గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130)

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130)

ప్రసిద్ధ బౌద్ధ వేదాంతి .సంస్కృతపండితుడు ,కవి  ,సాహిత్య చరిత్రకారుడు   విద్యాకరుడు 1050-1130కాలం వాడు .’’శుభాషిత రత్న కోశ’’కర్తగా బహు ప్రసిద్ధుడు .ఇది గొప్ప ఆంథాలజి గా ప్రసిద్ధి చెందింది .ఉత్తర బెంగాల్ లోని జగద్దాల విహార బౌద్ధ సన్యాసి అని కోశాంబి తెలిపాడు .రచన అంతా తాటి ఆకులపైనే కనిపిస్తోంది .అది ఇస్లాం కాలానిది అనికొందరు అంటారు .కాని టిబెట్ లోని నగొర్ బౌద్దారామం లోని తాటాకులగ్రంథం మొదటిదని , 1090లో రచించినట్లు ఉన్నదని అంటారు .రెండవది కాగితాలమీద ఉన్నది నేపాల్ రాజగురు పండిట్ హేమరాజ్ వద్ద ఉన్నది .ఇది 1130లో కూర్చిన తాజా గ్రంథం గా భావిస్తారు .2377శోకాల గ్రంథం ఇది .

మొదటి దాన్ని 19 12లో ఎఫ్. డబ్ల్యు. ధామస్ ‘’కవీంద్ర వచన సముచ్చయం ‘’పేరిట ప్రచురించాడు .ఇందులోనికోన్నిశ్లోకాలు వేరొకరు రాసిఉంటారని కోశాంబి అభిప్రాయపడ్డాడు .రెండవ గ్ర౦థంలో 1,732 శ్లోకాలున్నాయి .విద్యాకారుడు ఇంతటి బృహత్ గ్రంథం కూర్చటానికి చాలా ఏళ్ళు శ్రమించినట్లు అర్ధమౌతుంది .కాని శుభాషిత రత్న కోశం లో పేర్కొనబడిన చాలామంది కవులను గుర్తించ లేకపొతున్నారు .గుర్తింపబడిన 275మంది కవులలో 7గురు మాత్రం 7వ శాతాబ్దికి పూర్వకవులు .రాజ శేఖర ,మురారి ,భావభూతులు సుప్రసిద్ధకవులు .కాని వల్లన,యోగీశ్వర ,వాసుకల్ప ,మనో వినోద ,అభినంద కవులు మాత్రం బెంగాలికవులు కాని ,బెంగాల్ -బీహార్ లు కలిసి ఉన్నప్పటి తూర్పు పాలరాజ్య కవులు కాని అయి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .వీరు విద్యాకరుని సమకాలికులుకాని లేక కొద్ది కాలం ము౦దు వారుకాని అయి ఉండవచ్చు. విద్యాకరుని చేత అతి తక్కువగా ఉదాహరింపబడిన రచయితలలో ఎక్కువమంది పాలరాజ్య యువరాజులు .వీరి రచనలు రాజశేఖరుడు లేక భవభూతి ఎక్కడా ఉదాహరించిన దాఖలాలు లేవు .వీరిలో ధర్మపాల ,రాజ్యపాల ,బుద్దాకరగుప్త ,క్షిపాల ,జ్ఞానశ్రీ లున్నారు .మహాకవులైన కాళిదాస ,రాజశేఖర ,భవభూతి కవుల శ్లోకాలను విద్యాకర ఉదాహరించినా ,ఎక్కువభాగం తూర్పు బెంగాల్ కవుల కవిత్వానికే ప్రాముఖ్యమిచ్చాడు’’ బ్లడ్ ఈజ్ ధిక్కర్ దాన్ వాటర్ ‘’అనే సామెత ఉండనే ఉందిగా .జగద్దాల విహారానికి చెందినా ,విద్యాకరుడికి ఉత్తర భారతం లోని మిగిలిన అయిదు బౌద్ధ విహార గ్రంథాలయాలతోబాగా పరిచయమున్నట్లు అర్ధమౌతుంది.ఈ విహారాలలోని వారు తరచుగా కలుసుకోనేవారు.

