ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ”
—————————————————————–
కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73 మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .7+3==10 సంఖ్యా శాస్త్రం లో. వందా పూర్తి అయినట్లే .
శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ నామం .శంకర శాస్త్రి శివ నామం ..మేన మామ ,మేనల్లుడు విష్ణు ,శివ రూపాలుగా వెలిగి ,”త్వమే వాహం”ఆంటే నువ్వే నేను అనిపించుకున్నారు .బాంధవ్యం ,స్నేహం ,అపూర్వం .శ్రీ శ్రీ తర్వాత పేర్కొనదగిన స్థాయి సంపాదించి ఆరుద్ర మామకుతగ్గ అల్లుడైనాడు .మహా ప్రస్థానం తర్వాత పేర్కొన దగిన రచన ”త్వమేవాహం ”.ఆధునిక మహా కావ్య త్రయం లో త్వమేవాహం ఒకటి .మొదట్లో శ్రీ రంగం నారాయణ బాబు,శ్రీ శ్రీ పురిపండా ,పఠాభి ల ప్రభావం బాగా వున్నా ,క్రమం గా అందులోంచి జారి ,స్వంత గొంతుక తో ,స్వీయ వ్యక్తిత్వం తో ,మహాకవుల స్థాయికి ఎదిగిన వాడు ఆరుద్ర
తెలంగాణా నేపధ్యం గా ”త్వమేవాహం ”రాశాడు ఆరుద్ర . ఈ నాటి తెలం గాణా కాదు .పొరపడ కండి .నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయం గా ప్రత్యక్షర శిల్పం గా మలిచాడు .పొట్టి వాడైనా గట్టివాడైన దాశరదికి తోడై,గట్టిగా గళం విప్పాడు .ఇదొక సింబాలిక్ రచన .టి ఎస్ .ఇలియట్ రాసిన వేస్ట్ లాండ్ లోని లక్షణాలన్నీ నిక్షిప్తం చేసి ”,ఆంద్ర ఇలియట్ ”అనిపించు కున్నాడు .అయితే దీనికి టీకా ,టిప్పణి ఉంటేనే బోధ పడుతుంది .అందుకే మొదటి ప్రచురణ జన రంజకం కాలేదు .తర్వాత దాశరధి తో చక్కని ఉపోద్ఘాతం రాయించి ప్రచురించాడు .అతడు నిజం గా ఆరుద్ర హృదయాన్ని అద్భుతం గా ఆవిష్క రించాడు .readability కలిగించాడు .అప్పటి నుంచే త్వమేవాహం చదువరుల హస్తాలను ,మస్తకాలను అలంకరించింది .oft quoted lines కు జీవం పోసింది .హరీన్డ్ర నాధ చటోపాధ్యాయ రాసిన ”తెలంగాణా విప్లవ గాధలు ” ఆరుద్ర త్వమేవాహం కు ప్రేరణ .దీన్ని ఆరు కధలుగా కూర్చి కదా కావ్యం చేశాడు .ఈ ప్రక్రియ లో ఇదే మొదటిది
ఆరుద్ర మౌలికం గా ప్రయోగ వాది .ఆవేశం కంటే ఆలోచనతో కవిత్వం రాస్తాడు .చమత్కారం ,శబ్దాలంకారం ,భావ వ్యక్తీకరణకు తోడ్పదేట్లు రాయటం ఆయన ప్రత్యేకత .ఖండ కావ్యాన్ని కదా సూత్రం తో బంధించి ,పెద్ద కావ్యం గా ప్రయోగం గా రాశాడు .అభ్యుదయ కవితా చైతన్యాన్ని మరో మలుపు తిప్పాడు .”technic లేని కవిత్వాన్ని నేను ఊహించలేను ”అంటాడు .అయితే ”ఆరుద్ర కవిత్వం టెక్నిక్ లో కూరుకు పోయింది ”అన్న వాళ్ళూ వున్నారు . ”ట్రెయిన్ లో స్టీన్ గన్ .లా చెట్లు ,చిట్టెలుకలు —-చెయిన్సులో మగాళ్ళు -చెరచ బడ్డ ఆడాళ్ళు —చెడ పురుగులు –మదమెక్కిన సోల్జర్లు ”అనటం ఆరుద్ర మార్కు కవిత్వం .
