ఇప్పటి వరకు మనం కోనసీమ లోని రామేశ్వర అగ్రహార ఆహితాగ్నులు వేద పండితుల గురించి తెలుసుకొన్నాం .ఇకనుంచి నేదునూరు దగ్గరున్న కామేశ్వరి అగ్రహారం లోని వారి గురించి తెలియజేస్తాను .
1-శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు
రెండు చెవులకు బంగారు రింగులు ,కనులలో వేద ప్రకాశం ,కుడి చేతి నాలుగు వేళ్ళకూ బంగారు ఉంగరాలు ,ముంజేతికి బంగారు మురుగు ,మెడలోశుద్ధ స్పటికమాల ,కాంతులీనే యజ్ఞోపవీతం ,బోసినవ్వులతో 84 ఏళ్ళ వయసులోనూ తగ్గని వేద స్వరం తో కనిపిస్తారు శ్రీలంకా వెంకటరామ శాస్త్రి గారు .వేద పండితులుగా ఆంద్ర దేశం లో సుప్రసిద్ధులు .శ్రౌతం లో ఘటికులు.శ్రీ రెండు చింతల యాజులు ,శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్రి గారల మరణం తర్వాత శాస్త్రిగారు బాగా ప్రాచుర్యం లోకి వచ్చారు .కొంచెం ఆలస్యంగానే అగ్నిహోత్రం ప్రారంభించి ,అగ్ని స్టోమం వాయిదా వేసి ,యజ్ఞం చేసిన తర్వాత శ్రౌతానికి స్వస్తి పలికి ,మరణానికి 13 ఏళ్ళ ముందువరకు నిత్య అగ్ని హోత్రిగా ఉన్నారు .వేద ,శ్రౌతాలలో అద్వితీయులనిపించుకొని గౌరవం పొందారు .యజ్న యాగాది క్రతు నిర్వహణలో లంక వారిని ‘’అభినవ ఆపస్తంభుడు’’అంటారు .తైత్తిరీయాన్ని ఆపోసనపట్టి ,ఋగ్వేద పాండిత్యాన్ని సాధించి అధర్వ వేదం లో అవసరమైనంతవరకు పట్టు సాధించి ,సామవేదాన్నీచాలినంత మధించారు .వేదం ,శ్రౌత,ధర్మ శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు .జ్యోతిషం పై సలహాదారుకూడా .ఋత్విక్కు నిర్వహించాల్సిన వన్నీ ఆయనకు కరతలామలకం .సంస్కృత ఆంధ్రాలలో గ్రంథాలు రాసారు ,తాము స్వయంగా చేసుకొన్నాఆధాన ,అగ్ని స్టోమ లకు యజమానిగా ఉన్నా ,బ్రాహ్మణాలపై అపార విజ్ఞానఖని అయినందున జరిగే మంత్ర తంత్రాలపై చక్కని పర్యవేక్షణ చేసేవారు .ఆయన అగ్ని స్టోమం చేశాక ,భారత దేశంలోనే బాగా అనుభవమున్న అధ్వర్యులలో ఒకరుగా గుర్తింపు పొందారు .
సునిసిత మేధ లంక వారి సొత్తు .నిష్పాక్షికతకు నిలు వెత్తు దృష్టాంతం .వేదసభలలో సమదృష్టితో ,బహు మెత్తగా ,మాట్లాడాల్సిన విషయం పై పూర్తి దృష్టితో జనరంజకం గా ప్రసంగించే నేర్పు శాస్త్రి గారిది .తిరుపతి దేవస్థానం వేతనం తో ఉద్యోగం అందజేస్తామంటే బాబళ్ళ శాస్త్రి గారు ‘’అది ఆహితాగ్నికి కాదు ‘’అని తిరస్కరిస్తే ,వెంకరామ శాస్త్రిగారు వారిని అసలు పట్టించుకోనేలేదు .1995 నవంబర్ 5 న బంగాళాఖాతం లో పెను తుఫాన్ ఏర్పడి ,కోస్తా జిల్లాల జన జీవితాలను అస్తవ్యస్తం చేసినప్పుడు ,ఇళ్ళకప్పులు ఎగిరిపోయి ,కొబ్బరి తోటలు నేలకూలి ,పంటలు దెబ్బతిని వేలాది పశువులు అసువులుబాసి దారుణ నష్టాన్ని కలిగించింది .లంకా వారి పెంకుటిల్లు ,గొడ్లపాక ,ఆవులు ,పంట ,కొబ్బరి చెట్లు తీవ్రంగానష్ట పోయాయి .దాన్ని గురించి ఆయన ‘’దావోయిస్ట్’’ వేదా౦తి లాగా ‘’తుఫాన్లు వస్తాయి ,పోతాయి ‘’అన్నారు .ఈ స్థితప్రజ్నత వల్లనే ఆయన ఆరాధ నీయులయ్యారు .
లంకావారి సంప్రదాయ వేద విద్యాభ్యాసం,బాబళ్ళ శాస్త్రిగారి అభ్యాసంలాగానే సాగింది .శాస్త్రిగారు నేదునూరు గ్రామం లో జన్మించి ,ముక్కామలలో బాబళ్ళశాస్త్రిగారి తండ్రిగారి శిష్యులైనారు .చాలా క్రమశిక్షణతో నియమనిబంధనలతో సాగిన విద్య అది .తెల్లవారు జామున 3గంటలకే లేచి ,రెండుమైళ్ళు చీకటి మట్టి రోడ్డుపై నడిచి భమిడి పాటి వారింటికి చేరేవారు , ఉదయం అంతా అధ్యయనం జరిగేది .తర్వాత గురుపత్ని శ్రీమతి కామేశ్వరిగారు మధ్యాహ్న భోజనం పెట్టేవారు .ఆతర్వాత ఉదయం జరిగిన అధ్యయనా నికి సుదీర్ఘ సమీక్ష జరిగేది .సాయం సంధ్యావందనం చేసి ,మళ్ళీ చీకటిలో నడిచి స్వగ్రామం చేరుకోనేవారు .తల్లిగారు వండి వడ్డించిన భోజనం చేసి ,రాత్రి 8 గంటలకు నిద్ర పోయేవారు .’’మా తండ్రి గారు రోజూ రాత్రి నిద్రపోయే ముందు రెండు శ్లోకాలు నేర్పేవారు ‘’అని ఆయన జ్ఞాపకంచేసుకొన్నారు ..ఈ దిన చర్య బ్రహ్మ చర్య జీవితకాలం అంతా కొనసాగింది అని చెబుతూ ముసలితనం లో ‘’ఇటీవలికాలం లో ఎక్కువగా నిద్రావసరం లేకపోతోంది .అందుకని 2 గంటలకే నిద్ర లేచి 3 గంటలవరకు పక్కమీదనే మెలకువగా భగవధ్యానం తో ఉంటాను .అందరు హాయిగా నిద్రపోతుంటారు .అరుణోదయ వేళ కు మంచంనుంచి లేస్తాను ‘’అని చెప్పారు .శాస్త్రిగారి బ్రాహ్మ విద్యాధ్యయనం 6 సంవత్సరాలు భమిడి పాటి గురు వరేణ్యులవద్ద సాగింది .రెండవ గురువు తమ అల్లుడి తండ్రిగారివద్ద ముక్కమలలో మూడేళ్ళు ‘’ఘనం ‘’నేర్చారు .అరడజను మంది తోటి విద్యార్ధులతో వారాలు చేసి అక్కడ చదివారు.
లంకా వారి వేదవిద్యతో పాటు , వివాహం కూడా భమిడి పాటి వారి ఆధీనంలోనే జరిగింది. శాస్త్రిగారు బాబళ్ళ శాస్త్రిగారి సమీప బంధువు శ్రీమతి అనసూయగారితో జరిగింది .అప్పుఆయనకు 10 ఆమెకు 7 వయసు .లంకావారి ధర్మపత్నిగారి తండ్రి తాత ముత్తాతలు అందరూ ఆహితాగ్నులే కనుక ఆమెకు పత్నీ ధర్మాలు సహజంగా అలవడ్డాయి .రజస్వలయ్యాక 14 వ ఏట ఆమె నేదునూరుకు కాపురానికి వచ్చారు .పతివ్రతామతల్లి అనసూయ పేరు పెట్టినందుకు ఆధార్మాలన్నీ ఆమెలో ఉన్నాయి .8 మంది మగపిల్లలకు జన్మనిచ్చారు .చివర ఆడపిల్ల అనసూయ .ఒకరు పసితనం లోనే చనిపోయాడు .
