ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-4
మహాత్మా గాంధీ ‘’స్త్రీవాద వ్యూహం ‘’చెప్పాడు .అదే సత్యాగ్రహం .మహిళలకు వారి మేధకు సరిగ్గా సరిపోయే స్ట్రాటజి ఇది .పురుషులకంటే స్త్రీలే అహింసా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని బాగా వివరించి ప్రచారం చేయగల సత్తా ఉన్నవారని నమ్మాడు..స్త్రీలు బలహీనులవటం వలన వారికి ఈ బాధ్యత అప్పగించలేదు. వారిలో సమర్ధత , ధైర్యం ,త్యాగ గుణం ఎక్కువ అని బాధ్యత అప్పగించాడు. అవతలివారిని ఒప్పించే నేర్పు కూడా మగవారికంటే స్త్రీలకే ఎక్కువ అని గ్రహించాడు .తన నమ్మకాన్ని మరొకసారి ప్రకటిస్తూ ‘’మనం అబలలు అని పిలిచే మహిళలు సబలలు ఐనప్పుడు ,నిస్సహాయ స్థితి లో ఉన్న వారందరూ దుర్గా దేవిలాగా మహా శక్తి సంపన్నులౌతారు’’అన్నాడు బాపూజీ .
పురుషులతో పాటు మహిళలూ సమానమే అన్న గాంధీ సిద్ధాంతాన్ని గురించి ఆలోచిద్దాం .దీనినే ‘’సమతాదర్శనం ‘’అన్నాడు ,జైనమత ప్రవక్త వర్ధమాన మహావీరుడు .’’అన్నిఆత్మలూ శక్తి సంపన్నమైనవే .ఆత్మ దర్శనానికి, ఆత్మోన్నతికి అందరూ అర్హులే .నిర్వాణానికి పురుషులతోపాటు స్త్రీలూ అర్హులే ‘’అని మహావీరుని మహా బోధ .సమానత్వం అనేది మనసా వాచా కర్మణా జరగాలి . మహా వీరుని ఈ భావం గాంధీ మనసుకు బాగా హత్తుకున్నది .మహావీరుని ప్రేరణే, గాంధీ మహిళా సమానత్వం .చిన్ననాటినుండి గాంధీజీ మహావీర బోధలు విని అర్ధం చేసుకున్నాడు .ఆయనభావాలకు తనదైన భావ పుస్టి కలిగించి కాలానుగుణ౦ గా తన జీవితాన్ని తీర్చి దిద్దుకొని నడిచాడు .మహాత్ముని సమానత్వ సిద్ధాంతం- సంరక్షణ ,అస్పృశ్యత నిర్మూలన ,స్త్రీ పురుషుల సమానత్వం .‘’స్త్రీ పురుషునికి తోడు పురుషునితోపాటు సరిసమాన మానసిక, బౌద్ధిక శక్తి కలది ‘’అని అర్ధం చెప్పాడు .పురుషుని అన్ని పనులకు ఆమె తోడూనీడగా వ్యవహరిస్తుంది .అందుకే అతనితోపాటు ఆమెకు స్వేచ్చ ,స్వాతంత్ర్యం తప్పని సరి .మహా వీరుడు జైన సంఘం లో స్త్రీలకు ప్రవేశం కల్పించి , ఎలాంటి స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇచ్చాడో మహాత్ముడు కూడా అలాగే చేశాడు .మహావీరుని దృష్టిలో స్త్రీ పురుషులు ఆధ్యాత్మిక, ఆత్మ భావనలో సరిసమానులు . ఈ ప్రపంచాన్ని త్యాగం చేసి ,సన్యసించి నిర్వాణం పొందటానికి స్త్రీ పురుషులిద్దరూ అర్హులే అన్నాడు .ప్రతి జీవికి ఆత్మ ఉంటుందని బోధించాడు .
పర్యావరణ పరిరక్షణలో గాంధీ గారి పరికరాలేమిటి అని ఆలోచిద్దాం .పర్యావరణ క్షీణత జీవుల ఉనికికే మహా ప్రమాదంగా ఉంది .అజ్ఞాన జ్ఞానాభివృద్ధి భూగోళాన్ని ప్రమాదం అంచుకు నెట్టేసింది .మానవ సుఖ,విలాసాలకోసం ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నారు .దీనివలన వినిమయతత్వం (కన్సూమరిజం )విపరీతంగా పెరిగి ,జీవ వైవిధ్యనష్టం ,భూతాపం(గ్లోబల్ వార్మింగ్ ) పెరగటం ,సహజవనరుల క్షీణత, వివిధ విదాల కాలుష్య౦ పెరగటం మొదలైన తీవ్ర సమస్యలు చుట్టు ముట్టాయి .వీటివలన ప్రపంచ పతనం (గోబల్ కొలాప్స్ )జరిగే ప్రమాదముందని భీతి చెందుతున్నారు .మానవ మేధ పెరిగి, పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం రావటం తో, భౌతికత పై వ్యామోహం పెరిగి, జీవిత విధానం లో పెనుమార్పులు కలిగాయి .దీనికి గాంధీ జీ ఉపయోగించిన విలక్షణమైనవిధానాలు ,పరికరాలే పరిష్కారం .’’పాశ్చాత్య నాగరకత ఏడురోజుల అద్భుతం మాత్రమే .కనుక ప్రకృతి తో సహజీవనం తో ,,ఆధ్యాత్మిక భావాలతో జీవిత శైలిని నిర్మించుకోవాలి ‘’అని గాంధీ అప్పుడే చెప్పాడు .మన మైండ్ సెట్ మారాలంటే గాంధియన్ స్పిరిట్ మాత్రమే శరణ్యం .లేకపోతె మనం కూర్చున్న కొమ్మను నరుక్కునే బుద్ధిహీనులమై ,కాలుష్యం కోరల్లో చిక్కుకున్న వెర్రి వాళ్ళమై భూమాతకు తీరని ద్రోహం చేసే వాళ్ళుగా చరిత్ర హీనులమైపోతాం .తస్మాత్ జాగ్రత జాగ్రత .
భారతదేశం ,శాంతి అవినాభావ సంబంధమున్న విషయాలు .మహాత్ముడు ఇండియాలో బ్రిటిష్ పాలన అంతమొందటానికి చేసిన సత్యాగ్రహ,సహాయనిరాకరణ, క్విట్ ఇండియామొదలైన ఉద్యమాలన్నీ అహింసా యుతంగా జరిగి, విజయం సాధించి భారత దేశ౦ స్వాతంత్ర్య౦ పొందటానికి దోహద పడినవే.దక్షిణాఫ్రికాలో ప్రారంభించి 1915 జనవరిలో భారత దేశానికి వచ్చి ,జాత్యహంకార కాలనీ కోరలున్న తెల్లవారి పాలనపై పూరించిన పర్జన్య శంఖా రావాలే .గాంధీ రాకతో ఉద్యమాలకు జవ జీవాలొచ్చాయి .ఉత్సాహం కట్టలు తెంచుకొన్నది .ఐక్యత ఏర్పడింది. కలిసికట్టుగా కాలనీ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలనీ , స్వేచ్చాభారతమే అందరి లక్ష్యమని భావన బలీయమైంది .1920 నుండి 1947 వరకు అవిశ్రాంతంగా బాపు నాయకత్వం లో కోట్లాది భారతీయ స్త్రీ, పురుషులు ఆయన వెంటనడిచారు .రాజకీయ స్వాతంత్ర్యం కోసమేకాదు. అణగ ద్రోక్కబడిన దిక్కు మొక్కూలేని అసలు తమకు హక్కులు౦ టాయన్న విషయంకూడా తెలియని అమాయక అస్పృశ్యుల హక్కు, విధుల కోసం ఆయన పోరాడి విజయం సాధించాడు .వారిని ‘’హరిజనులు ‘’అనే గౌరవనామం తో పిలిచి దేవాలయ ప్రవేశం కల్పించటం తో వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయాడు . ఆయన సాధించిన అద్భుత విజయం నిజంగా’’ యైత్ వండర్’’.వీరందరూ స్వాతంత్ర పోరాటం లో ఆయుధాలు లేని పోరాట యోధులై గాంధీకి అండగా నిలిచారు .ఆసేతు హిమాచలపర్యంతం గాంధీ మాట వేదవాక్కు .గాంధీ వాక్కు మంత్రమే అయింది .భారత దేశ చరిత్రలో అత్యంత ప్రజా నాయకుడు –మాస్ లీడర్ అనిపించాడు మహాత్ముడు .ఆయన ఆదర్శ త్యాగమయ జీవితం కోట్లాది మంది భారతీయులకు కదిలించి నడిపించింది .అందరి కోరిక అయిన స్వాతంత్ర్యం సిద్ధించింది .సాంఘిక అసమానతలు ,లైంగిక వివక్ష లకు చరమగీతం పాడటానికి పని చేసింది .
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఈ చిరు ధారావాహిక
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-18-ఉయ్యూరు ,