‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

           ఆయనకు తెలుగుకథానిక ప్రాణం, తనువూ, మనసు ,ధ్యాస ,ఊపిరి   ఉచ్చ్వాస నిశ్వాసం .దాని కోసం జీవిత౦  త్యాగం చేసిన త్యాగమూర్తి .1910 లో గురజాడ రాసిన  తొలి తెలుగు కధానిక’దిద్దుబాటు ‘’  కు శతవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు కధానిక ను తానొక్కడే పల్లకీలో మోసి ,ఊరూరా తిప్పి ,సభలు సమావేశాలు ఏర్పరచి ప్రభుత్వాన్నీ సాహితీసంస్థ లను ,వ్యక్తులను, కథానికా రచయితలను, సాహిత్యాభిమానులను, సామాన్య పాఠకజనాన్నీకదిలించి ప్రేరణ ,స్పూర్తి కలిగించి కథకు శత జయంతి జరిపిన కథానికా కలం యోధుడు డా.  శ్రీ వేదగిరి రాంబాబు . అలాగే శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతినీ తాను ఘనంగా నిర్వహించి ,ప్రముఖ పట్టణాలను పద్మరాజుగారమ్మాయిలతో పర్యటించి ఉత్సాహపరచి జరిపించిన కార్య శీలి .ఆ తపన  అనితర సాధ్యం .అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ,మనిషి సాయం లేకుండా నడవ లేనిస్థితిలోనూ భార్యను వెంటబెట్టుకొని తెలుగు కథానికా సాహిత్యానికి జవజీవాలు చేకూర్చిన మానవతావాది .ఆ కృషి ,తపన, తపస్సు, కార్యదీక్ష అనితర సాధ్యం .పెద్దపెద్ద సాహిత్య సంస్థలు ,రాష్ట్ర ప్రభుత్వం  ,రేడియో టి.వి.  లు చేయాల్సిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నిర్వహించిన పట్టువదలని కధానికా విక్రమార్కుడు ,కధానికా ప్రచురణకోసం ఒక సం స్థ’’వేదగిరి పబ్లికేషన్స్ ‘’యేర్పరచి ,ఔత్సాహికులకు ప్రోత్సాహమిస్తూ ,పాతతరం వారిని కలం ది౦చవద్దని అస్త్ర సన్యాసం చేయవద్దని  బ్రిమాలి బామాలి కధానిక రాయమని బలవంతపెట్టిమళ్ళీ కలం పట్టించి  రాయించిన సహృదయుడు శ్రీ వేదగిరి రాం బాబు .66 ఏళ్ళ వయసులోనే  మరణించటం మనకు ,తెలుగు కథ కు దురదృష్టం.

సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారు ‘’బాపు –రమణ ‘’లపై ఉన్న గాఢానుబంధం తో ఏర్పరచిన’’ బాపు- రమణ స్మారక నగదు పురస్కారాన్నిమొట్టమొదటి సారిగా  సరసభారతి చేతశ్రీ చలపాక ప్రకాష్ గారి రమ్యభారతి, సరసభారతి సంయుక్తంగా విజయవాడ లో నిర్వహించిన శ్రీ పాగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభలో శ్రీ వేద గిరి రాం బాబు గారికి అందజేయించారు .ఆయన ఎంతో సంతోషించి  మైనేనిగారికి నాకు ఫోన్ లో ధన్యవాదాలు తెలియజేసి  వీలైనప్పుడల్లా మాట్లాడుతూ ఉండటం మా అదృష్టం .బాపు- రమణ స్మారక నగదు పురస్కారం రెండవ సారి ప్రముఖ కథానిక రచయిత కవి , చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజుగారికి మచిలీపట్నం లో సరసభారతి, క్రష్ణాజిల్లారచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యం లో జరిపిన సభలో అందజేసిన విషయం మీకు తెలుసు .సుమారు రెండేళ్ళక్రితం మచిలీపట్నం లో ఏదో  అవార్డ్  తీసుకుంటూ  రా౦బాబుగారు, కొంపెల్ల శర్మగారు, చిత్రకారుడు శ్రీ బాలి ఉయ్యూరు వస్తున్నామని నాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారింట ఆత్మీయ సమావేశమేర్పరచి ,పద్మరాజుగారి శతజయంతి  జరిపి రా౦బాబు గారికి, కొ౦పెల్ల , బాలి గార్లకు సన్మానం చేసి ధన్యులమయాం .పై సందర్భాలలో రాంబాబు గారి  ప్రస౦గాలు చాలా ఉత్తేజంగా ఉన్నాయి .సరస భారతికి వారు ఆప్తులు ,ఆత్మీయులు .వారు ఇప్పుడు లేరు అంటే జీర్ణించుకోవటం కష్టం గా ఉంది .

