మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి భద్రాచల వెళ్ళేదారిలో రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరం లో మారేడు మిల్లి ఉంది .’’దీన్ని వాల్మీకి వ్యాలీ వనవిహార స్థలి ‘’అంటారు .పచ్చని పంట చేలు ,ప్రకృతి సోయగం చూస్తే భగవంతుడే మానవులకు నయనానందం కోసం సృష్టించిన భూలోక స్వర్గమా ?దేవేంద్రుని అపర నందన వనమా?కుబేరుని ఉద్యానవనం చైత్ర రధమా?అని పిస్తుంది.ఇదంతా దేవతల ప్రత్యేక జిల్లానా?అనే సందేహమూ కలుగుతుంది .సందర్శకులకు కనులను విందు చేసే ప్రకృతి కాంత దివ్య క్షేత్రమిది .ఇక్కడి అరణ్యాలు వన్యప్రాణులు , వృక్షాలు వాటికి అండగా ఉండే కొండల ఎత్తునుంచి దూకే మనోహర జలపాత కన్యల సోయగాలు , పరిమళభరిత వనౌషద మొక్కలు , ,పైన్ ,బంగారు గుబురు వెదురు వృక్షాలు , కు ఇది ఆనంద నిలయం .ప్రకృతి సోయగాలను తనివి తీరా తిలకించి పులకి౦చటానికి అత్యంత అనుకూలమైన తావు మారేడుమిల్లి .ప్రకృతిమాత పవిత్రమైన ఒడిలో సేద తీర్చుకొనే అరుదైన అదృష్టం లభిస్తుంది .పలురకాల ఫెరన్,అరటి ,అనేకరకాల ఆర్కిడ్ లు ,వివిధ రకాల మామిడి తోటలు పరమ ఆకర్షణగా నిలుస్తాయి .యువకులకు అత్యంత ఇష్టమైన ట్రెక్కింగ్ కు అనుకూలమైన స్థలం .ఇక్కడ చూడతగిన అతి ముఖ్య ప్రదేశాలు కొన్ని తెలుసుకొందాం .
1-నందనవనం – అంటే వైద్యానికి ఉపయోగపడే అనేక ఔషధ జాతుల కేంద్రం . దీనినే ‘’ఎథ్నో మెడికల్ అవేర్ నెస్ సెంటర్ ‘’అంటారు .ఔషధ మొక్కల ప్రయోజనం సామాన్యప్రజలకు అవగాహన కలిగించే ప్రదేశం .ఇందులోని మొక్కలను పశ్చిమ కనుమలనుంచి ,ఒరిస్సా నుంచి తెప్పించి ,నాటి, పెంచి, పోషిస్తున్నారు.
2- బాంబూ చికెన్ -ఇటీవల అన్నిమాధ్యమాలలో బాగా ప్రచారమైన ,ఇక్కడి ప్రత్యేకమైన వెదురు చికెన్ –బాంబూ చికెన్ కు ఇది కేంద్రం .సంప్రదాయ బద్ధమైన ఈ చికెన్ కోసం అనేక ప్రాంతాలనుండి జనం విరగబడి వచ్చి ఆస్వాదిస్తారు .
౩-కాఫీ ,మిరియాల తోటలు –ఇక్కడ పె౦చుతున్న కాఫీ, మిరియపు తోటలను చూసి సందర్శకులు ముగ్ధు లౌతారు.ఈ నందన వనం ఈ రెండేకాక పలురకాల ఆర్కిడ్ జాతి పుష్పాలు ,చెట్లకు పాకే ఫెరన్ లు,అడవి అరటి ,వివిధ రకాల మామిడి తోపులు ప్రత్యేకంగా చూసి ఆన౦దించాలి.
4- వాలి-సుగ్రీవ మెడికల్ ప్లాంట్స్ కన్వర్సేషన్ ఏరియా –ఎత్తు పల్లాల ఈ ప్రాంతం లో 203 జాతుల వైద్య వనమూలికలు ,అరుదైన చెట్లను 260 హెక్టార్లలో పెంచుతున్నారు .అన్నీ ప్రజోపకారమైనవే .
5-కార్తీక వనం –కార్తీకవనం లో మత పరమైన పవిత్ర వృక్షాలను అంటే ఉసిరి, మారేడు, నేరేడు ,నిమ్మ ,రావి ,మర్రి ,అరటి ,మామిడి చెట్లు పెంచుతున్నారు . కార్తీకమాసం లో పవిత్ర కార్తీక వనభోజనానికి చాలాబాగా అనుకూల మైన ప్రదేశం .
6-మదన కుంజ్ –విహార స్థలం –పులి ,చిరుతపులి ,అడవి దున్న ,మచ్చలజింక ,మౌస్ డీర్ వంటి ఆడని జంతువులకు ఇది ఆవాసభూమి .అడవిఎలుగుబంటి,అడవినక్క,అడవికోడి ,పురి విప్పిన నెమళ్ళు ,పలురకాల అందమైన పక్షులు ఇక్కడ సర్వ సాదారణం .హిల్ హైనా ,హరన్ బిల్ ,కింగ్ ఫిషర్ గోల్డెన్ డ్రయోల్ వంటి అరుదైన జంతువులను వీక్షించవచ్చు పలురకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ముగ్ధ మనోహరంగా తమ రెక్కల అందాలతో సందర్శకుల చూపులను కట్టిపడేస్తాయి ,
7-జంగిల్ స్టార్ కాంప్ సైట్ –తూర్పు కనుమలలో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఈ ప్రదేశం రాత్రి విశ్రాంతి స్థలం .హాయిగా అరణ్య శోభ తిలకించి పులకి౦చిన వారికి మధుర స్వప్నాలకు ,చిరస్మరణీయమైన స్థానం . ఈ కాంప్ సైట్ వాలమూరు నదికి ప్రక్కనే మూడువైపుల ప్రవాహం తో వాలి –సుగ్రీవ కొండ అంచునే ఉంది .ఇక్కడే త్రేతాయుగం లో వానర వీరులు అన్నదమ్ములు అయిన వాలి సుగ్రీవుల మధ్య తీవ్ర పోరాటం జరిగింది . ఈ యుద్ధ క్షేత్రం ,పచ్చిక బీడులు ,శోభకూర్చే అరణ్యాలతో అవతలి కొండ గుట్టలపై దర్శనమిచ్చి ప్రాచీనకధను గుర్తు చేసి మన సంస్కృతికి ప్రతిబి౦బ౦గా నిలుస్తుంది ,మధురోహలతో మనసు పరవశం చెందుతుంది .
ఎక్కడో విశాఖ దగ్గరున్న అరకు అందాలు గురించి చెప్పుకోవటమే కాని ఇంతదగ్గరలో ఉన్న మారేడుమిల్లి వనసౌ౦దర్య సీమ గురించి నాకు ఇప్పుడే తెలిసింది .అందరూ తప్పక సందర్శించి మధురానుభూతులకు లోనవ్వాల్సిన మధురస క్షేత్రం మారేడుమిల్లి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు ,