గాంధీజీ 150 వ జయంతి  

గాంధీజీ 150 వ జయంతి

1-గాంధీజీ  –సత్యవాక్కు

సత్యం వద ,సత్యమేవ జయతే ,సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని ఋషి ప్రోక్తం .అన్నిటిలో సత్యమే శ్రేష్టమైన ధర్మం .దాన్ని అనుసరించినవారికీ ఈ లోకం లోనేకాదు పరలోకం లోనూ ఎదురులేదు .హరిశ్చంద్రుడు సత్య వాక్కు కోసం సర్వస్వాన్నీ తాత్కాలికంగా కోల్పోయినా అదే ఆయనకు అండగా నిలిచి సర్వం తిరిగి పొందటానికి తోడ్పడింది .సత్య హరిశ్చంద్ర నాటకం చిన్నతనం లో చూసిన గాంధీజీ సత్యానికి ఆకర్షితుడై ,సత్యానికి అంకితమై జీవించాడు .సత్య నిస్ట ఉన్నందునే హరిశ్చంద్రుడు చరిత్ర ప్రసిద్ధుడయ్యాడని గ్రహించాడు .ఎన్నికస్టాలెదురైనా సత్యమార్గం విడవను అని తీర్మానించుకొన్నాడు .శ్రావణుని పితృ భక్తికూడా  ఆయనపై గొప్పప్రభావం చూపింది . స్కూల్ లో ఉపాధ్యాయుడు కాపీ చేయమని ప్రోత్సహించినా తన అంతరాత్మకు విరుద్ధం కనుక చేయని ఆదర్శ జీవి .తండ్రి జేబులో డబ్బు కొట్టేసి తండ్రికి నిజం చెప్పి ఆయన మనసు గెలుచుకున్నాడు  .చేసినతప్పులు తెలుసుకొని ,తనపై తాను ప్రయోగాలు చేసుకొని సత్యమార్గాన్ని అనుసరించాడు .ఇలా చిన్నతన౦ లోనే సత్య విజయం సాధించాడు .ఆయన జీవితమే సత్య శోధన –యాన్ ఎక్స్ పెరిమేంట్ విత్ ట్రూత్  .సత్య వాక్కు మహత్తరమైనది .గోవు సత్యవాక్కును నిలబెట్టుకొన్నందుకు వ్యాఘ్రం మనసు మారి దాన్ని చంపకుండా వదిలేసిందన్నకథ మనకు తెలుసు .20 వ శతాబ్దం లో కూడా ఇలాంటి సత్యవాక్ పరిపాలకుడైనందుననే గాంధీజీ ప్రపంచ దృష్టి నాకర్షించాడు .సత్యం ,అహింస ఆయనకు రెండుకళ్ళు .అందుకే అతి సామాన్యుడు మాన్యుడై మహాత్ముడనిపించుకొన్నాడు  .’’గౌతమబుద్ధుడు ,జీసస్ ల తర్వాత అంతటి మహావ్యక్తి గాంధీ’’ అన్నాడు డా హూమ్స్ అనే అమెరికన్ మిషనరీ . ‘మహాత్మా గాంధి వంటి వ్యక్తి ఈ భూ ప్రపంచం మీద రక్తమాంసాల శరీరం తో మనుగడ సాగించాడంటే ము౦దుతరాలవారు నమ్మలేక పోవచ్చు ‘’అని కీర్తించాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ . సిద్ధాంతాలు అందరూ చెప్పవచ్చు కాని నిజ జీవితం లో వాటిని ఆచరి౦చి మార్గ దర్శనం చేసినవాడు మహాత్మా గాంధీ .   ఉదాత్త జీవిత లక్ష్య సాధనకు సాధనాలుకూడా పవిత్రంగా ఉండాలని బోధించాడు .వ్యక్తిత్వానికి విశ్వ ఖ్యాతి తెచ్చాడు .

