చేసుకున్నారు .కృష్ణలీలలు మధురాతిమధురం .వాటికి పరమ మాధుర్యం కలిగించాడు భాగవత పోతన్న .మధురలో కృష్ణాష్టమి వేడుకలు పులకరి౦ప జేస్తాయి.

     సర్వేపల్లి జయంతి ఉపాధ్యాయ దినోత్సవం

సెప్టెంబర్ 5 సర్వే పల్లి రాధాకృష్ణ పండితుని అన్మదినం .ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా నిర్వహిస్తారు .ఉత్తముపాధ్యాయులనుప్రభుత్వాలు గుర్తించి సన్మానిస్తాయి .సరసభారతి ఈ రోజునే ఉదయం 10 గ౦.లకు శ్రీ కోటగురువరేణ్యులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి గురుపూజోత్సవం స్థానిక అమరవాణీ హైస్కూల్ లో సంయుక్తంగా నిర్వహిస్తోంది .ప్రముఖ అతిధులు  ,గురు పుత్రులు కోట సోదరులు పాల్గొనే ఈ కార్యక్రమ౦లో”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల  రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి సన్మానం చేస్తూ ,స్థానిక ఉపాధ్యాయును సన్మానిస్తూ , శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ,కోటసోదరులు ఏర్పాటు చేసిన  మాస్టారి స్మారక నగదు బహుమతులను అర్హులైన  విద్యార్ధులకు అందజేసి సార్ధకం చేస్తోంది .

                  పొలాల అమావాస్య

  శ్రావణ బహుళ అమావాస్య ‘’పోలాల అమావాస్య’’సెప్టెంబర్ 9 ఆదివారం .పోలా౦బా వ్రతం చేస్తారు  వృషభానికి ఆహారం పెట్టే రోజు .హిరణ్య కశిపుని సోదరి సింహిక .విప్రసిద్ధి  భార్య కొడుకు అంధకాసురుడు .బ్రహ్మను తపస్సుతో మెప్పించి వరాలు పొందాడు .వీడు గుడ్డివాడేకాదు , కామా౦ధుడుకూడా .వరగర్వం తో వీడికామ దృష్టి జగన్మాత పార్వతీదేవిపై పడింది .శివుడు భూలోకం వెళ్ళినప్పుడు, కైలాసం వెళ్లి అమ్మవారితో అనుచితంగా మాట్లాడగా నందీశ్వరునికి కోపంవచ్చి వాడిపై యుద్ధం చేస్తుండగా శివుడు కూడావచ్చి ,వాడిని అడ్డగించి సంహరించాడు .అందుకే శివుడిని ‘’అంధకాసురకా౦తకే  మమ కి౦ కరష్యతి వైళమః  ‘’అని శివుడిని స్తుతిస్తాం .నందీశ్వరుని పోరాటపటిమకు మెచ్చి వరం కోరుకోమనగా తాను తన తండ్రి శిలాదునికి పొలం దున్నుతుంటే వృషభ రూపం లో లభించానని, కనుక ఆ రోజున  వృషభ లేక గోపూజ చేసేవారికి  ఆహారం  పెట్టేవారికి సకల శుభాలు కలిగేట్లు చేయి అని అడగగా తథాస్తు అన్నాడు శివుడు .కనుక వృషభ పూజ పోలాల అమావాస్య నాడు తప్పని సరిగా చేస్తారు .అవి దొరక్కపోతే ఆవులకైనా పూజ చేయవచ్చు .

  మరో కధ కూడా ఉంది .ఈ రోజున పోలేరమ్మతల్లి అనుగ్రహం కూడా పొందాలి,దీనికొక కథ ఉంది .పూర్వం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు .  శ్రావణ బహుళ అమావాస్య నాడు పోలేరమ్మ తల్లి పూజ చేసేవారు  .ఏడవ బిడ్డ పుట్టి మరణిస్తుంటే పూజ చేయలేకపోయారు..చివరి సారిగామళ్ళీ ఏడవ బిడ్డ పుట్టగానే చనిపోయాడు. ఏమైతే అయిందనే మొండి ధైర్యం తో  వాడిని గదిలోపెట్టేసి బయటికి వచ్చి మిగిలిన కొడుకులతో పోలేరమ్మ పూజ చేసింది అతనిభార్య .ఆ రాత్రి పిల్లాడి శవాన్ని తీసుకువెళ్ళి పోలేరమ్మ గుడి మెట్ల పై  పడేసి  రోదిస్తూ కూర్చుంది .పోలేరమ్మ ఆరాత్రి గ్రామ సంచారం చేస్తూ, ఏడుస్తున్న ఆమెను వోదార్చికారణం అడిగి తెలుసుకొని వాడినిబతికి౦చటమేకాక, అక్షతలిచ్చి ఇదివరకు చనిపోయిన బిడ్డలను పూడ్చిన చోట చల్లమని చెప్పింది .ఆమె అలా చేయగా, చనిపోయిన పిల్లలందరూ బతికి వచ్చారు .అందుకే కృతజ్ఞతగా  పొలాల మావాస్యనాడు పోలేరమ్మ తల్లి అనుగ్రహాన్ని ,శివానుగ్రహాన్ని పొందటానికి పోలేరమ్మ పూజ చేస్తారు .

  గోదావరి జిల్లాలలో ఇదే రోజు ‘’కంద పిలకలు ‘’అమర్చి పూజ చేసే అలవాటు ఉంది .కంద లో ఎభాగ౦లొను౦చైనా మొలకలు వస్తాయి .అది సంతానహేతువుగా భావించి పూజిస్తారని నా ఊహ .గోదావరి జిల్లాలో వివాహాది శుభకార్యాలలో అందుకే కందా బచ్చలి కూర వండటం కూడా శుభం కోసమే . ఇప్పుడు ఆవంటకం అన్ని జిల్లాలకూ పాకింది .

 ఇదీ శ్రావణ శోభ

 రేపు శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-13-8-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.