మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల
మొన్న 10 వ తేదీ ఆదివారం బెజవాడ లో శారదా స్రవంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లి, అయి పోయాక తిరిగి వస్తుంటే శ్రీమతి లక్ష్మీ ప్రమీలగారు తాను పరిశోధించి పిహెచ్ డి పొందిన ‘’ఆంద్ర ప్రదేశ్ లో పేరంటాళ్ళు ‘’గ్రంథం నాకు ఇచ్చి చదివి అభిప్రాయం తెలియ జేయమని కోరారు .బస్ ఎక్కి ఉయ్యూరు వస్తూ దారిలో దాన్ని తిరగేశాను .నాకు కొన్ని అభిప్రాయాలు తోచాయి .నిన్న 11 వ తేదీ సోమవారం ఆమెకు ఫోన్ చేసి వాటిని చెప్పాను .ఆవిడ సంతృప్తి గా సమాధానాలు చెప్పారు. తర్వాత ఆమె ఫోన్ చేసి తన జీవితం గురించి చదువు భర్త సహకారం పిల్లలు ,ఇటీవలే జరిగిన భర్త మరణం వగైరాలన్నీ ఒక ఆత్మీయుడితో చెప్పినట్లు దాదాపు అరగంట మాట్లాడి చెప్పారు. సంభాషణలో నేను ఆమెను ‘’అయితే మీరు ‘’స్వయం సిద్ధ ‘’అన్నమాట ‘’అనగానే నవ్వారు . ఆమె జీవితం అనేక విషయాలలో సాధన,తపన భర్త ప్రోత్సాహం ,గమ్యం చేరటం గురించి మీకు తెలియ జేయాలని రాస్తున్నాను .ఇందులోని విషయాలు ఆమె పరిశోధన పుస్తకం లోని ఆమె రాసిన ‘’నా మాట ‘’లోని సారాంశమే .నిన్ననే ఆమెకు మన సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను గుంటూరు జిల్లాలో నాటక ,సినీ రంగ నటుడు పర్జన్య గర్జన గళంతో ఉర్రూతలూగించిన శ్రీ వేమూరి గగ్గయ్య ,రాజకీయ దురంధరుడు మన మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య ,తెలుగు తల్లి విగ్రహ రూప శిల్పి శ్రీ దేవు శంకర్ లు జన్మించిన వేమూరు గ్రామం లో శ్రీమతి లక్ష్మీ ప్రసూన గారు కోగంటి వారింటి ఆడపడుచుగా శ్రీ వెంకట సుబ్బయ్య శ్రీమతి చిట్టెమ్మ దంపతులకు జన్మించారు .తల్లి వద్దనే అ ఆ లు దిద్ది ,రామయ్య మేస్టారువద్ద నాలుగవ తరగతి లో తెలుగుపై మమకారమేర్పడి ,పడవ తరగతిలో శ్రీ గిరి మేస్టారి బోధనతో చరిత్రపై అభిమానమేర్పడింది .స్కూల్ ఫైనల్ స్కూల్ ఫస్ట్ గా పాసైనా ,పియుసి లో చేరినా మాన్పించి తలిదండ్రులు ఆమె పెళ్లి చేసేశారు .