లండన్ వెళ్లేముందు తల్లి కిచ్చిన వాగ్దానాలను  ఎట్టి పరిస్థితి లోనూ మరచిపోకుండా అమలు చేసి సత్య సంధుడనిపించాడు .లండన్ లో తాను పేయింగ్ గెస్ట్ గా ఒక స్త్రే ఇంట్లో ఉండగా ,ఆమె కూతురు  తనపై ప్రేమలో పడగా ఇంటి యజమానురాలికి తనకు పెళ్లి అయిందని తనకిచ్చిన ఆతిధ్యానికి ధన్యవాదాలని నిజం తెలియజేస్తూ ఉత్తరం రాశాడు . గాంధీ సత్యసంధతకు  ఆమె ఎంతో అభినందించి౦ది . ఆయన  అసత్యం చెప్పిఉంటె జీవితమంతా బాధపడాల్సి వచ్చేదని ,సత్యం తెలియజేయటం వలన అత్యంత గౌరవనీయుడు అయ్యాడని మెచ్చుకొన్నది . బారిస్టర్ పాసై వకీలుగా ఉన్నా సత్యాన్ని విడవలేదు .ఏ వృత్తిలో ఉన్నా సత్య ధర్మాలు ఆచరిస్తే సాఫల్యత అధికం అని నిరూపించిన మహానుభావుడు బాపు .‘’  సత్య శోధన తప్ప నాకు దేనిపైనా ఆసక్తిలేదు .ప్రపంచం లో సత్యం తప్ప వేరేదీ లేదనే నమ్మకం నాకు రోజు రోజుకూ పెరుగుతోంది .సత్య సాధన పరికరాలు యెంత కఠినమైనవో,అంత సరళమైనవికూడా .సత్య శోధకుడు అందరూ తేలికగా తీసుకొనే ధూళి కణాన్నికూడా సూక్ష్మంగా చూస్తాడు ‘’అన్నాడు గాంధి .సహజంగా అబద్ధం,  అతిశయోక్తులు సత్యాన్ని మరుగు పరుస్తాయి .మితభాషణం ఈ లోపాన్ని తీరుస్తుంది .సత్యాన్ని ఆచరిస్తే న్యాయం దానంతట అదే మనల్ని అనుసరిస్తుందని  గాంధీ నమ్మకం.సత్యం వజ్రం కాగా కఠోరం .కుసుమం లాగా బహు కోమలం కూడా  అన్నాడు .సత్యం, ఉదారత ,సహిష్ణత ఉన్న చోట భేదాలు కూడా లాభాదాయకాలే అవుతాయన్నాడు ,సత్యాన్ని పాటిస్తే క్రోధం ,స్వార్ధం ద్వేషం సహజంగా తగ్గిపోతాయి .  ఇవి తగ్గకపోతే సత్యం గోచరించదు .సత్య నిస్ట ఉన్నవాడు తన భావాలలో లోపముందేమో అని ఆత్మపరిశీలన చేసుకోవాలి ,దానిఫలితాలు అనుభవించాలి .ప్రాయశ్చిత్తానికి సిద్ధపడాలి అన్నాడు .వ్యతిరేకించేవారి అభిప్రాయం తెలుసుకొని ,వారిని అనుకూలంగా మార్చుకోవటం సత్య నిస్టి ధర్మం

. సత్యం అనేమాట సత్ అనేదాతువు నుంచి వచ్చింది .అంటే ఉండటం అని అర్ధం .అంటే  జగత్తులో సత్యం తప్ప ఇంకేదీ లేదు అని భావం .అందుకే భగవంతుడు సత్య స్వరూపుడు .సత్యమే దైవం అని చెప్పాడు గాంధీ .కనుక ఆయన ఫిలాసఫీ సత్యం .సత్యం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది .దానినే చిత్ అంటారు జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది  .సత్యం అనంతమైతే ఆనందమూ అనంతమే .కనుక భగవంతుడు సత్, చిత్ ,ఆనంద మూర్తి . సత్యారాధానమే మన జీవిత ధ్యేయం .కనుక సత్యమే మన ఊపిరి కావాలి .సత్యమార్గం లో నడిస్తే ,ఉదాత్త జీవితం దానంతటికదే అలవడుతుంది .సత్యం లేని ఏ నియమమూ పని చేయదు .సత్యం మనసా వాచా కర్మణా ఉండాలి .ఇది తెలిసినవాడికి అన్నీ తెలుస్తాయి .సత్య శోదనే భక్తీ .అదే పరమాత్మను చేరేసాధనం .సత్యం లో పిరికితనం ఓటమి ఉండనే ఉండవు .ఇలా సత్యమార్గాన్ని అనుసరించి మార్గదర్శు లైనవారు సత్య హరిశ్చంద్రుడు ,ప్రహ్లాదుడు ,శ్రీరాముడు,ఇమాం హుస్సేన్ ,క్రిస్టియన్ మతప్రవక్తలు మొదలైనవారు అన్నాడు మహాత్ముడు .చేసే ప్రతిపనిలో సత్యనిబద్ధత ఉండాలి .అప్పుడు భగవత్ స్వరూపమైన సత్యమే మనం అవుతాం అని గాంధీ పరిపూర్ణ విశ్వాసం . సత్యం సర్వ స్వతంత్రమైనది, సనాతనమైనది అదే పరబ్రహ్మం .అందుకే కరుణశ్రీ ‘’జగత్రితయమ్మునకు సత్య సందేశ మంది౦చు శాంతి దూత ‘’’’సత్యకవచము వొడల  సంతరించి దండు నడిపినట్టి వాడు ‘’’’ఆతడజాతశత్రుడు మహాత్ముడు ,శాంత తపస్వి విశ్వ విఖ్యాతుడు ‘’ అన్నారు ..’’ సత్యానికి ఏ శక్తీ సంకెళ్ళు వేయలేవని నిరూపించిన ఘనతపస్వి’’అన్నాడు మల్లెమాల .  గాంధీజీ 150 వ జయంతికి మనమందరం సత్యవాక్కు పాటించటమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి .

గబ్బిట దుర్గా ప్రసాద్ -24- 9-18 –ఉయ్యూరు -9989066375

2–గాంధీజీ –అహింస

‘’అహింసా పరమో ధర్మః ‘’అని ఆర్యోక్తి .హింస చేయకపోవటం అహింస .ఎదుటి ప్రాణికి ఏరకమైన హాని కలగజేయకపోవటమే అహింస .సాటిమనిషిని మాటలతో, ప్రవర్తనతో, భావాలతో గాయ పరచకుండా ఉండటం .సకల జీవులపైనా ప్రేమ కలిగి ఉండటం .అహింస గొప్ప గుణం .బుద్ధుడు అహింసామూర్తి .ఆధునికకాలం లో గాంధీ మహాత్ముడు కూడా అహింసా మూర్తిగా ప్రసిద్ధి చెందాడు .రాజకీయక్షేత్రం లో  అహింసా సిద్ధాంతాన్ని ప్రయోగించి  విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తి మహాత్ముడు .నియంతలు ఘాతకులు చరిత్రలో తాత్కాలిక విజయంసాది౦చినా చివరకు సత్యం,ప్రేమ మాత్రమే శాశ్వత విజయం పొందుతాయి అని గాంధీజీ అభిప్రాయం .కత్తికి కత్తి,కన్నుకు కన్ను సిద్దా౦త౦  ప్రపంచాన్నే అంధకారం లోకి నెట్టేస్తుంది .యుద్ధం నియంతృత్వానికి దగ్గర దారి .అహింస మాత్రమే స్వచ్చమైన ప్రజాస్వామ్యాన్ని అందిస్తుంది .ప్రేమ తో లభించే అధికారం, శిక్ష, భయాలతో వచ్చే అధికారం కంటే వెయ్యి రెట్లు ప్రభావితమై ,శాశ్వతమౌతుందని గాంధీ విశ్వ సి౦చాడు  .అహింస వ్యక్తి నిష్టమేకాని దేశ నిష్టం కాలేదు అనే అపోహతప్పు .అశోక చక్రవర్తి రాజ్యమంతా అహింసా సిద్ధాంతాన్ని పాటిం చేట్లుచేశాడు .ఆహి౦స తో నడిపే స్వచ్చమైన ప్రజాస్వామ్య౦ ప్రజలకు మేలు చేస్తుంది .

