అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం

మా పెద్ద తోడల్లుడుగారు శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తిగారు 90  ఏళ్ళ వయసులో ఖమ్మం లోని స్వగృహం లో 28-8-18 మంగళవారం రాత్రి 7-30 గం.లకు మరణించారు .సుమారు మూడేళ్ళ నుంచి మూత్రపిండాల బాధతో  హార్ట్ ఎటాక్ తో కాళ్ళ వాపులు, కంటి జబ్బులతో ఇబ్బంది పడుతూ తేడా చేసినప్పుడు హైదరాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స చేయి౦చు కొంటున్నారు .ఆగస్ట్ మొదటి వారం లో బాగా లేక యశోద లో చికిత్స పొందుతుండగా నేను 7 వ తేదీ ఉయ్యూరునుంచి హైదరాబాద్ వెళ్లి హాస్పిటల్ లో ఆయన్ను చూసి పలకరించి వచ్చాను .అయితే అంతకుముందే డయాలిసిస్ జరిగి నీరసంగా ఉండటం తో నేను ఎక్కువ సేపు ఉండకుండా వచ్చేశాను .అ ఆర్వాత ఆయన వాళ్ళబ్బాయి అమ్మాయిలతో ‘’ప్రసాద్ గారు వచ్చారు కాని నేను ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడలేక పోయాను ‘’అని బాధపడ్డారట .అంతటి మెత్తని మనసు ఆయనది .ఉగాది రోజుకూడా ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .

   ఈ మధ్య వారం క్రితం మళ్ళీ తేడా చేస్తే హాస్పిటల్ లో చేరారు .వయసు రీత్యా డయాలిసిస్ తట్టుకోలేని పరిస్థితి .కనుక హాస్పిటల్ వద్దు అని ఇంటివద్ద మారాం చేశారట .కాని ఆయనబాద చూస్తూ ఊరుకోలేరుకదా .ఒప్పించి చేర్పించారు .అన్ని రకాల వైద్య౦ చేస్తూనే ఉన్నారు .కాని 27 వ తేదీ రాత్రితొమ్మిదిన్నరకు మా బావమరది ఆనంద్ ఫోన్ చేసి మూర్తిగారి పరిస్థితి చాలాక్రిటికల్ గా ఉందని వెంటిలేటర్స్ పైనే ఉన్నారని  ఆశలేదేమో నని నిర్వేదంగా చెప్పాడు . బహుశా రాత్రికో తెల్లవారుఝామునో ఖమ్మ౦కు అంబులెన్స్ లో తీసుకు వెడుతున్నారని చెప్పాడు .అప్పటికప్పుడు మేమూ బయల్దేర లేని స్థితి . మంగళవారం ఉదయం  మూర్తిగారి అమ్మాయి అల్లుడు శ్రీమతి మంజుల శ్రీ సత్యనారాయణ గార్లతో ఫోన్ లో మాట్లాడాను.మూర్తిగారిని అంబులెన్స్ లో హాస్పిటల్ వాళ్ల టెక్నీషియన్ సహాయంతో  వెంటిలేటర్స్ తోనే ఉదయం 5-30 కి హైదరాబాద్ లో అందరూ కలిసి బయల్దేరామని సుమారు ఉదయం 10-30 కు ఖమ్మం చేరుతామని అక్కడ పరిస్థితిని బట్టి వెంటిలేటర్స్  గురించి ఆలోచిస్తామని చెప్పారు .

