కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16
1–శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -2
శ్రీ వెంకట రామ శాస్త్రి శాస్త్రి గారి భార్య అనసూయగారు ‘’మా అమ్మాయిని ఆదర్శంగా అగ్రహారం లో ఆహి తాగ్ని భార్యగా పెంచాను ‘’.అది బాగా పని చేసింది .మావారు మా ఇద్దరబ్బాయిలకు వేదం నేర్పాలని ప్రయత్నించారు .అది ఫలించలేదు ‘’అన్నారామె .బాబళ్ళ శాస్త్రిగారు చాలా అంకిత భావం తో సోమయాగం చేశారు .ఆయన కుటుంబం లో,ఆయన తరం లోనే ఆరుగురు ఆహితాగ్నులు ఉండటం అరుదైన విశేషం.అయితే అనారోగ్యపు కొడుకు ,పిల్లలు లేని మనవడు ఆయనను బాధించాయి .ఇది ఇలా ఉంటే లంకా వారి కుటుంబం లో వేదాధ్యయనం బాగానే కొనసాగి ,ఎనిమిది మంది సంతానం లో ఏడుగురు పుత్రులు ఆయన మధ్య వయస్సులోనే లౌకిక వృత్తిలో రాణించారు .
‘’నేను కన్న అద్భుత కల నెరవేర్చుకున్నాను .నా నలుగురు కొడుకులు నాలుగు వేదాలలో దిట్టలు .ముగ్గురు శాస్త్రాల లోతులు తరచారు కాని దీనివల్ల లభించింది పూజ్యమే ‘’.అని నిర్వేదంగా అన్నారు లంకావారు .’’మా పెద్దబ్బాయిలిద్దరికీ ముందు వేదం నేర్పాను .కాని వాళ్ళు గొణుగుతూ సణుగుతూనే ఉన్నారు .రూపాయలు రాలటం లేదని నెల జీతాలు లేవనీ .అప్పుడు వాళ్ళతో వేదం ,వ్యవసాయం జమిలిగా చేసుకోండి అన్నాను .దీనికి తోడూ బంధువుల ఒత్తిడీ పెరిగింది .వేదం నేర్పి వాళ్ళను ఇంట్లో బందీలుగా ఎందుకు ఉంచుతున్నావని ప్రశ్నించారు .వాళ్ల మానాన వాళ్ళను స్వేచ్చగా వదిలెయ్యి ఏది కావాలంటే అదే నేర్చుకొంటారు .వాళ్ళు బుద్ధిమంతులేకదా.అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు .దీనిపై నిర్ణయం తీసుకోవటం నాకు కష్ట మైన విషయం .బాగా ఆలోచించి నిశ్చయానికి వచ్చాను .పెద్దాడిని సంప్రదాయ పధ్ధతి ఉన్న బ్రాహ్మణ కుటుంబం వారింట్లో ఉండటానికి కాకినాడ కు పంపాను .మా అమ్మగారు వాడికి వంట చేసిపెట్టేది . వాడు అక్కడ హైస్కూల్ చదువు పూర్తీ చేసి ,హైదరాబాద్ వెళ్లి డిగ్రీ అందుకొన్నాడు . కొడుకులకంటే మనవళ్ళు సంప్రదాయానికి ఇంకా దూరమయ్యారు.అయితే కొడుకులు ,మనవళ్ళు ఇక్కడికే వచ్చి ఉపనయనాలు చేసుకొని సంధ్యావందనం నేర్చుకొన్నారు .సంప్రదాయం వదిలినా వారి వారి వృత్తులలో వాళ్ళు బాగా రాణించారు అదే మాకు సంతోషం సంతృప్తి .స్వయంగా ఎదిగి స్వంతకాళ్ళపై నిలిచి వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు’’ ’’అని తమ కుటుంబ విషయాలన్నీ తెలిపారు..శాస్త్రిగారి చివరి అబ్బాయి శ్రీ లంకా భద్రాద్రి శ్రీరాం అదేనండీ -ఎల్. బి .శ్రీరాం మంచి రచయిత,నాటకనటుడు సినిమాలో ప్రముఖ హాస్యనటుడు.