పైథాగరస్ సిద్ధాంతాన్ని చక్కగా కవిత్వీకరించాడు ”.చిన్ని చీమలు వగైరా అడుగు భుజం అనుకోండి —బలవంత మైన సర్పం -గట్రా ఎట్ సేటేరా -లంబం అవదా మరి ?–రెండు విభిన భుజాలపై గల చతురశ్రాలలోని తమిశ్రం –థీసీస్,యాంటి థీసీస్ సుల మిశ్రమ -రెండు భిన్న పక్ష సంజ్ఞల పోరాటం –అనగా ఒక నూతన వ్యవస్థ ”
ఆరుద్ర కవిత్వం చదివి ”ఇంకా నేను కవిత్వం మానేసినా ఫర్వాలేదు ”అని కితాబు ఇచ్చాడు శ్రీ శ్రీ తన ముద్దుల మేనల్లుడికి .ఆంగ్లం లోని క్రియ ను తెలుగు లో కూడా వెర్బ్ గా చేసి ప్రయోగించాడు
. చెరిష్+ఇంచు=చరిషించు అనీ రన్ +అండి ==రనండి ,అలాగే ఆమెన్ -ఆమెన్ ఒక చోట మెన్ అనీ ఇంకోచోట ఆమె అనీ శ్లేష .
గతం లోని మంచి ద్వారా వర్త మానం తీర్చి దిద్ది ,భవిష్యత్తు పై దృష్టి కేంద్రీకరించిన ప్రతిభా మూర్తి ఆరుద్ర. అందుకే శ్రీ శ్రీ అంటాడు సాహిత్యోపనిషత్ లో ” చూశావా ఆరుద్రా !సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా –మధాచారాలు మారుతూ౦టా యి నిజం -కాని –సంప్రదాయం తాత ముత్తాతల ధనం -జాతికి జీవ నాళిక —జాన పద గీతిక ” .ఇదే మహా కవుల జంట దృష్టి తెలుగు సాహిత్యాకాశం లో శ్రీ శ్రీ ,ఆరుద్రలు సూర్య చంద్రులు . ..
ఆరుద్ర మరో పార్స్వ్యం
సినీ వాలి
ఆరుద్ర వచన కావ్యాలలో పేరు పొందింది ”సినీ వాలి ”ఆంటే అమావాశ్య ముందు కన్పించే ”చంద్ర రేఖ ”.పార్వతీ దేవికి కూడా ఆ పేరుంది .ఎంత కటిక చీకటి ముందు వున్నా ,ఆశా కిరణం తోడు వుంటుంది ,నిరాశ పనికి రాదనీ ఇందులోని ధ్వని .ఈ పేరు ఈ కావ్యానికి పెట్టి సార్ధకం చేసిన వారు ప్రముఖ కవి కాటూరి వెంకటేశ్వర రావు గారు .ఆధునిక కవిత్వానికి మూల వస్తువూ ,స్ఫూర్తీ ఆర్తీ అన్ని తనే అయిన వాడు ,మనిషిని ,అతని వ్యధను యుగయుగాల పీడనను ,వచ్చే యుగం పట్ల ఆశను ,ఆకాంక్షను ,తన కవితా దృష్టి లో ప్రతిఫలింప జేయటం ఆరుద్ర ఆనవాయితీ .అందుకే ప్రయోజన వాది గా గుర్తింపబడ్డాడు .అభ్యుదయం అతని వాదం .మనిషే అతని నాయకుడు .అనుభూతి తో పాటు,ఆలోచన వైపు మనిషినీ ,చదువరినీ నడిపించిన మహా కవి . ..సినీ వాలి నగర జీవితం పై వ్రాసిన గేయ కావ్యం ..విలక్షణ హీరో జగ్గయ్యకు అంకితమిచ్చి మామ అయాడు .మధ్య తరగతి క్లార్కు సూర్యారావు జీవిత చిత్రమే ఇది .కాంక్రీటు అరణ్యాలు అయిన నగర ఘోష ..
