శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం

సరసభారతికి అత్యంత ఆప్తులు ,నాపై అపార కరుణా దృక్కున్నవారు ,చుళుకీకృత సర్వ గీర్వాణ వాజ్మయ పాదోది పయస్కులైన అపర ఆగస్య ముని వరేణ్యులు ,  శ్రీ లలితా పరాభట్టారిక పరమోపాసకులైన  బ్రహ్మశ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి బ్రాహ్మీ మూర్తుల అనుంగు అంతేవాసులు ,వారి దౌహిత్రులు  గీర్వాణ౦ లో శతావధానం చేసి  శిశుపాలవధపై పరిశోధనతో పిహెచ్ డి అందుకున్న శ్రీ చెరువు ఆంజనేయ శాస్త్రిగారి బావమరదులు  , నా గీర్వాణ గాండీవానికి,పదును పెట్టి శోభ సమకూర్చినవారు ,విద్వత్ కవి పండిత ప్రకాండులు , మహా భక్తి  తత్పరులు ,అమోఘ సాధనా చతురాననులు,అనేక గ్రంథ నిర్మాణ చాతురీవైభవమూర్తి   ,అద్భుత ప్రసంగ మాధురి ,కలకండ కవిత్వ రస పారీణులు  ఉద్గ్రంద రహస్యాలను కరతలామలం చేసుకొన్న వరిస్ట గరిష్ట  బ్రాహ్మీ మూర్తి , బ్రహ్మశ్రీ డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు నాపైఅనుగ్రహం తో  పెనుభారం మోపి తాము ఆన్ లైన్ లో అనుగ్రహించిన  ‘’శ్రీ విష్ణు నుతి శతక౦’’ ’’కు ముందుమాట రాయమని దాన్ని శతకం లో ప్రచురిస్తామని నిన్న విద్యుల్లేఖ ద్వారా ఆనతిచ్చారు.గుర్వాజ్న శిరో దార్యం కదా .హనుమంతుని ముందు కుప్పిగంతులుగా  రాసే సాహసం చేస్తూ ,ఎల్లుండి శనివారం ఉదయానికల్లా రాసి ఆన్ లైన్ గా పంపిస్తానని మాట ఇచ్చి  ,శ్రీవారిని నా దొసగులను మన్నించమని వేడుకొంటున్నాను .

118 వృత్త పద్యాల కవితాకల్హార మాలికగా శ్రీ మహావిష్ణువు కంఠ  సీమను అలంకరించి ,విష్ణు ,వైభవ శోభలను ద్విగుణీకృతం చేసిన శతకం ఇది .విష్ణు పారమ్యాన్ని ,అవతార అంతరార్ధ పరమార్ధాలను  కళ్ళకు కట్టించారు .ప్రతిపద్యం రసగుళిక అనటంమామూలు మాట అవుతుంది .రసోవై సహ అయిన ఆ రసానందమూర్తిని నుతించేది కనుక  దానికి సమానంగా  పరమ రసస్పూర్తి గా ఉంది .’’’సర్వ ప్రవృత్తుల నాతడు ఇహము ,పరము ,సంతుస్టుడు,ముక్తుడు’’.అని మొదటిపద్యం లో చెప్పారు .విష్ణు సహస్రనామ స్తోత్రం లోని భావనలన్నీ మనముందుంచి ‘’శ్రీనారాయణ స్తోత్ర మంచిత భక్తిన్ బఠియి౦ప సిద్ధమగు సుశ్రేయంబు లున్గ ల్గేడున్ ‘’అని ఫలశ్రుతి చెప్పారు .ఆత్మ తత్వ ప్రబోధకుడు, అమలుడు ,అవ్యాజాను రాగుడు ,సద్గురుడు ఆనంద మయుడే కాక యోగి జన హృద్గుహ్యుడు  విష్ణుమూర్తి .కలిలో శ్రీ విష్ణు నామమే ఉపాస్యం  ప్రారబ్ధాన్ని నశింపజేసి,ముక్తినిస్తుంది .మానవత్వ విలువలు చాటటానికి శ్రీ రాముడుగా,పరశువు చేతబట్టి మునివర్గాన్ని బాధపెట్టే రాజులపాలిటి అరివీర భీకరుడై ‘’శృతి ధర్మముల్ నిరంతరముగసాగ జేసే శుభదాముడైన పరశు రాముడై,అమృతోత్పాదన సమయం లో ఆదికూర్మమై ,విష్ణువు సర్వవ్యాపి అని తెలియజెప్పటానికి నృహరి యై ,గీతామృతం పంచి ,విశ్వ రూపాన్ని వ్యాఖ్యానించి దుస్ట  సంహారం, శిష్టరక్షణ చేసే శ్రీ కృష్ణ పరమాత్మయై ,కలియుగం లో కల్కి గా ధర్మాలను నడుపుతూ వెలసిన అవతారమూర్తి విష్ణుమూర్తి అన్నారు .

