గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992)

శిరశినగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లాకుచెందిన కవి. వీరికి అభినవ కాళిదాసు అని బిరుదు కలదు.నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని గా ప్రసిద్ధిని పొందారు[1]. కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు[2]. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు.

1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు.

రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని:

1. కళాశాల అభ్యుదయం

2. రామానుజ చరితం

3. చిత్ర ప్రబంధం

4. రత్నమాల (ఖండ కావ్యం)

5. మనస్సందేశ కావ్యము

6. సంపత్కుమార సంభవ కావ్యము

7. గాంధీతాత నీతిశతకము

8. గీతాచార్య మతప్రభావ శతకము

9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము

10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము

11. వేణుగోపాల స్వామి సుప్రభాతము

12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము

13. పద్మావతీ పరిణయము (హరికథ)

14. రుక్మిణీ కళ్యాణము (హరికథ)

15. ముకుందమాల

16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు

17. విశిష్టాద్వైతమత సంగ్రహము

18. వేదార్థ సంగ్రహము (అనువాదం)

19. గురువంశ కావ్యనిధి

వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు.

సశేషం

గబ్బిట దుర్గాప్రసాద్-4-10-18 –ఉయ్యూరు

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

315 –స్నేహ బంధం సంస్కృత నాటిక కర్త – ఓగేటి అచ్యుతరామశాస్త్రి(19 32

జననం 1932 జనవరి 2

వృత్తి రచయిత, కవి, వక్త, పరిశోధకుడు

ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు మరియు గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు.

రచనలు

శంకరాచార్య (1958) – పద్యకృతి

బంధాబైరాగి (1959) – చారిత్రక నాటకం

సంస్కృత నాటక ప్రయోగరంగము (1975) – పరిశోధన గ్రంథము

స్నేహబంధనమ్‌ (1978) – సంస్కృతంలో వ్రాయబడిన సాంఘిక నాటకం

హిమకిరీటిని (1981) – కవితాసంకలనం

స్వామి వివేకానంద కవితా వైభవం (1983) – సాహిత్య విమర్శ

భారతీయ చరిత్ర సత్యాన్వేషణ (1983)

హైదరాబాదు నగర తెలుగు భాషా సాహిత్య వికాసచరిత్ర[1] (1985)

ఓగేటి వ్యాసపీఠి[2] (1986)

హైదరాబాదు నగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము[3] (1987)

ఎఱ్ఱన అరణ్యపర్వశేషము[4] – పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథము

అచ్యుతగీత – సంస్కృత గేయ సంపుటి

Lady of the Lake – ఆంగ్ల భాషలో తెలుగు జానపద కథల సంపుటి

హరిహరనాథ ద్విశతి

హిందూ మతం (1990) – సంస్కృత గద్యగ్రంథం

శ్రీ బాసర సరస్వతీక్షేత్రము – పద్యప్రబంధము

మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహాదూర్ “శాద్” జీవితచరిత్ర (1994) – హిందీ భాషలో

ఆంధ్రకేసరి – పద్యప్రబంధము

వేకువ వెలుగులు (ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఎస్.ఎస్) [5] (1997) –

బిరుదులు

సంస్కృత నాటకప్రయోగోద్ధారక

నటరాజరాజ

ఆశ్చర్య కుశలవక్త

మహోపాధ్యాయ

రాష్ట్రకవి

భాగ్యనగర భారతి మొదలైనవి.

31 6- అష్టకాల నరసింహరామశర్మ(20 వ శతాబ్దం )

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.[1] జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతుడు. అవధాని, సంస్కృతాంధ్ర పండితుడు, కవి, రచయిత. ఇతనికి అవధాన కళాప్రపూర్ణ, సారస్వత శిరోమణి, బ్రాహ్మీ విభూషణ, కవితా సుధాకర, కవికేసరి మొదలైన బిరుదులు ఉన్నాయి. ఇతడు తెలుగు, సంస్కృత భాషలలో అనేక గ్రంథాలను రచించాడు. ఉపాధ్యాయుడిగా ఇతని సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేసింది. ఇతని షష్టిపూర్తి సందర్భంగా 2010లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఇతడిని స్వర్ణకంకణంతో సత్కరించాడు. ఇతని అనుయాయులచే కనకాభిషేక, తులాభార సత్కారాలను కూడా పొందాడు.

