వినాయక చవితి శుభా కాంక్షలు
వినాయకునిపై రెండు విచిత్ర పద్యాలు
భట్టుమూర్తి అనే రామ రాజభూషణుడు వినాయకుని స్తుతిస్తూ ఒక తమాషా పద్యం చెప్పాడు .దాని చమత్కారం అనుభవిద్దాం –
‘’దంతా ఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయం గ్రాహమున్ –గంతు ద్వేషికి గూర్చి ,శైలజకు దద్గంగా ఝరీ చ్ఛాంతి న
త్యంతా మోదము మున్నుగా నిడి,కుమారాగ్రేసరు౦డై పితృ –స్వాంతంబు ల్వెల యింప జాలు నిభరా డ్వక్త్రుం బ్రశంసి౦చెదన్ ‘’.
భావం – శివుని జటాజూటం పై తిష్టవేసి, తల్లి పార్వతికి సవతి పోరు తెచ్చిన గంగ నీళ్లన్నీవినాయకుడు తొండం తో పీల్చేసి జనని పార్వతికి సవతి పోరు లేకుండాచేసి ఆనందం కలిగించాడు . అలాగే తొండం తో వెండికొండను ఒక్క సారి కదిలించగా ఆ ఊపుకు పార్వతీ దేవి శివునికి పరిష్వంగసుఖం చేకూర్చి తండ్రికీ మోదం కలిగించాడు .అలాంటి వినాయకునికి నమసకారం అన్నాడు కవి చమత్కారంగా .
రెండవ పద్యం దశకుమార చరిత్ర రాసిన కేతన కవి చక్కని పద్యం
‘’గ్రక్కున నేత్ర యుగ్మము కరద్విత యంబున మూసి పట్టి –మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటు సేసి ,యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవి౦పగా –దక్కొక ముద్దు నం బొలుచు దంతి ముఖుం గొలుతు బ్రసన్నుగాన్ .’’
బాల వినాయకస్వామి బాల్య చేస్టగా తండ్రి శివుడి రెండుకళ్ళు తన రెండు చేతులతో మూసి ,మిక్కిలి కన్ను అంటే అధికమైన కన్నుఅంటే త్రినేత్రాన్ని అనగా మూడో కంటిని,తన మూడవచేయి అంటే హస్తం అనగా తొ౦డ౦ తో మూసి పరమేశ్వరుని చిత్తాన్ని పల్లవి౦ప జేశాడట .అలాంటి గజాననుకి నమస్కారం అన్నాడు సరదాగా .
మనం కూడా ఇలాంటివినాయకుని రేపు వినాయక చవితి సందర్భంగా స్మరించి ధనులమవుదాం –
13-9-18 గురువారం శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలతో –
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-18 –ఉయ్యూరు
—