‘’నీదు పాద వరివస్య౦ జేసి జన్మంబు ధన్య విశేషంబుగజేసికొందు ‘’   అని ఆర్తిగా అంటారు  .బ్రహ్మాన్ని మదిలో ఊహించటమేకాని ఇలాఉంటాడని చెప్పటం ఎవరితరం కాదంటూ ‘’నరనారాయణ తేజమీ జగతి నిండి ‘’ఉందని ,’’పరమోదారు ,పరంజ్యోతి ,నక్షరు ‘’ని సంకీర్తనతో ఆ పరముని చేరతారని అభయమిచ్చారు .ఎవనిని తలిస్తే సందేహ నివృత్తి, భీతి తొలగి ,సంపత్ శ్రేణులు  విద్యా లభిస్తాయో ‘’ఆ విష్ణువు సర్వ దోష హరుడు ‘’’.సకలార్ధ సాధకం ,వత్సర  మాస, పక్ష ,తిధులకు కారణమై కాలాన్ని నియమించే జ్ఞాని విష్ణువు ..విష్ణుపదం చేరటానికి రాగద్వేషాలు వదిలి, సజ్జన సాంగత్యం తో ,సమస్త భూత హితుడై ,సౌశీల్యుడు,మైత్రి ఉన్నవాడికే సాధ్యం అని యోగ రహస్యం చెప్పారు .అయితే తనకు జపం ,ధ్యానం కుదరదని ,’’ఈ సర్వంబు నీవన్న జ్ఞాన పథంబెరుగ’’అని తన అల్పత్వాన్ని ప్రవరగా చెప్పుకున్నారు .’’యోగంబు ప్రత్యహమున్ జేయగ యోగానండుడా విష్ణువే ‘’అని అభయమిచ్చారు .

విష్ణువు విశ్వ రూపాన్ని –

‘’స్థిరుడై ,శాశ్వతుడై వెలుంగు పురుష శ్రేస్టున్,సహస్రంబులౌ –శిరముల్ ,కన్నులు, బాహువుల్ ,పదములున్ ,చిత్రంబులున్ నామముల్

బరగన్ భక్తి నమస్కరింతు ,బరితాపంబుల్ నివారించి ,స –ద్వరమున్ గూర్చు ననంతు ,నచ్యుతు ,గృపాపా౦గున్ జగన్నాథునిన్ ‘’గా దర్శించారు .మనకూ దర్శింప జేశారు .

ఒకే చైతన్యం అనేకమై సర్వత్రా భాసిస్తుంది .ఈజగత్తు  అద్వైతమే .’’మోక్ష రమా కాంక్ష ,మనోజ్ఞ రూప మెనయన్  సాక్షాత్కారి౦పన్ గదే ‘’  అని ఆ వెన్నుని ప్రార్ధించారు .పరమాత్మ ‘’పరమాణు స్థితి ,పర్వతాకృతి యై భాసించు ‘’అంటారు .’’ప్రాణ౦బే ప్రణవంబు ,తత్ప్రణవమే రాజిల్లు నీ తేజము  నీ ప్రాణంబుల్ నీ ప్రతిరూపు లౌదురు ,మహాత్ప్రాణ౦బ నీ వౌచు ‘’సంత్రాసం చెందే జగత్తునుచైతన్యం చేసేవాడు త్రిభువనవ్యాప్తుడైన జ్ఞానప్రదుడైన పురుషోత్తముడు అని ఉపనిషత్ రహస్యాన్ని అందమైన పద్యం లో నిబంధించి తేటతెల్లంగా చెప్పారు .కవిత్వ మహాత్మ్యాన్ని వివరిస్తూ ‘’కవితా గంగ సువర్ణాభిషేకం ,కవితాగంధం చల్లదనం ,కవితాపుష్పం అలంకారం .’’కవితా మాధ్వినివేదనంబగు రసజ్నా ,పద్మనాభ ప్రభో ‘’అని వివరించారు .చైతన్యమే సృష్టికి కారణమై పోషకమై లయకారకం అయి సత్యజ్ఞాన మనంతమై వెలుగుతుంది .ధర్మానికి గ్లాని కలిగినపుడు ‘’ధర్మముద్ధరణ జేయన్ బుట్టు నా దైవం ‘’హరి అని భగవద్గీతాసారం చెప్పారు .’’పరమాత్ముండగు  విష్ణువున్  సకల విశ్వంబులో దర్శించువారు జ్ఞానులు ‘’.నరజన్మం బతి దుర్లభంబు ,తిరుమంత్రం బెంతొ శ్రేస్టంబు’’అని విశిష్టాద్వైతాన్ని ఆ భాషలోనే చెప్పటం బాగుంది .

