విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్
పారిస్ లో 8-5-1874 జన్మించిన ఇనేస్సా ఆర్మాండ్ ఫ్రెంచ్ –రష్యన్ కమ్యూనిస్ట్ మహిళ.స్త్రీవాది .బోల్షెవిక్ పార్టీ సభ్యురాలు .ఎక్కువకాలం రష్యాలోనే గడిపింది .తల్లి నతాల్లె వైల్డ్ కమెడియన్ .తండ్రి ధియోడర్ పీచ్ డీ హీర్బాన్ విల్ ఫ్రెంచ్ ఒపేరా గాయకుడు .ఇనేస్సా అయిదేళ్ళ వయసులో త౦డ్రి చనిపోతే మాస్కోలోటీచర్ అయిన అమ్మమ్మ వద్ద పెరిగింది .19 వ ఏట సంపన్నుడైన అలెక్జాండ్రా ఆర్మాండ్ తో వివాహం జరిగింది .నలుగురు సంతానం కలిగారు .భార్యాభర్తలు మాస్కో కు బయట రైతు పిల్లలకోసం ఒక స్కూల్ పెట్టి నడిపారు .నగరం లోని విధి వంచితులకోసం ఏర్పాటైన చారిటబుల్ ట్రస్ట్ లో కూడా చేరి సేవలందించింది.
1902 లో భర్తకు దూరమై ,తన వామభావాలకు దగ్గరగాఉన్న వ్లాడిమిర్ ని పెళ్ళాడింది .వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు .1903 లో చట్ట వ్యతిరేకమైన ‘’రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ’’లో చేరింది.ప్రాపగా౦డా పేపర్లు పంచుతూ1907 జూన్ లో అరెస్ట్ అయి రెండేళ్ళు ఉత్తర రష్యాలోని మేజెం లో ప్రవాస జీవితం అనుభవించింది. 1908 లో అందరికళ్ళు కప్పి తప్పించుకొని రష్యావదిలి పారిస్ చేరింది .అక్కడ వ్లాడిమిర్ లెనిన్ మొదలైన బోల్షెవిక్ లతో పరిచయం ఏర్పడింది .1911 లో కమిటీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ లో సెక్రెటరి అయి ,పశ్చిమ యూరప్ లోని బోల్షెవిక్ లందరి మధ్య సయోధ్య కూర్చే పనిలో నిమగ్నమైంది .నాలుగేళ్ల తర్వాత 1912 జులై లో మళ్ళీ రష్యా చేరింది .చాలా సంక్లిష్ట పరిస్థితులలో ఆమె ప్రేగ్ సమావేశ తీర్మానాన్ని ఆమోదించే బాధ్యత తీసుకున్నది .బోల్షెవిక్ పార్టీ నిర్మాణం ,ప్రచారం ,ప్రావ్డాలో జరిగే పరిణామాలు గమనిస్తూ’’ డ్యూమా’’ కు సభ్యుల ఎన్నిక బాధ్యత చేబట్టింది .రష్యాకు ఆమె రాక వలన ఆమెకు ఇబ్బంది కలుగుతుందని ,అరెస్ట్ కావటం తధ్యమనీ లెనిన్ భావించి ,ఆమె పనిని ఆమె చేయటానికి అడ్డు చెప్పలేదు .అనుకున్నట్లే ఆమెను రెండు నెలల తర్వాత అరెస్ట్ చేసి 1913 మార్చి లో బెయిల్ మీద విడుదల చేశారు .మళ్ళీ చట్ట వ్యతిరేకంగా రష్యావదిలి లెనిన్ తో, నేడేజా కృపావిస్కి తో ఉండటానికి గెలీషియాకు వెళ్ళింది .వెళ్ళిన వెంటనే పార్టీ కార్యక్రమాలలో పూర్తిగా మునిగిపోయింది. లెనిన్ కు ఆమెపై అపారమైన నమ్మకం ఉండేది .ఆమె సామర్ధ్యంపై విశ్వాసముండేది.పార్టీ వింగ్ ఒఖానా కు అర్మడా లెనిన్ కు సరైన ఆసరా ,కుడి భుజంగా ఉంటె బాగుండుననిపించింది .బోల్షెవిక్ లందర్నీ సరైన దారిలోపెట్టటానికి ఆమెకు మించిన సమర్ధులు లేరని అందరూ అంగీకరించారు.లెనిన్ కూడా సాహసం చేయని అత్యంత క్లిష్ట సాహసోపేత మైన కార్యక్రమాలు చేసి తన సమర్ధత చాటుకొన్నది .
