సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

పవిత్ర నర్మదానది ప్రవహించే మధ్యభారతమైన మధ్యప్రదేశ్ లో జన్మించి,  ఆ నదీమతల్లి పవిత్రతను హృదయం నిండా  నింపుకొని , అక్కడి ఉజ్జయినీ మహాకాళేశ్వరుని అనుగ్రహ విభూతి పొంది ,  కవికులగురువు మహాకవి కాళిదాస కవితా సాహితీ సారాన్ని గ్రోలి ,పేరులో బిహారీ ఉండటం తో మగధ సామ్రాజ్య విధాత , మదించిన నందవంశ రాజుల మదమణగించి ,మౌర్య చంద్రగుప్తుని చక్రవర్తిగా ప్రతిష్టించి ఆ శపథం నెరవేరేదాకా సిగ ముడవని ,చాణక్యుని రాజనీతి సారాన్ని పుక్కిటబట్టి  ,అపర చాణక్యుడనిపించి  ,మధ్యప్రదేశ్ రాజ కుటుంబాల పోరాట పటిమ జీర్ణించుకొని,  ఎన్ని అడ్డంకు లెదురైనామొక్కవోని ధైర్యం తో ఎదిరించి విజయం సాధించే మనో ధైర్యాన్ని ఒంటబట్టించుకొని , ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్ కు మూడు సార్లు ఎన్నికై ,అక్కడి పవిత్ర గంగా నదీఝరీ సదృశ వాగ్ధాటి నలవరచుకొని ,నడుస్తున్న సంస్కృతీ ,సంప్రదాయ ,సాహితీ త్రివేణీ సంగమమై ,,దేశంలోని అన్ని తరగతులప్రజలకు ,రాజకీయ పక్షాలకు ఆదర్శ ప్రాయమై ,ఆనాటి యుధిస్టిరునిలా అజాత శత్రువై ,ఆయనలాగా ‘’మెత్తని పులి’’ అని పించుకొని ,పద్నాలుగు పార్టీల సహకారంతో దేశం లోనే మొట్టమొదటి సహకార సంకీర్ణ మంత్రివర్గానికి నాందిపలికి ,అందరి మాటలకు ,అభిప్రాయాలకు విలువనిచ్చి ,ఒడిదుడుకులు లేకుండా పాలన సాగించి ,13 రోజులకే మంత్రివర్గం ఒకే ఒక్క వోటు తేడాతో  కూలి పోయినా,బెదరక చెదరక అడ్డదారి తొక్కక,ప్రజా విశ్వాసం మళ్ళీ పొంది పూర్తీ మెజారిటి తో అధికారం లోకి వస్తామని లోక్ సభలో శపథం లాంటి ప్రతిజ్ఞ చేసి,ఆతర్వాత ఆమాట నిలబెట్టుకొని ప్రజాబలంతో గద్దెనెక్కి షంషేర్ అనిపించుకొన్న మధ్యప్రదేశ్ నుంచి భారత దేశ తొలి ప్రధాని అయినవాడు ,అతులిత సుగుణ సంపన్నుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ .

ఉత్తరప్రదేశ్ బటేశ్వర్ నుంచి  వీరిపూర్వీకులు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని మొరీనా కు వలసవచ్చారు .తాతగారు పండిట్ శ్యాం లాల్ వాజ్ పాయి ,వాజపేయం చేసిన శ్రౌతి  .తండ్రి  కృష్ణబిహారీ వాజ్ పాయ్ స్కూల్ టీచర్ .తల్లి శ్రీమతి కృష్ణా దేవి . శ్యాం ప్రసాద్ ముఖర్జీ అంతరింగికుడై ,జనసంఘ స్థాపనలో బాధ్యత వహించి ,దానికొక స్వరూపస్వభాలు ఏర్పరచి ,ఎన్నికలలో గెలిచే సత్తా కలిగించినవాడు .దేశమంతా ఎమర్జెన్సీ దుష్టపాలన లో క్రూర హింసా దౌర్జన్యాలతో నలిగి అష్టకష్టాలు పడుతున్నప్పుడు  లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ్ దానికి వ్యతిరేక పోరాటం చేసే ప్రయత్నం లో ఉండగా ,పార్టీలకు అతీతంగా ఆలోచించి ,విస్తృత ప్రాతిపదికపై ‘’జనతా పార్టీ ‘’ఏర్పరచటం లో కీలక పాత్ర పోషించి , మహాత్మాగాంధీకి అసలైన వారసుడు శ్రీ మొరార్జీ దేశాయ్ ని ప్రధాని నిచేసి ,తాను విదేశా౦గ మంత్రిగా రాణించి ,యు.ఎన్. వో .లో హిందీలో మాట్లాడిన తొలి విదేశాంగ మంత్రిగా చరిత్ర సృష్టించాడు .ఆనాటి జనతా ప్రభుత్వం ప్రజలకుఎన్నో మేళ్ళు చేసింది .సమర్ధులైన మంత్రులు ఉండేవారు .కాంగ్రెస్ కు  రాం రాం కొట్టిన శ్రీ జగ్జీవన్ రాం ఉప ప్రధాని ,ఆర్ధికమంత్రి హెచ్. ఏం .పటేల్ ,హోమ్ మంత్రి చరణ్ సింగ్ .ప్రజావసర వస్తువులన్నీ అత్యంత చౌకగా ప్రజలకు అందుబాటులో ఉండేవి .ప్రజా ప్రభుత్వం ఎలా ఉండాలో జనతా ప్రభుత్వం ఆచరించి చూపింది .ఇందులోనూ వాజ్ పాయ్ చొరవ బాగా ఉంది .