28 వ తేదీ మంగళవారం ఉదయం స్నానపూజాదులు పూర్తీ చేసుకొని ,అన్నం వండుకొని ఉదయం 9 గం లకే తిని,కారులో మేమిద్దరం  9-30 కి బయల్దేరి బెజవాడ వెళ్లి అక్కడున్న మా శ్రీమతి చిన్నక్కయ్య జానకిగారిని కూడా ఎక్కించుకొని అక్కడ 11 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1-15 కు ఖమ్మం చేరాం  .మూర్తిగారి భార్య అంటే మా శ్రీమతి పెద్దక్కయ్య గారు మహా లక్ష్మి గారు , కొడుకు సూర్యనారాయణ ,కోడలు స్వర్ణ ,మూర్తిగారి తమ్ముడికుమారులు కోడళ్ళు సూర్యం పెద్ద వియ్యంకుడు వియ్యపరాలు  అప్పటికే వచ్చి ఉన్నారు .లోపలగదిలో ఆయన మామూలుగా పడుకొనే మంచం మీదే పడుకోబెట్టారు .అప్పటికి వెంటి లేటర్స్ తీసేసి గంటన్నర అయి౦దన్నాడు సూరి .టెక్నీషియన్ వెంటి లేటర్స్ తీసేయ్యగానే ప్రాణం పోతుంది అని చెప్పాడట .అయినా శ్వాస ఆడుతోంది .గుండె కొట్టుకొంటోంది .ఎగ రొప్పుతో పొట్ట బాగా కదుల్తోంది .మనం పలకరించినా తెరచి ఉన్నకనులు మనల్ని గుర్తించలేక పోతున్నాయి . కృత్రిమ శ్వాస లేదు కనుక ఏ క్షణం లోనైనా ఊపిరి ఆగిపోవచ్చు  .అందరూ మంచం చుట్టూ కూర్చుని విషాదంగా ఉన్నాం .

    రాత్రి అసలేమి జరిగింది అని సూర్యాన్ని అడిగితే వాడు ‘’బాబాయ్ !రాత్రి నాన్నగారి బాధ చూడలేక డయాలిసిస్ చేయమని డాక్టర్ ను రిక్వెస్ట్ చేశాం . నాన్నగారికి 12 ఏళ్ళ నుంచి ఆయనే డాక్టర్ .నాన్నగారి వ్యాధి గురించి అన్ని విషయాలు ఆయనకు తెలుసు ఈ 12 ఏళ్ళలో 6 సార్లు మాత్రమే డయాలిసిస్ చేశారు .కనుక మనం కోరినప్పుడు చేయరు అన్నీ ఆలోచించే ఆ డాక్టర్ నిర్ణయాలు తీసుకొంటారు . ఆయనంటే నాన్నగారికీ, మాకు అంతనమ్మకం .కాని ఇప్పుడు డయాలిసిస్ చేస్తే తట్టుకోలేరు  చేయటం  మంచిది కూడా కాదు  అన్నారు .ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని అడిగాం .ఒక్కటే ఉంది .80 వేలరూపాయల  ఇంజెక్షన్ ఉంది .అదిచేస్తే ఆయన శరీరం దాన్ని తీసుకోగలిగితే 6 నెలలు లైఫ్ గ్యారంటీ .కాని అది సైడ్ ఎఫెక్ట్ ఇస్తే హార్ట్ పై ప్రభావంకలిగి  కార్డియాక్ అరెస్ట్ ,లేక బ్రెయిన్ పై ప్రభావం చూపించవచ్చు .ఇంతకంటే మనం ఏమీ చేయలేం .మీ  నిర్ణయాన్నిబట్టి చేస్తాం అన్నారు .క్షణం కూడా ఆలోచిచకుండా  అందరం వెంటనే చేయమని కోరాం .దానికోసం కాలర్ బోన్ దగ్గర గాటు పెట్టి చేయాలట .అలానే చేశారు .డాక్టర్ వెంటనే బయటికి వచ్చి సక్సెస్ సూర్య౦ గారూ అని సంతోషంగా చెప్పారు .అందరం హాయిగా ఊపిరి పీల్చుకున్నాం .అరగంట కాగానే నన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి రమ్మని విచారంగా మొహం పెట్టారు డాక్టర్ .మూర్తిగారి శ్వాస ఆగిపోయింది .అని చెప్పాడు .అయినా ప్రయత్నిస్తున్నామని గుండెలను కదిల్చే ప్రయత్నం చేశారు .బాగానే పని చేసి గుండె కొట్టుకొన్నది ..ఒక్కసారి మూర్తిగారు పెద్దశబ్దం చేశారు .డాక్టర్ అది గమనించి నాతో కార్డియాక్ అరెస్ట్ జరిగిందని ,బ్రెయిన్ కూడా దెబ్బ తిందని ఇక ఏమీ లాభం లేదని ఖమ్మం  తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు అయితే ఖమ్మానికి వెంటిలేటర్స్ పైనే తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చారు .ఉదయం 5-30 కు బయల్దేరి 10-30 కు చేరాం ‘’అని జరిగిన విషయాలన్నీ చెప్పాడు .ఆదివారం కూడా మూర్తిగారు అందరితో సరదాగానే మాట్లాడారట .మనవరాలు మంజులకూతురుకు ఉద్యోగం వచ్చిన వార్తవిని అభినంది౦చారట .ఇంతలో ముంచుకొచ్చేసింది .