బౌద్ధ సన్యాసి అయినా విద్యాకరుడు ఈ బృహత్ సంకలనం లో ప్రేమ కవిత్వానికే ప్రాధాన్యమిచ్చాడు  .అందులోనూ శృంగారం  దట్టించిన కవితలనే బాగా ఉదాహరించాడు .’’తలలు బోడులైన తలపులు బోడులా ‘’అన్నాడు కదా వేమన్న .మంచి ప్రణాళికతోనే  దీన్ని కూర్చాడు .మొదటి శ్లోకాలన్నీ ‘’బోధి సత్వుని ‘’పై రాసినవే. వీటిని విహారాలలోని ఆచార్యులు (ప్రొఫెసర్లు),విద్యాకరుని సమకాల కవులు రాసినవే .తర్వాత శివుడు, విష్ణువు లపై శ్లోకాలున్నాయి .వీటిని తొందరగా తెమిల్చేసి అయ్యవారు ఒక్కసారి శృంగార కవిత్వం లోకి లాంగ్ జంప్ చేశాడు .ఋతువులు ,దూత రాతలు ,రోజులోని వివిధ దశల వర్ణనలు ఉంటాయి .

సుభాషిత రత్న కోశం తర్వాత 1205లో శ్రీధర దాసు సంకలించిన ’’సుదూక్తి సుధ’’అనేమరో సంకలనం బెంగాల్ నుంచే వచ్చింది .ఇది623శోకాల  ‘’పిల్ల కోశం ‘’అని పేరుపడింది .కాని రాశి వాసి లలో విద్యాకరుని సంకలనానికే పేరు వచ్చింది .ప్రసిద్ధ చరిత్రకారుడు ,ఆంగ్లకవి ‘’ఇంగాల్లిస్’’ఇంగ్లిష్ లోకి సుభాషిత రత్నకోశాన్నిమొత్తాన్ని అనువదించాడు .ఇందులో కవిత్వ స్థాయి చాలా ఉదాత్తంగా ,ఉన్నతంగా ఉందని అంటారు .తర్వాత చాలామంది చేత అనువాదమైంది.

325-కౌముదీ మహోత్సవ కర్త –విజ్జ?(8-9శతాబ్దం )

కేరళకు చెందిన విజ్జ లేక విద్య ,లేక విజ్జక  8లేక 9శాతాబ్ది సంస్కృత కవ యిత్రి.ఆమె కవితలు మధ్యకాలపు కవుల చరిత్ర లో ఉదాహరింపబడినాయి .ఈమెనే విద్యాకరుడు ‘’విద్యా ‘’అని ,శారంగధర ‘’పద్ధతి’’లో ప్రాకృతం నామం ‘’విజ్జకా’’ అనీ ,వల్లభ దేవుని కవుల చరిత్రలో కూడా’’ విజ్జకా ‘’అనీ ‘’విజ్జాక’’ అనీ పేర్లున్నాయి .విజ్జకా లేక విజయా౦క ను జల్హణుని’’సూక్తి ముక్తావళి’’లో రాజ శేఖరుడు చెప్పినట్లు ఉదాహరించిన శ్లోకం  లో –కర్నాటకకు చెందిన ఆ ‘’విజయా౦క ‘’సరస్వతీదేవిలాగా విజయం సాధిస్తుంది .కాళిదాసు లాగా ఆమె వైదర్భీ రీతి కవిత్వం లో మేటి ‘’.

