కాలభైరవాలయం  –ఇసన్నపల్లి

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి

తెలంగాణా కామారెడ్డి జిల్లా రామన్నపల్లి మండలం ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది .కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు . శివుని ఆత్మస్వరూపం తో  ఇక్కడ కాలభైరవస్వామి కొలువై ఉన్నాడు .ఇదికామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న క్షేత్రం .పంటపొలాలమధ్య పింక్ రంగు దేవాలయం దూరం నుంచే ఆకర్షిస్తుంది .దోమకొండ సంస్థానాదధీశులకాలం లో 200 ఏళ్ళక్రితం  పునర్నిర్మింప బడింది .కాశీ తర్వాత కాలభైరవునికి అంతటి విశిష్టమైన దేవాలయమిది .13 శతాబ్దం నాటి ఆలయంగా గుర్తింపు పొందింది .

  చేతబడి చేయబడిన వారి బాధలు పోవటానికి ఈ కాలభైరవుని 21 రోజులు కాని 41 రోజులు కాని దీక్షగా సేవిస్తారు .సంతాన ,ఉద్యోగ మరేఇతర సమస్యలున్నా స్వామికి మొక్కుకుంటే తీర్చే భక్తులపాలిటి కొంగుబంగారం స్వామి .రామారెడ్డి గ్రామాన్ని  రధాల రామారెడ్డి పేట అనేవారు. అక్కడ రంగ రంగ వైభవంగా దేవతా రదోత్సవాలు జరిగేవి .17 వ శతాబ్దం దాకా ఇది దోమకొండ సంస్థానం అధీనంలో ఉండేది .1550- నుండి 1600 వరకు పాలించిన రెండవ కామి రెడ్డి కొడుకు రెండవ మల్లారెడ్డి కొడుకు రామా రెడ్డి పేరుతొ నిర్మించబడిన గ్రామం రామారెడ్డి .మల్లారెడ్డి ఇక్కడే శ్రీ సీతారామస్వామి దేవాలయం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాలు నిర్మించాడు .ఈ రెండు గుడులలో ప్రతి ఏడాది బ్రహ్మాండంగా రదోత్సవాలు జరిగేవి . ఈ దేవాలయాల నిత్యపూజా మహోత్స వాలకు,నిర్వహణకు  సంస్థానాధిపతి  రాసిచ్చిన అగ్రహారమే ఇస్సన్న పల్లి .ఇది రామారెడ్డి కి  ఈశాన్యం లో ఉంటుంది .

  మల్లారెడ్డి అన్న ఎల్లారెడ్డి తనకొడుకు విస్సా రెడ్డి పేరుతొ కట్టించినది విస్సన్నపల్లి ,కాలక్రమం లో ఇసన్న పల్లి అయింది .ఈ ఊరి మొదట్లోనే కాలభైరవాలయం ఉంది .ఇందులో 8 దిక్కులలో 8 మంది  భైరవులుఉండేవారు . ..అందులో ఈశాన్యం లోని ‘’ఈవానుడు’’ అనే  కాలభైరవుడే ముఖ్యం .ఈశాన్య దిక్కులో ఉన్నాడుకనుక ఈశాన్యపల్లి అనే పేరు క్రమంగా ఇసన్నపల్లిగా కూడా మారి ఉంటుందని స్థానిక కధనం .అసితంగ భైరవ,రురు భైరవ ,చండ్ర భైరవ ,క్రోధ భైరవ ,ఉన్మత్త భైరవ ,కాపాలభైరవ ,భీషణ భైరవ ,సంహార భైరవ అని భైరవులు ఎనిమిది మంది . కాని ఈక్షేత్ర కధనం ప్రకారం అతిసాంగ,సంసార ,రురు ,,కాల ,క్రోధ ,తామ్ర చూడ, చంద్ర చూడ  ,మహాభైరవులు .ఇందులో ముఖ్యుడైన కాలభైరవస్వామే ఇక్కడ కొలువై ఉన్నాడు .మిగిలిన 7 భైరవ విగ్రహాల ఆచూకీ ఇప్పుడు లేదని చెపుతున్నారు. ఈ కాలభైరవ విగ్రహం క్రీశ13 వశతాబ్ది కాకతీయులకాలం నాటిదని విశ్వసిస్తారు .స్వామి దిగంబరంగా ఉండటం తో ఈ విగ్రహాన్ని దిగంబర జైన విగ్రహం అని కూడా అపోహ ఉంది .ఇసన్నపల్లి,రామారెడ్డి గ్రామాలు 1550 -60 కాలం లో ఏర్పడ్డాయికనుక ,ఇది జైన విగ్రహం కాదన్నారు .పురాణాలు కాలభైరవుని దిగంబరునిగానే వర్ణించాయి కనుక ఇది సనాతన వైదిక దేవతా విగ్రహమే నని స్పష్టంగా చెప్పవచ్చు.