యూరప్ లోని సోషలిస్ట్ లు మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొనటానికి వెనకాడుతున్న విషయం ఆర్మాండ్ కు తెలిసి కలత చెందింది .లెనిన్ తో కలిసి ప్రచార కరపత్రాలపంపిణీ చేస్తూ,మిత్రరాజ్య సైన్యాలను తమ ఆఫీసర్లపై తుపాకులు గురిపెట్టమని, సోషలిస్ట్ విప్లవానికి సహాయ పడమని ప్రోత్సహించింది , 1914 జులై లో బ్రస్సెల్స్ లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ బ్యూరో సమావేశానికి లెనిన్ ఆర్మాండ్ ను బోల్షెవిక్ ప్రతినిధిగా పంపాడు .అక్కడ ఆమె మహామహులైన కాట్స్కి,వాన్డర్ వీల్డ్ ,హూస్మన్ ,లక్సం బర్గ్ ,ట్రాస్కి,ప్లెఖనోవ్ ,మార్టోవ్ వంటి దిగ్గజాల తో సంప్రదించటానికి ఆయాభాషలలో అసమాన ప్రతిభ ఉన్న ఆమె సమర్ధవంతంగా తన పని ముగించింది . లెనిన్ భావజాలాన్ని అకు౦ఠిత దీక్షను ,పోరాట పటిమను, సాహసాన్ని వాళ్లకు కళ్ళకు కట్టించింది .ఆమె నిర్వహించిన పాత్రను లెనిన్ బహుధా ప్రశంసిస్తూ ఆమెపై తనకున్న నమ్మకాన్ని లేఖలో తెలియ జేశాడు .
1915 మార్చి లో స్విట్జర్ లాండ్ వెళ్లి ,యుద్ధ వ్యతిరేక అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సమావేశాన్ని నిర్వహించింది .1917 మార్చి 2 న జార్ చక్రవర్తి రెండవ నిఖలాస్ సింహాసనాన్ని పరిత్యజించి ,ప్రా౦తీయ ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగిస్తే, అది రష్యన్ రిపబ్లిక్ ను ప్రకటించింది .ప్రవాసం లో ఉన్న బోల్షెవిక్ లు రష్యా చేరి పునర్నిర్మిద్దామనుకొంటే తీవ్ర నిరాశ ఎదురైంది .జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం బోల్షెవిక్ లు రష్యా వస్తే తూర్పుభాగపు యుద్ధం అంతమౌతుందని ఆశించారు .అందుకోసం ఆర్మెండా , లెనిన్ మరో 26 మంది విప్లవ వీరుల కోసం ప్రత్త్యేక రైలును ఏర్పాటు చేసి పెట్రోగ్రాడ్ కు ఆహ్వానించారు .అక్టోబర్ విప్లవం పూర్తి అయి రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ లెనిన్ నాయకత్వం లో అధికారం లోకి వచ్చింది .