శ్రీ నేదునూరి శ్రీరామమూర్తిగారు ఉదార హృదయంతో కొత్త అగ్రహారం లో ఇంటినీ ,అర ఎకరం పొలాన్నీ 1960 మార్చి 4 న ఏర్పాటు చేశారు .అదే కామేశ్వరీ అగ్రహారం శ్రీరామమూర్తిగారి మాతృమూర్తి పేరిట ఏర్పాటు చేశారు ..నేదునూరుకు చాలాదగ్గరలోనే ఉంది.ఈ ప్రశాంత నూతన అగ్రహారం లోవీరుకాక మరో నాలుగు బ్రాహ్మణ కుటుంబాలున్నాయి .కొబ్బరి ,మామిడి తోటలమధ్య, పచ్చటి పంటపొలాలమధ్య ఈ అగ్రహారం ఉంటుంది .’’ఆ నలుగురు ‘’ వేద పండితులుకారు కాని బాబళ్ళ శాస్త్రిగారి ప్రియ శిష్యుడు రమణ చిర్రావూరి కుటుంబీకుడు .తర్వాత శ్రీపాద వారి కుటుంబం ఇక్కడికి చేరింది .వీరికుమారుడు మాణిక్యం వేదం నేర్చాడు ,కనుక లంకా శాస్త్రిగారికి ఈ అగ్రహారం చాలా అనువైనదిగా వేదాధ్యనానికి వీలుగా ఉందని సంతృప్తిపడ్డారు .పిత్రార్జితం తోపాటు తనకున్న 7 ఎకరాలపోలం వ్యవసాయం పర్య వేక్షిస్తూ వేదం నేర్పించారు .తాము రచించిన గ్రంధాలను ,వేదం ,శ్రౌతాలపై రాసిన విషయాలను ముద్రించారు .వీలైనప్పుడురాజమండ్రి వేద సభలకు హాజరౌతూ ,ఈస్ట్ కోస్ట్ రైలు ఎక్కి కంచికి,శృంగేరి లకు వెళ్లి వేదార్ధ ప్రవచనాలలో పాల్గొనేవారు .
లంకావారు కామేశ్వరీ అగ్రహారం చేరాక ,నేదునూరు లో బ్రాహ్మణ కుటుంబాలు క్రమగా తగ్గిపోయి రెండు మూడు శాతానికి వచ్చింది .షెడ్యూల్డ్ కాస్ట్ ,బాక్ వర్డ్ క్లాస్ ,సెట్టిబలిజ ,కంసాలి ,దేవాంగ ,కుమ్మరి ,మంగలి ,చాకలి కుటుంబాల సంఖ్య పెరిగి వారి మెజార్టీ గణనీయంగా వృద్ధి చెందింది .వ్యవసాయ పనులకు వీరి ఆసరా తప్పదు .వీరందరికీ శాస్త్రిగారంటే తమ నేదునూరు వాసి అనే గొప్ప అభిమానమే నేదునూరులో ఏడాదికి రెండు సార్లు వేద సభలు జరుగుతాయి .ఒకటి లంకా శాస్త్రిగారిపేరుమీద ,రెండవది గ్రామం లోని శివాలయం లోని శివుని పేరిట .