భర్త శ్రీ కోనేరు శివ సత్యనారాయణ రైల్వే ఉద్యోగి అవటం తో కాపురానికి హైదరాబాద్ వెళ్ళారు లక్ష్మి .చదువుకొంటాను అంటే అందరు మగాళ్ళ లాగానే ఆయనా ‘’టాట్ కుదరదు ‘’అని అడ్డు చెప్పగా కోరిక మనసులోనే అణచుకొని ,పిల్లలు ,వారిపె౦పకం ,విద్యా, వివాహాలు అన్నీ దంపతులు సక్రమగా నెరవేర్చి ,భర్తకు అన్నిరకాలా సహకరించి ఆయనమనసు గెలిచి 55 ఏళ్ళ వయసులో భర్తకు చదువు కొంటానని మళ్ళీ అప్లికేషన్ పెట్టి, సాంక్షన్ చేయించుకొని ,ఆయన అందించిన అన్ని రకాలైన ప్రోత్సాహ సహకారాలను అంది పుచ్చుకొని 2004 లో దూరవిద్య ద్వారా బి. ఏ . ఎం .ఏ.లు నాగార్జున యూని వర్సిటీ నుండి పాసై , హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో ఎం.ఫిల్..,,పి హెచ్. డి .సాధించి వరుసగా 12 ఏళ్ళు కస్టపడి ఇలా చదివి తన జీవిత ధ్యేయం నెరవేర్చుకొనే సరికి ప్రమీలగారికి 68 ఏళ్ళు వచ్చేశాయి .ఈ లోగా యోగా లోనూ సాధన చేసి అనేక పరీక్షలు పాసై అనేక రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చి మెడల్స్ కూడా సాధించారు .ఒక రకంగా పట్టు వదలని ‘’లేడీ విక్రమార్క’’శ్రీమతి లక్ష్మీ ప్రమీల .ఈ పన్నెండేళ్ళు తనభర్త తనకెంతో చేదోడు వాదోడుగా ఉన్నారని ,ఆయన తోడ్పాటే లేకుంటే తానింత సాధించగాలిగేదాన్ని కాదని చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నారు భర్త సత్యనారాయణ గారికి .
తాను పుట్టిన వేమూరు చారిత్రిక రాజకీయ సాంఘిక ప్రాముఖ్యం పై అధ్యయనం చేయాలని కోరిక కలిగి ,అక్కడ తమ తాత ముత్తాతల నుండి తమ తండ్రి కి కు సంక్రమించిన వైశ్యు ల పొలం లో క్రీ.శ.11 20 లో ఆ వూరి వైశ్యులు నిధి పాతిపెట్టారని కాశీలో శాసనం వేయించగా ,దాన్ని చదివిన ఒక సన్యాసి చందోలు పాలించే వెలనాటి కులోత్తుంగ చోళుని కి తెలియజేయగా ,రాజు దాన్ని తవ్వి తీయించి చందోలుకు తరలించాడని ,నిధికి కాపలాఉన్న కాలభైరవుడికి సన్యాసి బలి అయ్యాడని కైఫీయత్ లలో ఉన్నట్లు ఆమె గ్రహించారు .పొలం లో అప్పటి పెద్ద సైజు ఇటుకలు ,యక్షిణి విగ్రహం బయటపడి ఆప్రదేశానికి ‘’ధనపు కొట్లు ‘’అనే పేరు వచ్చిందని తెలిపారు .
తన ఈ పరిశోధన అంశం కు ప్రేరణ చిన్నతనం లో తాను చదివిన ‘’బాల సన్యాసమ్మ ‘’కథ అనీ భర్తతో పాటు సహగమనం చేసిన ఆమె అలా ఎందుకు చేసిందనే సందేహం కలిగి తనమనసులో పరిశోధన బీజం మొలకెత్తటం ప్రారంభమై౦దన్నారు .మూఢాచారాల వల్ల ,సంఘం లో భర్త చనిపోయిన విధవలకు గౌరవ మర్యాదలు లేక పోవటంవలన సంఘం నుండి నిర్లక్ష్యాన్ని భరించలేక సతీ సహగమనం ప్రారంభమై అలాంటి వారు గ్రామ దేవతలై పూజ లండుకొంటున్నారని అర్ధమైందని ,ఇలా ‘’ పేరంటాళ్ళు ‘’ గా మారిన త్యాగధనులైన మహిళలలో అగ్రవర్ణాలవారితోపాటు, అడుగు వర్ణాలస్త్రీలూ ఉన్నారని తెలిసింది .భర్తతోనే కాక తోడబుట్టిన వారితోనూ సహగమనం చేసినవారున్నట్లు తెలుసుకొన్నారు .కనుక ఆంద్ర దేశం లోని పేరంటాళ్ళ జీవిత విశేషాలను చారిత్రకా౦శాలతో పరిశోధించటానికి లక్ష్మిగారు పూనుకున్నారు .ఇలా ఇంతవరకు ఎవరూ పరిశోధించకపోవటం ఆమెకు దక్కిన అరుదైన అవకాశం, అదృష్టం కూడా .ప్రాధమిక విషయాలు సేకరించి నిజనిర్ధారణకు ప్రతి చోటుకూ వెళ్లి ,ప్రత్యక్షంగా అక్కడి సమాచారాన్ని, ఫోటోలను సేకరించి బహు ప్రయాస పడ్డారు .లక్ష్మీ ప్రమీల గారి ఈ పరిశోధనకు మార్గ నిర్దేశం చేసినవారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం చరిత్ర సంస్కృతీ ,పురావస్తు శాస్త్ర పీఠం శ్రీశైల ప్రాంగణ పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నా రెడ్డి గారు . ‘’ముందుమాట’’గా రెడ్డిగారు రాసిన వాక్యాలు ఆలోచనాత్మకాలు .తన పిహెచ్ డి ఆమోదం పొందగానే ఆమె భర్త అందుకోసమే ,ఈ ఆనందాన్ని పొందటానికే ఆమె సాధించిన దానికి సంతృప్తిని పొందటానికే అన్నట్లు జీవించి ,ఈ ఆనందం శాశ్వతంగా అనుభవించకుండానే పుస్తకావిష్కరణ దాకా జీవి౦చ కుండా కొద్దికాలానికే పరలోక గతులవ్వటం ఆమెను చాలా కృంగ దీసింది ..తట్టుకో లేకపోయారామే .పుస్తకావిష్కరణ చేసిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ ‘’అరుదైన పరిశోధన ‘’గా అభి వర్ణించారు .
ఈ పరిశోధన గ్రంథం లో శ్రీమతి ప్రమీల పేరంట౦ అంటే ఏమిటో చెప్పి ,ఒక ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేకకారణ౦ తో మరణించిన స్త్రీమూర్తిని ‘’పేరంటాలు’’అంటారని ఆమె మహిమలతో దైవత్వం పొంది పూజలందుకొని గ్రామదేవతగా రూపు దాల్చటం సర్వ సాధారణమని చెప్పారు . వీరిలో సతీ సహగమనం చేసిన వారెక్కువ అని అన్నారు .జిల్లాలవారీగా పేరంటాళ్ళ చరిత్ర గొప్ప అధ్యయనంతో తనకున్న పేజీల పరిమితిలో అవసరమైనంత వరకే వివరాలు అందించారు ,ఫోటోలు పెట్టారు .మొత్తం మీద 57 మంది పేరంటాళ్ళ చరిత్ర ఇందులో ఉంది .వారికి రంగ రంగ వైభవంగా జరిగే తిరునాళ్ళు గురించికూడా సంతృప్తిగానే రాశారు .
శ్రీమతి కోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రసూన డా.లక్ష్మీ ప్రసూన అయిన సోపాన ప్రక్రియ అందరకు ప్రేరణగా నిలుస్తుంది .ఇంత చేసినా పి.హెచ్ .డి .లో, యోగా లో స్వర్ణ పతకం రావాల్సిన తనకు ప్రాంతీయ దురభిమానం , వివక్ష అడ్డుగా నిలవటాన్ని జీర్ణించుకోలేక పోయారు .వెండి పతకం తో సరిపెట్టారని బాధ పడ్డారు .పట్టుదల,ప్రోత్సాహం ,దీక్ష ఉంటే మహిళ సాధించరానిది ఏమీ ఉండదని మనకు సాక్ష్యం గా ,’’మరో స్వయం సిద్ధ ‘’గా నిలచిన శ్రీమతి లక్ష్మీ ప్రసూన గారిని హృదయపూర్వకంగా అభి నందిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-18 –ఉయ్యూరు
—