విజయాంక అంటే విజయం అ౦కమునందు కలది అని అర్ధం .విద్య లేక విజ్జా అంటే జ్ఞానం ,విజ్ఞానం అని భావం .చాళుక్య రాజు కొడుకు పులకేశి (610-642)కొడుకు, యువరాజు చంద్రా దిత్యుడు దక్షిణభారతాన్ని తండ్రితర్వాత పాలించాడు .ఈతని భార్య ‘’విజయభట్టారిక ‘’నే ‘’విజ్జక ‘’అంటారు .విజ్జక విజ్ఞానం సరస్వతీ దేవితో సమానం కాని రంగులో నల్లగా ఉండేదట .దీనిపై ఒక శ్లోకంలో  దండి కవి సరస్వతీదేవిని పూర్తి శుద్ధ స్పటిక సంకాశం గా ఉన్నది అని ‘’తన కావ్య లక్షణ సారం ‘’లో ప్రారంభం లో అనటం తప్పు   అని తెలియ జెప్పే శ్లోకం ఒకటి’’ సారంగధర పధ్ధతి ‘’  లో ఉంది –

‘’నన్ను నల్లకలువ రెక్కలున్న విజ్జక అని తెలుసు కోకుండా దండి  సరస్వతీ దేవిని అతి తెల్లగా ఉంటుందని రాశాడు ‘’.జల్హణుడు ‘’సూక్తి ముక్తావళి ‘’లో కొంచెం తేడాలో .’’నన్ను నల్లకలువ రెక్కలున్న ‘’అన్న శ్లోకం రాసింది ఒక అజ్ఞాత కవిఅన్నాడు .ఏది యెమైనప్పటికీ ఈమె దక్షిణ భారత దేశ సంస్కృత కవయిత్రి అని రుజువైంది .కాని పులకేశి కోడలు విజయాదిత్యుని భార్య విజయ అని చెప్పటానికి సాక్ష్యాధారాలు లేవు .8వశతాబ్దపు దండి  7వ శతాబ్ది విజయను రాజ కుమారి అనటం చెల్లదు .అదే నిజమైతే ఆమె 7 శతాబ్దం చివర దాకా జీవించి ఉండాలి .

ధనదేవుడు విజ్జ ను మాంచి తెలివి తేటలున్న కవయిత్రిగా మెచ్చాడు .అంతేకాక విజయాంకఅనే కవయిత్రి వైదర్భీ రీతిలో దిట్ట అని చెప్పాడు .అయితే  ఈ ఇద్ద్దరూ ఒకరేనా కాదాఅని ధనదేవుడు తేల్చలేదు .

‘’కౌముదీ మహోత్సవం ‘’ సంస్కృత నాటకం  ఒకేవొక రాత ప్రతి కేరళ లో లభ్యమైంది .ఇందులో కొంతభాగం చెదపురుగులు తినేశాయి .ఉపోద్ఘాతం లో  రచయిత పేరున్న చోటమొదట్లో  ఒక పెద్ద చిల్లి కనిపించింది .చదవటానికి వీలున్న చోట చివరగా ‘’కయా’’అని ఉంది .కనుక రచయిత స్త్రీ అయి ఉండాలి .మాననీయులు మానవల్లి రామకృష్ణయ్యగారు  అది కయాకాదు జా అని తేల్చి చివరకు పేరు ‘’జకయా ‘’అన్నారు  .కాని ఏ.కే. వార్డర్ ఇది సందేహమే అన్నాడు .కొంత దారిలో పడింది .మిగిలిన పరిశోధకులు ‘విజ్జకయా ‘’అన్నారు .ఈమెయే విజ్జ అనీ చెప్పారు .వార్డర్ మళ్ళీ ఒప్పుకోక ఇంకోపేరు’’మోరికయా’’కావచ్చు అన్నాడు .  అసలు ఇది రచయిత పేరేకాదు  నాటకం లో ఉపా౦క౦ పేరు ‘’పతకాయా ‘’అన్నాడు .నాటక ఇతి వృత్తం ,శైలీ విజ్జ రాసినట్లు లేదంటారు .కనుక అంతకు ముందుకాలం వాడైన భాసమహాకవి వంటికవి రాసిన నాటకం అన్నారు.బహుశా 6వ శతాబ్దం తర్వాత రచింపబడి నట్లు ఉందన్నారు .