                మూర్తిగారి బంధువులు మిత్రులు వచ్చి చూసి వెడుతున్నారు .తెల్లవారుజామున 5 గంటలవరకు యశోదా హాస్పిటల్ లోనే ఉన్న మా బావమరది ఆనంద్ ఇంటికి వెళ్ళాడు వీళ్ళు ఇటు వచ్చారు .వాడు, భార్య రుక్మిణి మధ్యాహ్నం 12 గంటలకు బస్ లో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరి సాయంత్రం 5-30 కు ఖమ్మం చేరారు .వీళ్ళకూ సూర్యం మంజులావాళ్ళకూ రాత్రి తెల్లవార్లూ నిద్ర లేదు .సూర్యం వాళ్లకు మూడు రోజులనుంచి నిద్రే లేదు మొహాలన్నీ అలసి పోయి ఉన్నాయి .మేము సాయంత్రం 5-30  గంటలవరకు ఉండి,అందరికీ చెప్పి కారులో మళ్ళీ ఉయ్యూరు బయల్దేరాం .సుమారు నందిగామ దగ్గరకు రాగానే రాత్రి 7-30 కి ఆనంద్ ఫోన్ చేసి ‘’పెద్దబావ వెళ్ళిపోయాడు బావా ‘’అని బావురుమన్నాడు .నేను మా అబ్బాయిలకు ఫోన్ చేసి చెప్పాను మా అమ్మాయి పోద్దుననుంచీ చాలాసార్లు ఫోన్ చేసి విషయాలు తెలుసుకుంటూనే ఉంది .మాఅబ్బాయి రమణకూడా.అంటే మూర్తిగారి గుండె, ఊపిరి తిత్తులు  వెంటిలేటర్స్ తీసేసిన తర్వాత కూడా 8 గంటలు పనిచేస్తూ ఇక సెలవు అని ఆగిపోయాయన్నమాట .ఇదొక వింత అనుభవం అని అందరూ అన్నారు  .నిన్న 29వ తేదీ బుధవారం ఉదయం మూర్తిగారి పార్ధివ శరీరానికి  మూర్తిగారి తమ్ముడు, బావమరది ఆనంద్, కూతురు అల్లుడు  ,బంధువుల కుటుంబాలు, స్నేహితుల సమక్షం లో  కొడుకు సూర్యం యధావిధిగా అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించి పితృ ఋణం తీర్చుకున్నాడు .

