ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు

ఎవరీ భగదత్తుడు? ఎవరిమీద అతని ప్రతీకారం ?

నరకాసురుని కొడుకు భగదత్తుడు. గొప్ప పరాక్రమ శాలి అర్జునునితో సరి జోడైన యుద్ధ వీరుడు .తండ్రి నరకాసురుడు శ్రీ కృష్ణ సత్యభామ లతో చేసిన యుద్ధం లో చనిపోయాడు. తల్లి భూదేవి రూపమైన సత్యభామ కొడుకు నరకుడు .నరకంటకుడయ్యాడని కొడుకనే దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేసింది .నరకుడు చనిపోయిన రోజే మనకు నరక చతుర్దశి. మర్నాడు ఆ స౦బరం చేసుకొనే దీపావళి .ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి .మర్నాడువచ్చే అమావాస్య దీపావళి అమావాస్య .తనతండ్రిని చంపినా దగ్గరుంచి దగ్గరుండి , భగదత్తుడికి కృష్ణుడిపై పీకల్లోతు ద్వేషం ప్రతీకారం ఏర్పడ్డాయి  .

ఏ దేశానికి రాజు ?అతడి బలం బలహీనత

తండ్రి మరణం తర్వాత భగదత్తుడు ప్రాగ్జ్యోతిష పురానికి రాజయ్యాడు .ఇది అస్సాం లోని గౌహతి ప్రాంతం లో ఉండేది .పాండు రాజుకు అత్యంత ఆత్మీయుడు .కాని జరాసంధుడికి భయపడి అతని కనుసన్నలలో మెలిగే వాడు .అర్జునుడు దిగ్విజయ యాత్ర చేసినపుడు భగదత్తుడు పార్దునితో ఎనిమిది రోజులు భీకర యుద్ధం చేసిన పరాక్రమ శాలి .క్రీడిని గెలవలేక ‘’నేను ఇంద్ర సఖుడిని .నువ్వు ఇంద్ర కుమారుడివి .మనలో మనకు పోరాటం ఎందుకు ?’’అని సంధి చేసుకొని ,కోరినంత ధనం ఇచ్చి పంపించేశాడు .దీని వివరాలు తర్వాత తెలుసుకొందాం .

నరక , భగదత్తుల శక్తి సామర్ధ్యాలకు నేపధ్యం ఏమిటి ?

కురు క్షేత్ర యుద్ధం లో భగదత్తుడు దుర్యోధనుడి పక్షాన నిలబడి యుద్ధం చేశాడు . తండ్రి నరకుడు తాను సంపాదించిన వైష్ణవాస్త్రం ను కొడుకు భగదత్తుడికి ఇచ్చి చనిపోయాడు భారత యుద్ధం లో ఈ వైష్ణవాస్త్రాన్ని భగదత్తుడు అర్జునునిపై ప్రయోగించాడు .వైష్ణవాస్త్రాన్ని అడ్డు కొనే శక్తి ఎవరికీ లేదు .ఇక తప్పక శ్రీ కృష్ణుడు దానికి అడ్డు నిలిచాడు .భగదత్తుడు తన అత్యంత వేగం, శక్తివంతమైన ‘’సుప్రతీకం ‘’అనే ఏనుగు నుతండ్రినుండి పొంది దాని   నెక్కి పాండవ  సైన్యాన్ని చీల్చి చెండాడాడు.దేవేంద్రుని ఏనుగు ఐరావతం వంశానికి చెందినదే ఈ సుప్రతీకం .ఏనుగుపై కూర్చుని యుద్ధం చేయటం దిట్ట భగదత్తుడు .అర్జునుడు చివరికి సుప్ర తీకం తో సహా భగదత్తుని తీవ్ర బాణాలతో సంహరించాడు . కృష్ణుడే అడ్డపడక పొతే పార్ధుడి పని అయిపోయినట్లే అని తెలుస్తోంది .ఈవివరాలూ తర్వాత చూద్దాం .

