శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -4
తాను పొందిన శుక్ల యజుర్వేద వ్యాప్తి కోసం యాజ్నవల్క్య మహర్షి గంగాతీరాన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు .ఒక రోజు కణ్వుడు అనే ఋషి పుత్రుడు వచ్చి పాదాలపై వ్రాలి ‘’మహాత్మా !శాకల్యుడి వంటి వాళ్ళు తప్ప మిమ్మల్ని పొగడని వారుండరు లోకం లో .మీకు తెలియని విద్య లేదు .నేను మీకు ముఖ్య శిష్యుడుగా ఉండాలనే ఆశతో వచ్చాను .నన్ను సర్వాదికారిని చేస్తే మహదానంద పడతాను .’’అన్నాడు వినయంగా .అప్పుడాయన ‘’భాస్కరాశీర్వాదం తో పొందిన శుద్ధ యజుర్వేజం లోని ముఖ్యభాగాన్ని నీకే బోధిస్తాను .దీనివలన లోకం లోని అన్ని వేదాలకంటే నీకు నేను చెప్పినదే మొదటి స్థానం లో ఉంటుంది .అదే లోకం లో ‘’ప్రధమ శాఖ ‘’అని, కాణ్వ శాఖ అని ప్రసిద్ధి చెందుతుంది .అనగానే అతడు ‘’మీ అనుగ్రహం తో నేను అందరికంటే ఆదధిక్యుడు అనే కీర్తి పొందుతాను ‘’అన్నాడు .వెంటనే యాజ్న వల్క్యుడు ‘’వత్సా !నీవొక్కడివే గొప్ప వాడివి అవటం కాదు ,నీకు చెప్పేవేదం చదివి ,అందులోని అర్ధాదులను గ్రహించి నీ శిష్య పర౦పర కూడా గొప్పవారవ్వాలి .లోకం లో మంచి విషయాన్ని గ్రహించినవారంతా అధికులే’’అని ఆశీర్వదించి అన్ని విషయాలతో పరిపూర్ణంగా ఉన్న ప్రదానభాగాన్ని అంతటినీ కణ్వుడి కి బోధించి చదివించాడు .ఈ కాణ్వ సంహిత లోని పూర్వ భాగానికి సాయనాచార్యుడు ‘’వేదార్ధ ప్రకాశం ‘’అనే భాష్యాన్ని ,ఉత్తర భాగానికి నాగ దేవభట్టు కుమారుడు అనంతా చార్యుడు ‘’వేదభావార్ధ దీపిక ‘’భాష్యాన్ని ,జాత వేద ఉపాధ్యాయుడి కొడుకు శ్రీ మదానంద బోధ భట్టో పాద్యాయుడు ‘’కాణ్వ వేదమంత్ర భాష్య సంగ్రహం ‘’రచించారు .
కాణ్వీయ సంహిత లోని మొదటి అధ్యాయం నుంచి 27 వ అధ్యాయం వరకు ఉన్న దానిలో దర్శ పూర్ణ మాసలు మొదలు అశ్వమేధం చివరవరకు అన్ని క్రతువులు ఉన్నాయి .21 నుంచి 27 వరకున్న అధ్యాయాలు మొదటి 20 అధ్యాయాలలోని విషయాలే అన్న పాశ్చాత్య పండితుల అభిప్రాయం సరై౦ది కాదంటారు .28 నుండి 35 వరకు ఉన్న8 అధ్యాయాలు’’ ఖిలం ‘’అని అంటారు .వీటికి శ్రౌత వినియోగాన్ని కాత్యాయనుడు చెప్పలేదు .అయితే వాటిని ఎందుకు ఉంచారు అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం వాటిలో విశేషాలు ఉండటం ,బ్రహ్మ యజ్ఞం మొదలైన వాటిలో వాటి అవసరం ఉ౦దికనుక .కానీ అవి ఏదో ఒక క్రతువు గూర్చి మాత్రం చెప్పలేదు .36 నుండి 40 వరకు 5 అధ్యాయాలను ‘’శుక్రియములు ‘’అంటారు వాటిని పగలు మాత్రమే ఉచ్చరించాలి, కాని రాత్రి వేళ కాదు బ్రాహ్మణాలలో .వీటికి ‘’ఆరణ్యకాలు’’ అనే పేరుకూడా ఉంది .కారణం ఇవిబ్రాహ్మణాలలోని,ఆరణ్యాక భాగం లో వ్యాఖ్యానం చేయబడ్డాయి .కనుక అరణ్యాలలో నే కాని, గ్రామాలలో వాటిని పఠించ రాదు .శుక్రియ భాగం తప్ప మిగిలిన వేదభాగాలన్నిటిని గ్రామ౦ లోనైనా, అరణ్యం లోనైనా చదువ వచ్చు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-18 –ఉయ్యూరు
—