దాదాపు పదేళ్ళ  నుంచీ ఇన్ని రకాల వ్యాధులతో బాధపడుతూ కూడా చెదరని చిరునవ్వుతో ,సడలని ఆత్మ విశ్వాసం తో ,ధైర్యంగా మౌనంగా మునీశ్వరుడిలా మూర్తిగారు గడిపారు.ఎవరిపైనా చికాకు, కోపం ప్రదర్శించని తత్త్వం ఆయనది .ఎంతటి దుఖాన్నైనా బాధనైనా నిబ్బరం గా తట్టుకొనే మనస్తత్వమున్నవారు . భార్య మహాలక్ష్మి గారు ఆయనకు అన్నిటా బాసటగా ఉన్నారు . ఇద్దరూ కూర్చుని చక్కగా అనేక విషయాలు గంటలతరబడి మాట్లాడుకోనేవారు  అంతటి అన్యోన్యం వారిది .సుమారు ఏడాది నుంచి ఆయన కు ఆమె కనిపించకపోతే విలవిలలాడేవారట  అనుక్షణం ఆమె ఆయన ఎదుట కనిపించాలని ఉండేదట.  హైదరాబాద్ లో కొడుకు, కూతురు ఉన్నా ,వాళ్ళు అక్కడికి వచ్చి ఉండమన్నా ఖమ్మం స్వంత ఇంట్లోనే పెద్దగా సౌకర్యాలు లేకపోయినా హాయిగా వండుకు టిని ఉండాలనుకొనే స్వేచ్చా జీవులు  వారిద్దరూ .ఆయనకు ఇష్టమైన పదార్ధాలు ,పిండివంటలు ,ఉపాహారాలు  వండి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టటం ఆవిడకు ఎంతో ఇష్టం .ఆయన కాఫీగత ప్రాణి .కనుక అడిగినప్పుడల్లా చిక్కని చక్కని కాఫీ కలిపి ఇచ్చేది .ఇంటికి వచ్చినవారికీ అంతే.అతిధి మర్యాదలకు పెట్టింది పేరు .ఎన్నో రకాల ఊరగాయలు పెడుతుంది .మా ఆవిడను ‘’అమ్మడూ !’’అని .చాలా ఆప్యాయంగా పిలిచి మాట్లాడుతుంది ఫోన్ లో కూడా అంతే .నెలకు కనీసం వాళ్ళే రెండు సార్లైనా ఉయ్యూరు కు ఫోన్ చేసి మాట్లాడేవారు .వెడల్పు ముఖం నుదుటిపై పెద్ద కుంకుమబొట్టు తో ఆవిడ సాక్షాత్తూ మహా లక్ష్మీగా కనిపించేవారు .మహా లక్ష్మి పేరు సార్ధకం చేసేవారు

   దారిలో నేను మొదట హెడ్ మాస్టార్ గా పని చేసిన వత్సవాయి హైస్కూల్ ను ,అక్కడ స్కూలు వెనక నేను అద్దెకున్నశ్రీ పుల్లయ్యనాయుడు గదిని చూసి నాయుడు దంపతులు మమ్మల్ని చూసి ఆనందంతో ఇచ్చిన కోకాకోల తాగి మళ్ళీ బయల్దేరాం .ఇటు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆగి వెళ్ళటం  మాకు మామూలే .మార్చిలో వచ్చినప్పుడు, అంతకుముందు మా అమ్మాయి విజ్జి ,కోడలు సమత మేము వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణ౦ లో పుల్లయ్యనాయుడు దంపతులను చూసివచ్చాం .వాళ్ళకూ మేమంటే విపరీతమైన అభిమానం .