నరక జననం  శక్తి సంపాదన

ఒక సారి చరిత్ర పుటల్ని తిరగేస్తే –హిరణ్యాక్ష, హిరణ్య కసిపులు అన్నదమ్ములు .హిరణ్యాక్షుడు భూమిని చుట్టి సముద్ర గర్భం లో దాచిపెట్టాడు .భూ దేవి మొరవిని శ్రీ మహా విష్ణువు ఆది వరాహ రూపం దాల్చి సముద్ర గర్బం చొచ్చి తన కోరపై భూమిని లేపి పైకి తెచ్చాడు .అప్పుడు వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు .అతడే నరకాసురుడు .అసుర సంధ్యా సమయం లో తామిద్దరూ కలిసినందువలన పుట్టిన వీడికి అసుర అంటే రాక్షస లక్షణాలు వస్తాయని భూదేవికి శ్రీ హరి చెప్పాడు .తన బిడ్డ నరకాసురుడిని ఎప్పటికైనా విష్ణు మూర్తి సంహరించటం ఖాయం అని అర్ధమైంది భూదేవికి .కనుక అనునయంగా హరిని తన బిడ్డకు రక్షణ కల్పించమని వేడు కొంటుంది .సరే అని అభయమిచ్చి ఏనాటికైనా నరకునికి తల్లి చేతిలోనే మరణం సంభవిస్తుందని హెచ్చరించి ,భూదేవికి అతి భయంకరమైన’’ వైష్ణవాస్త్రం ‘’ప్రసాదించి  వెళ్ళిపోయాడు .తన ప్రియ పుత్రుడిపై ప్రేమతో, ఆ అస్త్రాన్ని నరకాసురుడికి ఆమె ఇచ్చేసింది  .

భగదత్తుని చేరిన వైష్ణవాస్త్రం –దాని ప్రభావం

కాలక్రమంలో వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడు తనకుమారుడు భగదత్తుడికి ఇచ్చి వేశాడు .ఇది అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం .దీన్ని ప్రయోగిస్తే దేవేంద్రుడు కూడా తప్పించుకోలేడు.దీన్ని నిర్వీర్యం చేసే సామర్ధ్యం విష్ణువుకు  మాత్రమే ఉంది .సాధారణం గా ఏ అస్త్రాన్ని అయినా శత్రువు వైపుకు గురి చూసి సంధించాలి .కాని వైష్ణవాస్త్రాన్ని మాత్రం శత్రువు వైపు కాకుండా రాకెట్ లాగా పైకి సంధించాలి .అప్పుడది ఆకాశం లోకి అత్యంత వేగం తో చేరి, అక్కడి నుంచి  ఇంకా వేగాన్ని పుంజుకొని రాకెట్ లాగా టార్గెట్ అయిన  శత్రువు వైపుకు దూసుకు వచ్చి సంహరిస్తుంది . .దీన్ని ఆధారం గానే ఇప్పుడు ‘’ఇంటర్ కాంటి నెంటల్ బాలిస్టిక్ మిసైల్ ‘’తయారుచేశారు .రామాయణ ,మహాభారతాలలో ఉపయోగించిన అన్ని అస్త్రాలకంటే  వైష్ణవాస్త్రం సర్వ శక్తి వంతమైంది అని విష్ణుపురాణం పేర్కొన్నది .మహా భారత కాలం లో ఈ అస్త్ర రహస్యం శ్రీ కృష్ణునికి  ,నరకాసురునికి ,భగదత్తునికి,శ్రీకృష్ణ రుక్మిణులకుమారుడు ప్రద్యుమ్నుడు ,పరశురాములకు మాత్రమే తెలుసు .రామాయణకాలం లో శ్రీరాముడికి ,రావణ కుమారుడు ఇంద్ర జిత్తులకు మాత్రమే తెలుసు .

శ్రీ క్రష్ణార్జునులపై   భగదత్తు ని ప్రతీకారేచ్ఛ

కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు తమ తండ్రి పాండురాజు నరకం లో ఉన్నాడని తెలిసి దానినుండి విముక్తిచెంది౦చి స్వర్గ లోక ప్రాప్తికోసం నారదమహర్షి సలహాపై  రాజ సూయయాగం చేశాడు .భీమార్జున నకుల సహదేవులు నలు దిక్కులకు వెళ్లి రాజ్యాలను జయించి  దిగ్విజయ యాత్ర పూర్తి  చేస్తారు .అర్జునుడు ప్రాగ్జ్యోతిష పురం పై యుద్ధ యాత్ర చేసి ,దాని ఏలిక భగదత్తుని తో  యుద్ధం చేశాడు .విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది .చివరికి ఇంద్రుడే వచ్చి కలగ జేసుకొని పార్ధ భగదత్తుల మధ్య రాజీ కుదిర్చాడు .భగదత్తుడు కప్పం చెల్లించి సామతరాజుగా ఉండటానికి అంగీకరించాడు .బంధు మిత్రులతో సహా ధర్మ రాజు చేసే రాజసూయ యాగానికి అతిధిగా కూడా వెళ్ళాడు .

భగదత్తుని భగభగ యుద్ధం

ఇంద్రుడికి స్నేహితుడే అయినా భగదత్తుడు తన తండ్రి నరకాసుర వధకు కారణం కృష్ణుడే అని శ్రీ కృష్ణునిపై పగబట్టి ,కురుపాండవ యుద్ధం లో కౌరవ పక్షాన యుద్ధం చేశాడు .మొదట భీష్ముడి నాయకత్వం లో, తర్వాత ద్రోణుని నాయకత్వం లో యుద్ధం చేశాడు .12 వ రోజు యుద్ధం లో భగదత్తుడు భగభగమండే మధ్యాహ్న మార్తాండ పరాక్రమం తో పాండవ సైన్యాన్ని హడలెత్తించాడు .  ఎలాగైనా యుద్ధ ఫలితం తమకు దక్కాల్సిందే , ధర్మ రాజును బంధించి తనకు అప్పగించాల్సిందే నని  ద్రోణుడిపై దుర్యోధనుడు ఒత్తిడి పెంచుతాడు .సరేనని సుశర్మను ఎరగా వేసి, అర్జునుడినిధర్మ రాజు నుంచి దూరంగా తీసుకు వెళ్ళే ఉపాయం చేస్తాడు .ధర్మ రాజు ఒంటరిగా యుద్ధం లో ఉన్నాడు .ఇంతలో పాంచాల వీరుడు సత్ర జిత్తు ధర్మరాజుకు అండగా రధాన్ని మళ్ళించి  ద్రోణుడిని ఎదుర్కొ౦టాడు ,ఒక అర్ధ చంద్రాకార బాణం తో ద్రోణుడు సత్ర జిత్తు తల నరికేస్తాడు .వెంటనే విరాట మహారాజు తమ్ముడు సూర్యదత్తుడు వచ్చి ద్రోణుడిదతో యుద్ధం చేశాడు .ఇతడినికూడా ద్రోణుడు ఖండిస్తాడు .విషయం గ్రహించిన భీముడు కాలయవనుడిలా ద్రోణుడిపై పడ్డాడు .భీముడు ఉంటే, ధర్మరాజును బంధించటం అసాధ్యమని గ్రహించి దుర్యోధనుడు భీముడిపై భగ దత్తుని ఉసిగొల్పుతాడు .అతడు వెయ్యేనుగుల బలమున్న సుప్రతీక ఏనుగుపై వచ్చి భీముడిని ఎదుర్కున్నాడు .దాని ఘీ౦కారానికి భూ, నభో ,అంతరాళాలు గజగజలాడి  ఒణికిపోయాయి.వెయ్యేనుగుల బలపరాక్రమవంతుడైన భీముడు సుప్రతీకంపై విరుచుకు పడ్డాడు .కాని దాని ముందు నిలవ లేక పోయాడు .తొండం తో భీమరధాన్ని పైకెత్తి విసిరేసింది .రధం నుండి కిందపడిన భీముడు చనిపోయాడనిపాండవ సైన్యం భావించి ,హాహాకారాలు చేస్తూ పారిపోసాగారు .

