హరి కృష్ణ –ఒక పరిచయం
అప్పుడు నేను పామర్రు హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాను .అవి ఎన్టి ఆర్ కొత్తగా తెలుగు దేశం పార్టీ పెట్టి ఊరూరా ప్రచారం చేస్తున్న రోజులు .ఒక రోజు హరి కృష్ణ మా స్కూల్ కు మందీమార్బలంతో వచ్చి స్టాఫ్ నందర్నీ స్వయంగా కలిసి,నమస్కారం చేస్తూ తెలుగు దేశం పార్టీ కి ఓటు చేయవలసిందిగా అభ్యర్ధించారు .అప్పుడేవరైనా ‘’అలాగే ‘’అంటాం అందరం అలానే అన్నారు .ఆతర్వాత చాలాసార్లు ఎన్నికలప్రచారం లో పామర్రు మీదుగా వెడుతూ ప్రచార రధం పైనే కనిపించారు తప్ప మళ్ళీ ప్రత్యక్షంగా చూడలేదు .
మరో సారి పామర్రులో పని చేస్తుండగానే’’ తాతమ్మ కల’’సినిమా నందమూరు లో షూటింగ్ జరుగుతున్నప్పుడు స్టాఫ్ అందరం సైకిళ్ళమీద నందమూరు రామారావు గారింటికి వెళ్లాం .రామారావు గారు మమ్మల్ని సాదరం గా ఆహ్వానించి టిఫిన్ కాఫీలు అందించి షూటింగ్ జరిగే ప్రదేశం మాకు చూపమని ఒక మనిషి నిచ్చిపంపారు .పొలాల్లో షూట్ చేస్స్తున్నారు .భానుమతి రామారావు నటిస్తున్నారు చేతిలో కర్ర పట్టుకొని ముసలి గెటప్ లో ఇద్దరూ ఉన్నారని జ్ఞాపకం .హరికృష్ణను కూడా చూసినట్లే గుర్తు .ఒక గంట షూటింగ్ ప్రదేశం లో ఉండి రామారాగారికి ధాంక్స్ తెలిపి ,తిరిగి వచ్చాం .
మా మద్రాస్ మేనల్లుడు అంటే మా పెద్దక్కయ్య శ్రీమతి లోపాముద్ర , బావగారు శ్రీ కృపానిధి గార్ల కుమారుడు శ్రీనివాస్ మద్రాస్ లో మెట్రిక్ పరీక్షలకు తయారౌతున్నప్పుడు వాడు చదివే స్కూల్ లో RAMA KRISHNA కూడా చదవటం ,ఇద్దరికీ మంచి స్నేహం ఉన్నట్లు తరచూ చెప్పేవాడు .వాళ్ళు మెట్రిక్ పరీక్ష గుంటూరు కేంద్రంగా రాశారు .వాళ్ళంతా ఒక పెద్ద హోటల్ లో బస చేశారు .నన్ను వెళ్లి చూడమని మా అక్కయ్య చెబితే ,నేను గుంటూరు కు చూడటానికి వెళ్లాను .అక్కడ హరి కృష్ణ ను చూసిన ట్లు లీలగా జ్ఞాపకం. గట్టిగా చెప్పలేను .
మరో సారి నాకు మోపిదేవి హై స్కూల్ లో1963లో – నాతోపాటు పనిచేసిన నాకు అత్యంత ఆప్తుడు , జూనియర్ తెలుగు పండిట్ స్వర్గీయ శ్రీ కూచిభొట్ల సత్యనారాయణగారు తర్వాత నందమూరు హై స్కూల్ కు బదిలీ అయినప్పుడు హరికృష్ణ అక్కడి స్కూల్ లో చదివేవాడని ,అప్పటికే నటనలో దిట్ట అని డైలాగ్స్ తాను నేర్పెవాడినని సినిమాలో చిన్న కృష్ణుడు వేషం వేశాడని కలిసినప్పుడు చెప్పేవారు .