హిట్లర్ ముసోలిని లు నియంతలుగా మారి ప్రజలను హింసించారు .హిట్లర్ 5 మిలియన్ల యూదుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు .అహింస పిరికితనంకాదు.అదొక మహత్తర శక్తి .అది విస్ఫోటనమై అనుకున్నది సాధిస్తుంది అంటాడు గాంధి .ఆహి౦స కు ఆత్మ స్థైర్యం కావాలి అన్నాడుబాపు . ‘’మానవ స్వభావం పై .మహాత్ముడికి ఉన్న అచంచల విశ్వాసమే ఆయన ఆత్మ శక్తి ‘’అన్నాడు డా పట్టాభి . పిరికితనం ,దౌర్జన్యాలలో దౌర్జన్యమే మేలు అన్నాడు .అవతలవాడు ఆపదలో ఉన్నప్పుడు పిరికితనం తో పారిపోకుండా దౌర్జన్యం తో ఎదిరించికాపాడాలి .రక్షణకోసం చేసే దౌర్జన్యం హింస కాదు పైగా గౌరవం,కర్తవ్య౦ కూడా  అని తనకొడుకు అడిగిన ప్రశ్నకు గాంధీ సమాధానం చెప్పాడు .సౌజన్యం చాలా ఉత్కృష్టమైంది .శిక్షించటంకంటే క్షమించటం పురుష ధర్మం అన్నాడు .శూరుడికి క్షమ అలంకారం .శిక్షించే శక్తి ఉన్నా,వదిలేయటం  క్షమా గుణం .శారీరక బలం మాత్రమే బలం కాదు .జయి౦పరాని సంకల్పమే బలం అన్నాడు మహాత్ముడు .కేవలం లక్షమంది బ్రిటిష్ వాళ్ళను చూసి 30 కోట్ల భారతీయులు భయపడాల్సిన పని లేదు. అహింస మన ఆయుధం .క్షమ మన బలం అని ఉద్బోధించాడు .అహింస వలననే మనం స్వాతంత్ర్యాన్ని సాధించి ప్రపంచానికి మార్గ దర్శనం చేయాలి అన్నది బాపూ ఉన్నతాశయం .హింస మృగ ధర్మమైతే అహింస ,సౌజన్యం మానవ ధర్మం .

మనపూర్వ  మహర్షులు ప్రజ్ఞావంతులు ,మహా యుద్దవీరులు ,అస్త్ర,శస్త్ర  విద్యా కోవిదులు .ఇవి నిరుపయోగం అని గ్రహించి దుఃఖ పీడిత ప్రపంచానికి మోక్షం సౌజన్యం వలన సిద్ధిస్తుందని బోధించారని గుర్తుచేశాడు బాపూజీ .బ్రిటిష్ దుస్ట పాలన అంతం చేయటానికి అహింసకు మించిన శక్తిలేదు అని నొక్కి చెప్పాడు .సర్వ శక్తివంతుడైన దశ కంఠ రావణుని ,కేవలమానవ మాత్రుడైన శ్రీ రాముడు జయించటం లో శారీరక బలాన్ని, మనో బలం తో  జయించటం అని అంతరార్ధం అని ప్రవచించాడు .

భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ ఆధ్వర్యం లో ఎన్నో నిరసనలు  మరెన్నో పోరాటాలు ,ఇంకెన్నో ఉద్యమాలు ,సత్యాగ్రహాలు జరిగాయి .హింసకు తావు లేకుండా గాంధీ గారి అహింస మంత్ర ప్రభావంతో అన్నీ విజయమైనాయి .ఎప్పుడైనాఎక్కడైనా ఆందోళనకారులు హద్దుమీరి  హింసకు దిగితే మహాత్ముని గుండె చివుక్కుమనేది .వెంటనే నిస్సంకోచంగా ఉద్యమాన్ని ఆపేయించాడు .అది వెనక్కి తగ్గటం కాదు .ఒక విధమైన యుద్ధనీతి . .తాను సత్యం, అహింస అనే పురాతన మార్గాన్నే ఎన్నుకున్నానని ,తాను మహాత్ముడిని కానని ,మానవమాత్రుడిని కనుక పొరపాట్లు చేయటం సహజం .ఎక్కడైనా ,ఎప్పుడైనా తాను రాజీ పడితే అది దేశానికి నష్టదాయకం గా ఉండదని విశ్వ సించ మని కోరిన  మహోన్నత మానవీయ అహింసామూర్తి .అందుకే ‘’నీ ఆహి౦సా మకుట మణికాంతులు –ఈ మహా ప్రపంచ సుఖ శాంతులు .నీ సర్వమానవ సమాన దృష్టి –సత్యా హింసల సమస్టి ‘’అని కీర్తించి ‘’జెండా జాతికి జీవ గర్ర ,సమతా చిహ్నమ్ము ,సర్వస్వము ‘’అనీ ‘’అమ్మ పరాయి పంచ బడి ,అశ్రువు లోడ్చుచు నుండ బిడ్డ చిత్తమ్మదిచూచి యోర్వగలదా’’అనీ ‘’యజ్ఞఫలము స్వరాజ్య సంప్రాప్తి పార్ధ ‘’అని విజయశ్రీలో అన్యాపదేశంగాను కరుణశ్రీ కర్తవ్య౦  బోధించారు.’’అహింసా లతామతల్లిని మహాత్ముడు  అంచి తమ్ముగ పూలు పూయించినాడు’’అన్నది యదార్ధం .

గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు -9989066375

3-గాంధీజీ –సత్యాగ్రహం

సత్యాగ్రహం అంటే సత్యం కోసం చేసే పోరాటం .సహాయ నిరాకరణ ,ఉపవాసదీక్ష ఆయుధాలు గా చేసే ధర్మ పోరాటం .మహాత్మాగాంధీ 1906 సెప్టెంబర్ 11 న మొదటిసారిగా దీన్ని దక్షిణాఫ్రికా లో ప్రారంభించాడు .భారత స్వాతంత్ర్య ఉద్యమం లో సత్యాగ్రహం ప్రముఖ పాత్ర పోషించింది .గుజరాత్ లో తాము దీనిని’’పాసివ్ రెసిస్టన్స్ ‘’అంటే నిష్క్రియాత్మక నిరోధకత ‘’గా పిలిచేవారమని ,అది పిరికి తనానికి చిహ్నంగా భావించగా   దీనికి మదన్ లాల్ గాంధి ‘’సదాగ్రహం ‘’అని పేరు పెట్టి బహుమతి పొందాడని. గాంధీ దాన్ని కొంచెం మార్చి ‘’సత్యాగ్రహం ‘’అన్నాడని, ఇదే దేశం లో పోరాటానికి పేరుగా నిలిచిపోయిందని గాంధి చెప్పాడు . అమెరికాలో నల్లజాతి వారి  పౌరహక్కుల పోరాటం లో మార్టిన్ లూధర్ కింగ్ గాంధీజీ సత్యాగ్రహాన్నే  ఆయుధంగా ప్రయోగించి విజయం సాధించాడు .సత్య సాధన కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం .తప్పు చేసిన వారిని బలవంతంగా ఆపకుండా ,వారిలో గణనీయమైన మార్పు తీసుకురావటమే దీని ముఖ్య ఉద్దేశ్యం . .ఆగ్రహమంటే కోపం .కాని ఇందులో కోపతాపాలకు తావులేదు .శాంతియుతంగా నిరసన తెలియ జేయటమే జరుగుతుంది .నిరసన ద్వారా కోర్కెల సాధన ముఖ్య సిద్ధాంతం .దీనిలో నిరాహార దీక్ష ,ఆమరణ నిరాహార దీక్ష ఉంటాయి .ఈరెండు పేర్లు చెప్పగానే మనకు గుర్తువచ్చేది గాంధీ మహాత్ముడే .అప్పుడు స్వతంత్రం కోసం సాగించిన మహాత్ముని  సత్యాగ్రహం నేడు అన్ని రంగాలలోనూ తమహక్కులు, కోర్కెలు సాధించటానికి సాధనంగా మారింది .

హత్యాగ్రహం లో భాగమైన నిరాహార దీక్షను రాజకీయ అస్త్రం గా మొదట ప్రయోగించింది  గాంధీయే. ఆమరణ నిరాహార దీక్ష సాధనంగా చేసుకొని శ్రీ పొట్టిశ్రీరాములు  అమరులై ,మనకు ఆంద్ర రాష్ట్ర౦ సాధించి పెట్టారు .ప్రపంచం లో చాలా దేశాలలో సాత్యాగ్రహం విస్తృతంగా ప్రచారం లో ఉంది .కనకనే దీన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి మహాత్ముని జన్మదినం అక్టోబర్ 2 ను ‘’అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం’’గా ప్రకటించింది .గాంధీజీ 72 వ జన్మదినోత్సవం లోకానందంగా జరిగినా ప్రపంచమంతా మహా సంక్షోభం లో మునిగి భారత దేశం ఒక్కటిమాత్రం శాంతి  సుహ్రుద్భావాలను బోధిస్తూ సభ్యతా లోకానికి దూరంగా ఉంది .’’లోకాః సమస్తాః సుఖినో భవంతు ‘’అనేది భారతీయ సిద్ధాంతం .దేశాలన్నీ స్వయం పోషకాలుగా ,స్వయం సంపూర్ణంగా స్వావలంబనగా ఉండాలని భావన   .గాంధీ ‘’ప్రతి బ్రిటిష్ వానికీ ‘’అనే శీర్షికతో లేఖ రాసి ,తాను సత్యాగ్రహాన్ని అసహాయోద్యమగా నిర్వహిస్తున్నానని  ,రెండవ ప్రపంచయుద్ధ౦లొ   బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరిస్తానని తెలిపాడు .

