అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు
ఏకాంత వాసం లో దీర్ఘ తపస్సులో అరణ్యవాసం లో మహర్షులు దర్శించినవి లేక ఆరాటంలో పుట్టినవి ఆరణ్యకాలు .ఇవి కర్మకాండలగురించి, వ్రతాలు ,ప్రవర్గ్యలు గురించి తెలియ జేస్తాయి .ఆరణ్యకాలు కర్మకాండ కు సంబంధించినవైతే ఉపనిషత్ లుజ్ఞానకాండకు సంబంధినవి .వేద మంత్ర భాగాలను సంహితాలని, వాటి వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలని ,,వాటిలోని కర్మకాండను తెలియజేసేవి ఆరణ్యకాలని, వేదాలలోని జ్ఞానభాగాన్ని చెప్పేవి ఉపనిషత్లు లేక వేదాంగాలని అంటారు.
ఆరణ్యకాలు కూడా వివిధ ఋషుల పేర్లతో పిలువ బడుతున్నాయి .ఋగ్వేదానికి ఐతరేయ ఆరణ్యకం, కౌశిక ఆరణ్యకాలు -యజుర్వేదానికి తైత్తిరీయ ఆరణ్యకం, మైత్రాయణీయ ఆరణ్యకం,కేదారణ్యకం ,బృహదారణ్యకం సామవేదానికి తలవకారఆరణ్యకం ,ఆరణ్యక సంహిత ,అధర్వ వేదానికి ఆరణ్యకం ఆలభ్యం
ఐతరేయాఅరణ్యకం 5 అధ్యాయాలు మొదటి రెండిటిలోప్రాణ విద్య ఉంటుంది 3 లో సంహితోపనిషత్ లో స్వర చర్చ 4 ,5 ల లో మంత్రాల సాంకేతిక వివరణ ఉంటుంది దీన్ని మహానామ్ని అంటారు
తైత్తిరీయ ఆరణ్యకం లో 10 భాగాలు .మొదటి దానిని ‘కథాకాని ‘’అంటారు .అగ్ని ఛయన కాండ ఉంటుంది 2వది మహాయజ్ఞ నిర్వహణ విధానం మిగిలినవి మంత్రం తంత్ర సాంకేతిక వివరాలు.
కథారణ్యకం -తైత్తిరీయమే .సాంఖ్యాయన ఆరణ్యకం లో 15 అధ్యాయాలు . ,2 అధ్యాయాలు మహా వ్రతాన్ని 3నుంచి 6 కౌశిక ఉపనిషత్ ను ,7,8 సంహితోపనిషత్ ,9 ప్రాణ విశిష్టత ,10 అగ్నిహోత్ర విధి 11 అంత్య సంస్కారం 12 ప్రార్ధన ఫలితాలు13 శ్రవణ మనన నిధి ధ్యాస వివరణ 14 అహం బ్రహ్మాస్మి వివరణ 15 బ్రహ్మ నుంచి గుణ సాంఖ్యాన వరకు గురు స్తుతి ఉంటాయి .బృహదారణ్యకం బృహదారణ్యక ఉపనిషత్ ను ,ముఖ్యంగా ‘’పర్వాగ్య ‘’కర్మ కాండను గురించి వివరిస్తుంది.ఆరణ్యకాలను ‘’రహస్య బ్రాహ్మణాలు ‘’అన్నారని నిరుక్తానికి వ్యాఖ్యానం రాసిన దుర్గా చార్య అన్నాడు.
ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టముగా ఉండేది. భగవానుని అంశ అయిన వేదవ్యాసుడు ఈ వేదరాశిని విడివిడిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అధర్వణవేదము అను నాలుగు భాగములుగా విభజించాడు. వేదాలలో సంహితలు మూలగంథాలు. వీటికి వ్యాఖానాలు బ్రాహ్మాణాలు అవతరించాయి. బ్రాహ్మాణాలలోని ఒక భాగంగానే అరణ్యకం ఆవిర్భవించింది.
అరణ్యకములు
అరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ప్రతి సంహితలు బ్రాహ్మణాలున్నట్లే అరణ్యకాలు కూడా ఉండేవి. కాలాలు గడిచే కొద్దీ ప్రజల నిరాదరణకు బలై చాలా వరకు నశించి పోయాయి. అథర్వవేదానికి చెందిన గోపథబ్రాహ్మణం అనే బ్రాహ్మణానికి సంబంధించిన అరణ్యకం లేకపోవడము ఇందుకు తార్కాణం.