క్విట్ ఇండియా ఉద్యమం లో 24 రోజులు జైలు శిక్ష అనుభవించిన అటల్జీ స్వాతంత్ర్య సమరయోధుడు .ఆపేరు చెప్పుకొని ఎన్నడూ రుబాబు చేయలేదాయన .జనతాపార్టీ ప్రభుత్వం కూలిపోయాక భారతీయ జనతా పార్టీ ఏర్పరచి అధ్యక్షులై లాల్ కృష్ణ ఆద్వానీ స్నేహ సహకారాలతో విస్తృతంగా దేశమంతా పర్యటించి ,పార్టీ పునాదులు పటిస్టం చేసి బిజెపి అధికారం లోకి రావటానికి విశేష కృషి చేశాడు .అటల్జీ అనుయాయి  భైరన్ సింగ్ షెకావత్ రాజస్థాన్ ముఖ్యమంత్రియై ఆదర్శ ప్రభుత్వాన్ని నడిపాడు .లంబాడీలకు వెన్నుదన్నుగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేసి అంతగొప్ప ముఖ్యమంత్రి లేదు అనిపించాడు .మధ్యప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం సుందర్ లాల్ పట్వా ఆధ్వర్యం లో ఏర్పడి, నానాజీ దేశ్ ముఖ్ నా యకత్వం లో ‘’అంత్యోదయ’’ కార్యక్రమం చేబట్టి ఆదివాసీ జన సౌభాగ్యానికి శ్రీకారం చుట్టారు . ఇవన్నీ పైన వాజ్ పాయి ప్రధానిగా ఉన్నప్పుడు జరిగినవే .అప్పటిదాకా ఈ రెండు రాష్ట్రాలు చాలా వెనకబడి ఉన్నాయి వాటిని అభి వృద్ధిమార్గం లో నడిపిన ఘనత ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదే.

అటల్ ప్రధాని , ఆద్వానీ ఉపప్రధాని ,అటల్ పార్టీ అధ్యక్షుడు ,ఆద్వాని  కార్యదర్శి .పార్టీకి ప్రభుత్వానికి ఒకరు ఒకరు రధి అయితే మరొకరుసారధి .వీరిద్దరి స్నేహసుగంద పరిమళం దాదాపు 68 ఏళ్ళు సాగి ,ఆదర్శ ప్రాయమైనది  అందరికీ .బిజెపి కి వారు కృష్ణార్జునులు .ఒకరికొకరు గురు శిష్యులు .ఆంద్ర ప్రదేశ్ ఐటి అభి వృద్ధికి అటల్ ఎంతో సహకరించాడు .చంద్రబాబు ఆలోచనను మన్నించి స్వర్ణ చతుర్భుజి తో ఆసేతు హిమచలపర్య౦త౦  విస్తృత మైన  రోడ్ల నిర్మాణం జరిగింది .టెలికాం లో విప్లవాత్మకమైన అభివృద్ధికీ బాబు సూచనలనే అమలు పరచాడు అటల్జీ .ద్రవ్యలోటు అదుపుకు తెచ్చేందుకు ప్రధాని కృషి చేసి మదుపు ధనాన్ని పెంచగలిగాడు .ఉచిత ప్రాధమిక విద్యకోసం ‘’సర్వ శిక్షా అభియాన్ ‘’ప్రవేశ పెట్టాడు.పెట్టుబడుల ఉపసంహరణకు ఒక మంత్రిత్వ శాఖనేర్పరచి ప్రభుత్వ పాత్రను తగ్గించి ,ప్రైవేట్ పెట్టుబడులకు ఆకర్షణ కల్గించింది అటల్జీయే.

