యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -1
బృహత్కల్పం లో కురు పాంచాల దేశం లో గంగానది తీరం లో చమత్కార పురం లో యజ్న వల్క్యుడు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .సకల సద్గుణాలతో విరాజిల్లుతూ చిన్ననాటే వేదాధ్యయన పరాయణుడై యాజ్న వల్క్య ,వాజసని ,బ్రహ్మరాత ,దేవ రాత పేర్లతో ప్రసిద్ధి చెందాడు .యజ్ఞం అంటే వేదం .వేదాలను చక్కగా చెప్పగలవాడు కనుక యజ్న వల్క్యుడని,అన్నికాలాలలో అన్నదానం చేయటం చేత వాజసని అనీ ,బ్రహ్మము అంటే వేదం కనుక వేదాన్ని నిరంతరం బోధించేవాడుకనుక బ్రహ్మ రాతుడని,దేవునిచే పాత్రదానం ఇవ్వబడ్డాడుకనుక దేవరాతుడని సార్ధక బిరుదనామాలు పొందాడు .వల్కలం అంటే వస్త్రం .యజ్ఞం లేక యాగం ఆయనకు వస్త్రాలవంటివి అంటే విడువరాని బంధం కలవి కనుకనూ యజ్న వల్క్య నామం సార్ధకం .
ఆ కాలం లో వర్ధమాన పురం లో శకలుడు అనే మహర్షి ఉండేవాడు .ఆయనభార్య దితి .ఈ దంపతులకు సునంద అనే కుమార్తె ,శాకల్యుడు అనే కుమారుడు జన్మించారు .సునందను యజ్ఞవల్క్యునికిచ్చి వివాహం చేశాడు .వీరికి చాలాకాలం సంతానం లేదు .పుత్ర సంతానం కోసం యజ్న వల్క్యుడు కేదారం వెళ్లి 12 ఏళ్ళుశివునికై తీవ్ర తపస్సుచేశాడు .ప్రత్యక్షమైన పరమేశ్వరుడు వరం కోరుకోమనగా సత్పుత్రుని ప్రసాదించమని అర్ధించాడు .అప్పుడు శివుడు ‘’లోకం అంతా బ్రహ్మ విద్యా విహీనంగా ఉంది .కనుక నేనె నీకు కుమారుడిగా జన్మించి బ్రహ్మ విద్యా వ్యాప్తి చేస్తాను ‘’అని వరమిచ్చాడు .ఆనందం తో యజ్ఞవల్క్యుడు చమత్కార పురం చేరి శుభవార్త చెప్పాడు .కొంతకాలానికి సునంద గర్భవతి యై పండంటి పుత్రుని కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం కన్నది .వేదోద్ధరణకు జన్మించిన పరమేశ్వరుడనే ఆ బిడ్డను అందరూ భావించారు .అతనికి యాజ్న వల్క్యుడు అనే పేరు పెట్టారు .తండ్రికున్న నాలుగు పేర్లూ ఈయనకూ సంక్రించాయి .అయిదవ ఏట అక్షరాభ్యాసం ,గర్భాస్టమం లో ఉపనయనం చేశారు .కొంతకాలానికి కంసారి అనే పుత్రిక కూడా కలిగింది .యజ్న సునంద లకు.ఈమెకు యుక్త వయసు రాగానే వివాహ ప్రయత్నాలు చేశారు .కొడుకు దేవ దేవుని వరప్రసాదంఅని వారి మధ్య సంభాషణ జరిగింది .దేవదేవుడు ఎవరు అని కొడుకు వాళ్ళను ప్రశ్నించాడు .అతని తెలివి తేటలకు సంతోషించారు .బాష్కలుడు అనే గురువును చేరి వేద విద్యా రహస్యాలను నేర్వమని పంపించి దంపతులు శేష జీవితాన్ని కేదార క్షేత్రం లో గడపటానికి వెళ్లి పోయారు .