ప్రక్రియా వైవిధ్యం
——————–
” ఇంటింటి పద్యాలు ”రాసి ప్రతి ఇంట్లో పాడుకోనేట్లు చేశాడు ఆరుద్ర .”గాయాలు -గేయాలు ”రాసి మనసు లోని బాధను వెళ్ళ గక్కాడు ..”విశ్వ నాద నాయకుడు ”చరిత్రను నాటకం గా మలిచాడు .అందరు స్త్రీ పాత్రలే వుండే నాటికలు రాశాడు .”ఆరుద్ర నాటికలు ”పరమ ప్రయోజనం కోసమే రాశాడు .అవి కాలక్షేపం బఠానీలు కావు .”సర్రియలిస్ట్ ”కవిగా రాణ పొందాడు కధకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు .”నేను చెప్పానుగా ”అనే కదా సంపుటి తెచ్చాడు .దేశీయ ఛందస్సు లో ‘కూనలమ్మ పదాలు ” ”రాసి అందర్నీ కొరడాతో ఝళిపించాడు .”పైలా పచ్చీసులు ”తో పరవళ్ళు తొక్కాడు .”వెన్నెల -వేసవి-”లతో చల్లదనం ,చంద్ర గాడ్పులు విసిరాడు .”అచ్చు తప్పులు ”రాసి కొత్త వరవడి సృష్టించాడు .ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి .”కొండంత మనిషి చ (క) నుమరుగైనాడు ”
”anthropology ”, ప్రీ హిస్టరీ వ్రాసి పాత చరిత్రను తవ్వి తలకెత్తాడు .”ఆరుద్ర గళ్ళ నుడికట్టు ”సాహితీ ప్రియులకు గొప్ప కని కట్టు గా వుండేది .”స్థల నామాలు ”పై తీవ్ర పరిశోధన చేశాడు .”వ్యాస పీఠం ”రాసి ఆధునిక వ్యాసుడే అయాడు .”detective ”సాహిత్యం సృష్టించి ,నేర పరిశోధన లో కొత్త దనం ప్రవేశ పెట్టాడు .జర్నలిస్ట్ గా పత్రికా సేవ కూడా చేశాడు .”సమగ్రాంధ్ర చరిత్ర ”తో ఆరుద్ర సాహితీ విశ్వ రూపం మనకు దర్శన మిస్తుంది .అంతకు ముందే”త్వమే వాహం ”కావ్యాన్ని తెలంగాణ నేపధ్యం లో రాశాడు .ఇది symbolic రచన .చదరంగం మీద ప్రత్యెక అభిమానం వుంది దాని లోతులు తరిచి పుస్తకం రాశాడు .’ఇంత విస్త్రు తం గా వైవిధ్యం గా తన సాహితీ జేవితాన్ని పండించు కొన్నాడు భాగవతుల సదా శివ శంకర శాస్త్రి అయిన ఆరుద్ర ..సిని పాటల మాటల రచయిత గా శ్రీ శ్రీ తో పాటు నిలబడ్డాడు .డబ్బింగ్ రచయిత గా మామకు తగ్గ అల్లుడని పించు కున్నాడు . తాను చే బట్టిన ప్రతి ప్రక్రియను సర్వాంగ సుందరం చేసి భళా అనిపించుకున్న ఆరుద్రను గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే వుంటుంది …
నిత్య పరిశోధకుడు ఆరుద్ర
తెలుగు సాహిత్యానికి సామాజిక నేపధ్యం లో సాహిత్య చరిత్ర రాసిన ఘనాఘనుడు ఆరుద్ర .సప్త సాహితీ సముద్రాలను తానొక్కడే అవలీలగా ఈది ఒడ్డుకు చేరిన వాడు .సామాన్యుడు సైతం చక్కగా ,కధలా చదూకోనేట్లు”సమగ్రాంధ్ర సాహిత్యం ”సృష్టించిన బహుముఖ బ్రహ్మ .అనితర సాధ్యమైన దాన్ని తాను చేసి చూపాడు .మొదటి సారిగా పది సంపుటాలు తెచ్చాడు ..ఆ తర్వాత రెఫెరెన్సు కోసం పది సంవ త్సరాలు పరిశోధన చేసి ఇంగ్లాండ్ ,అమెరికా లైబ్రరీ లలో వున్న సమస్త విషయాలను సేకరించి మిగిలిన మూడు భాగాలు ప్రచురించాడు .కవి కాలమ్ పై చర్చలు ,కులం పై రాద్దా౦తాలు అరణ్యం లో ,కొండల్లో చీకటి కోణం లో చిక్కుకున్న సాహితీ చరిత్ర అనే దివ్య గంగను భూమార్గం పట్టించి ,జనసామాన్యం కోసం జాతి తరించటం కోసం కృషి చేసిన ”సాహితీ భగీరధుడు ”ఆరుద్ర .పది విశ్వ విద్యాలయాలు ,,వెయ్యి అకాడెమీలు చేయలేని పనిని ఒంటరిగా ఆరుద్ర చేసి జాతికి అంకితమిచ్చి ధన్యుడైనాడు .తన ఆరోగ్య సర్వస్వాన్ని కోల్పోయాడు .