ఇతడు తన 16వ యేట 1960లో బాసర క్షేత్రాన్ని దర్శించాడు. అప్పుడు 56రోజులపాటు ధ్యానంలో నిమగ్నం కాగా సరస్వతీదేవి కటాక్షించి తన దేవాలయాన్ని నిర్మించవలసినదిగా కోరింది. దేవి ఆదేశానుసారం ఇతడు మెదక్ జిల్లాలో అనంతసాగర్ ప్రాంతంలో తన జీవితమంతా వెచ్చించి సరస్వతీదేవాలయాన్ని నిర్మించాడు[2][3].

ఇతడు తన మొదటి అష్టావధానాన్ని నారాయణఖేడ్‌లో అనుకోకుండా పూర్తి చేశాడు. అప్పటి నుండి కొన్ని వందల అవధానాలను నిర్వహించాడు.

31 7- అలంకార సుధా సింధు కర్త -ఆణివిళ్ళ వేంకట శాస్త్రి(18 వ శతాబ్ద )

ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు శాస్త్ర పారంగతులు మరియు బాలకాళిదాసు బిరుదాంకితులు.

జీవిత విశేషాలు

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి (కాకరపర్రు) చెందిన ఆణివిళ్ళ నారాయణ కవి కుమారుడు. ఈయన 18 వ శతాబ్దానికి చెందినవాడు. బాల కాళిదాస బిరుదాంకితుడైన శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు సర్వ శాస్త్ర పారంగతుడు సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత పెద్దాపురం సంస్థానం మహా ప్రభువులు, దార్లపూడి, విజయనగర మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు .[

రచనలు

మహేశ్వర మహా కావ్యం

సతీ స్తోత్రం

భాస్కర ప్రశస్తి

రుక్మిణీ పరిణయం కావ్యం రాశాడు.

వేంకట శాస్త్రి గారు గొప్ప అలంకారికులు. అలంకార సుధా సింధు రస ప్రపంచం ఆతని శేముషికి నిదర్శనాలు . చిత్ర చమత్కార మంజరిని పెద్దాపురం రాజు వత్సవాయి తిమ్మ జగపతికి అంకితమిచ్చాడు. చిత్ర కవిత్వముగా సూర్య శతకం రాసాడు. శ్రీ ఆణివిళ్ళ వేంకటశాస్త్రి గారికి వార్ధక్య దశలో పెద్దాపురం సంస్థానం వారు అగ్రహారం ప్రసాదించాలని సంకల్పించగా అప్పటి మంత్రి పాణంగిపల్లి రామచంద్రుడు గారి కుతంత్రము వల్ల నెరవేరలేదట. పాణంగిపల్లి రామచంద్రుడు తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలానికి చెందిన పాణంగిపల్లి, గ్రామమును అగ్రహారంగా పొందే నిమిత్తం అలా చేసాడని లోకోక్తి. నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసాడు. మెచ్చిన రాజు వల్లూరుమల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. అక్కడ సోమయాగం చేసాడు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యం రాసాడు.

31 8– సంస్క్రుతాన్ధ్రకవి – కుంటిమద్ది శేషశర్మ(19 13 )

1913, ఫిబ్రవరి 2 అనంతపురం లో జన్మించి తెలుగు ఉపాధ్యాయ అధ్యాపకులై సంస్కృతాంధ్ర రచనలతో ప్రసిద్ధుడయ్యాడు .తండ్రి కుంటిమద్ది వెంకట రంఘా చార్యులు .తల్లి శేషమ్మ .భార్య జయ లక్ష్మి

శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన కుంటిమద్ది శేషశర్మ అనంతపురం జిల్లా కవులలో ఎన్నదగినవాడువిద్యాభ్యాసం

కుంటిమద్ది శేషశర్మ కుంటిమద్ది ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ విద్యపూర్తి చేశాడు. బళ్ళారిలో ఉన్నత పాఠశాల విద్య చదివాడు. తన తాతగారైన కుంటిమద్ది శ్రీనివాసాచార్యుల వద్ద ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు. 1938లో తెలుగు విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఇతని కోడలు మృణాలిని అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సుప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి. అమెరికాలో కూచిపూడి నృత్యాన్నినేర్పించే కళామండపం అనే సంస్థను నడుపుతున్నది.

