గురు గీత
బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (స్వామీ ప్రనవానంద భారతీకుమార్ )రచించిన 48 గ్రంధాలలో ‘’గురుగీత ‘’పునర్ముద్రణ గ్రంధం ఇవాళ 2-9-18 ఆదివారం ఉదయం రోటరీ క్లబ్ ఆడిటోరియం లో శాస్త్రి గారి శత జయంతి కుటుంబ వేడుకలలో ఆవిష్కరి౦ప బడింది .దానిపై నన్ను సమీక్ష చేయమని శాస్త్రి గారి కుమార్తె శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారు కోరగా ,ఆపని చేసే ప్రయత్నం చేశాను .కాని అందరూ కుటుంబ సభ్యులే పాల్గొని వారి పరిచయాలు వారి పాటలు మాటలతో సమయం బక్కచిక్కి నాకు లభించింది రెండే రెండు నిమిషాలే .కాని ఈ పరిచయం సరసభారతి సాహితీ బంధువులకు అందజేసే తలంపుతో రాసి తెలియ జేస్తున్నాను .
వ్యాసమహర్షి రాసిన స్కాందపురాణం లోని సనత్కుమార సంహితలో శివ పార్వతీ సంవాదంగా ‘’గురు గీత ‘’ఉన్నది .మహర్షి ‘’అస్య శ్రీ గురుగీతా స్తోత్ర మంత్రస్య భగవాన్ సదాశివ రుషిః నానావిధాని చందాంసి శ్రీ గురుపరమాత్మ దేవతా హం బీజ౦ సః శక్తిః క్రోం కీలకం శ్రీ గురు ప్రసాద సిద్ద్యర్దే పాఠే వినియోగః ‘’అని అన్నిరకాల ఛందస్సులు వాడి రచించాడు వ్యాసర్షి .సిద్ధ యోగ విధానం లో గురుగీత కు ప్రాధాన్యత ఎక్కువ. స్వామి ముక్తానంద 182 శ్లోకాలను ఎంపిక చేసి శ్రావ్యత కలిగిస్తే, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గురుగీతకు గొప్ప ప్రచారం చేస్తున్నారు .అలాంటి గురుగీతను తాడేపల్లి శాస్త్రిగారు 3అధ్యాయాలు ,35 1 శ్లోకాలతో ఉన్నదాన్ని ‘’కందమాలిక’’గా అలాగే రాశారు .కందం అందంగా సాగి సులభ బోధకంగా ఉంది .
‘’గురుర్బ్రహ్మా ర్గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ‘’
అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాన్జన శాలాకయా –చక్షురున్మీలన తమ్ ఏవ తస్మైశ్రీ గురవేనమః ‘’
త్వమేవ మాతాచ పితాచ త్వమేవ –త్వమేవ బందుశ్చసఖా త్వమేవ –త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ –త్వమేవ సర్వం మమ దేవ దేవ’’
‘’ఏక ఏవ మహా మంత్ర౦ గురురిత్యక్షరద్వయం ‘’
‘’మంగళం గురురూపాయ –మహనీయ గుణాత్మనే –సర్వ లోక శరణ్యాయ –సాదు రూపాయ మంగళం ‘’తో పాటు సాక్షాత్తు శ్రీ కృష్ణునికి అభేద రూపమైన వ్యాసమహర్షి ని స్తుతించే –
‘’ఆచతుర్వదనో బ్రాహ్మా –ద్విబాహు రపర కేశవః -అఫాల లోచన శ్శివః-పరబ్రహ్మ స్వరూపకః ‘శ్లోకమూ గురువుకే చెందుతుంది .రేపు జగద్గురువైన శ్రీ కృష్ణ జన్మాష్టమి . ముందురోజు గురుగీత గురించి మాట్లాడటం సమయోచితమే .కుచేలుడు కృష్ణ దర్శనం కోసం ద్వారకకు వెళ్లి అక్కడ స్నేతుడు కృష్ణుడు తనకు చేసిన సకల సపర్యలకు పొంగిపోయి కృష్ణుడు తమ గురువైన సాందీప మహర్షి ని తలచు కొని గొప్పగాకీర్తించాడు . అవాక్కైన కుచేలుడు
‘’గురు మతి దలపగ త్రిజగ –ద్గురుడవనం దగిన నీకు గురుడనగా నొం-డొరు డెవ్వ డింతయును నీ-కరయంగ ,విడంబనం బగు గాదె హరీ ‘’అంటాడు .అంటే త్రిలోక గురువైన నువ్వు నీ గురువును తలచుకోవటం మహనీయ విషయం .లోకానికి ఆదర్శంగా నిలిచావు అని పోతన్నగారి పద్యం .అదీ గురు గరిమ .
