గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680)

భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోలింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)

  ఉద్యోగమునకై మేనమామల సహాయం

గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లభించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.

ఆలయ నిర్మాణం

పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి ధనం సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.

గోపన్నకు జైలు శిక్ష

కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. “నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి”, “పలుకే బంగారమాయెనా”, “అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా” వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన “ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా”, కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- “నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?” – అని వాపోయి, మరలా – “ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు” – అని వేడుకొన్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.

రామ లక్ష్మణుల తిరిగి చెల్లింపు

అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది,ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది[2].

వాగ్గేయకారులలో ఆధ్యుడు

శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన – “ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?” – ఇంకా ప్రహ్లాదవిజయములో “కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్” – అన్నాడు .

ఇంతటి మహా రామ భక్తుడు సంస్కృతం లో కీర్తనలు రాశాడని మనకు తెలియదు .ఇవాళ ఉదయం విజయవాడ ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం లో  స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గానం చేసిన  రామ దాసుగారి సంస్కృత కీర్తన మొట్టమొదటి సారిగా విన్నాను .అంతకు ముందు ఒక వేళ విని ఉన్నానేమో జ్ఞాపకం లేదుకాని ,విని ఉంటే ఆయన రాసిన కీర్తన కాదేమో నని ‘’లైట్ ‘’తీసుకొని ఉంటానేమో నని కూడా నా అజ్ఞానం వలన అనుకోని ఉండవచ్చు .వెంటనే మా అబ్బాయి శర్మకు మెయిల్ పెట్టి నెట్ లో రామదాసు సంస్కృత కీర్తనలు ఉంటె వెతికి పంపమన్నాను .వాడు శ్రమించి ,శోది౦చి మూడు  కీర్తనలు ఆడియో తో సహా పంపాడు . ఇంతకు మించి ఎవరివద్దనైనా ఉంటె నాకు పంపితే చేరుస్తాను .ఇప్పటిదాకా గీర్వాణకవుల పై మూడు భాగాలలో  1,090 మందిపై రాసి,ఇంకా ముద్రి౦పని  నాలుగవభాగం లో కూడా 311 మంది పై రాసిన నేను,  రామదాసు గారి సంస్కృత కీర్తనలు గమనించక పోవటం క్షమించరాని నేరంగా నే భావించి వెంటనే రాసి తప్పు దిద్దుకోన్నాను .అవున్లే -మూకకవిని ,కంచి పరమచార్యులవారిని ,అన్నమయ్యనూ కూడా మూడవ సంపుటం లోకి పెట్టిన  ‘’తెలివి నాది ‘’.

పాల్ రాబ్సన్ అని ప్రసిద్ధి చెందిన చిత్తూరు ఉప్పలధడియం నాగయ్యగారు ఎంతో కస్టపడి  శ్రమించి, ఎన్నళ్ళో శ్రమించి ,  భక్త రామదాసు బ్లాక్ అండ్ వైట్ చలన చిత్రం నిర్మించి ,దాసుగారికి ప్రేరణగా నిలిచినా భక్త కబీర్ పాత్రకు కూడా ప్రాముఖ్యత కల్పించి , ,రామదాసు వేషం వేసి  అసలు రామదాసు ఇలానే ఉండేవాడు అనిపించి  కీర్తనలు రస గుళికలుగాపాడి ,రామభక్తితో తాను పులకించి మనల్నికూడా పులకింప జేసి,  సంగీతంకూర్చి దర్శకత్వం వహించి కంచర్ల గోపన్న రామదాసు ఐన విధానాన్ని కళ్ళకు కట్టించి తానుతరించి మనల్నీ తరింప జేశారు  .’’రామదాసు గారూ  రసీదందుకోండి’’అని తానీషా గుర్రం పై పరి గెత్తుకొస్తూ పాడిన పాట ఇంకా’’ హాంట్ ‘’చేస్తూనే ఉంది . మళ్ళీ శ్రీ రాఘవేంద్రరావు దర్శకత్వం లో కలర్ ఫుల్ గా శ్రీ నాగార్జునతో వేషం కట్టించి శ్రీ కీరవాణి సంగీతం లో యువతకు చేరువగా తీర్చిదిద్దారు .ఇందులో ‘’అ౦తా రామమయం –ఈ జగమంతా రామమయం ‘’కీర్తన మలచిన తీరుకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే .అదే రామదాసుగారి భక్తివైభవ సామ్రాజ్యం .ఈ రెండూ మరచి పోతే చరిత్ర మనల్ని క్షమించదు . తిరుపతి దేవస్థానం అన్నమయ్య  సంకీర్తనా ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం రామదాసు కీర్తనలకు ఇవ్వకపోవటం బాధాకరమే .అది సొమ్ములదైవం .ఇది బాధల దైవం అయినందుకా ?శ్రీ బాలమురళి రామదాసు కీర్తనలు ఎన్నో ఏర్చి కూర్చి శ్రావ్యంగా గానం చేసి చిరస్మరణీయం చేశారు .ఆ వాగ్గేయ కారునికి ఈ వాగ్గేయ కారుడు ఋణం తీర్చుకున్నాడు .భక్త సమాజాలవారు రామదాసు కీర్తనలను ఘనంగా గానం చేస్తూ ,ఆయన ను మర్చిపోకుండా చేస్తున్నందుకు అభినందనలు .త్యాగరాజు గారి చేతనే జేజే లందుకొన్న భక్త శిఖామణి  భద్రాచల రామ దాసు గారు .