             తెనాలోలోని సుండూరు లో 1958 లో జన్మించిన శ్రీ  వేదగిరి రాంబాబు ఉన్నత విద్యాభ్యాసం చేశారు అయినా తనకిష్టమైన జర్నలిజానికి అంకితమై జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నాడు  జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాడు . .రేడియోలో దున్నేశారు  .ఎన్నో కథానికలు రచించారు .ఆయన రాసిన ‘’జైలు గోడల మధ్య  ‘’నవల కు గొప్ప గుర్తి౦పువచ్చింది . ‘’వయసు కథలు’’బాగా పాప్యులరయ్యాయి .దూర దర్శన్ లో ‘’పాపం పసివాళ్ళు ‘’సీరియల్ తీశారు .తాను రచించతటమే కాకుండా యువ కథానికా రచయితలను ప్రోత్సహించటానికి ‘’వేదం గిరి రాంబాబు కధానికా పురస్కారం ‘’ఏర్పరచి అర్హులకు అందించారు .విజయనగరం లోని గురజాడ నివాసాన్ని గ్రంథాలయంగా మార్చటానికి కృషి చేశారు. ఆరోగ్యం కోసం ‘’మన ఆరోగ్యం ‘’రాశారు .హెల్త్ మేగజైన్ కు గౌరవ సంపాదకులుగా ఉన్నారు .తెలుగు భాషకు వేదగిరి రాం బాబు గారు చేసిన కృషికి ప్రభుత్వం నుండి రెండు సార్లు నందిపురస్కారం అందుకున్నఘన  కీర్తి ఆయనది

  ‘’వేద గిరి రాంబాబు బహుముఖీన ప్రజ్ఞావంతుడు .సముద్రం లో అలలు తగ్గనట్లు అతని తపన తగ్గదు.ఆయన సాగించింది సాధారణ యాత్రకాదు. అదొక నిర్విరామ  విరామ మెరుగని అక్షరరమ్య యాత్ర .  తన సాహితీ ప్రక్రియల్లో కడదాకా ప్రయాణించాడు .సృజన, నిర్మాణాత్మక ,ముద్రణ రంగాలను సాహితీ త్రివేణిగా మలచిన సాహితీ తపస్వి .’’ చిరుకప్ప ‘’తో కథానికా అరంగేట్రం చేశారు .’’సముద్రం ‘’కథ ఆంద్ర సచిత్రవార పత్రిక బహుమతి పొందింది .సంఘసేవా, సాహిత్య సేవా జమిలి గా చేశాడు .సెంట్రల్ జైలు లోకి వెళ్లి అక్కడి ఖైదీలతో ముఖాముఖి జరపి,రాష్ట్రం లో మిగిలిన జిల్లాకూ వెళ్లి ఖైదీలను పరామర్శించి  , వారి కథలను,వ్యధలను , కహానీలను  కన్నీటిని వేదనను  నవలీకరించి ‘’జైలు గోడలమధ్య ‘అనే పరిశోధనాత్మకనవల  రాసి  వారికి ‘’అమ్మతనం ‘’చూపించిన మాతృహృదయం ఆయనది .ఆసాంత౦ ఆర్ద్రత ఇందులో మనసుల్ని పిండేస్తుంది .ఒక రకంగా ఇది నాలుగువందల ఏళ్ళ  హైదరాబాద్ చరిత్ర .అంత అద్భుతంగా మలిచాడు  .శ్రీ వీరాజీ అన్నట్లు చిన్నకదల పెద్ద మేస్త్రీలు గురజాడ ,శ్రీపాద నుంచి బుచ్చిబాబు ,పాలగుమ్మి వరకు జరిగిని సాహితీ కృషిని మళ్ళీ బయటికి తీసి షోకేసు లో అందంగా అమర్చాడు .శతాధిక గ్రంథాలు రచించి,ప్రచురించిన అద్వితీయ సాహితీ సవ్యసాచి .100 ప్రసిద్ధ కధలతో ‘’దీప తోరణం ‘’ప్రచురించారు . అయన రచించిన ‘’అడవిమనుషులు ‘’ధారావాహికకు రజత  నంది  పురస్కార౦ లభించింది  .’’మనలో ‘’గాడ్’’రాశారు .’’వేదగిరి రాంబాబు పరిశోధనలు ,’’గిడుగుపిడుగు ‘’’’చిరుధాన్య రుచి ‘’ రాశారు .తనకథలను ‘’వేదగిరి రాంబాబు కథలు ‘’సంకలం తెచ్చారు .