ప్రధమాధ్యాయంలో శౌనకాది మహర్షులు యధాప్రకారం గా సూతమహర్షి ని’’ఎవని తత్వ శ్రవణ౦బున భువిని జీవి సర్వ దుఃఖ ముక్తు౦ డగునో ‘’వివరించమని అడిగితే ఆయన ‘’భవ రోగ శామమని గీత ‘’ను వివరిస్తానంటూ ఒకప్పుడు కైలాసం లో పార్వతి శివుని ఇదే ప్రశ్న అడిగితే ఆయన బోధించి ‘’గురు గీత ‘’ను సవివరం గా చెప్పాడు
మాయా జగత్తులో శరీరం అజ్ఞాన సంభవం అనే జ్ఞానం ఎవరి ప్రసాద మహిమ వలన లభిస్తుందో అతడే గురువు .’’గురువర్యు ననుగ్రహమే –హరియించును శోక మోహ భారము లెల్లన్ –వర దేశి కేంద్రు కేవల –పరమాత్మ స్వరూపునకు ప్రణతు లొనర్తున్ ‘’అని గురువు అంటే ఎవరో చెప్పాడు .ఎవరి అనుగ్రహం తో అజ్ఞానం నశించి జ్ఞానం లభిస్తుందో అతడే పరమాత్మస్వరూపమైన గురువు .’’గు వర్ణ అజ్ఞాన తమము –రు వర్ణంబు జ్ఞాన తేజ భాసంబగు మా –నవులకు తమస్సు హరియించు గు –రువు నిస్సంశయంబుగను బ్రహ్మ౦బే యగున్ ‘’అనిగురువు బ్రహ్మమే అని స్పష్టం చేశాడు .అజ్ఞాన మనే చీకటిని విజ్ఞానం అనే కంటి కాటుకపెట్టి ఆత్మజ్ఞాన దృష్టి ప్రసాదించే ‘’బ్రహ్మ జ్ఞాన ఘనుండు గురుడు ప్రణతుల నిడెదన్ ‘’
గురువు గొప్పతనాన్ని వివరిస్తూ శాంతుడు, గగన తలానికి అతీతుడు ,శాశ్వత గుణుడు నిరంజనుడు ,చైతన్యుడు గురు దేవుడు అన్నాడు .గురువు విశాల హృదయం ఉన్నవాడు –‘’తన సత్యమె జగతికి నాగు –తనభాసమె సకల జగతికి భాసమునౌ –తనయానందమెసర్వుల –కానందంబైన గురునికి వందనముల్ ‘’
గురువు కారణ ,ప్రేరణ ఫలకార్య రూపుడు కారణ కార్య స్వరూపుడు ‘’తారకం కూడా గురువే .అజ్ఞానమనే పాముకాటుకు ప్రజ్ఞానం అనే ప్రధమ వైద్య౦ చేసి ,సుజ్ఞానం బోధించే ‘’బ్రహ్మ జ్ఞాన స్వరూపం ..గురుసేవకు దూరమైన వాడికి ‘’దొరకదు ముక్తిమార్గము ‘’అని ఘంటాపథంగా చెప్పాడు .
రెండవ అధ్యాయం గురు ధ్యానవైభవం .గురువు ఎక్కడుంటాడు ?’’హృత్పద్మ కర్ణిక కేంద్ర-తత్పద సిమ్హా సింహాసనస్థిత దివ్యమూర్తి –సత్ చిత్ సుఖ సకలాభీ –ష్ట ప్రదు శశికళాభాసి సద్గురుడు ‘’అని యోగాఢ్య స్వరూపునిగా వర్ణించాడు .ఇంకొంచెం లోతుకు వెళ్లి –‘’అ కథా త్రిరేక సరసిజ –ప్రకటితమును ,సహస్ర దళమండలమున హం –సకు సరస త్రికోణ౦బున ‘’ప్రకాశించే జ్యోతి అన్నాడు .గురువుకంటే అధికం లేదు హరి హరాదుల కోపాన్ని గురువు హరి౦చ గలడు కాని గురువుకు కోపం వస్తే’’ అప్పీలే’’లేదు .మళ్ళీ ఆయన అనుగ్రహం పొందాకే ఏదైనా .జ్ఞానం జ్ఞేయం అన్నీ తన మనసే అని తెలుసుకోవాలి .గురు భక్తిలో లోపం రానీయ కూడదు .’’గురు శాపగ్రస్తునకు –దొరకదు పార్వతీ ,రక్ష ‘’దీనికి సురులు మహర్షులు కూడా ఆశక్తులే .పరబ్రహ్మం నుంచి గడ్డిపరకవరకు పరమాత్మ స్వరూపమే .అలాంటి పరమాత్మ గురువే .
