పాకిస్తాన్ లోని శ్రీ హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం
అనగానే ఆశ్చర్యపోతున్నారా ?నిజంగానే ఉందంటే అవాక్కైపోతారా ?అవును ఉంది .ఇది బెలూచిస్తాన్ ,పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్య యాత్రాస్థలి .అక్కడి ఇక్కడీ క్షత్రియులకు కులదేవత దుర్గా మాత అనబడే హింగూలాదేవి ..కరాచీకి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది .దాక్షాయణి శిరస్సు పడిన హింగోలా ప్రదేశం అవటం తో 51 శక్తిపీఠాలలో అగ్రస్థానం పొందింది .ప్రతి శక్తిపీఠం లో భైరవ ఆరాధన ఉన్నట్లే ఇక్కడా జరుగుతుంది .ఇక్కడి భైరవుని’’ భీమలోచనుడు’’ అంటారు .కచ్ లో కోటేశ్వర్ లో ఆలయం ఉంది .పురాణాలలో ‘’బ్రహ్మ ద్రేయ ‘’గా చెప్పబడింది .పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో ఈ హింగోలా దేవి ఆలయముంది .మక్రాన్ తీర పర్వత శ్రేణులలో ,హిందూమహాసముద్రానికి 120 ,అరేబియా సముద్రానికి 20 కిలోమీటర్ల దూరం లో ఉంది .ఈ క్షేత్ర యాత్రను ‘’నానీకి హజ్ ‘’అంటారు స్థానిక ముస్లిం లు .ఈ యాత్ర కరాచీకి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న’’ హావో ‘’నది నుంచి ప్రారంభమౌతుంది .
హింగోల మందిరం అతి పెద్దదైన హింగోల నదీ తీరం లో ఉంటుంది .పూర్తిగా ఎడారి ప్రదేశం లో ఉన్న భూమి కనుక దీన్ని సంస్కృతం లో ‘’మరుభూమి ‘’అని ,.క్షేత్రాన్ని’’ మరుతీర్ధ హింగోలి’’అని అన్నారు .అంటే’’ ఎడారి దేవత’’ అని భావం . కాళికానంద అవధూత హింగోల ,కోటేశ్వర క్షేత్ర సందర్శనం చేసి బెంగాలీ భాషలో ‘’మరుతీర్ధ హింగోలి ‘’నవల రాశారు .మకరాన్ కోస్టల్ హై వే కరాచీ గ్వాదర్ లనుకలుపుతూ బెలూచిస్తాన్ అరేబియన్ సీ కోస్ట్ కు సమాంతరంగా ఉంటుంది .దీన్ని ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది .అలేక్సాండర్ తన విజయయాత్రను ఇక్కడినుంచే వెనక్కి తిప్పాడు .అంటీ ‘’పీఛేమూడ్ ‘’ఇక్కడినుంచే .ప్రయాణీకులకు యాత్రీకులకు ఎంతో వీలుగా ఈ హైవే నిర్మాణం జరిగింది .
హింగోల అంటే సినబార్ అంటే మేర్క్యురిక్ సల్ఫైడ్.మనపూర్వీకులు దీన్ని పాముకాటు మొదలైన విషాలనుండి కాపాడటానికి ఔషధంగా ఉపయోగించేవారు. ఇప్పుడూ వాడుతూనే ఉన్నారు .ముస్లిం లు దీన్ని ‘’నని ‘’అంటారు .ఇది పురాతన దేవత ‘’నననియ’’ కు సంక్షిప్తం .దీనికే పర్షియన్ భాషలో ‘’అనహిత ‘’అంటారు .అరేబియా సముద్ర తీర ఓడరేవు గ్వాదర్ నుంచి నడకతోనే ప్రారంభమయ్యే యాత్ర అ మహా శక్తి స్వరూపిణి అమ్మవారి దర్శనానికి పవిత్ర౦ గా ఉంటుందని నమ్మకం .యాత్రీకులకు పూజారులు లేక సహాయకులు ఈ ఎడారిలో సహకరించి దారి చూపుతారు .చేతిలో ఒక త్రిశూలం లాంటి కొయ్యకర్ర పట్టుకొని వెంట నడిపిస్తారు .త్రిశూలం శివుడికి, అమ్మవారికి ఆయుధంకదా.కనుక వీరిని ‘’చరి ధారులు ‘’అంటే కర్ర పట్టుకొనే వారు అంటారు .ఈ కర్ర త్రిశూలానికి కాషాయ ధ్వజం కట్టబడి ఉండటం విశేషం .
ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి పూజారి ఒక కాషాయ వస్త్రం ఇచ్చి ,మిగిలిన వారికి సహాయం చేస్తానని ప్రమాణం చేయిస్తారు .తాము వెంట తెచ్చుకున్న నీటిని వేరెవరికీ ఇవ్వవద్దని వారిస్తారు కూడా .కారణం పవిత్ర యాత్ర మలినం కాకూడదనే .యాత్ర మధ్యలో ‘’చంద్ర కూప్ ‘’అనే బురద అగ్నిపర్వతం వద్ద ఆగుతారు .ఆసియాలోనే ఇది అతిపెద్ద బురద అగ్నిపర్వతం .ఇది చాలాపవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు దీనికి ‘’బాబా చంద్ర కూప్ ‘’అంటే ‘’చంద్రబావిపిత ‘’అని అర్ధం .అగ్నిపర్వతాలు సాధారణంగా ‘’మాగ్మా ‘’తో నిండి ఉంటె ఇది బురదతో ఉండటం విశేషం .ఆసియాలో ప్రమాద అగ్నిపర్వత ప్రాంతాలలో ఇది చాలా ముఖ్యమైనది .ఒక్కోసారి వేడి బురద ఎగచిమ్మబడి తర్వాత చల్లబడి గుట్టలుగా పేరుకుపోతుంది .ఈ ప్రాంతం లో ఇలాంటి కూపాలు 18 ఉంటాయి .అండమాన్ దీవులలో ఒక బురద అగ్నిపర్వత౦ ఉంది. యాత్రికులు చంద్ర కూప్ దగ్గర ఆగి, రాత్రి విశ్రాంతి తీసుకొంటారు రొట్టెలు వండి అగ్ని పర్వతం శాంతి౦చటానికి నైవేద్యం పెడతారు .ఇవి వండటానికి గోధుమపిండి, నెయ్యి, పంచదార ఉపయోగిస్తారు .వీటిని భూమిమీదకాక కర్రలపై పెట్టి నివేదిస్తారు .ఉదయంలేవగానే యాత్రికులు పూజారుల సహాయం తో అగ్నిపర్వతం ఏర్పరచిన గొయ్యి దగ్గరకు చేరి దాని అంచున ఒక కొయ్య త్రిశూలం పాతి ,మంత్రాలు చదువుతూ రోటీలను నైవేద్యం పెట్టి ఊదుకడ్డీలు, హారతి వెలిగించి చూపించి రొట్టెలను ముక్కలు చేసి అగ్నిపర్వత కూపం అంటే నోటిలో పడేస్తారు .ఈ పనికాగానే ప్రతియాత్రికుడు తను చేస్సిన తప్పులు ,పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రార్ధించి మళ్ళీ పాపాలు చేయననిప్రమాణ౦ చేస్తాడు .ఎవరైనా ఒప్పుకోకపోతే ,అతడిని యాత్రిక బృందం నుంచి వెలి వేస్తారు .తర్వాత బాబా చంద్ర కూప్ వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగుతారు .
నాలుగైదురోజుల ప్రయాణం తర్వాత, చెక్క ఇళ్ళున్న ఒక గ్రామం చేరుతారు .ఇక్కడే పూజారులు,,సహాయకులు నివాసం ఉంటారు .ఇక్కడి ముస్లిం లకు హింగులాదేవి అరాధ్య దైవం .దేవాలయ ప్రవేశం ముందు భక్తులు హింగూల నదిలో పవిత్ర స్నానం చేస్తారు దీనికి ‘’అఘోరానది’’ అనే పేరుకూడా ఉంది .తడి వస్త్రాలతో అమ్మవారి దర్శనం చేయటం ఇక్కడ సంప్రదాయం .హింగూల అమ్మవారు అంటే ‘’సూర్య చంద్రాకృతి’’మాత్రమే.అంటే విగ్రహం ఉండదు .కొండమీద ఎత్తైన ప్రాంతం లో ఉన్న గుహలో ఈ గుర్తు ఉంటుంది .శ్రీరాముడు ఇక్కడికి వచ్చి,తపస్సు చేసి అన౦తరం తనబాణ౦ తో ఈ చిహ్నాన్ని ఏర్పరచాడని పురాణకధనం .ఈ గుహ దేవాలయాన్ని ‘’మహల్ ‘’అంటారు.అరబిక్ భాషలో భవనం అని అర్ధం .యక్షులు దీన్ని నిర్మించారని స్థానికుల విశ్వాసం .గుహకప్పులు, గోడలు అందమైన దృశ్యాలతో తీర్చి దిద్దబడి ఉంటాయి.నేల మిలమిల మెరుస్తూ ఉంటుంది .
‘’నాని ‘’అనిపిలువబడే అమ్మవారి గుహాలయ ముఖద్వారం 50 అడుగుల ఎత్తు ఉంటుంది,గుహా౦తర్భాగం చివరలో గర్భాలయం లో అమ్మవారి చిహ్నం దర్శనమిస్తుంది .ఎర్ర వస్త్రాలు , గంధ సిందూరం కప్పబడి ఉంటుంది .నేలపై పాకుతూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసి ,వేరొక మార్గం నుండి బయటకు రావాలి .భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేస్తారు .రాత్రి పూట ఇక్కడే గడిపి ఆకాశంలోని అద్భుతమైన ‘’పాలపుంత ‘’ను చూసి పరవశిస్తారు .
విదర్భ రాజు నలమహారాజు హింగూలా దేవి పరమభక్తుడు .ఒకసారి పూరీ రాజు ఆయన సహాయార్ధం వచ్చాడు .జగనాధ స్వామికి ప్రసాదం వండటానికి అతడు హింగూల దేవిని దేవాలయ వంటగదిలో నిప్పు రాజేయమని ప్రార్ధించాడు .పూరీ దేవాలయ౦లొ జగనాద స్వామికి ప్రసాదాలు తయారు చేసే పవిత్రాగ్ని వెళ్ళింది .
మను చరిత్రలో పెద్దనామాత్యుడు ప్రవరాఖ్యుని చేత సిద్దుడిని ఏయే క్షేత్రాలు సందర్శించారని ప్రశ్నిస్తాడు అతడు ‘’కేదారేశు భజించితిన్ , శిరమునన్ గీలి౦చితిన్ హింగులా పాదా౦భోరుహములన్ ‘’అని మొదలు పెట్టి తన తీర్ధ యాత్రా విశేషాలన్నీ చెప్పి, అతనిలో తీర్ధ యాత్ర చేయాలనే సంకల్పం కలిగించటం ,సిద్ధుడు పాదలేపనం పూస్తే దానిమహిమతో హిమాలయ పర్వతం చేరి ‘అటజని కాంచె భూమిసురుడ౦బర చుంబి శిరస్సర జ్ఝరీ పటలముహుముర్లు ఠదభంగ తరంగ మృదంగ నిస్శ్వన స్ఫుట నటనాను కూల ఫరిఫుల్ల ‘’ ‘’అనే గొప్ప పద్యం రచించటం మనకు తెలిసిన విషయాలే .