    తనది ‘’కథ కులం ‘’అని శ్లేశించిన చమత్కారి రాంబాబు .రాబోయే తరానికి తెలుగు అక్షరం అందించాలనే తపన ఉన్నవాడు .మాతృభాషను ద్వేషించినవాడు, చదవనివాడు ప్రోత్సహించనివాడు దేశ ద్రోహి అని నిర్మొహమాటంగా చెప్పారు .తాను చేసే ఈ అక్షరయజ్ఞం తనవొక్కడివల్లనే సాధ్యంకాదని, కవులు, కళాకారులు  రచయితలు , సాహితీ వేత్తలు సంస్థలు వదాన్యులు, భాషా సంఘాలు ,అన్ని మాధ్యమాలు ప్రభుత్వాలు పాలు పంచుకొంటేనే ఘన విజయం లభిస్తుందన్నారు .తాను ప్రేరణ చేసి మార్గదర్శకం చేస్తానుకాని అనుసరించేవారు ఉంటేనే ఫలప్రాప్తి లభిస్తుందని నమ్మారు .రచయితలు  సమాజాన్ని 360 డిగ్రీలలో దర్శించి రాస్తేనే ,ప్రయోజనం ఉంటుందన్నారు .తాను గత దశాబ్దన్నర కాలంగా చేస్తున్న కృషి సాహిత్యం లో ప్రతిఫలించి ఇవాళ చక్కని సాహిత్యవాతావరణం ఏర్పడిందని  దీన్ని ఇకా ముందుకు తీసుకు వెళ్ళే గురుతర బాధ్యతా అందరిపైనా ఉందని చెప్పారు .ఆయన గురించి మరో ప్రముఖ కధానికా రచయిత శ్రీ మునిపల్లె రాజుగారు చెప్పిన విషయం చిరస్మరణీయం –

మానవ జీవన వైకల్యాలు, సంక్లిష్ట మానవ సంబంధాలు అరిషడ్వార్గాల ఆటలు, అస్తిత్వ వేదనలు సెంటిమెంటల్‌లోతులు, ఏ రసమైనా మానవ స్వభావ పరిధిలోనే యిమిడ్చి రాంబాబు చెప్పడం – విమర్శకులకు నచ్చే విషయం. బహుళ ప్రమోదాన్విత రచనల ఆర్ద్రతతో తడిసిపోయినవాడు, అందుకనే అతడు నిర్నిద్రరచనా వ్యగ్రుడైనాడు. తన అభివ్యక్తీకరణలో అక్షరశక్తి కన్నా భావుక పరిణతకే పట్టాభిషేకం చేసినవాడు. ‘అర్థాంగి’, ‘తల్లి’ ‘గొప్పదానం’, ‘అస్పష్ట ప్రతిబింబాలు’ యిత్యాది కథానికల్లో సామాన్య పాఠకులకు తెలియని అవయవదానం గురించిన అవగాహన, ‘భయం’ కథలో హైద్రాబాద్‌కు Specific సమస్య – పతంగుల పండుగలో ఘోర ప్రమాదాల హెచ్చరిక, ‘అద్దంలో బింబం’లో అభద్రతకు నిర్వచనం చెబుతూ ”ఆయన పోయిన తర్వాత, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ పడిపోయినట్లయింది” అంటాడు. బూజుపట్టిన పురాతన మూఢాచారాల మీద తిరుగుబాటు కథ – ‘లక్ష్యం’. సినిమా కథల చౌర్యమూలాలను అత్యంత వ్యంగ్యంగా బయటపెట్టిన కథ – ”అనగనగా” యీ కాలపు ”యువ” సినిమాల Fans తప్పక చదవాలి. ఈ ఇరవై కథలకూ ఒక దిశానిర్దేశం విధించుకొన్న శ్రీరాంబాబు వ్యక్తంగానో అవ్యక్తంగానో, కథానిక శిల్ప ప్రాథమిక సూత్రానికి కట్టుబడినట్లు. నేననుకొంటున్నాను – “A Short Story gives less and asks more” అంటే పాఠకుడి మెదడుకు మేతనిస్తుందని. అది శిల్ప రహస్యం.