  కాలభైరవ ఆవిర్భావం గురించి తెలుసుకొందాం .పూర్వం  మహర్షులు మేరు పర్వతం పై చేరి ‘’అఖండ పదార్ధం ఏది?’’అని త్రిమూర్తులను ప్రశ్నించారు బ్రహ్మ తానే అని ,అంటే శివుడు యజ్ఞాధిపతి ఐన తానే అన్నారు .దీన్ని బ్రహ్మ విష్ణువులు ఒప్పుకోలేదు .అప్పుడు అందరు వేదాలను చెప్పమన్నారు .వేదాలు ‘’మేము చెప్పింది నమ్ముతాము అంటే చెపుతాము ‘’అన్నాయి .సరే అని ఒప్పుకోగా ‘’శివుడే అఖండ పదార్ధం ‘’అని విస్పష్టంగా చెప్పాయి .విష్ణువు అంగీకరించగా బ్రహ్మ ఒప్పుకోకపోతే శివుడు కాలభైరవుని సృష్టిస్తే అతడు బ్రహ్మను చంపేశాడు .అంటే బ్రహ్మగర్వభంగం చేశాడన్నమాట .కాలభైరవుడు తనబ్రహ్మ హత్యాపాతకం పోవటానికి ఉపాయం చెప్పమనగా బ్రహ్మ కపాలం పట్టుకొని సకల క్షేత్రాలనదుల్లో స్నానం చేయమని  ఎక్కడ అది జారిపోతుందో అక్కడ పాపం తొలగినట్లే అని చెప్పాడు .కాశీలో గంగానదిలో స్నానం చేయగానే బ్రహ్మ పుర్రె జారిపోగా శివుడు అతని బ్రహ్మ హత్యాదోషం పోయిందని  జన్మ రాహిత్యం కలిగిందని చెప్పి కాశీలో కొలువైఉన్న తనకు క్షేత్ర పాలకుడిగా ఉండమని ఆదేశిస్తాడు .

   స్థానిక కధనాలు కొన్ని చూద్దాం .ఇక్కడకాలభైరవ విగ్రహం ప్రతిస్టించటానికి కాశీలో విగ్రహం చెక్కించి ఎడ్ల బండీ మీద తెస్తుంటే ఇక్కడికి రాగానే బండీ  ఆగిపోయింది  ఎడ్లు బెదిరిపారిపోయి బండీ విరిగి పోయి అప్పటిదాకా పడుకోబెట్టబడిన విగ్రహం అమాంతం లేచినిలబడి అదే తాను ఉండాల్సిన చోటుఅని చెప్పింది . ఆ ప్రకారమే ఊరి మొదట్లో అక్కడవదిలేసి వెళ్ళిపోయారు ..అక్కడే ఎండకూ వానకూ ఆచ్చాదన,లేకుండా ఉంటె  ,గ్రామస్తులు భీకరారకారమైన ఆ విగ్రహానికి పూజ చేయటానికి ఝడిసేవారు .కరువుకాటకాలు వస్తే మాత్రం ఆవు పేడ తెచ్చి విగ్రహానికి పూసేవారు .ఆ పేడ కరిగిపోయేదాకా కుంభ వృష్టి కురిసేది .లోకకల్యాణానికి తనవిగ్రహానికి పేడ రుద్దినా సహించిన కరుణామయుడు ఈ కాలభైరవుడు  .