1916 లో  అహ్మదాబాద్ దగ్గర సబర్మతీ నదీ తీరం లో సత్యాగ్రహ ఆశ్రమం నిర్మించబడింది .ఆశ్రమవాసులు బ్రహ్మచర్యం పాటిస్తూ నిదాడంబర జీవితం సాగించారు .ఎవరిపని వారే చేసుకొనేవారు .సత్యాహింసలు  ,అస్పృశ్యతా నివారణ పాటించారు .సామాన్య ప్రజలు వాడే ఉప్పు పై ప్రభుత్వం పన్ను విధించటానికి నిరసనగా 1930 మర్చి 12 న గాంధి ఇక్కడి నుండి  దండి కి కాలినడకన అందరితో కలిసి వెళ్లి ఉప్పు సత్యాగ్రహం చేసి ఉప్పు తయారు చేశారు  .ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్ణ స్వరాజ్య ఉద్యమం తర్వాత అతిపెద్ద వ్యతిరేక ఉద్యమం  .ప్రపంచమంతా స్వాగతించింది .తర్వాత దేశమంతా ఉప్పుసత్యాగ్రహాలుఒక ఏడాది పాటు  పెద్ద ఎత్తున జరిగాయి .సరిహద్దు గాంధి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పెషావర్ లో సత్యాగ్రహం చేసి అరెస్టయ్యాడు ..ఆయనఅనుచరులపై  బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరపమని ఆదేశించినా’’ రాయల్ గర్వాల్ రైఫిల్స్’’ దళం కాల్పులు జరపటానికి తిరస్కరించింది .ఉప్పు సత్యాగ్రహం తర్వాత విదేశీ వస్త్ర బహిష్కరణ జరిగింది .అప్రజాస్వామిక అరణ్య నియమోల్లంఘన కూడా జరిగింది

అక్టోబర్ 17 బ్రిటన్ తో ఇండియా సమరం మొదలైంది  గాంధీ ఆదేశంతో వినోబాభావే మొదటి సత్యాగ్రహి నెహ్రు రెండవవాడు .ఇద్దరు యుద్ధ వ్యతిరేక ఉపన్యాసం చేసి సత్యాగ్రహం ప్రారంభించి అరెస్ట్ అయ్యారు .పటేల్ ను కారణం లేకుండానే అరెస్ట్  చేశారు  .దేశమంతా సత్యాగ్రహానికి సమాయత్తమైంది .ఉత్సాహం ఉరకలేసింది..శాంతిభద్రతలను కాంగ్రెస్ వాలంటీర్లు బాగా కాపాడారు .సత్యాగ్రహులను నిర్బంధించటం వాక్ స్వాతంత్రం వంటి హక్కులను కాలరాయటమే అన్నాడు గాంధి . .వ్యష్టి సత్యాగ్రహం తర్వాత సమస్టి సత్యాగ్రహం వచ్చి దౌర్జన్యానికి దారి తీస్తుందననుకుని  ఉపావాస దీక్ష అన్నాడు .తర్వాత వ్యక్తి సత్యాగ్రహానికి మొగ్గు చూపాడు .సత్యాగ్రహులను జాగ్రత్త గా ఎంపిక చేయాలని హితవు చెప్పాడు .ప్రభుత్వం అణచి వేసే ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసినా ,లోబడకూడదని ఆయన సిద్ధాంతం .సుభాస్ చంద్ర బోస్ కూడా 1941 లో అరెస్ట్ అయ్యాడు .  గాంధీ గారి సత్యాగ్రహం ఇంతమందిని ఇన్ని విధాల ప్రభావితం చేసి జాతీయోద్యమాన్ని తీవ్రతరం చేసింది .’’నీ సత్యాగ్రహ సాధన –శాంతి దేవతా సమారాధన’’ అన్నారు కరుణశ్రీ  .’’గుప్పెడు ఉప్పును పోగేసి ,నిప్పుల ఉప్పెనగా చేసి –దండి యాత్రనే దండ యాత్ర చేసిన అధినేత,జగజ్జేత ‘’అన్నాడు సిరివెన్నెల .’’He was un dying inspiration –being the father of our nation –let us preserve what he gave –be wise and be brave ‘’.సత్యాగ్రహమ్మునే సాధనమ్ముగ జేసి –సామ్రాజ్యవాదుల ‘’ను సాగనంపాడు గాంధీ మహాత్ముడు .

గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు -9989066375

4- గాంధీజీ –సహాయ నిరాకరణ ఉద్యమం

భారత దేశం లో బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం .జలియన్ వాలాబాగ్ సామూహిక హత్యల తర్వాత మహాత్మా  గాంధీజీ దీన్ని ఆహి౦సాత్మకంగా చేబట్టాడు .దీని ముఖ్యోద్దేశం భారత్ లో ఇక బ్రిటిష్ పాలన ఏమాత్రమూ కొనసాగరాదని  .ముందుగా బ్రిటష్ వారి వస్తువులు కొనరాదని, స్థానిక చేతి వృత్తుల వారి వస్తువులుకొని ప్రోత్సహించాలని  ఉద్యమ౦ ప్రారంభమైంది.కల్లు దుకాణాల వద్ద పికెటింగ్ కూడా దీనికి తోడైంది .1920 వేసవి లో దేశ వ్యాప్తంగా లక్షలాది పురుషులు,మొదటిసారిగా స్త్రీలు   స్వచ్చందంగా  ఆహి౦సాత్మకం గా  మహాత్ముని నాయకత్వం లో నడిచారు . ఈ ఉద్యమం ఆయన వ్యూహ రచనకు ,  ప్రభావానికి , నేర్పు, క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి భారత దేశ దాస్య విముక్తికి,  స్వతంత్రేచ్ఛ కు,  మొత్తం దేశం లోని చైతన్యానికి అద్దం పట్టింది .అమెరికా మేధావి హెన్రి డేవిడ్ థోరో 1846 లో చేబట్టిన సహాయ నిరాకరణ విధానం  ఆయన నిరాడంబర జీవితం గాంధీ ,టాల్ స్టాయ్ ,లపై గొప్ప ప్రభావం ,ప్రేరణ కలిగించాయి .

సహాయ నిరాకరణ ఉద్యమానికి బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానం ,తోడైంది .  ,గాంధీకి తెల్ల ప్రభుత్వం పై ఉన్న నమ్మకం నశించి , పరాయి  శని  విరగడ కావాల్సిందే నని ఇక వారికి సహాయపడటం ఘోర తప్పిదం, పాపం అవుతుందని ప్రకటించాడు .ఖిలాఫత్ ఉద్యమంలో ఉన్న భారతీయ ముస్లిం లుకూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సమర్ధించి పాల్గొన్నారు .అందరిదీ ఒకే ఆకాంక్ష .ఏడాది లోపు స్వరాజ్యం సాధించాలని .దీనికి తోడుబ్రిటిష్ వారి రాజ్యాంగ పౌరపాలన విధానంపై గాంధీకి నమ్మకం పోయి ,బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని తీర్మానించాడు .భారత దేశ ఆర్ధిక పరిస్థితి మరీ క్షీణించి పోవటం ,మన డబ్బు అంతా బ్రిటన్ కు  ప్రవహించటం  ,స్వదేశీ వస్తువుల అమ్మకం తగ్గి బ్రిటన్ ఫాక్టరీ వస్తువుల అమ్మకం విపరీతంగా పెరగటం ,బ్రిటిష్ సైన్యంతో కలిసి యుద్ధం చేసి చనిపోయిన  భారతీయ సైన్యం పై ప్రబుత్వనిర్లక్ష్యం కూడా కారణాలయ్యాయి. .