అరణ్యకాలు అంటే ఏమిటి ?
వేదములలో సంహితలు మహర్షులు దర్శించినవి కావున ఇవి మూలగ్రంథాలు. బ్రాహ్మణాలనేవి సంహితలకు వ్యాఖ్యాన రూపాలు. వేద రాశిలో సంహితలు, బ్రాహ్మణాలువరుసగా ఒకటి, రెండు స్థానములు కాగా అరణ్యకాలు మూడవ స్థానమును పొందినవి. అరణ్యకాలు అంటే అనేకమంది ద్వారా ఈ క్రింది విధముగా అనేక అర్థాలు ప్రతిపాదించబడినవి.
- అరణ్యంలో దీక్షతో అథ్యయనము చేసిన గ్రంథాలే అరణ్యకాలు.
- గృహస్థాశ్రమము వదలి సన్యాసము లేదా సన్యసించుట వలన అరణ్యాలకు వెళ్ళి ప్రశాంత వాతావరణములో తపదీక్షతో వేదాధ్యయనము చేయటకు కావలసిన గ్రంథాలే అరణ్యకాలు.
- కర్మఫలంతో పాటు జ్ఞానం సంపాదించు మేలు కలయిక అరణ్యకాలు.
- యజ్ఞాలలోని రహస్యాలను అరణ్యాలలోనే మహర్షులు చర్చించారు.
- బ్రాహ్మణము లలో ఉండే గృహస్థాశ్రమ కర్మకాండలు, జ్ఞానం మాత్రము ప్రధానముగా ఉండే ఉపనిషత్తు ల మేలు కలయికయే అరణ్యకాలు.
- అరణ్యములలో మాత్రమే ఆచరించవలసినవి కావున అరణ్యకాలు.
- వేదాల సారమే అరణ్యకాలు.
అరణ్యకాలు – సంహితలు
వేద విభాగానికి చెందిన సంహితలు మంత్రములతో కూడినవే మునుముందు వేదం అనుకునేవారు. తదుపరి కాలాములో మంత్రముతో పాటు వ్యాఖ్యాన రూపాలైన బ్రాహ్మణాలు కూడా కలిపిందే “వేదం” అని ఇంకొందరు అభిప్రాయ పడ్డారు. అరణ్యకాలు మాటేమిటి ? ఇవి కూడా కర్మభాగంతో పాటుగా జ్ఞాన మార్గమునకు చెందిన ఉపనిషత్తులు కలిగి ఉండుటచే వేదమని పిలువ కూడదని కొందరి అభిప్రాయము. అందుకు కారణము వేదాంతమే ఉపనిషత్తులు అని వ్యవహరించారు.
నిర్మాణ విషయం లో ఆరణ్యకాలు వాటిలోని విషయాలను బట్టి చాలా భేదం గా కనిపిస్తాయి కొన్నిటిలో సంహితభాగం కలిసిఉంటే మరికొన్నిటిలో బ్రాహ్మణభాగం కలిసి ఉంటాయి .మిగిలినవాటిలో సూత్రాలతో కలసి ఉంటాయి .చాలా ఆరణ్య కాలలోమంత్ర వివరణ ,పదాల వ్యుత్పత్తి ,వాటి గుర్తింపు ,చర్చలు , పురాణగాధలు ,ప్రతీకాత్మక లేక సాంకేతిక వివరణలు ,అరుణ కేతు లాంటి ఋషుల లోతైన వేదా౦త భావనలతో నిండిన మంత్రాలు ఉన్నాయి .