అయిదునెలలక్రితం  మార్చి 12 ఉయ్యూరులో బయల్దేరి ఖమ్మంవచ్చి మూర్తిగారు అప్పటికి అనారోగ్యం నుంచి తేరుకున్నందున మేమిద్దరం చూడటానికి వచ్చాం .మూర్తిగారు దంపతులకుమేము నూటా వస్త్రాలు పెడితే ,ఆదంపతులు మా దంపతులకు బట్టలు పెట్టారు .వారికి ‘’షార్లెట్ సాహితీ మైత్రీబంధం ‘’;;వసుధైక కుటుంబం ‘’పుస్తకాలు అప్పుడు అందజేశాం .అనారోగ్యం మర్చిపోయి రాజకీయాలగురించి దేశ పరిస్థితులపైనా చాలాసేపు మాట్లాడారు .మా పిల్లల౦ టే  చాలా ఇష్టం .ముఖ్యంగా శర్మ ,రమణలు ఆయనకు శిష్యులు .మా అమ్మాయి విజ్జి మూర్తి గారికి  అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంది .నా సాహితీ కృషిని నిండుమనసుతో మెచ్చుకొనేవారు .శ్రీ ఆంజనేయస్వామిపూజకు కి తరచుగా డబ్బు లిచ్చేవారు .పుస్తకం లో ఆయన మరదలు అంటే మా ఆవిడ ఫోటో ఉండటం చూసి మహా మురిసి పోయేవారు .ఆయనకు  సరసభారతి పుస్తకాలు ఆవిష్కరణ కాగానే పంపటం ,ఆయనా ,అందుకొన్న  తర్వాత ఫోన్ చేసి ‘’ప్రసాద్ గారు !ఇన్ని పుస్తకాలు, ఇంతటి విషయసేకరణ ఎలా చేయగాలుగుతున్నారో తలచుకొంటే ఆశ్చర్యం వేస్తుంది ‘’అనే సుమనస్కత మూర్తిగారిది .90 సంవత్సరాల నిండైన సంతృప్తికరమైన జీవితం అనుభవించారు.హాయిగా నిష్క్రమించారు .కొడుకు సూర్యం కు ఇద్దరబ్బాయిలు .ఇద్దరూ అమెరికాలో మంచి ఉద్యోగాలలో ఉన్నారు .ఇద్దరికీ మగపిల్లలు .అమ్మాయి మంజుల కొడుకు బి టెక్ చేసి కెనడా లో ఉద్యోగం లో ఉన్నాడు .కూతురు బి టెక్ పాసై ఉద్యోగం సాధించింది ఈమధ్యనే .కొడుకు ,కూతురు మూర్తిగారికి రెండుకళ్ళు .మునిమనవళ్ళను చూసి  మూర్తిగారు మురిసిపోయారు .ఎత్తుకొని ఆడించి ఆనందించేవారు .మనవళ్ళు తాతగారితో వీలైనప్పుడల్లా ఫోన్ లో మాట్లాడుతారు .ఆయనకూ వాళ్ళతోసంభాషించటం చాలా ఇష్టం . వాళ్ల భార్యలపైనా  గొప్ప ఆపేక్ష ఆయనకు .ఆయన మంచితనం ఎల్లలు లేనిది .మా కుటుంబానికి మూర్తిగారంటే విపరీతమైన అభిమానం ,ఆపేక్ష ,గౌరవం మర్యాదా .ఆయనకూ అంతే .మా అమ్మాయి అమెరికానుంచి వస్తే కారులో మేమందరం ఖమ్మం వెళ్లి చూసివస్తాం .మూర్తిగారింట్లో పనస చెట్టు బంపర్ క్రాప్ ఇస్తుంది ఇష్టంగా  ఆ దంపతులు  కోసి ఇస్తారు .

    మూర్తిగారు  జిల్లా కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రా ర్ గా గా పని చేసి రిటైరయ్యారు .ఒక్క దమ్మిడీ లంచం తీసుకోకుండా అత్యంత నిజాయితీగా నిబద్ధతతో పని చేసిన స్ట్రిక్ట్ డిసిప్లిండ్  ఆఫీసర్ .రాకీయాలకు తలొగ్గకుండా కమ్యూనిస్ట్ ల ,నక్సలైట్ ల ప్రాబల్య ప్రాబల్యం ఉన్న ఏరియాలలో కూడా పని చేసి భేష్ అనిపించుకొన్నారు .ఖమ్మం లోని సహకారనగర్ లో స్వంత ఇల్లు కట్టుకోవటానికి ముందు శివాలయం దగ్గర ఉండేవారు .వీళ్ళ ఇంటి ప్రక్కనే తెలంగాణా కవి శ్రీ దాశరధి గారి ఇల్లు ఉండేది. ఒక సారి మూర్తిగారింటికి వెళ్ళినప్పుడు వాకిట్లో కూర్చున్న దాశరధి గారిని చూశాను .వీరింటి ఎదురుగా కొడపై ఖిల్లా ఉండేది .ఇప్పుడు స్వంత ఇంటిదగ్గర చిన్న కొండపై శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది .మా అబ్బాయిల పెళ్లిళ్లకు , అమ్మాయి పెళ్ళికి మూర్తిగారి దంపతులు వచ్చారు .తోడల్లుళ్ళ అందరి ఇళ్లలోని శుభకార్యాలకూ రావటం  వాళ్ల ఆశీర్వాదాలు పొందటం మాకు ఆనందం .శుభంగా భావిస్తాం .ఆ దంపతులకు పాద నమస్కారం చేయకుండా ఎప్పుడూ రాము .