. ”ప్రపంచ వాజ్మయాన్ని ప్రజాపరం చేసి ,ప్రస్థాన భేరి మోగించి ,బావుటా ఎగుర వేసిన ప్రజా కవి ఆరుద్ర ”అన్న మాట సత్యం యుగవిభజన చేయటం లో ఆరుద్ర కొత్త మార్గం తొక్కాడు .పోషకులను ఆధారం గా చేసుకొని యుగవిభజన చేసి తన మార్క్సీయ దృక్పధాన్ని నిల బెట్టుకున్నాడు .కవి ,పండితుడు ,విమర్శకుడు ,శాసన భాషావిష్కారుడు అన్నీ తానె కనుక సాహిత్య చరిత్ర అంత గొప్ప గా వచ్చింది .అందుకే సాహిత్య పండితుల్లో ఆరుద్ర అగ్రేసరుడు .”చుళికీ కృత సర్వ పాదోది పయస్కుడైన ముని ”అని నన్నయ గారు అగస్త్య మహర్షిని సంభావించారు .అలాగే బవిరి గడ్డం తో ,కాషాయ వస్త్రాల తో వున్న ఆరుద్ర నిజం గానే” సాహితీ ఆగస్తి యార్ ”. ,
నిరంతర పరిశీలనా వ్యసనుడు
తొమ్మిదవ ఆసియా క్రీడల సందర్భం గా పోస్టల్ శాఖ వారు ”మత్ష్య యంత్రాన్ని కొట్టే శ్రీ కృష్ణుని” చిత్రాన్ని స్టాంప్ గా వేశారు .దాన్ని చూసి చాలా మంది ఆక్షేపించారు .అయితె ఆరుద్ర ప్రాచీన తెలుగు కావ్యాలలో ఒక దాని నుంచి కృష్ణుడు మత్ష్య యంత్రాన్ని కొట్టే ఘట్టాన్ని వుదహరించి సమర్ధించాడు .
” శ్రీ కృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడు ”అని కూడా వివరించాడు
ఏకలవ్యుడు కుంతీ దేవి అక్క కొడకు అని సంస్కృత హరివంశం ఆధారంగా తెలిపాడు . కుమార్తె కు పుత్రిక కు భేదం వుందని”మనుధర్మ శాస్త్రం ”ఆధారం గా వివరించాడు .కుమార్తె ఆంటే తోడబుట్టిన అన్నదమ్ములు కల అమ్మాయి .పుత్రిక ఆంటే సహోదరులు లేనిది ..ఈమెకు పుత్రుని అధికారాలన్నీ దక్కు తాయి .
” సీత రామునికి ఏమవుతుంది ?”అనే వ్యాసం లో వివిధ దేశాల లోని రామాయణాలను సాకల్యం గా పరిశీలించి వివరించాడు .
” వేమన్న ” పై పరిశోధన చేసి ”వేమన్న వేదం ”అనే అభినవ వేదం రాసాడు /.
” గురజాడ ”పై అంతులేని అభిమానం తో ”గురజాడ గురు పీఠం ”రాసి ఆయనకు మహోన్నత పీఠం కల్పించాడు . ‘
తెలుగు వాళ్ళు చేసుకొనే ప్రతి పండుగ వెనుక వున్న, ప్రతి ఆచారం వెనకా వున్న పరమార్ధాన్ని తెలియ జేసిన sixth sense వున్న ఆరో రుద్రుడు ఆరుద్ర . చరిత్ర ,విజ్ఞానం ,దర్శనాలు ,నాట్య శాస్త్రం ,సంగీతం ,చదరంగం ,ఇంద్రజాలం మొదలయిన వాటన్నిటి పై సాధికారం గా రచనలు చేసిన సాహితీ విరాణ్మూర్తి ఆరుద్ర .అయితే ప్రతి రచనను ” marxist దృక్పధం ”అనే గీటురాయి పై పరీక్షించాడు నిబద్ధత గల గొప్ప రచయిత అనిపించు కొన్నాడు ఆరుద్ర .31-8-1925 విశాఖలో జన్మించి 4-6-1998 మద్రాస్ లో మరణించాడు ఆరుద్ర .
నమో రుద్రాయ ఆరుద్రాయ అని నమస్కరిస్తూ
నేడు ఆరుద్ర జయంతి సందర్భంగా
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-20 11 –ఉయ్యూరు
—