ముఖ్యంగా ఆరణ్యకాలు భాష శైలి లలో బ్రాహ్మణాలులాగా యజ్ఞయాగాది క్రతు విధానంపై చర్చించాయి.కనుక వీటిని నిర్దుష్టంగా చేసే విధానాలపై దృష్టి పెట్టాయి .వేదపాఠ్య ప్రణాళిక లో కొన్ని యజ్ఞాల విషయం లోమాత్రమే ఆరణ్యకాలు నిబంధి౦పబడినాయి .వేద శాఖల పేర్లతో ఆరణ్యకాలు పిలువబడి నాయి . వివరాలు మొదట్లోనే పైన తెలియజేయబడినాయి .అయినా మరొక్కమారు తెలుసుకొందాం –ఋగ్వేద సంహితకు ఐతరేయ శాఖ కు చెందిన ఐతరేయ ఆరణ్యకం ,కౌశికి ,సాంఖ్యాయన శాఖలకు ‘’కౌశీతకి ఆరణ్యకం’’ఉన్నాయి .కృష్ణ యజుర్వేద సంహితకు తైత్తిరీయ శాఖకు చెందిన తైత్తిరీయ ఆరణ్యకం ,మైత్రాయన శాఖకు మైత్రాయారణ్యకం,చరక లేక కథా శాఖకు కథారణ్యకం ఉంటే, శుక్ల యజుర్వేద సంహితకు కాణ్వ ,మాధ్యందిన శాఖలకు బృహదారణ్యకం ఉన్నది .మధ్య౦దినం 9 భాగాలలో చివరి 6 భాగాలు బృహదారణ్యక ఉపనిషత్ లోనివే .సామవేదానికి జైమినేయశాఖకు తలవకార ఆరణ్యకం లేక జైమిని ఉపనిషత్ బ్రాహ్మణం ఉంది .ఆరణ్యక సంహిత విలక్షణ ఆరణ్యక గ్రంథంకాదు .సామవేద సంహితకు పూర్వార్చికం .దీనిలోని మంత్రభాగాన్ని ఆరణ్యక సంహిత అన్నారు .దీని ఆధారంగా ఆరణ్య గాన సామాలను గానం చేస్తారు .అధర్వ వేదానికి ఆరణ్యకం లభించలేదు .కాని గోపథ బ్రాహ్మణాన్నే దీని ఆరణ్యకం గా భావిస్తారు .
ఐతరేయ ఆరణ్యకం –లో 5 అధ్యాయాలున్నాయి .ఏ అధ్యాయానికి ఆ అధ్యాయాన్నే ఆరణ్యకం అని పిలుస్తారు .మొదటిభాగం ‘’మహావ్రతం ‘’గురించి వివరిస్తుంది .దీనిలో కర్మకా౦డతోపాటు ఊహాత్మక వివరణా ఉంటుంది .రెండవ దానిలో 6 అధ్యాయాలున్నాయి .అందులో మొదటి మూడిటిలో ‘’ప్రాణవిద్య ‘’గురించిన అన్ని వివరాలు ఉన్నాయి .ఇదే అన్ని మంత్రాలకు ముఖ్య ఆధారం .ఇందులోనే అగ్ని హోత్రునికి సూర్య ,వాయువులకు ఆహుతులు వేసే విధి విధానం ఉంది .వేద మంత్ర విధిని అతిక్రమించినా ,లోపం చేసినా అత్యల్ప జీవులైన పక్షులు ,పాకే జంతువుల జన్మ లభిస్తుందని తెలియ జేసింది .రెండవభాగం లోని 4, 5 ,6 అధ్యాయాలనే ఐతరేయ ఉపనిషత్ అంటారు .మూడవ భాగానికి సంహితోపనిషత్ అని పేరుంది .ఇది పద పాఠం ,క్రమపాఠ౦ ,జటపాఠం మొదలైనవి వివరిస్తుంది .అంటే వేదాన్ని ఎలా ఉదాత్త అనుదాత్తాలతో నేర్వాలో తెలియ జేస్తుంది .స్వరాలలో ఉన్న స్వల్ప భేదాలనూ సవివరంగా చర్చించి చెబుతుంది .ఇందులోని నాలుగు అయిదు ఆరణ్యకాలు అంటే భాగాలు మంత్రాల సాంకేతికత పై విపులంగా వివరిస్తుంది .దీనికి ‘’మహానామ్ని ‘’అనిపేరు .దీనికి సంబంధించిన యజ్ఞం మధ్యందిన యజ్ఞం .
తైత్తిరీయ ఆరణ్యకం –ఇందులో 10 అధ్యాయాలు .మొదటి6 ను సరైన ఆరణ్యకం అన్నారు .ఇందులో నిమొదటి రెండు అధ్యాయాలు ‘’అష్టౌ కాథకాని’’అంటారు.అంటే కాథకంలోని 8 అధ్యాయలు అని అర్ధం .ఇవి అసలు తైత్తిరీయ శాఖకు చెందినవికావు అనిభావం .వీటిని కాథక శాఖనుంచి అరువు తెచ్చుకొన్నారు .ఇవన్నీ వేదం లోని అగ్నిచయనం గురించి విపులంగా చెప్పేవే .