వైష్ణవాస్త్రానికి అడ్డుపడిన శ్రీ కృష్ణుడు

అపాయం అర్ధం చేసుకొన్న శ్రీకృష్ణుడు అర్జునుని తో ధర్మ రాజుకు తాము సాయంగా వెళ్లాలని చెప్పి అటువైపు రధం మళ్ళించాడు .రావటం తోనే అర్జునుడు భగదత్తుని ఏనుగు సుప్రతీకం పై విరుచుకు పడి వాడితో ఘోరసంగ్రామం చేశాడు .ఒకరికొకరు తీసిపోవటం లేదు .భగదత్తుడు కిరీటిపై శక్తి ఆయుధం సంధించాడు .నానా తంటాలుపడి తప్పించుకొన్నాడుకాని కిరీటం నేలపడింది .భగదత్తుడు పార్దునితో శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తూనే ,నిరాయుధుడైన శ్రీ  కృష్ణుని శర సంధానం చేసి తీవ్రంగా గాయపరుస్తూ తన పగతీర్చుకొంటున్నాడు .తన ప్రాణ సఖుడు, బావ సాక్షాత్తు పరమేశ్వరస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మను బాణాలతో వాడు గాయ పరుస్తుంటే కట్టలు తెంచుకున్న కోపం తో భగదత్తుని శర్వ శక్తులను పణంగా  పెట్టి బాణాలతో చీల్చి చెండాడాడు.ఇక లాభం లేదని భగదత్తుడు చావో రేవో తేల్చుకోవాలని  కిరీటిపై  తన తండ్రి ఇచ్చిన వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు .దిక్కులు దద్దరిల్లి ముల్లోకాలు కంపించాయి .ఇరుపక్షాల సైన్యం  ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తున్నారు .అది అర్జునుని వైపు మరణ వేగంతో దూసుకోస్తోంది .అర్జునుడు బె౦బేలెత్తి అసహాయుడై దిక్కు తోచక నిలబడిపోయాడు . అర్జునుని  చావు ఖాయం అని అందరూ అనుకొంటున్నారు .దుర్యోధనుడు ఆనందం తో ఉబ్బి తబ్బబ్బవు తున్నాడు. పాండవ సైన్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోతున్నారు .ఒకటి రెండు సెకన్లలో అర్జునుని తాకి చంపేస్తుంది  అనే సమయం లో శ్రీకృష్ణుడు చటుక్కున లేచి వైష్ణవాస్త్రాన్ని తనపైకి తీసుకున్నాడు .వైష్ణవ స్వరూపుడైన శ్రీ కృష్ణుని శరీరం తాకగానే వైష్ణవాస్త్రం పూలమాలగా మారి ఆయన మెడలోపడి అల౦కార మైంది.ఈ అనూహ్య సుందర దృశ్యాన్ని తిలకించిన దేవతలు పులకితులై శ్రీ కృష్ణునిపై పుష్ప వర్షం కురిపించి తమ హర్షం  వ్యక్తం చేసుకొన్నారు .ఇలా విష్ణువు తాను ఇచ్చిన అస్త్రాన్ని తనలోనే కలుపుకొని చరిత్ర సృష్టించాడు .

భగ దత్తుని మరణ రహస్యం

తాను ఊహించని ఈ పరిణామానికి భగదత్తుడు పౌరుషాసూయ ద్వేషాలు ముప్పిరిగొనగా అర్జునునిపై తీవ్రబాణాలు వేశాడు .అర్జునుడు రెట్టించిన పౌరుష పరాక్రమాలతో  భగదత్తుని ఎదుర్కొని, ఒక బాణం తో అతని ఏనుగు సుప్రతీకం శిరస్సుపై ప్రయోగించగా, అది దాని శిరస్సును రెండు ముక్కలు చేసేసింది .సగం బలం క్షీణి౦చిందివాడికి .అయినా శక్తికొద్దీ పోరాడుతూనే ఉన్నాదు .శ్రీ కృష్ణుడు అర్జునుడితో ‘’అర్జునా !వాడిని ఓడించటం ఆషామాషీ కాదు .ముసలివాడైన భగదత్తుని కనుబొమల పై ఉన్న వెంట్రుకలు గడ్డం కనుబొమలపై మెరిసిందా అన్నట్లు చాలా పెద్దాగా ఉంటాయి .నుదుటిపై వాటిని ఒక గుడ్డతో కట్టి జాగ్రత్త పడతాడు .నువ్వు బాణం తో ఆ గుడ్డను చీల్చేస్తే  క్షణకాలం లో ఆ వెంట్రుకలు వాడి కళ్ళను కప్పేస్తాయి .ఆ కొద్ది సమయం లో నువ్వు ఎలాగైనా భగదత్తుని చంపి తీరాలి.లేకపోతే ఇక ఇంతే సంగతులు ‘’అని కిటుకు చెప్పాడు .కిటుకు తెలిసిన క్రీడి  వాడిబాణం తో వాడి నుదుటిమీద గుడ్డను చీల్చేస్తాడు .వెంటనే అతని పొడవైన కను వెంట్రుకలు కళ్ళను కప్పేసి అతినికి ఏమీ కనపడకుండా చేశాయి .ఇదే చాన్స్ అనుకోని  శక్తివంతమైన బాణాలతో పార్ధుడు భగదత్తుని సంహరించి వాడి శకానికి సమాప్తి పలుకుతాడు .శ్రీ కృష్ణుని దయ, ఉపాయాల వలన భగదత్తుని బారినుండి ప్రాణాలతో బయటపడి వాడినే చంపేశాడు  బావను నొప్పించినదానికి ప్రతీకారం తీర్చుకున్నాడు  .ఇంతటి మహాభారత పోరాట యోధుడి గురించి మనకు అతి తక్కువగా మాత్రమే తెలుసు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-18 –ఉయ్యూరు

 

 

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.