మూడు ఏళ్ళ క్రితంఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో జరిగిన శ్రీ హనుమజ్జయ౦తికి మధ్యాహ్నం 12 -30 కి స్వామివార్ల శాంతి కల్యాణం కూడా అయిపోయాక ఇద్దరు మహిళలు వచ్చి స్వామివారికి పూజ చేయించలని కోరారు .ఆసమయం లో ఇక పూజలు ఉండవని, సాయంత్రం వస్తే నేనే దగ్గరుండి పూజ చేయిస్తానని చెప్పాను .సరేనని తీర్ధ ప్రసాదాలు తీసుకొని వెళ్ళారు .సాయంత్రం ఘనంగా చాలీసా పారాయణ జరుగుతున్న సమయం లో ఆ ఇద్దరు మహిళలు మళ్ళీ వచ్చారు .అప్పుడు కూర్చోపెట్టి వాళ్ల వివరాలు అడిగాను .ఒకామె తాను సినీ యాక్టర్ నందమూరి హరి కృష్ణగారి భార్యనని చెప్పి తనతో పాటు వచ్చిన ఆవిడ హరి కృష్ణ తోడల్లుడిగారి భార్య అనీ ,తామిద్దరం ఉయ్యూరు దగ్గర కుమ్మమూరు నుంచి వచ్చామని చెప్పారు .అప్పుడు నాకు తెలిసింది ఆ రెండో ఆవిడ నాకు బాగా తెలిసిన హనుమంతరావు గారి భార్య అని .దగ్గరుండి పూజారితో వారిద్దరి గోత్రనామాలతో అష్టోత్తర సహస్రనామార్చాన చేయించాను .స్వామి వారి అలంకరణ వైభవం చూసి వారిద్దరూ పరవశం చెందారు .ఆ రోజు తమలపాకులతో ప్రత్యేక పూజ కనుక స్వామి దాదాపు తమలపాకులతో మునిగిపోయి అత్యంత వైభవంగా ఉన్నారు. వాళ్లకు కన్నులపండువుగా ఉందని తెగ మెచ్చుకొన్నారు . పూజ పూర్తయ్యాక అసలు ‘’మా ఆలయం గురించి మీకు ఎలాతెలుసు ?’’అని హరికృష్ణ భార్యను అడిగాను .ఆమె ‘’మా వారు హరిక్రష్ణగారు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం గురించి నెట్ లో చూసి చదివి తెలుసుకోన్నారట .నిన్నరాత్రి కుమ్మమూరులో ఉన్న నాకు ఫోన్ చేసి ,నన్ను తప్పకుండా హనుమజ్జయ౦తినాడు ఆలయానికి వెళ్లి, స్వామివార్లను దర్శించి పూజ చేయించి రమ్మని చెప్పారు .అలాగే నని చెప్పి ,ఉదయం పనులన్నీ ముగించుకొని మేమిద్దరం వచ్చాం ‘’అని చెప్పారు .చాలా సంతోషించి వెంటనే ఇంటికి వెళ్లి సరసభారతి పుస్తకాలు తెచ్చి ,ఇద్దరికీ చెరో సెట్ ఇచ్చాను .దీనికి మరీ సంబర పడ్డారు .డబ్బు ఇవ్వటానికి సిద్ధమయ్యారు .డబ్బుకు పుస్తకాలు అమ్మము .మీకు కావాలంటే హుండీలో మీరు ఇవ్వాలనుకోన్నది వేయండి .అని చెప్పాను. అలానే చేసి మరింత ఆశ్చర్యపోయారిద్దరూ.
ఇదీ నందమూరి హరికృష్ణ తో నాకున్న పరిచయంగా నేను చెప్పుకొనేది .
కొస మెరుపు –నేను ఉయ్యూరు హై స్కూల్ లో పని చేస్తున్నప్పుడు ,ఎన్టీ ఆర్ కొత్తగా పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నాడు .మాస్టాఫ్ అంతా కాంగ్రెస్ సానుభూతిపరులు .కాని రామారావు పా ర్టీ పెట్టి ,ఘన విజయం సాధిస్తారని ఆయనే ముఖ్యమంత్రి అవుతాడనీ రోజూ నాకు తెలిసిన పేపరు వార్తలతో వాదించేవాడిని .ఒకరోజు పేపర్ లో పడిన రామారావు ఫోటో నా రాక్ కు అంటించి నా అభిమానం చాటాను . రామారావు గెలవటం ముఖ్యమంత్రి అవటం జరిగిపోయాయి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-18 –ఉయ్యూరు
—
—