మొదటి అధ్యాయం వేదం లో చివర వచ్చినది .ఇందులో పురాణ పురుషుల పేర్లున్నందున అలా భావించాల్సి వచ్చింది .అగ్ని హోత్ర వేదిక నిర్మాణానికి ఇటుకలను పేర్చే విధానం ‘’ఆరుణ ప్రశ్న’’ఉండటం వలన సూర్యనమస్కారాలు చేసే విధానం ఉన్నందున ఆ పేరు వచ్చింది .రెండవ అధ్యాయం ప్రతి బ్రాహ్మణుడు ఆచరించాల్సిన పంచ మహాయజ్ఞాల వివరణ .వేద స్వాధ్యాయనం,యజ్ఞోపవీత ధారణ ,సంధ్యావందనం ,బ్రహ్మ యజ్ఞం ,పితృ యజ్ఞం ,కూష్మాండ హోమం (యజ్న వేదికను శుభ్ర పరచటం )గురించి విస్తృత వర్ణన . ఇందులోనే ‘’శర్మణ’’అనే పదం ప్రయోగింపబడింది .ఈపదాన్ని బౌద్ధ, జైనులు ఆతర్వాత వాడుకొన్నారు .3వ అధ్యాయం అనేక హోమాలు యజ్ఞాల సాంకేతిక వివరాలు తెలియ జేసింది .4 వఅద్యాయం శ్రౌత కర్మకాండలో ప్రవర్గ్య కు చెందిన మంత్రాలు న్నాయి .దీనిలో అత్యధిక ఉష్ణోగ్రతలో ప్రత్యేకమైన మట్టిపాత్రలో పూర్తిగా పాలుని౦పి ,ఎర్రగా పాత్ర కాలేదాకా మరగించటం ఉంటుంది కనుక ఇది ప్రమాద హేతువుగా భావిస్తారు .ప్రవర్గ్య అంటే అగ్నిస్టోమం లో తాజా పాలను మహావిర లేక ఘర్మ అనే మట్టిపాత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలో వేడి చేయటం .ఈ పాలను అశ్వినీ దేవతలకు నైవేద్యంగా పెడతారు .ఇదికూడా కథాశాఖ విదానంగానే ఉంటుంది .5 వ అధ్యాయం లో ప్రవర్గ్య యజ్న విధానం వచనం లో చెప్పబడింది .దీన్ని బ్రాహ్మణ శైలి అంటారు ఇదీ కథా శాఖ విధానాన్ని పోలి ఉంటుంది .6 వ అధ్యాయం పితృమేదానికి సంబంధించింది .అంటే దహన సంస్కార మంత్రాలున్నాయని అర్ధం .7,8,9 అధ్యాయాలు తైత్తిరీయ ఉపనిషత్ లోని 1-శిక్ష 2-ఆనంద 3- భ్రుగు అనే మూడు వల్లి లు .10 అధ్యాయం ను ‘’మహారణ్య ఉపనిషత్ ‘’అంటారు .ఇందులో మూడు సంహితలలోని మ౦త్రాలు ఉన్నాయి .
కథారణ్యకం –ఇది తైత్తిరీయ౦కు సమాంతరంగా ఉంటుంది .ఇందులో కొద్దిభాగం మాత్రమే భద్ర పరచబడింది .అదికూడా కాశ్మీర దేశం లో భూర్జర పత్రాలలో నిక్షిప్తమైంది .ఈమధ్యనే దీన్ని కూర్చి ముద్రించారు .అనువాదమూ ఉంది .