ఇప్పుడు రామదాసు గారి సంస్కృత కీర్తనల భక్తి  సౌందర్యాన్ని చూద్దాం –

1-మాయామాళవగౌళ – ఏక (మణిరంగు – త్రిపుట

పల్లవి:
నందబాలం భజరే బృందావన వాసుదేవం నం..
చరణము(లు):
జలజసంభవాది వినుత చరణారవిందం
లలిత మోహన రాధావదన నళినమిళిందం నం..
నిటలతట స్ఫుటకుటిల నీలాలక బృందం
ఘటితశోభిత గోపికాధర మకరందం నం..
గోదావరీతీర వాసగోపికా కామం
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం నం..

 

2-.

నవరోప – ఆది (నవరోజు – త్రిపుట)
పల్లవి:

భజరే మానసరామం
భజరే జగదభిరామం భీ..కరధృత శరకోదండం
కరితుండాయుత భుజదండం భ..
దాశరథీ సురసింహం
కౌసల్యా బహుభాగ్యం రామం
మైథిల్యాలోచన యోగ్యం భ..అవనత జలజభవేంద రం
అగణితగుణగణసాంద్రం
మాయామానుష దేహం ముని
మానస రుచికరదేహం భ

..రూపమదనశతకోటిం నత భూవదన శతకోటిం భ

..శ్యామసజలధరశ్యామం
సాంబశివానుత రామం
భద్రాద్రిచలనివాసం పరి
పాలిత శ్రీరామదాసం భ..
3-నాదనామక్రియ – ఆది (కేదార – ఆది)

3-పల్లవి
భజరే శ్రీరామం హే మానస
భజరే రఘురామం రామం భ..
చరణము(లు):
భజ రఘురామం భండనభీమం
రజనిచరాఘ విరామం రామం భ..
వనరుహ నయనం కనదహి శయనం
మనసిజ కోటిసమానం మానం భ..
తారకనామం దశరథ రామం
చారు భద్రాద్రీశ చారం ధీరం భ..
సీతారామం చిన్మయధామం
శ్రీ తులసీదళ శ్రీకరధామం భ..
శ్యామలగాత్రం సత్యచరిత్రం
రామదాస హృద్రాజీవ మిత్రం భ..

 

 

ఆలస్యంగా రాసినందుకు రామదాసుగారు నన్ను క్షమిస్తారని భావిస్తాను .ఇప్పటికైనా రాస్తున్నందుకు సంతృప్తి చెందుతున్నాను .

8-3-18 తో కామా పెట్టిన ఈ సీరియల్ ను మళ్ళీ దీనితో కొనసాగిస్తున్నాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-18 –ఉయ్యూరు

 

 

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.