గాంధీజీ గురువు  గోపాలకృష్ణ గోఖలే   స్వాతంత్య్రం కోసం  ఉద్యమించి ,అరెస్ట్ అయి , మాండలే జైలులో ఉన్నాడు   . కాలనీ ఆర్ధిక శక్తిని, బ్రిటిష్ పాలననుఎదిరించి స్వతంత్ర భారత దేశ ఆవిర్భాగానికి ఒత్తిడి ఎక్కువైంది .ఉద్యమ బాధ్యత గాంధీ తీసుకున్నాడు .రౌలట్ చట్ట వ్యతిరేక ఉద్యమం దేశ వ్యాప్తం గా చేయమని బాపూ పిలుపునిచ్చాడు .అన్ని ప్రభుత్వ ఆఫీసులు ,ఫాక్టరీలు మూసెయ్యాలని ,బ్రిటిష్ స్కూళ్ళు కాలేజీలు  నుంచి భారతీయ విద్యార్ధులు,ఉపాధ్యాయులు పోలీస్, మిలిటరీ,  సివిల్  వ్యవస్థలను బహిష్కరించి బయటికి రావాలని లాయర్లు కోర్టులను బహిష్కరించాలని  బ్రిటిష్ వారిచ్చిన బిరుదులు  త్యజించాలని  పిలుపు నిచ్చాడు   .తిలక్ ,బిపిన్ చంద్రపాల్ జిన్నా ,అనిబిసెంట్ మొదలైన ముసలి నాయకులు  దీన్ని వ్యతిరేకించారు .కాని గాంధీపై అపారనమ్మకమున్న యువత అంతా గాంధీకి వెన్ను దన్నుగా నిలిచి ఆయన చెప్పినట్లే చేశారు .కాంగ్రెస్ బాపూను పూర్తిగా సమర్ధించింది .మౌలానా ఆజాద్ షౌకతాలి సోదరులు  అండగా నిలిచారు . గుజరాత్ లోని ఖేడియా లో ప్రజలు పూర్తి  అవగాహన లేరని తెలుసుకోకుండా  సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొనమని  పిలుపునిచ్చినందుకు తన తప్పు తెలుసుకొని దాన్ని ‘’హిమాలయన్ మిస్టేక్ ‘’అని ఒప్పుకున్న గొప్పమనసు బాపూజీ ది.

ఇంతటి మహోద్యమం అపూర్వ ఐక్యత చూసి బ్రిటిష్ ప్రభుత్వం బిత్తర పోయింది .  .1922  ఫిబ్రవరి 5 న ఉత్తరప్రదేశ్ లోని’’ చౌరీ చౌరా’’గ్రామం లో ప్రజలు కల్లు దుకాణం వద్ద పికెటింగ్ చేస్తుండగా,  పోలీసులు వాల౦టీర్ల పై దురుసుగా ప్రవర్తిస్తే ,ప్రజలురెచ్చిపోయి  పోలీస్ స్టేషన్ పై దాడి చేసి 22 మంది పోలీసులు లోపలుండగా స్టేషన్ కు నిప్పుపెట్టారు .విషయం తెలిసిన బాపు, అంతవరకు  అత్యంత క్రమశిక్షణతో,  అహింసాయుతంగా దేశమంతా సాగిన ఉద్యమం ఇలా హింసాత్మకంగా మారటం తో తీవ్రం గా కలత చెంది ,హింస వద్దని ప్రజలకు హితవు పలికి ,మూడు వారాల ఉపవాస దీక్ష చేబట్టి ,సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాడు .ఉద్యమాన్ని అణచటానికి 1922 మార్చి 18 న గాంధీని అరెస్ట్ చేసి ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు ,మిగిలిన నాయకులనూ అరెస్ట్ చేశారు . , ,మోతీలాల్ చిత్తరంజన్ దాస్ మొదలైనవారు స్వరాజ్య పార్టీ పెట్టి గాంధీనాయకత్వాన్ని  పూర్తిగా వ్యతిరేకించారు   .ఎక్కడో చిన్నగ్రామంలో జరిగిన సంఘటనకి గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమం ఆపెయ్యటం మంచిదికాదని జాతీయవాదులు అభిప్రాయ పడ్డారు .

అమరవీరుడు భగత్ సింగ్ ఈ ఉద్యమం లో పాల్గొన్నాడు  దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చీరాల-పేరాలఉద్యమం దీని ఫలితమే  ‘’సత్య౦బు ,శాంత్య హింసలకు స్వాగత మిచ్చే ఆయన బ్రతుకు మహాప్రయాగ-అతడొక ధర్మ దేవాలయంబు –విచిత్ర విశ్వ విద్యాలయంబు ,హిమాలయంబు ‘’అన్నకరుణశ్రీ మాటలు అక్షర సత్యాలు   . ‘’గాంధి యుగమున బుట్టితి ,గాంధి నడుపు నుద్యమంబుల –నలగితి నోపినంత ‘’అని పొంగిపోయారు తెనుగు లెంక  తుమ్మల .Truth and non- violence   is what he taught –Same were the principles he fought ‘’.మహాత్ముని 150 జయంతికి ఆయన మార్గాన్ని అనుసరించటమే సరైన నివాళి .

గబ్బిట దుర్గా ప్రసాద్-24-9-18 –ఉయ్యూరు -9989066375


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.