శాంఖ్యయన ఆరణ్యకాలు –ఇది 15 అధ్యాయాలు .మొదటి రెండు అధ్యాయాలు మహావ్రతం గురించి చెప్పబడింది . ౩ నుంచి 6 వరకు ఉన్నదాన్ని ‘’కౌషితకి ఉపనిషత్ ‘’అంటారు .7,8 సంహితోపనిషత్ .9 ప్రాణం గొప్పతనం వివరిస్తుంది .10 వ అధ్యాయం అగ్ని హోత్ర విధివిధాన వివరణ .మానవ శరీరం లో అంటే పురుషునిలో అగ్ని వాచకం లో ,వాయువు ప్రాణం లో ,సూర్యుడు కళ్ళల్లో ,చంద్రుడు మనసులో ,దిశలు చెవులలో నీరు శక్తిలో ఉన్నాయని తెలియ జేసింది .ఈ ఆరణ్యకం అర్ధం చేసుకున్నవారికి దేవతలందరి అనుగ్రహంకలిగి ఇచ్చిన హవిస్సులు అందుకొని తినటం నడవటం మాట్లాడటం ఆలోచించటం దానం చేయటం మొదలైన వాటికి సర్వ సమర్ధత లభిస్తుందని తెలిపింది .11వ అధ్యాయ౦ అనారోగ్యం, మృత్యువు లను ఎదుర్కొనే పరిష్కారాలు సూచిస్తూ ,కలల ప్రభావాలను చర్చించింది .12 లో ప్రార్ధన ఫలితాల వివరాలున్నాయి .13 లో విశేషమైన తత్వ చర్చ ఉండి,మానవులు ప్రాకృతిక ,శారీరక బంధాలను విసర్జించి శ్రవణ ,మనన ,నిధిధ్యాస లను అలవరచుకొని ,జపతపాలతో ,ఆత్మనిగ్రహం ,,విశ్వాసం లతో జీవించాలని చెప్పింది .14 వ అధ్యాయం లో రెండే రెండు మంత్రాలున్నాయి .అవి 1-అహం బ్రహ్మాస్మి –ఇదే సకల వేదసారం 2-వ మంత్రం ‘’మంత్రార్ధం తెలియకుండా వేదమంత్రాలను వల్లె వేసినవాడు తాను మోసే బరువు విలువ తెలియని జంతువు వంటి వాడు ‘’అని చెప్పే మంత్రం .
15 వ అద్యాయం బ్రహ్మ నుంచి గుణ సంఖ్యా యనుడి వరకు గురుపరంపర వర్ణన విపులంగా ఉన్నది .
బృహదారణ్యకం –శుక్ల యజుర్వేద బ్రాహ్మణం లో శత పథ బ్రాహ్మణం కు చెందిన ఆరణ్యకం బృహదారణ్యకం .మాధ్యందిన శాఖ కు చెందినది .తైత్తిరీయ ,కథారణ్య కాల లాగానే ఇది ప్రవర్గ్య కర్మకాండను గురించి విపులంగా చర్చించింది .బృహదారణ్య ఉపనిషత్ ను అనుసరించింది .
రహస్య బ్రాహ్మణాలు –ఆరణ్యకాలు బ్రాహ్మణాల కొనసాగింపే .బ్రాహ్మణాలలో చెప్పబడని రహస్య కర్మకాండల గురించి చర్చించటం వలన రహస్య బ్రాహ్మణం అనే పేరొచ్చింది.
మొత్తం మీద మనకు తెలిసి౦దేమిటి ?ఆరణ్యకాలు ముఖ్యంగా 1- బ్రహ్మ విద్య 2-ఉపాసన ౩- ప్రాణ విద్యను బోధిస్తాయి .యజ్న యాగాదులు కర్మకా౦డలలోని రహస్యాలను వివరిస్తాయి .మైత్రేయి –యాజ్ఞవల్క్యుల మధ్య జరిగిన చర్చలు చిన్నకథలు,వాటి అంతరార్ధం తెలియ జెప్పుతాయి .కర్మ కాండ కు, జ్ఞానకాండకు మధ్య సేతువుగా ఉంటాయి. అంటే బ్రహ్మవిద్యకు ఉపాసనకు మధ్య అంతరాన్ని తొలగించే వంతెన లా ఉంటాయి .భౌగోళిక చారిత్రిక సాంస్కృతిక విశేషాను తేటతెల్లంగా వివరిస్తాయి .
మనవి –బ్రాహ్మణాలు గురించి రాసిన చాలాకాలానికి మనోరణ్యం లో చిక్కుకున్న ఆరణ్య కాల గురించి ఇవాళ రాయటానికి ముఖ్య కారకులు శ్రీ సింగపూర్ శ్రీధర్ . ఆయన ఫోన్ చేసి అడగక పొతే ఇప్పుడప్పుడే రాసి ఉండేవాడిని కానేమో !ఆయన ప్రేరణే ఇవాళ ఉదయం 9-30 నుంచి మధ్యాహ్నం 1-30 వరకు కదలకుండా కూర్చుని దాదాపు నాలుగు గంటలు రాసి పూర్తి చేశాను .కనుక ఈ ఆరణ్యకాలు శ్రీ సింగపూర్ శ్రీధర్ గారికి అంకితస్తే సముచితమని భావించి ఆయన అనుమతిలేకుండానే అంకిత మిస్తున్నాను –దుర్గాప్రసాద్
ఆధారం –ఇంగ్లిష్ ,తెలుగు వీకీ పీడియా.ఇంతకు మించిన వివరాలు నాకు దొరకలేదు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-18 –ఉయ్యూరు
—