అక్టోబర్ విప్లవానంతరం ఆర్మండ్ మాస్కో ఎకనమిక్ కౌన్సిల్ అధ్యక్షురాలైనది .మాస్కో సోవియెట్ కు ఎక్సిక్యూటివ్ మెంబర్ అయింది .అయినా ఆమె సోవియట్ ప్రభుత్వ ధోరణిని విమర్శించి ,ట్రీటీ ఆఫ్ బ్రెస్ట్ –లిటోవ్ స్క్ పై ప్రభుత్వం సంతకం చేయటాన్ని నిరసించింది .పెట్రోగ్రాడ్ కు రాగానే కమ్యూనిస్ట్ పార్టీలో ,ట్రేడ్ యూనియన్ లలో మహిళా సమానత్వ హక్కులకోసం కృషి చేస్తున్న ‘’జేనోడేల్’’సంస్థకు డైరెక్టర్ అయింది.ఈ సంస్థకు శాసన చట్టాలు చేసే హక్కు కూడా ఉండేది .అనేక సంస్కరణలు అమలు చేసి ఆర్మాండ్ ఆడవారికి విడాకులు పొందేహక్కు ,గర్భస్రావ హక్కు , ప్రభుత్వ వ్యవహారలలో భాగం ,మాస్ కాంటీన్ లు, మదర్ సెంటర్ లు ఏర్పరచటానికి విశేష కృషి చేసింది .1918 లో స్వెర్ డ్లోవ్ సహాయం తో ‘’నేషనల్ కాంగ్రెస్ ఫర్ వర్కింగ్ ఉమెన్ ‘’సభ ఏర్పాటు చేసి లెనిన్ తో ముఖ్య ప్రసంగం చేయించింది.’’రెడ్ ఆర్మీ’’ లో స్త్రీలు చేరటానికి గొప్ప అవకాశాలు కల్పించింది . 1920 లో జరిగిన’’ మొదటి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ మహిళా సమావేశం ‘’కు ఆర్మాండ్ అధ్యక్షత వహించి మహిళా విచక్షత ఇకపై చెల్లదని ,పురుషులతో సమాన హక్కు బాధ్యతా,పదవులు మహిళలకు దక్కాలని అద్భుత ప్రసంగం చేసింది .లెనిన్, ఇనేస్సా అర్మాండ్ ల మధ్య ప్రణయం, ఒకరిపై మరొకరికి గొప్ప ఆరాధనాభావం ఉండేవి .
ఇప్పటికే అనేక బాధ్యతలు కర్తవ్యాలతో అలసిపోయిందని భావించి లెనిన్ ఆమెను కొద్దికాలం విశ్రాంతికోసం ‘’కకాకస్ ‘’వెళ్ళమని హితవు చెప్పాడు .అక్కడ అంటు వ్యాధులు ప్రబలంగా ఉన్న సంగతి లెనిన్ కు తెలియదు .అక్కడకు చేరిన ఆమెకు, అనుచరులకు అంటు వ్యాధి కలరా సోకటం చేత వారికి సెప్టెంబర్ ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు .ఆమె సెప్టెంబర్ 21 న ‘’నాల్చిక్ ఎక్సి క్యూటివ్ కమిటీ ‘’నికలిసి తమకు ఆశ్రయం కలిగించమని కోరటానికి సాహసించింది .కాని దురదృష్ట వశాత్తు అర్మాండ్ సెప్టెంబర్ 24 ఉదయమే 46 ఏళ్ళ వయసులోనే మరణించింది .ఆమెను మాస్కో లోని క్రెమ్లిన్ వాల్ నేక్రోపోలిస్ లో ప్రభుత్వ లాంచనాలతో ,అంతకు పూర్వం ఏ మహిళకూ జరగని అరుదైన ఘనమైన గౌరవంతో ఖననం చేశారు .వేలాది మంది అంతర్జాతీయ గీతాలాపన చేస్తూండగా ఈ కార్యక్రమం నిర్వహించారు . రెడ్ స్క్వేర్ లోనూ ఖననం చేసి గౌరవించారు .రెడ్ స్క్వేర్ లో ఖననం చేయబడిన మొట్టమొదటి మహిళ ఆర్మాండ్ .
ఇన్ని విశిష్ట సేవలు రష్యన్ జాతికీ మహిళలకూ చేసిన ఆర్మ౦డ్ ను రష్యా ప్రజలు 1930 కే మర్చిపోయారు .1930 లోనే ఆమె అధ్యక్షత వహించిన ‘’జేనోటేడిల్’’ సంస్థను రద్దు చేశారు .లెనిన్ ఇన్ పారిస్(1981 ) సినిమాలో ఆమె పాత్రను క్లాడ్ జేడ్ పోషించింది .లెనిన్ ది ట్రెయిన్ ,ఆల్ మై లెనిన్స్ సినిమాలలో కూడా ఆమె మనకు కనిపిస్తుంది .లెనిన్స్ రష్యన్ రిటర్న్స్, సెవెన్ డేస్ టు పెట్రోగ్రాడ్ అనే ఫిక్షన్ ల లో ఆర్మాండ్ హీరోయిన్ .
ఇలా రష్యా విప్లవ వీరవనిత ఇనేస్సా ఆర్మాండ్ రష్యాలోనే విస్మృత నాయకురాలవటానికి అక్కడి అనేక రాజకీయ మార్పులే ముఖ్య కారణం అనిపిస్తుంది .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