ఇక్కడేకాక గుజరాత్ ,రాజస్థాన్ లలోకూడా హింగూలా దేవి దేవాలయాలున్నాయి .కులార్ణవ తంత్రం లో 18 శక్తిపీఠాలలో పాకిస్తాన్ లోని ఈ పీఠం మూడవదని ఉంటె, కుబ్జికాతంత్రం లో 42 సిద్ధి పీఠాలలో అయిదవదని చెప్పబడింది .తంత్ర చూడామణిలోని ‘’మహా పితా నిరూపణ ‘’భాగం లో 43 గురించే ఉంది. తర్వాత 51 అయ్యాయి పితాదేవత అంటే దేవియే. హా కొట్టారి,కొట్టవి,కొట్టారిష అనీ,భైరవుని భీమలోచనుడని చెప్పబడింది.16 వ శతాబ్దం లో ముకు౦ద రాం రాసిన ‘’చండీ మంగళ్’’లో తొమ్మిది గురించే చెప్పాడు .
ఒక కధనం ప్రకారం త్రేతాయుగం లో విచిత్ర వీరునికుమారులుహింగూల ,సుందరులు .వీళ్ళు లోకకంటకులైతే వినాయకుడు సుందరుడిని సంహరించాడు .ప్రజలు దేవిని ప్రార్ధించి హింగూలను చంపమని ప్రార్ధించారు .వాడిని వెంబడిస్తూ దేవి ఇప్పుడున్న హి౦గూల గుహలోకి వచ్చి వాడిని సంహరించగా వాడు తనపేరిట ఆప్రదేశం పిలువబడాలని ఆమెను అర్ధించాడు .తధాస్తు అన్నది .మరో కధనం ప్రకారం బ్రహ్మ క్షత్రియులనేవారు హింగూల దేవిని కులదేవతగా ఆరాధించేవారు .పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది క్షత్రియులు పారిపోతే వారికి ఇక్కడి బ్రాహ్మణులు ఆశ్రయమిచ్చి బ్రాహ్మణ వేషాలు వేయించి ప్రాణాపాయం తప్పించి వారినికాపాడమని హింగూలాదేవిని ప్రార్ధించారు .వీరి వంశంవారే ఆతర్వాత బ్రహ్మ క్షత్రియులయ్యారు .ఇంకో కధనం ప్రకారం దధీచి మహర్షి రత్న సేనుడనే సింధు రాజును తన ఆశ్రమం లో రక్ష కల్పించాడని ,కాని పొరబాటున రత్న సేనుడు బయటికి వస్తే , పరశురాముడు చంపాడని,కొడుకులు ఆశ్రమం లోనే ఉన్నారని పరశురాముడు మహర్షిని సందర్శించినపుడు వాళ్ళు బ్రాహ్మణ వేషం లో కనిపించారని కనుక ఆయన దృష్టి వీళ్ళపై పడలేదు కనుక బ్రతికిపోయారని ,అందులో ‘’జయసేనుడు ‘’సింథ్ కు వెళ్లి రాజ్యపాలన చేశాడని ,దధీచి ఉపదేశించిన హింగూలమాత మంత్రం తో రాజ్యాన్ని కాపాడాడని ,హింగూలాదేవి పరశురాముడిని ఇక క్షత్రియ సంహారం చేయవద్దని శాసి౦చి౦దని అంటారు .
ప్రతి ఏడాది హింగులామాతయాత్ర ఏప్రిల్ లో ప్రారంభమౌతుంది .మూడవ రోజు ముఖ్యమైనది .పూజారులు మంత్రోచ్చాటన చేస్తూ యాత్రిక భక్తులు సమర్పించే నైవేద్యాలు కానుకలు స్వీకరించి ఆశీర్వదించమని ప్రార్ధిస్తారు .అమ్మవారికి అందరూ కొబ్బరికాయలే సమర్పిస్తారు . కొందరు ఇక్కడే నాలుగు రోజులు ఉంటారు .దేశం లోని అన్ని ప్రాంతాలనుంచీ అమ్మవారి దర్శనానికి యాత్రికులు వస్తారు .ఓపిక ఉన్నవారందరూ దర్శించి తరించాల్సిన క్షేత్రం హింగూల దేవి సిద్ధ శక్తి పీఠం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-18- ఉయ్యూరు
—
ఇంత చాట భారతం రాసే బదులు నాలుగు ఆలయం బొమ్మలు పెట్టొచ్చు గదా.