ఉద్యోగం

1943నుండి అనంతపురం జిల్లాలోని హైస్కూళ్లలో ఆంధ్ర ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 1959 నుండి 1971 వరకు జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశాడు.

31 9-బాష్ప బిందవః-కర్త గరికపాటి మల్లావధాని(18 99 -1985 )

గరికపాటి మల్లావధాని (సెప్టెంబరు 18, 1899 – జనవరి 5, 1985) స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.

బాల్యం, విద్యాభ్యాసం

ఈయన కొవ్వూరు లో 1899లో వికారి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ నాడు సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి కుమారునిగా జన్మించాడు[1]. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించాడు. ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రుల శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు దిద్దుకున్నాడు. కల్లూరి వెంకట్రామశాస్త్రి, వజ్ఝల సీతారామ శాస్త్రుల దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు. వేలూరి శివరామశాస్త్రి గారి అష్టావధానాల ఆకర్షణలో పడి అవధానాలు చేయడం ప్రారంభించాడు.

ఉద్యోగ ప్రస్థానం

ఈయన కొంతకాలం ఎర్నగూడెం తాలూకాలో తెలికిచెర్ల జమీందారు రాజా కాకర్లపూడి వేంకటరమణయ్య ఆశ్రయములో వున్నాడు. ఆ జమీందారుగారి వినోదార్థము కవితాగోష్ఠులను, అష్టావధానములను కావించి, 8 ఎకరముల భూవసతిని సన్మానముగా గ్రహించినాడు. నర్సాపురములో జరిగిన సభలో “కవిశేఖర” బిరుదమును పొందాడు. 1922 లో ఏలూరులోని గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయములో సంస్కృతాంధ్ర పండితుడిగా చేరినాడు. 1930వ దశకంలో “ఢంకా” అనే పత్రికను నడిపినాడు. 1935 లో మంజువాణీప్రెస్ , రామా అండ్ కో, వెంకటరమణ పవరుప్రెస్ మొదలైన ముద్రణాలయములలో గ్రంథపరిశోధనము గావించాడు. 1947 లో సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీలో తెలుగుపండితులుగా చేరి పెక్కుమంది శిష్య ప్రశిష్యులను సంపాదించి విశిష్ట భాషాసేవ ఒనర్చినాడు.

స్వాతంత్ర్య పోరాటం

1921 లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపాడు! 1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించాడు.

కోర్టువారు ఆయన్ని, ఏలూరులో బ్రిటీషు జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు. అప్పుడు, ఆయన ఆశువుగా చెప్పిన పద్యం.

 

లేదుగదయ్య! మా నుడుల లేశమసత్యము సత్య బద్ధమౌ

వాదమె దోసమయ్యెడు నభాగ్యమిదే మనకబ్బె నింక నౌ

కాదననేల? మీ విహిత కార్యకలాపము దీర్పబూనుడా

మీదట దేవుడే గలడు మిమ్మును మమ్ము పరీక్షసేయగన్‌.

 

“మేము చెప్పేది కాస్త కూడా అబద్ధం కాదు. నిజం చెప్పడం అపరాధం అయ్యింది. ఇది మన దురదృష్టం. ఇక అవును, కాదు అనడం ఎందుకు? మీరు చెయ్యవలసిన పని, (అంటే నన్ను జైలులో పెట్టడం) మీరు చెయ్యండి. ఆపైన మిమ్మలినీ, మమ్మలిని పరీక్షచేసేందుకు దేవుడే ఉన్నాడు,” అని ఆయన చెప్పాడు. జైలు కెళ్ళాడు.

 

రచనలు

గరికపాటి కలంలో దేశభక్తి గళం

భారతాంబికా శతకము

విద్యార్థి శతకము

ఋతుషట్కము

శివనివేదనము

శంకర జననము

పుష్పవివేకము

పండిత రాయలు

ఆదర్శజ్యోతి (శ్రీరాముని గుణగణ ప్రశంస)

అమరుక కావ్యం (ఆంధ్రీకరణము)

దిగంబరి (తత్త్వనాటికలు)[2]

అవధానాలు

ఇతడు సుమారు 20వరకు అష్టావధానాలు చేశాడు. ఇతని అష్టావధానాలలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, కావ్యపాఠము, వ్యస్తాక్షరి, పురాణపఠనము, చదరంగం, అప్రస్తుత ప్రసంగం అనే ఎనిమిది అంశాలు ఉండేవి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.