హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు
సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం విజయవాడలో శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యం లో నిర్వహింప బడుతున్న శారదాస్రవ౦తి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా వెళ్లి ,అందరూ మరచిపోయిన కమ్మని తెలుగు హాస్య రచయిత శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారి గురించి మాట్లాడాను .ఆ విషయాలు మీకోసం .
శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి ,శ్రీ మునిమాణిక్యం నరసింహారావు వంటి హాస్య రచయితల తర్వాత తెలుగులో చిరు దరహాసం చిందించిన హాస్య రచయిత శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు .ఆయన ఆంద్ర ప్రభలో ధారావాహికంగా కొన్నేళ్ళు రాసిన ‘’వడగళ్ళు ‘’, ‘’ఆషామాషీ ‘’లకోసం ఎదురు చూసేవాళ్ళం ఒక రకం గా ‘’ఆషామాషీ ‘’ఫేం రావూరు ..సినీ రంగ ప్రవేశమూ చేసి అక్కడా హాస్యాన్ని చిలకరించారు .అలాంటి మనిషిని నేటి తరం స్మరించి స్పూర్తి పొందాలి .
1913 లో కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రావూరు జన్మించారు .బందరులోనే బి ఏ చదివి పాసై ఏమీ చేయకుండా ఊహాలోకం లో సంచరించేవారు .డిగ్రీ పరీక్షలో కథ రాయమంటే వెరైటీ గా రాయాలని పించి పద్యాలలో రాసిన పైత్యకారి .దిద్దే గురువు మెచ్చుకోకుండా గుండు సున్నా పెట్టాడు .అదే వయసులో ‘’కుచేలోపాఖ్యానం ‘’పద్యకావ్యం గా రాసినకవి రావూరు .బందరు అంటే ముట్నూరు కృష్ణారావుగారు ,ఆయన ‘’కృష్ణా పత్రిక ‘’ముందు మనకు గుర్తొస్తాయి .రోజూ సాయంత్రం అక్కడ ముట్నూరు వారు సాహితీ దర్బార్ నిర్వహిస్తారు .పింగళి కాటూరి ,విశ్వనాధ ,బాపిరాజు మొదలైన హేమా హేమీలతోపాటు దానికిరావూరు తప్పక హాజరయ్యేవారు .రోజూ పత్రికాఫీసు వెనకున్న తోటలో కృష్ణారావు గారు మౌనముద్రాలంకారులై పచార్లు చేస్తుంటే ,వారి వెనక రావూరు వారు నడిచేవారు .ఇద్దరి మధ్య చాలాకాలం మాటలే చోటు చేసుకోలేదు .ఒక రోజు అకస్మాత్తుగా ముట్నూరు వారు వెనక్కి తిరిగి చూసి ‘’రేపట్నించి చేరండి ‘’అని రెండే రెండు మాటలు మాట్లాడారు .పట్టరాని సంతోషం తో ఉప్పొంగి పోయారు రావూరు .’’నాకు కృష్ణా పత్రిక లో ఉద్యోగం వచ్చింది’’ అని హితులకు సన్నిహితులకు చెప్పేశారు .
కృష్ణా పత్రిక ఆఫీసులో ఎడమ వైపు పౌరాణిక చిత్ర దర్శక బ్రహ్మ (అప్పటికి ఇంకా అంత సీను లేదు ) శ్రీ కమలాకర కామేశ్వరరావు కుర్చీలో కూచుని పత్రికకు ‘’ఆధ్యాత్మిక వ్యాసాలు ‘’రాసేవారు .కుడిప్రక్క కుర్చీలో రావూరు కూర్చుని సిని ,నాటక సాహిత్య సమీక్షలు రాసేవారు .ఎదురుగా సంపాదకులు ముట్నూరు వారు ఆసీనులై ఉండేవారు .సంపాదకీయాలన్నీ కృష్ణా రావు గారే రాసేవారు .వాటికి చాలాగొప్ప విలువ ఉండేది .ఎవరినీ లెక్క చేసే వారుకాదు .నిష్పక్షపాత౦గా ,ఆలోచనాత్మకం కా ,మార్గ దర్శకం గా ఉండేవి .అవన్నీ తర్వాత ‘’లోవెలుగులు ‘’పేరుతొ ముద్రణ పొంది ప్రేరణ నిచ్చాయి . రావూరుగారు ఇక్కడే ‘’వడగళ్ళు ‘’శీర్షికతో వారం వారం ధారావాహిక రాశారు .సుతిమెత్తని హాస్యం తో చమక్కులతో గిలిగింతలు పెట్టేవి అవి .వడగళ్ళ కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురు చూసేవారు .
కృష్ణా పత్రికలో రాస్తూనే ,’’ఆనందవాణి’’ పత్రికలో ‘’కప్పు కాఫీ ‘’శీర్షికతో హాస్యపు కాఫీ అందించేవారు .’’వినోదిని ‘’పత్రికలోనూ వినోదం పంచేవారు .రెండు చేతుల తోపనిచేస్తే సవ్య సాచి అంటారు .మరి మూడు పత్రికలలో ఏకకాలం లో రాసిన రావూరు వారిని ‘’త్రిసాచి ‘’అనవచ్చా ?.సమకాలీన రాజకీయాలను కథలు కథలుగా రాసి అవి ఎవరినుద్దేశించి రాశారో వారుకూడా ఏడవ లేక నవ్వుకోనేవారట .చురుక్కు ,చమక్కు లేకుండా ఒక్క వాక్యం కూడా ఉండేదికాదు .ఇప్పుడు హాస్య బ్రహ్మ శ్రీ శంకరనారాయణ రచనా అలానే ఉంటుంది .ఇవేకాక ‘’గుడి గంటలు ‘’,మాగ్రామం ‘’,మనకవులు ,మరపు రాని బాపూజీ వంటివీ రాసి తనకు తానె సాటి అనిపించారు .