ఆరోగ్యం మరీక్షీణి౦చి పోయేదాకా శాస్త్రిగారు తాము నిర్వహించిన శ్రౌతకార్యాల గురించి ఎంతో ఆసక్తిగా చెప్పేవారు .తమ నిత్య కర్మకాండల గురించి మాత్రం తక్కువగానే మాట్లాడేవారు .నేదునూరు లో ఒక వడ్రంగి ని కుదుర్చుకొని1957 లో నిర్వర్తించిన శ్రౌత కార్యాలకు కావలసిన పనిముట్లను స్వయం పర్యవేక్షణలో తనకు కావాల్సిన విధంగా తయారు చేయి౦చు కొన్నారు .అక్కడ ‘’ఆధానం ‘’మాత్రమే చేయాలనుకొన్నారు .అగ్ని స్టోమం చేస్తే ‘’దుర్బ్రా హ్మణుడు’’అనే మచ్చ మాసిపోతు౦దని అందరికీ చెప్పేవారు .సతీమణి అనసూయగారే ప్రోత్సహించి నిర్వహించేట్లు చేశారు .’’ఆమె కావాలనికోరింది. జరిగింది ‘’అని తాను నిమిత్తమాత్రుడిని అన్నట్లు చెప్పారు .అల్లుడు మిత్రనారాయణ ‘’సోమ యాగం లేని ఆధానం అర్ధ రహితం ,అసంపూర్ణం ‘’అని మామగారికి నచ్చ చెప్పాడు . మూడేళ్ళ విరామం తర్వాత శాస్త్రిగారు మళ్ళీ వడ్రంగిని పట్టుకొని, అగ్ని స్టోమానికి కావలసిన పరికరాలన్నీ దగ్గరుండి తయారు చేయి౦చుకొని సర్వ సమర్ధమై 1960 లో అగ్ని స్టోమం కామేశ్వరీ అగ్రహారం లో పోలాలమధ్య ఘనంగా నిర్వహించి అందరికి ఆనందం సంతృప్తి కలిగించారు .ఈ సమయం లో శాస్త్రిగారి అల్లుడు మిత్రనారాయణ’’సర్వతో ముఖం ‘’చేయటానికి దూరం వెళ్ళాడు .
ఒకసారి ఆ ప్రాంతం లో గంటకు 160మైళ్ళ అంటే 257 కిలోమీటర్లవేగం తో గాలులతో భీకరతుఫాను చుట్టుముట్టి శాస్త్రిగారి ఇల్లు కొడుకు ఇల్లు .చేతికి అంది వచ్చిన పంట అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి .ఆయన్ను ఓదార్చటానికి వచ్చినవారితో ‘’ఇలా జరగాల్సి ఉంది .జరిగిపోయింది .ఇబ్బందేమీ లేదు ‘’అన్నస్థిత ప్రజ్ఞులు శాస్త్రి గారు.’’ఆయనకు దేనితోనూ అ౦టీముట్టని అనుబంధమే ‘’అన్నారు దువ్వూరు యాజులుగారు .చివరి రోజుల్లో షుగర్ బాగాపెరిగి ఒక బొటన వ్రేలు తీసెయ్యాల్సి వచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తే పలకరించటానికి వచ్చినవారితో ‘’బొటన వ్రేలు తీసేశారా ?నిజ౦గానా? నాకే తెలీలేదు మీకెలా తెలిసింది ?’’అని ప్రశ్నించారు .ఆంద్ర లో శ్రీ కంచి పరమాచార్యులవారు మహా వైభవంగా చక్రవర్తి భోగంతో పార్టన చేసున్నారు .ఒక రోజు ఈచిన్న కామేశ్వరీ ఆగ్రహారానికి కనీసం సంప్రదాయానికి బద్ధంగా పల్లకీలోనైనా కాకుండా సామాన్యుని లాగా కారులో లంకా శాస్త్రి గారింటికి వచ్చి పరామర్శించారు .ఈ విషయం అక్కడా, అన్ని చోట్ల ఎంతో గోప్పవిషయంగా ప్రచారమై పోయింది .దీనిపై శాస్త్రిగారిని స్పందించమని దువ్వూరు యాజులుగారు ,ఒకరిద్దరు ప్రశ్నించారు
–దువ్వూరుయాజులు గారు –పరమాచార్యుల వారుఏమన్నారు ?
లంకావారు-ఏ మంటారు ?
యాజులు –స్వాములుఇక్కడికే ఈ ఇంటికే వచ్చారా ?
లంకా-అవును
ఇంకొకరు –ఏమన్నారాయన ?
లంకా-ఏమంటారు ?
మూడో ఆయన –పరమాచార్యులవారు మీ ఆరోగ్యం గురించి అడిగారా ?
లంకా-ఆ. .
మూడో ఆయన –సంస్కృతం లో మాట్లాడారా ?
లంకా –లేదు తెలుగు లోనే .
దువ్వూరి –వస్తున్నట్లు వారినుంచి ముందుగానే సందేశం ఏదైనా వచ్చిందా ?
లంకా-లేదు .
బహుశా కొడుకు ఎల్బి శ్రీరాం కు కూడా తండ్రి వారసత్వమే సంక్రమించి ,ఇలాంటి పొడి మాటలే ఇష్టంగా రాస్తాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-18- ఉయ్యూరు