పదేపదే ఇతర దేశాలలో  పర్యటించి ఖజానాకు బొక్క పెట్టకుండా అన్ని దేశాలకు స్నేహ హస్తం చాటి ,పాకిస్తాన్ నుకూడా మిత్రుని చేసుకొన్న చాణక్యం ఆయనది .కవ్వించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధం లో బుద్దీనేర్పిన బృహస్పతి   అందుకే పాక్ మాజీప్రధాని నవాబ్ షరీఫ్ ‘’అటల్ జీ పాకిస్తాన్ ఎన్నికలలో నిలబడినా గెలుస్తారు. ఆయనకు అంతప్రజాబలం ఉంది ‘’అన్నాడు ..శత్రువైనా ప్రతిపక్షనాయకుడైనా మంచి ఉంటే మెచ్చుకొనే సహృదయత ఆయనది .బంగ్లాదేశ్ విమోచనకు విముక్తి వాహిని  ఏర్పరచి ప్రధాని ఇందిర చూపిన చొరవను మెచ్చి ఆమెను’’ అపరకాళి’’కగా అభివర్ణించిన అపరాకాళిదాసు గా  అందరి మన్ననలు పొందిన విశాల హృదయుడు .బిజెపి అంటే అమెరికా తొత్తు అని నిత్యం మొరిగే వారి నోళ్ళు మూయించి పోఖ్రాన్ అణుపరీక్ష మూడో కంటివాడుఅంటే డేగ చూపుల అమెరికా వాడికి  కూడా తెలీకుండా నిర్వహించిన దీక్షా దక్షుడు .ఇందులోకలాం గారి విశ్వసనీయపాత్రకు జేజేలు పలికినవాడు . ఆయన బహు రాజనీతిజ్ఞుడు అంటే స్టేట్స్ మన్ .

19 42లో గ్వాలియర్ విక్టోరియాకాలేజిలో చదువుతున్నప్పుడు రాజకుమారి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు .ప్రేమలేఖ కూడా రాసి ఆమె పుస్తకం లోపెట్టాడు ఆమెకూడా రాసి అదే పుస్తకం లో పెట్టి౦ది కాని ఎవరూ బయటికి చెప్పుకోలేదు .ఆమె ఆఆయన ఆఉత్తర౦  చూడలేకపోయాడు చివరికి తలిదండ్రులకు తెలిసి పెళ్ళికి ఒప్పుకోకుండా వేరోకనితో ఆమె పెళ్లి చేశారు .తర్వాత ఎప్పుడో ఆమ కనబడింది .భర్త చనిపోయాడు ఒక కూతురు నమిత .తల్లిని  తనింటికి ఆహ్వానించి తనవద్దే ఉంచుకొని ఆకూతురును దత్తత చేసుకొని తండ్రి అయి ఆమెకు పెళ్లి చేసి ,ఆమెకు పుట్టిన పిల్ల నీహారికతో తాతగా ఆడుతూ పాడుతూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొన్న నిండు హృదయుడు  .ఈ విషయం బయట ఎవరికీ తెలియదు .దీనికి ఆయనకుహిందీ సినిమాలో గుల్జార్ రాసిన  ‘’ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వు .దానికి ఎలాంటి పేరూ పెట్టకు ‘’పాట ఆదర్శం .ప్రియురాలుదక్కకపోయినాప్రేమ  కలకాలం నిలుస్తుందని నిరూపించిన ప్రేమమూర్తి.

ఆయనది వికాస విదేశాంగ నీతి .ఆయన సాటిలేనిసంస్కర్త .బహుముఖ ప్రజ్ఞాశీలి ,ఆద్యుడు ఆరాధ్యుడు .మార్గ దర్శి .కర్మ యోగి .ప్రపంచ వేదికమీద భారత దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరించి ,భవిష్యత్ తరాలను ప్రభావితం చేసే కార్యక్రమాలెన్నో చేబట్టిన అభ్యుదయవాది, గామి .ప్రగతిపథ నిర్దేశకుడు .ఎందరెందరికో స్పూర్తి ,ప్రేరణ ఆయన .అటల్ లాంటి వారు మరోకరుండరు .మిత్ర ధర్మానికి ఎంతో విలువనిచ్చే అచ్చపు ప్రజాస్వామ్యవాది .అందుకే ఎమర్జెన్సీ ని అంతగా వ్యతి రేకించాడు ,కారాగార వాసం అనుభవించాడు.