‘’అంగుస్ట మాత్ర పురుషుడు –సంగత హృత్పద్మ మరయ సద్గురు ధ్యానం –మంగళ ప్రద జ్ఞానము ‘’అంటాడు.
గురుని ధ్యానం తో స్వయం బ్రహ్మ అయ్యే శిష్యుడు భూమిపై పిండ ,పద ,రూపము ల విముక్తుడవుతాడు ‘’అని శివుడు అనగానే పార్వతి పిండం,,పదం రూపం ,రూపాతీతం అంటే వివరించమని అడగగా పరమేశ్వరుడు ‘’’కుండలినీ శక్తి పిండ –మండగ పదమగును హంస పరికిం పంగా-మదాల రూపము బిందువు –ని౦ డగు రూపము కతీత నిరంజనమున్ ‘’అని తాంత్రిక రహస్యం చెప్పాడు .ఎప్పుడూ శాంతంగా ఉంటూ సర్వకాల సదానంద బ్రహ్మం –సర్వత్రా చెందిన సర్వాత్మయే,తాను అనే స్పృహ సర్వజ్ఞత అవుతుందని సూక్ష్మ౦ చెప్పాడు .గురూపదేశం గురు మార్గం లో నడవటం గురుభక్తి ముక్తికి సోపానాలు .
తర్వాత గురు గీత మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు అ౦బకు అ౦బాపతి .గురుగీత పుస్తకం రాసినా, దానం ఇచ్చినా ,గురు శ్రవణం చేసినా ,పఠించినా సద్గతి కలుగుతుంది .’’గురు గీతా జప పరునకు –దొరకు నన౦త ఫలప్రాప్తి గురు కృప చేతన్ –దారిద్ర్యము నశియించును -కర గించును సర్వ పాపగిరుల సహితమున్ ‘’.అకాల మృతువు సంకటాలు ఆది వ్యాధులూ తొలగిపోతాయి .ఎవరెవరికి ఏ కోరిక ఉంటె ఆ కోరిక తప్పక తీరుతుంది .’’శైవ ,శాక్త ,పశుపతి ,వై –ష్ణవ ,గాణాపత్య ,సౌర ,షణ్మతచరులున్ –సవినయముగ జపియి౦తురు గురుని ‘’అని షణ్మతా వల౦బు లందరూ గుర్వనుగ్రహం కోసం తపించేవారే అన్నాడు .
