బీహార్ రాష్ట్రం కైమూర్ జిల్లా కౌరాలో ఉన్న శ్రీ ముండేశ్వారి దేవాలయం క్రీ .శ.625 నాటి అతి ప్రాచీన దేవాలయంగా వినుతి కెక్కింది .ఆ నాటి శాసనమే సాక్ష్యం .ఇప్పటికీ పూజా పునస్కారాలు అందుకొంటున్న దేవాలయం కూడా అని పురావస్తు శాఖ ధృవీకరించింది .
ము౦డేశ్వర కొండపై 608 అడుగుల ఎత్తునున్న దేవాలయం ఇది.కైమూర్ పీఠ భూమి లో సొన్(సువర్ణ ) నదీతీరం లో ఉంది .ముండేశ్వర కొండపై చాలా ప్రాచీన శిలా విగ్రహాలున్నాయి .పాట్నా ,గయా లేక వారణాసి లనుండి ఇక్కడికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు .దగ్గర రైల్వే స్టేషన్’’ మోహన –బాబువా జంక్షన్ రైల్వే స్టేషన్ ‘’.ఇక్కడి నుంచి దేవాలయం కేవలం 22 కిలోమీటర్లు.’’లాల్బహదూర్ ఎయిర్ పోర్ట్ వారణాసి’’ దగ్గర విమానాశ్రయం .ఇక్కడి నుండి దేవాలయం 102 కిలోమీటర్లు .
బీహార్ నాగర శైలిలో ఆలయం నిర్మి౦పబడి౦ది .నాలుగువైపులా ద్వారాలు ,కిటికీలు ఉన్నాయి .ఆలయ శిఖరం ధ్వంసమైంది.కాని కొత్తగా పునర్నిర్మిస్తున్నారు .ఆలయ ముఖ ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి .గంగ ,యమునమొదలైన మూర్తులున్నాయి .గర్భాలయం లో శ్రీ ము౦డేశ్వరిదేవి విగ్రహం ,చతుర్ముఖ శివలింగం ఉన్నాయి .అయ్యవారు ,అమ్మవారు ఆలయం లో ఉన్నా ,అమ్మవారికే ఇక్కడ విశేష పూజలు జరగటంవిశేషం .ము౦ డేశ్వరి దేవి మహిష వాహనం పై దశభుజాలతో దర్శనమిస్తుంది .అంటే మహిషాసుర మర్దిని గా దర్శనం అనుగ్రహిస్తుంది .వినాయక ,సూర్య ,విష్ణు విగ్రహాలు కూడా ఉన్నాయి .అనేక శిధిల విగ్రహాలు కూడా కనిపిస్తాయి .ఆర్క లాజికల్ డిపార్ట్ మెంట్ ఈ దేవాలయాన్ని సంరక్షిస్తోంది .ఆలయాభి వృద్ధికి ,రహదారి నిర్మాణానికి బీహారు ప్రభుత్వం చాల డబ్బు సాంక్షన్ చేసి ఖర్చు పెడుతోంది .ఇది హర్షించదగిన విషయం .
భారత దేశం లో అతి ప్రాచీన దేవాలయంగా గుర్తింపు పొందిన శ్రీ ము౦డేశ్వరి దేవాలయం లో మొదటినుంచి ఇప్పటిదాకా అవిచ్చిన్నంగా పూజాదికాలు నిర్వ హింప బడుతూ౦డటం విశేషం .శ్రీరామనవమి ,శివరాత్రి మహా పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి సందర్శిస్తారు .నవరాత్రులలో గొప్ప ఉత్సవం, జాతర చేస్తారు .శక్తి దేవాలయం గా ప్రసిద్ధి చెందటం వలన తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-18 –ఉయ్యూరు