రావూరు వారు మొదటినవల ‘’నెలవంక ‘’రాశారు .పిల్లలు లేరని కుమిలిపోతున్న ఒక నటుని జీవితం మలుపు తిరిగి ఆధ్యాత్మికత పై ధ్యాస మళ్ళిచివరికి ముక్తి పొందటం ఇందులో కథ..రావుగారు విజయవాడ ఆకాశవాణి కి నక్షత్రాలు –నాగలి ,కనిపించటం లేదు ,రిహార్సిల్స్ ,షాజహాన్ ,బిల్హణీయం మొదలైన నాటక నాటికలు రాశారు ఇవి ఎన్నో సార్లు పునః ప్రసారాలైనాయి .వారి ‘’నెలవంక ‘’కూడా చాలా సార్లు ప్రసారమై ,14 భాషలలో అనువాదం పొంది రికార్డ్ సృష్టించింది .రావూరు పేరు దేశమంతా మారు మోగింది .
బందరు నాటక నటులు అంటే అందరికి ముందు గుర్తుకొచ్చేవారు శ్రీ డి .వి.సుబ్బారావు .నాదస్వరం అంటే గుర్తుకొచ్చేది శ్రీ దాలిపర్తి పిచ్చిహరి .ఈ మహానుభావు లిద్దరికీ రావూరు వారు బందరులో ‘’గజారోహణం ‘’చేయించి పురవీధులలో ఊరేగించి అఖండ సన్మానం చేశారు.రావూరు వారి కళాభిమానం అంత ఉత్కృష్ట మైనది .పాతతరాన్ని ఆడరించటమే కాదు కొత్తతరాన్ని ప్రోత్సహించటానికి ‘’భాషా కుటీరం ‘’సంస్థను స్థాపించి కొత్త రచయితలతో రాయించి స్వంత ఖర్చులతో ముద్రించి ప్రోత్సహించిన విశాలహృదయులు .దీనితోపాటు బందరు లోనే ‘’చుక్కాని ‘’పత్రిక స్థాపించి కొంతకాలం నడిపారు .ఇక్కడ నుంచి రావూరు వారి జీవితం కొత్త మలుపు తిరిగింది .
మద్రాస్ వెళ్ళారు .సినిమా రచయితగా అరంగేట్రం చేశారు .15 సినిమాలకు మాటలు ,పాటలు కూడా రాశారు .అందులో భానుమతి ,నాగేశ్వరరావు సూర్యకాంతం సి.యేస్. ఆర్.నటించి ,భానుమతి భర్త రామకృష్ణారావు దర్శకత్వం చేసిన భరణి వారి ‘’చక్రపాణి ‘’ సినిమా రావూరు సంభాషణా చాతుర్యంవల్లనే సూపర్ డూపర్ హిట్ అయింది .భరణీవారిదే ‘’వరుడుకావాలి ‘’సినిమాకు మాటలు కూర్చి గొప్ప హిట్ చేశారు .సతీసక్కుబాయి.కృష్ణమాయ ,శ్రీ కృష్ణ తులాభారం సతీసావిత్రి ,చింతామణి ,నాగపంచమి ,సొంతవూరు మొదలైన చిత్రాలకు సంభాషణలు రాసి రక్తి కట్టించారు
రావూరు ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రికకు ఇంచార్జ్ గా ,దినపత్రికకు సబ్ ఎడిటర్ గా ,హైదరాబాద్ లో స్పెషల్ కు కరస్పా౦డెంట్ గా వివిధ హోదాలలో పని చేసి తమ సమర్ధత నిరూపించారు .ఆంద్ర ప్రభ దినపత్రికకు గొప్ప క్రేజ్ తెచ్చింది రావూరు రాసిన ‘’ఆషామాషీ ‘’దాదాపు పదేళ్ళు నిర్వహించారు .1947 స్వాతంత్ర్య దినోత్సవాలకు రావూరువారిని సాంస్కృతిక కార్య దర్శిని చేశారు .ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు విద్యామంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గార్ల ఆధ్వర్యం లో జరిగిన శ్రీ మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో శ్రీ రావూరు వారిని ఘనంగా సత్కరించారు .1978 లో ‘’కళాప్రపూర్ణ ‘’సత్కారం అందుకున్నారు .తరతరాలుగా నిలిచిపోయే రచన ఒకటి రావూరు వారు రచించారు .అదే ‘’వంద చందమామలు ‘’అందులో ఆంధ్రరాష్ట్రం లో అన్ని రంగాలలో విశిస్టులైన వందమంది ప్రముఖుల గురించి జీవిత చిత్రణమే ఇది దీనికి మనమంతా రావూరువారికి రుణపడి ఉంటా౦. .
ఆధారం –రావూరు వారి కుమార్తె శ్రీమతి జ్ఞాన ప్రసూన వ్రాసిన వ్యాసం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-18 –ఉయ్యూరు
—