మూడవ అధ్యాయం –జ్ఞాన ప్రదాన ప్రశంసన లో గురు మంత్రం ముఖం లో ఉన్నవాడికి అఖిల కార్య సిద్ధికలుగుతుందని ,గురువుకు సంతృప్తికలిగితే శిష్యుడికి ముక్తిలభిస్తుందనిచెప్పగా ఇదంతా శ్రద్ధగా విన్న పార్వతి ‘’బోధ గురువుల సంగతి బాగానే ఉంది మరి బాధ గురువుల సంగతేమిటి ?అలాంటి నిషిద్ధ గురు సేవవల్ల వాళ్ల గతేమిటి ?’’అని ప్రశ్నించింది .దానికి ‘’నిషిద్ధ గురువు అని ఎప్పుడైతే తెలుసుకొని వదిలేస్తాడో అప్పుడే సద్గురు భావన కలుగుతుంది .పరమ గురువు సంగతి వివరిస్తూ పరమ శివుడు నదులన్నీ సముద్రం లో కలిసినట్లు గురువులందరికీ ధ్యేయం పరమగురువే ,అయితే ఎవరా పరమగురుడు అంటే –‘’అజ,హరి హర ,వైభవమును –త్యజించు శాంతుండు నిత్య తృ ప్తుం డగు చున్ –విజిత శోక మోహాది వి-రాజ నిజాశ్రయుండగు ‘’పరమగురువు ‘’ప్రియా ‘’అని చెప్పాడు .త్రిమూర్తులకతీతభావం కలిగి శాంతం భూషణ౦ గా అను నిత్య సంతృప్తి తో శోక మొహాదులను విసర్జి౦ చిన వాడే పరమ గురుడు అని విస్పష్టం గా చెప్పాడు పార్వతీ విభుడు .గురువును మించిన దైవం ,గురువుతో సమానుడైన తండ్రి లోకం లో లేరు .గురుభక్తి ఉంటె ఏం జరుగుతుందో వివరిస్తూ పరమగురుడు పరమేశ్వరుడు –‘’’
‘’గురు భక్తి పరుడు ,సతతము –చరియించు వేద శాస్త్ర సారాను గుణం –ఘోర పాతక శ్రేణిని-హరియించు విశేష భక్తి పరతంత్రు౦డై ‘’అని భరోసా ఇచ్చాడు భవుడు. ‘’భుక్తియు ముక్తియు ,నొసంగ –శక్తి ప్రదములును గురుని చరణ కమలముల్-శక్తుండు నశక్తుడు నా –సక్తి నాశ్రయించ జన్మ సఫలత గాంచున్ ‘’
‘’గురు గీత వేదసారము –పరిపూర్ణముగా వచింప బడినది యగుచున్ –గురు పదమున కన్యంబును –నరయ లేదు జీవ ముక్తి కరమగు నదియున్ ‘’అంటే గురు గీత వేదం లో ఉన్న సార సంగ్రహం ,సంపూర్ణం కనుక గురువు పాదాలకంటే వేరేదీ జీవన్ముక్తి కలిగించేది లేదు .మరోక్కమారు ‘’ఎ౦ఫటిక్ ‘’గా ‘’గురునామ తుల్య దైవము –గురు సమపిత ,బంధు జనులు ,గురు సమ ప్రభువున్ –గురు సదృశ పరమపదము –నరయ దుర్లభంబు జగతి నేరికి నైనన్ ‘’అని ముక్తాయింపు ఇస్తూ మరొక్కసారి ఉమతో ఉమారమణుడు -‘’గురు గీతయె-భవ దుఃఖ వినాశకారి పఠించగ దీ-పవిత్ర తత్వము గురు దీ-క్షా విహీను ముందు నెపుడు నే విధి నైనన్ ‘’అని సమాప్తి పలికారు. గురు అంటే విశేషమైన విశిష్టమైన అనే అర్ధం కూడా ఉంది కనుక ఇది నిజంగానే గురు గీత సార్ధక నామం తో విరాజిల్లింది .దీనిని శాస్త్రిగారు 2-11-1995 లో ప్రారంభించి 19-11-95 న 18 రోజులలో దీక్షగా రాసి ముగించారు .వారి అనుభవసారం, శ్రీ లలితా పరాభట్టారిక అనుగ్రహం వారి అర్ధాంగి శ్రీమతి స్వరాజ్య లక్ష్మిగారు వ్రాసే స్వతంత్యం ఇచ్చి ప్రోత్సహించటం తో 48 గ్రంథాలు రాసి సంగీత, సాహిత్య సవ్య సాచిగా కీర్తిపొందారు .
వారిని తరచూ ఆ కుటుంబ సభ్యులు స్మరిస్తూ ఘన నివాళి అర్పిస్తామని ఈ ఉదయం శపధం కూడా చేశారు . అది నిలబెట్టుకుంటారని ఆశిద్దాం . శాస్త్రి గారి పేరిట స్మారక పురస్కారం ఏర్పరచి, ప్రతి ఏడాది వారి జయంతి లేక వర్ధ౦తి నాడు సంగీత , సాహిత్యాలలో లబ్ధ ప్రతిస్టులను ఎంపిక చేసి, ప్రదానం చేస్తే శాస్త్రి గారికి ఘననివాళి గా ఉంటుందని సభావేదికపై తాడేపల్లి కుటుంబ సభ్యులకు నేను సూచన చేశాను .మనకు తెలిసిందే .ఇవన్నీ సభా వైరాగ్యం లాంటివే.అలా కాకూడదు .అని ఆశించటం లో తప్పులేదు .
రేపు 3-9-18 సోమవారం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-18 –ఉయ్యూరు
—