‘’ఆతని కొలిస్తే అన్నిజగాలను కొలిచినట్లే .ఆయన తింటే సర్వ భూత సంతతి తిన్నట్లే .అన్నిటా ఆతడే .’’ఎవరే మార్గమున ప్రవర్తిలిన నిన్నే చేరారు శర్వా ‘’అని కృష్ణుని గీతలోని భావాన్ని పద్యీకరించారు .  ‘’హరినామం బెదవిస్మరింప బడుటే ,యత్యంత దుఖంబగున్ ‘’అన్నారు .’’మతినీవె గతినీవె ‘శ్రీపతీ ‘’అని ‘’శృతినీవె గతినీవె నా ఈ నా ఆకృతివి నీవె భారతీ ’’అంటూ స్వాతికిరణం సినిమాలో మాస్టర్ మంజునాథ్ పాడిన పాట భావం గానే శాస్త్రిగారూ అన్నారు. ‘’అన్నంబా హరి ,రూపమే ,తినెడువాతండె- దేహస్థుడై యన్నంబెల్ల బచించు నాల్గు గతుల౦ దాతండె’’..’’భ్రమలన్పాన్పి ,యదార్ధమున్ దెలియ జెప్పన్ ,దైవ మేన్నో ప్రయత్నములన్ జేయుచు ,విశ్వ రూపమున సందర్శింప గా జేసె’’  అన్నారు పరమాత్మ అసలురూపాన్ని దర్శింపజేస్తూ…’వరమై ,లోక వరేణ్యమై ,వరదమై ,వర్ధిల్లునారాయణ స్మరణం బార్తిహరం  ‘’అనీ ,’’ఖగరడ్వాహను డాశ్రితావనుడు,విఖ్యాతుండు ,శ్రీ శంఖ చ –క్ర గదా ఖడ్గ ధనుర్ధరుండు ‘’అని విష్ణుమూర్తి రూప సౌందర్యాన్ని వర్ణించారు .ప్రత్యక్ష దైవం అయిన సూర్యుని ఆరాధిస్తే ,అనురాగమూర్తి అయి ఆహారాదికాలు ఇస్తాడని ‘’తల్లి దండ్రి గురు డీ సర్వంబౌ జ్యోతి ,నా-దిత్యున్ గొల్చెద ,దేవ దేవుని, సురాధీశున్ గృతజ్నండనై’’అని చివరిపద్యం ముగించి ,శ్రీమన్నారాయణ మూర్తికి  సూర్యనారాయణ మూర్తికి అభేదాన్ని తెలియజేసి సూర్యుని  , సవితృ నారాయణనిగా భావించే అనాదిభావాన్ని విశదీక రించారు .

శాస్త్రిగారి శతకాన్ని తల స్పర్శగా స్పశించానే తప్ప, లోతుగా విశ్లేషణ చేయలేక పోయిన నా అజ్ఞానాన్ని శాస్త్రిగారు మన్నించాలని కోరుతున్నాను .రసానందస్వరూపమైన శ్రీ మహావిష్ణువు నుతి శతకం కనుక ప్రతిపద్యం మధురస స్వరూపంగా ఉంది .ఉదహరించాలంటే శతకమంతా మళ్ళీ రాయాల్సి వస్తుందని  కొన్నిటినే ఉదహరించిన నా సాహసాన్ని శాస్త్రిగారు మన్నిస్తారని విశ్వసిస్తూ ,వారికిచ్చిన మాటను ఒక పూట ముందే పూర్తి  చేసి, వారికి దీన్ని ఇప్పుడే మెయల్ చేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-18 –ఉయ్యూరు

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.