శ్రీ
కవి సార్వభౌమాది షోడశ బిరుదాంకితులు ,బహుపద్య,వచన,నాటక గ్రంథకర్తలు,
అనేకానేక సన్మాన గృహీతలు, సర్వదా సుప్రసన్న రస స్వభావులు …. అయిన
శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి
(నదీశ )
పరోక్ష అంతేవాసులు సమర్పించు పద్యహారతి
1 ఉ // శ్రీ కమలాక్షి చెల్వమగు శ్రేయ కవిత్వములిచ్చి ప్రోవగా
ఆ కవితా వధూటి మది యర్మిలి బ్రహ్మగ నెంచె నీ జతన్
ఆ కవి సర్వవేదు సతి ,యంబ వరంబుల గంగ ముంచగా
ధీ కలితాత్మ ! యో కవి ‘నదీశ ‘ మమున్మదినుంచు మెప్పుడున్
2 ఆ // ప్రభవ వత్సరమున ప్రభవించి నాడవు
భవుడొసంగెనేమొ భవ్య కవిత
కవి పదమ్ము గొనుచు గరళ కంఠుని ‘రాజ
మౌళి ‘పదమునందు మనిపినావు .
3 సీ // వంశము ‘చింతలపాటి ‘ట !కవితయో
మధురమధుర మగు మంచి తేనె
పేరు నృసింహుడు వీడ డెన్నడు నవ్వు
శాంతమూర్తిగ నుండు చనవుమెండు
కవనమే దీక్షగా కలము సాగింపగా
‘దీక్షిత’ నామంబు దిటవు నొందె
శర్మ నామము , గాని ,సమరానికి బిలుచు
సమపండితుల ఘనాశ్చర్య రీతి
ఛాత్రులన్ని దిశల శ్లాఘ్యు లై కీర్తిని
పొంద .. తలచు తాను పొందినటుల
తేగీ // గౌరవంబు పొంది జలధి గౌరవంబు
సరణి , గురువను పేరును సార్థకంబు
జేసె , తను ‘నదీశు’ డనగ చిఱు నగవుల
సొగసు చూపు ‘నదీశు’ ని జూడ శుభము
4. సీ// కోగంటి పాలెమ్ము కొలువునిన్బిలిచెను
పేరు నిల్పెద వంచు ప్రేమతోడ
చందర్ల పాడిక చదువులు నేర్పెను
తన కీర్తి దాయాది వని తలంచి
వేదాంత వర్ధినీ వేల్పుల నెలవులో
సంస్కృతంబును నేర్చి చతురుడవయ
భావనారాయణ పలు భాషలు గఱుపఁ
తెలుగు మధువు ద్రావ జెలగితీవు
తేగీ // మీసములు పెంచు వయసున మీసములను
ద్రిప్పి, యుభయ భాషలవారిదీప్తి కొల్ల
గొట్టి కవిపేరు గణియించి కొమరు మిగుల
బోధ వృత్తి యను జలధి మునిగినావు
5 తేగీ // కళలు పదునాఱు శశికిని గగనమందు
బిరుదులు పదునాఱు ‘నదీశ ‘ వరుని కిలను
పరులు పదునైదు బిరుదులు గరిమనీయ
స్వీయ నామంబె బిరుదాయె విపులయందు
రవియొసంగెను కళలను రాజుకనిరి
సూరి జనులోసంగిరి యిల సూక్తినిధికి
6 సీ // విశ్వమంత వెదకి వేల్పుల ముప్పది
మువ్వుర దెచ్చిన పుణ్యు వోలె
పద్యకావ్యములను బహులోక ప్రీతిగా
రచన జేసి భువిని రాణ కెక్కె
తాను నదీశుడు తన తల యొకగిరి
గిరినుండి పాఱెడు సురనదివలె
వచన రచన జేసి వచన వనధికి తా
నొకవచన సతిని యొసగె కరుణ
తేగీ // నాటకము వ్రాసె జగతిని నయపథమున
నడుప ‘ధర్మవిజయము’ను కడునిపుణత
‘దానవైభవము’ను దెల్పు తలపు తోడ
వ్రాసె బాస యందములందు వఱద పాఱ
7. తేగీ // సంస్కృతంబున రచనలు చతురరీతి
జేసి తనవిద్యకు సొబగు చెక్కి చెక్కి
పండితులలోన మాన్యత బడసె నాడు
దేవతలు మెచ్చుచు నొసఁగఁ దీవెనలను .
8. సి // ఎన్నెన్ని వ్రాసెనో యెన్నెన్ని జూచెనో
రాత్రిమ్బగళ్లును రచన రచన
ముద్రితంబులు కొన్నముద్రితంబులు కొన్ని
గుట్టలైబడియుండు కొలువుదీరి
కన్యను వరునకై కర తోయ మిడినట్లు
కావ్యదానమొనర్చు ఘనుల జూచి
మదిలెక్క రానట్టి చదువులెన్నింటినో
పరుల కొఱకు వ్రాసి వరుల జేయు
తేగీ // ఎల్లాదాటని సంద్రము కొల్లబోని
చదువలలవలె గ్రంధాలు సాగిపోవు
సాహితీ క్షేత్రమున కల్ప శాఖి వోలె
నిత్యఫలముల నందించు నేర్పు గల్గి
సేద్యమును జేయు శిల్పి కృషీవలుండు
9 సీ // కవిరాజ మౌళిగా కవిశిరోమణి యౌచు
మధుర భారతి యౌచు మధురకవిగ
కవిసార్వభౌముగా కవివతంసునిగను
సాహిత్య సాగర సత్కవీంద్ర
ఆంధ్ర గోవర్ధనుడని జనులు పొగడ
భక్త కవివరేణ్య పండిత పర
మేశ్వరుడంచు నా యీడ్యమౌ బిరుదులు
కొల్లగొట్టితివీవు కుకవి వైరి
తేగీ // నీదు బిరుదులె నీ శక్తి పాదుకొనగ
జేసె నీ భువి ,యిట్టి నీ జీవనంబు
పావనంబుగా !గోవుల భక్తిమీర
పూజసలిపి యా పుణ్యము మూట గట్టి
జగతి నీ దీక్ష తెలియంగ శాలనొకటి
కొమరు మీరగ గట్టుచు గోవుకరుణ
పొందు కవి నీవె !నిజమిది! మూడుమార్లు
తెలిపెదము మము మదినుంచి దీవెనలిడు
స్వస్తి
రచన : అందుకూరి శాస్త్రి
(A .C.P.Sastry)
9440308760