  భక్తుల మనోభావం లో మార్పు వచ్చిఎన్నో ఏళ్ళ తర్వాత ప్రజలు పూజ చేయటం మొదలు పెట్టారు .తర్వాత విశాలమైనప్రాంగణ౦ లో గొప్ప ఆలయం కట్టి స్వామిని ప్రతిష్టించారు .సి౦ధూరవర్ణం తో స్వామినిలువెత్తు విగ్రహం  తో మెరిసిపోతూ దర్శనమిస్తాడు .ధ్వజస్తంభం  శివలింగం లింగం ముందు కాలభైరవ (శునక )విగ్రహం కనిపిస్తాయి. గర్భ గుడిలో శిలారూప కాలభైరవ స్వామి దర్శనమిస్తాడు  , భీకర రూపం కనబడకుండా ముఖానికి వెండి తొడుగు వేస్తారు .ఆయనకు ముందు నంది విగ్రహం ఉంటుంది .భక్తులుకోరికలుతీరటానికి కొబ్బరికాయముడుపులు ,వస్త్రాలు, తొట్టెలు,కడతారు .దుస్ట శక్తుల నివారణకోసం 10 ,20, 50, 100 రూపాయల  నోట్ల దండలు కడతారు .స్వయంభుగా వెలసిన ఏకైక కాలభైరవ విగ్రహం కనుక మహా మహిమాన్వితం .పూజలు శైవ సంప్రదాయం లో జరుగుతాయి .మహారాష్ట్ర ,కర్నాటక ను౦డి కూడా భక్తులు వస్తారు .శనిప్రభావం తొలగటానికీ ఈస్వామి దర్శనం చేస్తారు .ఆరోగ్య సమస్యలున్నవారు రెండుపూటలా స్నానం చేసి స్వామివారిని దర్శించిపూజిస్తారు .నిత్యపూజలతోపాటు ప్రతిమంగళవారం విశేషపూజలు, అన్నసమారాధనా జరుగుతాయి.కార్తీక వైశాఖ మాసాలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు .కార్తీక బహుళ పంచమినుండి స్వామివారి జన్మ దిన వేడుకలు  నవమి వరకు 5 రోజులు మహోత్సవంగా చేస్తారు .రధోత్సవం ,అగ్నిగుండాల వేడుకకూడా నిర్వహిస్తారు  పూర్ణాహుతితో సమాప్తం ..వైశాఖం లో నాలుగు మంగళవారాలు విశేష పూజలు చేస్తారు .మొదటిమంగళవారం 108 రకాల స్వీట్లు నైవేద్యం  రెండో వారం పుష్పాలంకరణ ,మూడోవారం పండ్లతో   నాలుగోవారం  విశేషమైన అలంకరణ ఉంటాయి శ్రావణమాసం లో లక్ష బిల్వార్చన ,నిత్యాభిషేకం ఉంటాయి ,

   ఆలయంలో కాలభైరవునితోపాటు శివలింగం వినాయక విగ్రహంఉన్నాయి  .కాలభైరవ ఉత్సవవిగ్రహం రుద్రాక్షలతో శోభాయమానంగా ఉంటుంది .ఇక్కడి బావిలో నీరు ఏకాలమైనా పుష్కలంగా ఉండి స్వామి అభిషేకాలకు భక్తులకు విశేషంగా ఉపయోగపడుతుంది .

 శ్రీ కాలభైరవ దర్శనం సకల దోష నివారకం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in దేవాలయం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.