యాజ్న వల్క్యుడు బాష్కలుని వద్దకు చేరి ఋగ్వేదం అభ్యసించాడు .సామ వేదాన్ని జైమిని వద్ద నేర్చాడు .పైలుని వద్ద అధర్వ వేదం చదువు కొన్నాడు .యజ్న యాగాలకు ఉపయోగ పడే యజుర్వేదాన్ని తన మేనమామ విదగ్ధ శాకల్యుడు ఉండే వర్ధమాన పురం వెళ్లి నేర్చుకొన్నాడు .వేదపాఠం చెప్పటం లో బహు ప్రజ్ఞావంతుడు కనుక విదగ్ధ శాకల్యుడని పించుకొన్నాడు .ఇతడు వర్ధమాన పుర రాజు సుప్రియుడికి పురోహితుడుకూడా .ఈయన దగ్గర మూడువందల అరవై మంది విద్యార్ధులు యజుర్వేదం అభ్యసిస్తున్నారు .యాజ్ఞావల్క్యుని అవతార పరమార్ధం వారెవరికీ తెలియక పోవటం చేత అవమానిస్తుండేవాళ్ళు .
రాజు సుప్రియుడు దుర్వ్యసనాల పాలిటబడి రోగ గ్రస్తుడయ్యాడు .పురోహితుడికి మొరపెట్టుకొని తన జబ్బు తగ్గే ఉపాయం చెప్పమన్నాడు .మందులకు లొంగని జబ్బు ‘’శాంతిక ‘’కు లొంగుతుందని చెప్పి ఊరడించి ,రాజమందిరానికి రోజుకొక శిష్యుని పంపి అతనిచే శాంతికం జరిపిస్తూ రాజుకు మంత్రోదకం తీర్ధంగా ఇచ్చే ఏర్పాటు చేశాడు .ఏ రోజు ఎవరు వెళ్ళాలో కూడా శిష్యులకు తెలియ జేశాడు .ఒక రోజు యాజ్ఞ వల్క్యుని వంతు వచ్చింది .మేనమామ వెళ్లి శాంతిక జరిపి మంత్రోదకం రాజుకు ఇచ్చి రమ్మన్నాడు .రాజు గుణ శీలాలు తెలిసి వెళ్ళనన్నాడు .నచ్చ చెప్పి పంపాడుమేనమామ మేనల్లుడిని .రాజు అమర్యాదగా ప్రవర్తించినా సహించాడు .మంత్ర జలం పై నమ్మకం లేదన్నాడు . తెచ్చిన మంత్ర జలాన్ని కోపంతో అక్కడున్న ఎండిపోయిన కర్రపై చల్లి’’ మళ్ళీ రాజమందిరానికి రాను’’ అని చెప్పి గురు కులానికి వెళ్లి పోయాడు .ఇంతలో ఆ ఎండుకర్ర ఆకులు, కాయలు, పండ్లు తో ఒక చెట్టు గా మారి శోభాయమానంగా కనువిందు చేసింది .చూసిన రాజు ఆశ్చర్యపోయి తాను చేసిన తప్పు తెలుసుకొన్నాడు .గురుకులానికి సేవకులను పంపి యాజ్ఞవల్క్యుని మళ్ళీ పంపమని గురువును వేడుకున్నాడు .ఆయన శిష్యుడికి చెప్పాడు .’’మా నాన్న చెప్పిన నీతి మార్గాన్నే నేను ఆచరించాను .మళ్ళీ వెళ్ళను ‘’అని తెగేసి చెప్పాడు గురుమామకు .ఆయనకు కోపంవచ్చి ‘’నీమహిమ తో నీకు గ్గర్వం హెచ్చింది ‘’అన్నా వినక శిష్యులతో బుద్ధి చెప్పిస్తానన్నా బెదరలేదు .తర్వాత ఏం జరిగిందో తర్వాత తెలుసుకొందాం .
రేపు వినాయక చవితి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-18- ఉయ్యూరు