10వ శతాబ్ది రాజశేఖరుడు ,11శతాబ్ది భోజుడు  విజ్జ పేరు ఉదాహరించారు .7-8 శతాబ్ది దండి ఆమె శ్లోకం తెలిపాడు . వీటన్నిటి బట్టి విజ్జ 8 లేక 9 శతాబ్ది సంస్కృత కవి అని తేల్చారు .విజ్జ ప్రేమ ఋతువులు ,ప్రకృతి పై శ్లోకాలు రాసింది .గోప్పభావుకత శైలి లయ తో ఆమె కవిత్వం శోభిల్లింది .ఇవన్నీ ముఖ్య సంస్కృత కవుల చరిత్రలో కనిపిస్తాయి .దండ దేవుడు రాసినట్లు చెప్పబడిన ఒకశ్లోకం ,సారంగధరుని ‘’పధ్ధతి ‘’లో ‘’నలుగురు ప్రసిద్ధ సంస్కృత కవయిత్రులలో విజ్జ ఒకరు –వారు –శీల భట్టారిక ,విజ్జ ,మరుల ,మోరిక .ఈ నలుగురు కవిత్వం రాయటం లో ,విద్యావేత్తలతో సంభాషించటం లో అన్ని శాస్త్రాలలో మేటి అనిపించుకోన్నవారు .వాదాలలో మహామహులను ఓడించి గెలుపొందినవారు .వీరుమాత్రమే  ఆ కాలం లో లబ్ధ ప్రతిస్టులైన కవయిత్రులు .’’అన్నాడు .

విద్య రాసింది అని విద్యాకరుడు ,విజ్జిక రాసిందని శ్రీధర దాసు విజ్జకా రాసింది అని జల్హణుడు ,అజ్ఞాత కవయిత్రి రాసిందని వల్లభ దేవుడు పేర్కొన్న ఒక శ్లోకం –‘ప్రేమించటం లో ,ప్రేమ వ్యవహారాలలో శృంగారం లో నిన్ను అనేక అలంకారాలతో  వర్ణించబడే  నువ్వు అదృష్టవంతురాలవు .కాని నా ప్రేమికుడు నా రవికముడి పై చెయ్యి వేసినప్పుడు నాకు ప్రపంచమే కనిపించదు అంతా మర్చేపోతాను ‘’.(విజ్జక (విజ్జ )

మరొక శ్లోకం ‘’పక్కి౦ టాయనా !నా ఇంటి పై ఓ కన్నేసి ఉంచు .నా ప్రియుడి తండ్రి నూతిలోని ఉప్పు నీరు తాగలేడు.నేను ఒంటరిగా చెరువు నీళ్ళు తీసుకు రావటానికి వెడుతున్నాను .నా శరీరం పై ఖాళీ లేకుండా నఖాలతో గుచ్చేయ్యగాలవా ‘’(విజ్జక (విజ్జ )

మరో శ్లోకం తన బీదరికాన్ని గురించి ‘’చావులో రోగం రోస్టుఅన్నీ హరి౦చుకు పోతాయి .నడవలేనితనం ,మాటరాని తనం కంపించే శరీరం దరిద్రుడిని బగా గుర్తుపడతాయి ‘’(విజ్జ )

ప్రేమించటం పై మరో శ్లోకం – ఆనందమైనఆ రాత్రి లో  దీపం తోడుగా మనిద్దరం ఆ రాత్రంతా  గాఢం గా ప్రేమించుకోన్నాం .మంచం కిర్రుకిర్రులాడింది .అతడు శ్వాసపీల్చటానికి స్వల్ప విరామం తీసుకొంటున్నాడు –రాత్రంతా మంచం పళ్ళు కొరుకుతూనే ఉంది ‘’(విజ్జ )

ఇంకా విజ్జ పేరు మిస్టరీగానే మిగిలి ఉంది

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-18-ఉయ్యూరు

 

 

 

 

 


 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.