చిన్ననాటినుందడి శాస్త్రిగారు తండ్రికి వ్యవసాయపనులకు తోడ్పడేవారు . వ్యవసాయ యాజమాన్యం సహజం గా అలవడి,మంచి యజమానులుగా పేరు పొందారు .నారు పోయటం ,దుక్కి దున్నటం, నాట్లు వేయటం ,కూలీలను మాట్లాడటం,కలుపు తీయటం ,అదునుకు నీరు పెట్టటం, కోతలు ,కట్టివేతలు,నూర్పిడి అన్నీ దగ్గరుండి తండ్రీ కొడుకులు చూసేవారు .పొలాల గట్లమీద కొబ్బరి చెట్ల నీడలో తండ్రి తనయులు శిష్యులకు అధ్యయనమూ కొనసాగించేవారు .గ్రామస్తులు ముహూర్తాలకోసం ,ధర్మ సందేహాలు తీర్చుకోవటం కోసం అక్కడికే వచ్చేవారు .ఒక్కోసారి ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వచ్చేది .సామవేదం వారు’’ ఇంటి వద్ద వేదాధ్యయన౦, ,పొలాలలో వల్లెవేయటం అంతా ధనార్జనా వ్యామోహమే ‘’అన్న విమర్శకు శాస్త్రిగారు దీటుగా సమాధానం చెబుతూ ‘’కృషి వేదానికి అవరోధం .వేదం కృషి కి అడ్డంకి’’ ,అని అర్ధం వచ్చే శ్లోకం చదివే వారు .’’వ్యవసాయం కావాలంటే వేదపండితుడు కాలేడు.కానీ నా విషయం లో నా చదువు ,అధ్యయనం నేను వ్యవసాయ విధులను చేబట్టటానికి ,ముందే జరగటం నా అదృష్టం ‘’అన్నారు .
శాస్త్రిగారి తండ్రి గారు 72 వ ఏట 1947 లో చనిపోయారు . అప్పుడు ఆయన వయసు 35 .శాస్త్రిగారు తల్లి ,అర్ధాంగి,కుటుంబం ఇతరులతో సహా రైలులో సుదీర్ఘ ప్రయాణం చేసి కాశీ వెళ్లి శ్రార్ధ కర్మ నెరవేర్చారు . .ఉన్న ఆస్తి అన్నదమ్ములు పంచుకోగా ,శాస్త్రిగారికి ఎకరం 20 బస్తాలు పండే పంటభూములు వచ్చాయి .అయినా పిల్లల చదువులకోసం అప్పులు చేయాల్సి వచ్చింది .’’నా జీవితం అప్పు లేకుండా గడవలేదు ‘’అన్నారు ..చిన్న అనసూయ ను కోరుమిల్లి వాసి భమిడి పాటి మిత్రనారాయణ కిచ్చి వివాహం చేయటానికి చాలాకాలం క్రితం 400 రూపాయలు కట్న మిచ్చారు ఇ తడు ఆహితాగ్ని కుమారుడు .త్వరలో ఆహితాగ్ని అవుతున్నవాడుకూడా .ఆంద్ర దేశం లోనే కాదు, యావత్ భారత దేశం లోనే అత్యంత చిన్నవయసులో ఆహితాగ్ని అయినవాడు .ఈమె వలన శాస్త్రి గారి కుటుంబం ఆహితాగ్ని కుటుంబం కు మళ్ళీ చేరువయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-18 –ఉయ్యూరు .
.
—
శ్రీ దుర్గాప్రసాద్ గారికి నమస్కారములు !! ముందుగా ఇంతటి మహనీయుల గురించి మాకు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు. ఈ ధారవాహిక క్రమ సంఖ్య 14 గా సరిచేయగలరు. ఎందుకంటే క్రితం ధారావాహిక 13 (కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13 ) కనుక
శ్రీ దుర్గాప్రసాద్ గారికి నమస్కారములు !! ముందుగా ఇంతటి మహనీయుల గురించి మాకు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు. ఈ ధారవాహిక క్రమ సంఖ్య 14 గా సరిచేయగలరు. ఎందుకంటే క్రితం ధారావాహిక 13 (కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13 బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ అవధానిగారు, కుమారులు) కనుక