  మూర్తిగారు’’ చైన్ స్మోకర్ ‘’.చేతిలో సిగరెట్ పెట్టె, వక్కపొడి పాకెట్ లేకుండా కనిపించేవారుకాదు .ఈయనకు తోడు మా ఆవిడ మేనమామ ,మాకజిన్ బ్రదర్ .మంకొల్లులో పోస్టాఫీస్   నిర్వహిస్తూ ,ఆయుర్వేద డాక్టర్ అయిన  చతుర్వేదుల పూర్ణానందం అన్నయ్య ‘’జిగినీ దోస్తీలు’’ .ఒకరికొకరు  బహిర్ ప్రాణం .ఇద్దరూ ‘’ఊదుడు గాళ్ళే’’అవటం తో స్నేహం ఎక్కువ .వాళ్ళిద్దరూ ఎన్నెన్నో రాజకీయాలు మాట్లాడుకొనేవాళ్ళు పోగపీలుస్తూ  వక్కపొడి నమలుతూ. ఆరోగ్యందేబ్బతిన్నాక సుమారు అయిదారేళ్ళనుంచీ సిగరెట్ ,వక్క పొడిలకు స్వస్తి పలికారు .

   మూర్తిగారిని మొదటిసారి  నా చిన్నప్పుడు జగ్గయ్యపేట లో ఆయన వివాహమైన కొత్తలోనో ఎప్పుడో రేడియో స్టోర్స్ లో పని చేస్తుండగా చూసిన గుర్తు .ఆయన తండ్రిగారు పరమభక్తులు .జగ్గయ్యపేటలో ఇంట్లో నిత్యం పూజలు పునస్కారాలు సంతర్పణలతో పెళ్లి ఇల్లులాగా ఉండేదని చెప్పుకొనేవారు .దాదాపు ఆస్తి అంతా ఇలా ఖర్చుయిందని అంటారు .అలా ఎందుకనుకోవాలి ?ఆయన పుణ్యఫలమే ఇప్పుడు వారి సంతతికి  రక్షగా ఉందని భావించవచ్చు .’’చేసిన ధర్మమూ చెడని పదార్ధము వచ్చును నీ వెంట ‘’అనే తత్వ గీతం ఉంది కదా.