– మునిపల్లె రాజు

  కధానిక పుట్టుపూర్వోత్తరాలు త్రవ్విపోసిన శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు వెలువరించిన అభిప్రాయాలు మాన్యమైనవి –

ఆధునిక కథానికా నిర్వచనానికి లక్ష్య ప్రాయమయిన రచనలు చేశారు రాంబాబుగారు. కథానికా శిల్ప విన్యాసాన్ని వెలిగింపజేసే కథలు అనేకం ఉన్నాయి. వాటిలో హృదయాన్ని కదిపేవి కొన్ని, కుదిపేవి కొన్ని; కళ్ళను చెమరింపజేసేవికొన్ని, మెరిపింపజేసేవి కొన్ని! వాటిలోంచి ఏర్చికూర్చిన కథానికల పూలగుత్తే మనచేతిలో ఉన్న ఈ పుస్తకం, దీనిలోని ఒక్కొక్క కథానికా పుష్పం సహజ సుందర శిల్పవికాస రూపం. ఒక్కొక్క కథానికా వస్తువు సమకాలిక సామాజిక/వైయక్తిక సంక్లిష్టతావలయంలోనుంచి లాగి మానవ జీవనశకలంగా రూపుగట్టించినది. ఈ విధంగా వస్తు శిల్పకళాకృతులను దాల్చిన ఈ కథానికలు ఈనాటి సమాజానికి అత్యంతావశ్యక మయినవి. మనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న మంచిచెడులను మనం గమనించకపోవచ్చు; గమనించలేకనూ పోవచ్చు. వాటి ప్రభావాలకు మనలో స్పందన లేకపోవచ్చు. కాని రాంబాబుగారి కథానికలు, వాటినన్నింటినీ మన దృష్టికి తెస్తాయి. మనలో స్పందనను కలిగిస్తాయి. ఒక వ్యక్తి మనస్తత్వంలోని వెలుగు నీడలను స్పష్టంగా చూపిస్తాయి.

– పోరంకి దక్షిణామూర్తి

చిన్న కథలకు ఇవ్వాల్సిన’’ మూడ్’’  వేదగిరి కథల్లో ఉండటం విశేషం. ఈ గొప్పతనం అమెరికన్ రచయిత  ఎడ్గార్ అల్లెన్ పో ప్రత్యేకలక్షణం అన్నారు ‘’విడీవిడని చిక్కుల’’ శ్రీ వీరాజీ  .’’కొసమెరుపు అద్భుతంతో సమాప్తి చేసే కధకుడు ఓ హెన్రీ లాంటివాడు .కధల్లో మనుషులు  సజీవంగా కనిపి౦పజేసే లక్షణం రాంబాబుది’’అన్నారు చిత్రకారుడు శ్రీ బాలి .

   అక్షర యోధుడు శ్రీ వేద గిరి రాంబాబు ఇంకా అందుకోవలసిన శిఖారాలున్న వారు . అందాలకే సమ్మోహం కలిగించే నల్లని వంకీల జుట్టు గుండ్రని నగుమోము సుందరుడు ,అంతే అందమైన స్నిగ్ధమైన మెత్తని మనసున్న పుంసామోహనుడు  శ్రీ రాంబాబు  ఇలా అర్దాంతరం గా ,అనారోగ్యం తో 66 వయసులో ఈనెల 18 న మరణించారు .ఆ అక్షర శిల్పి,కలం తో నిశ్శబ్ద విప్లవం సృష్టించిన ,”కథానికా వేదగిరి శృంగం” రాంబాబు గారికి   అక్షర నివాళి ఘటిస్తున్నాను ..

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-18 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.