పది సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన రాజకీయ దురంధరుడు .రాజనీతిజ్ఞుడు .ఒకసారరెప్పుడో ఢిల్లీ లో  7 సీట్లు బిజెపి గెలిచినప్పుడు పార్థిమేస్టారి అరుగానే పార్లమెంట్ లో  తెల్లవార్లూ మిత్రుడు సూరి నరసింహం ఇంట్లో రేడియో వింటూ,  గంటకో టీ తాగుతూ చప్పట్లుకోడుతూ నేనూ ,గుండురామం ,వెంట్రప్రగడ సాంబయ్య,మండా వీరభద్ర రావు  మొదలైన వాళ్ళం పొందిన అనుభూతి ఎన్నటికీ మర్చిపోలేను .,  అంటే స్టేట్స్ మన్ .పార్లమెంట్ ప్రసంగాలలో చురుక్కులు చమక్కులు కవితాదారతో ఆకట్టుకొన్న వాగ్ధాటి ఆయనది .

చిన్నప్పటి నుంచి  ఆర్ .ఎస్ .ఎస్. నీడలో ఎదిగిన అటల్జీ ,అధికారం లో ఉండగా దానినీడ పడకుండా ,దాని ప్రభావానికి లోనుకాకుండా ,దాని పెత్తనం తనమీద లేకుండా చేసుకొన్న సౌజన్య వ్యక్తిత్వం ఆయనది .రాజీలేని రాజనీతి, ముక్కుసూటి ఆయనముఖ్య  లక్షణాలు .

ఒకసారి శ్రీ జగ్జీవన్ రాం రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రైలుప్రమాదాలు జరిగి ఎందరో చనిపోతే ,ఆ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావిస్తూ ‘’మీ పరిపాలన లో జనం జగ్  జీవన్ కీ రాం రాం ‘’అని చమత్కరించాడు వాజపాయ్ .దీనర్ధం అయ్యా తమ ఏలుబడిలో జనం జగత్తుకు రాం రాం చెబుతున్నారు అని ఆయన పేరుతోనే గొప్ప చమత్కారం సృష్టించాడు .మరోసారి ఆయనే ఆహార మంత్రిగా ఉండగా ఆహారపదార్ధాల సప్ప్లై సరిగ్గా లేక ,పంటలు పండక జనం ఆలో లక్ష్మణా అని అలమటిస్తుంటే అప్పుడు అటల్జీ సభ లో ‘’జనం అన్నమో రాంరాం ‘’అని అలమటిస్తున్నారని మళ్ళీ ఆయన పేరుతోనే చమత్కరించాడు .ఆరేళ్ళు ప్రధానిగా చేసిన తర్వాత  ,20 14 లో మళ్ళీ యెన్. డి. ఏ .బిజెపి కూటమి  అఖండ విజయం సాధిస్తుందని ఆయన్ను రెస్ట్ తీసుకొని ఆద్వానీకి పగ్గాలిస్తే బాగుంటుంది అనే సణుగుడు ఆయన చెవిన పడి ‘’న టైర్డ్ న రిటైర్డ్  ఆద్వానీ జీకి నేత్రుత్వ్ మే విజయ్ కీ ఓర్ ప్రస్థాన్ ‘’ ‘’నేను అలసటా చెందలేదు, రిటైరూ అవ్వలేదు.ఆద్వానీగారి నేతృత్వం లో విజయం వైపు పయనం ‘’అని నర్మ గర్భంగా చెప్పారు  .1996 లో మొదటిసారిగా ప్రదానిపదవి చేబట్టే సందర్భం లో జర్నలిస్ట్ రాజీవ్ శుక్లా ఆయన్ను ఇంటర్వ్యు చేస్తూ’’అటల్ జీ ఇప్పటిదాకా హాయిగా ప్రజలమధ్య తిరిగారు .ఇక ఇప్పుడు భద్రతా వలయం లో బందీ అయి ,ప్రజలకుదూరమౌతారు. మిమ్మల్ని ప్రజలు దూరం నుంచే చూడాల్సి  వస్తుంది ‘’అని అంటూండగా అటల్జీ వలవల ఏడిచేసి కన్నీరు కార్చిన దయామయుడు .

హిమ శృంగ సదృశ సమున్నతుడు ,మేరునగ ధీరుడు ,సముద్రమంతలోతైన అంతఃకరణ ఉన్నవాడు,నడిచే భారతీయ మూర్తిమత్వం ,సర్వమత సమన్వయ  గంభీరుడు ,శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ 93 వ ఏట నిన్న 16- వతేదీ తిరిగి రాని లోకాలకు చేరారు  .ఆయన భారతరత్నం ,ఆయన లేనిలోటు తీరనిది .ఆయన మరణం దేశానికే తీరని నష్టం .

అశ్రునయనాలతో ఆ అభినవ భీష్మునికి అంజలి ఘటిస్తూ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-18- ఉయ్యూరు

 

.

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

  1. Anon అంటున్నారు:

    ఆయన వయసై పోయి వెళ్ళిపోయాడు. ఇందులో దేశానికి నష్టమేముంది బయ్యా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.