  మూర్తి గారికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చాలామందే ఉన్నారు .అందరిమీదా ఆయనకు విపరీతమైన అభిమానం .వాళ్ళకూ ఆయనపై ఆరాధనా భావం .కుటుంబ పెద్దగా ఆయనకు విశేషమైన గౌరవం ఇస్తారు .మూర్తి గారి దంపతుల కుమార్తె మంజుల వివాహం ఖమ్మం లో మా పెద్దబ్బాయి శాస్త్రి, సమత లవివాహానికి ముందు జరిగింది .మా అబ్బాయిలందరూ మంజుల పెళ్ళికి మంచి సహకారం అందించారు .మా బావమరది ఆనంద్ కూడా .వాడంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ .వాడు పుట్టగానే తమకు ఒక బావమరది పుట్టాడని గొప్పగా చెప్పుకున్న విశాల హృదయం ఆయనది  .రామప్పగుడికి మా వాళ్ళను జీపులో తీసుకువెళ్ళి అక్కడ జరిగే పేరిణి శివ తాండవం చూపించారు .ఆయన కరీనగర్ లో పనిచేసినప్పుడు సిద్దిపేటలో ఉన్న మామేనల్లుడు అశోక్ ఇంటినుంచి బస్ లో వచ్చి మూర్తిగారింటికి వెళ్లి చూసి వచ్చాను .అప్పుడు వాళ్లకు బాయిలర్ ఉండేది .అదే దాన్ని నేను మొదటి సారి చూడటం .తర్వాతెప్పుడో నేను కొన్నాను .మూర్తి గారు నాతో చాలా గౌరవంగా మాట్లాడుతారు .పెద్దగా రాచకీయ చర్చ చేయరు .మూర్తిగారి కుమారుడు సూర్యనారాయణ మూర్తిని మేమందరం సూర్యం లేక సూరి అంటాం .వాడు స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగం లో చేరి మేనేజర్ గా రిటైరయి హైదరాబాద్ మియాపూర్ లో అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు .తండ్రిని ‘’నాన్నారూ నాన్నారూ’’అంటూ గౌరవంగా సంబోధిస్తాడు .తండ్రిని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపాడారు సూర్యం, స్వర్ణ దంపతులు .వైద్యానికి ఎంతఖర్చైనా భరించారు .సేవలు చేశారు .తండ్రి ఋణం బాగానే తీర్చుకున్నాడు సూర్యం .కూతురు మంజుల కూడా తనవంతు సహకారం అందించింది .అల్లుడు సత్యనారాయణ గారు బహు యోగ్యుడు .అలాంటి అల్లుడు దొరకటం మూర్తిగారు చేసుకొన్నా అదృష్టం .ఆయన మంచితనానికి దక్కిన ప్రతిఫలం .

  అతి సాధారణ జీవితాన్నే గడిపారు మూర్తి గారు .ఆడంబరాలు ,హెచ్చులుకు పోలేదు  గొప్ప సంతృప్తి తోఉండేవారు. అల్ప సంతోషి  .ఆ దంపతుల వివాహం అయి 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఏదైనా వేడుక ఘనంగా చేసుకోమని మా ఆవిడ వాళ్లకు ఎన్నో సార్లు చెప్పింది కానీ వాళ్ళు వద్దన్నారు . మేమిద్దరం కనీసం సత్యనారాయణ స్వామి వ్రతం అయినా చేసుకోమని గోల చేశాం .చివరకు ఒప్పుకొని ఖమ్మం లో వ్రతాన్ని బంధు మిత్రుల సమక్షం లో చేసుకొని విందు ఏర్పాటు చేశారు .ఉయ్యూరునుంచి మేమిద్దరం వెళ్లి నూతనవస్త్రాలు చదివించాం .వాళ్ళూ  అందరికీ బట్టలు పెట్టారు .మూర్తిగారి అల్లుడు సత్యనారాయణ  స్వగ్రామం ఖమ్మ౦  దగ్గరున్న మీనవోలు .ఖమ్మంలో సత్యనారాయణ అన్నలూ అక్కలు ఉన్నారు .కనుక బందుగణానికి కొదవలేదు .మూర్తిగారి సహోద్యోగులు ,మిత్రులు వీరింట్లో ఏ శుభకార్యమైనా హైదరాబాద్ కు వచ్చి వెళ్ళటం పరిపాటి. అంతటి సౌజన్యం సంపాదించారు మూర్తిగారు .

            శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తి గారు అన్ని విధాలా సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్రుని సద్గుణాలు మూర్తీభవించిన వారు . ఏప్రిల్ 13 మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ హైదరాబాద్ లో మరణించింది .నాలుగు నెలలకు మళ్ళీ మూర్తిగారి మరణం .ఈ  రెండూ మాకు తీవ్ర మనస్తాప౦  కలిగించాయి .మా కుటుంబాలకు పెద్ద అయిన మూర్తి గారి  మరణానికి సంతాపం తెలియజేస్తూ ,వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతూ ,ఆ కుటుంబానికి సాను భూతి అందజేస్తున్నాను .

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-18 –ఉయ్యూరు

image.png

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.