గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం )

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం )

భావకాదేవి లేక  భావా దేవి అని పిలువబడిన ఈ సంస్కృత కవయిత్రి 12వ శతాబ్దం లేక అంతకు పూర్వం ఉండేదని భావిస్తారు .మధ్యకాలపు సంస్కృత కవులు తమ గ్రంథాలలో ఈమెను ఉదాహరించారు .విద్యాకారుని సుభాషిత రత్న కోశం లోనూ సూక్తి కర్ణామృతం ,కవీంద్ర వచన సముచ్చయం లోను ఈమె కవతలు ఉదాహరింపబడినాయి .స్త్రీ వక్షో సౌందర్యాన్ని వర్ణించిన కవిత –

1-‘’ఆమె పాలిండ్లు ఇద్దరు రాజులలాగా సమానంగా ఉన్నతంగా ఉన్నాయి –పైనుంచి అన్ని వైపులకు చూస్తున్నట్లు కనిపిస్తాయి .విశాల జఘన సామ్రాజ్యాన్ని జయించిన ధీమా ఆ చూపుల్లో ఉంది .సరిహద్దు యుద్ధాలలో ని కఠోర ధిక్కార ధోరణి ఉంది ‘’

2-వలచి వలపించి పెళ్లి చేసుకొన్నప్రియుడు ఆశాభంగం కలిగించిన భార్య మనోవేదన –

‘’మొదట్లో మా ఇద్దరి శరీరాలు పూర్టి గా  ఏకత్వం పొందాయి –తర్వాత రెండుగా పెరిగాయి –ఇప్పుడు అతడూ నేనూ సంతోషానికి దూరమయ్యాం ‘’

3-ఇప్పుడు నువ్వు భర్తవు ,నేను భార్యను –ఇక ఈ జీవితం లో నాకు ఇంకేమి వస్తుంది ?చెట్టు ఏపుగా పెరిగి విరవటానికి వీలుకానిదైనది .చేదుపళ్ళు కాస్తున్నాయి –తినలేను భరించలేను ‘’.

327-విరహ వేదన ఒలికించిన –మరుల (13వ శాతాబ్దం )

13వ శతాబ్ది కి చెందిన మరుల సంస్కృత కవయిత్రిగా ప్రసిద్ధి పొందింది. సాహిత్య చరిత్రలో స్థానం సాధించింది .సారంగ ధరు ని  ‘’పధ్ధతి ‘’లో ,జల్హణుని’’సూక్తి ముక్తావళి ‘’లో ఆమె కవితలు చోటు చేసుకొన్నాయి .కనుక 13శతాబ్దం లో ఉండి ఉంటుందని భావన .ఆకాలం లో ఆమె బహుళ ప్రసిద్ధి చెందినకవి గా గుర్తి౦ప బడినట్లు దండదేవుడు సారంగధర పద్ధతిలో తెలిపాడు –‘’శీలాభట్టారిక ,విజ్జ మరుల మోరిక అనే నలుగురు స్త్రీ కవులు అసమాన ప్రతిభా సామర్ద్యం తో కవిత్వం రాశారు .దిగ్దంతులైన పండితుల్ని వాదాలలో జయించారు .సకల శాస్త్ర పారంగత్వం వారి సహజ ఆభరణం ‘’

మరుల కవిత్వం దొరకలేదు .కొన్ని శ్లోకాలే కనిపించాయి .అందులో ప్రియుడికి దూరమైన ప్రేయసి గురించినదాన్ని తెలుసుకొందాం –

‘’గోపయంతి విరహ జనితం దుఃఖ మగ్రే గురునం –కిం త్వం ముగ్ధే నయన విశ్రితం వాస్ప పూర్ణం రుణస్థి

నక్తం నక్తం నయన సలిలైర్ యేస అద్రీ కృతస్తే-శయ్యో పాతః కథయతి దశం అతాపే శోష్యమానః ‘’

భావం –నీ ప్రేయసికి దూరమై నీ దుఖాన్ని దాచుకొంటూ –ఎందుకున్నావ్ ప్రియతమా –కన్నీళ్లు వరదలా కళ్ళలోంచి ప్రవహిస్తుంటే ఆనకట్ట కడుతూ ఎలా ఉండ గలుగుతున్నావ్?  కన్నీటి ప్రవాహం తో నీ పక్కఎన్నో రాత్రులు  తడిసి ముద్ద అయిపోతుంటే ,మర్నాడు ఉదయం ఎండిపోవటం నీ దురవస్థకు  సాక్ష్యం కాదా ‘’

328-మానవ సంబంధాలపై కవిత్వం రాసిన –శాలి భట్టారిక (9వ శతాబ్దం )

9వ శతాబ్దానికి చెందిన సంస్కృత కవయిత్రి శాలిభాట్టారిక పేరు సాహిత్యకారులందరూ పేర్కొన్నారు.ఆమె రాసిన శ్లోకాలలో నర్మాదానదిని ,వింధ్య పర్వతాలను వర్ణించినవి ఉన్నాయి .కనుక ఆప్రాంతానికి చెందినది గా ఊహిస్తున్నారు .7వ శతాబ్ది రాష్ట్ర కూట రాజు  ధృవ యొక్క దేవేరి శీలా మహాదేవి ఈమెయే కావచ్చు అని మైసూర్ యూని వర్సిటి రిసెర్చ్ స్కాలర్ ఏం .బి .పద్మ అభిప్రాయపడింది .భట్టారిక అనేది ఉన్నత గౌరవ వాచకం అన్నదామె.రాణిగా ఎన్నో భూరి దానాలు చేసి ఉంటుందని అంటోంది .రాజశేఖరుడు కూడా శీలాభట్టారిక పా౦చాలీ శైలి లో గొప్పకవి అని మెచ్చాడు .15శతాబ్దపు వల్లభ దేవుడు ‘’సుభాషితావలి’’లో రాజశేఖరుని శ్లోకం ఉదాహరిస్తూ పాంచాలీ శైలి అంటే ‘’పదానికి ,అర్ధానికి సమతుల్యం ఉన్న శైలి ‘’అని చెప్పాడు అంటాడు .ఈ శైలి 7వ శాతాబ్దికవి’’బాణుడి ‘’లో కనిపిస్తుంది  .

చాలామంది సంస్కృత సాహిత్య విమర్శకులు శీలాభట్టారిక కవిత్వాన్ని ఉదాహరించటం ,కవుల చరిత్రలో ఆమె పేరు ప్రసిద్ధంగా ఉండటం వలన ఆమె  శ్రేష్టత్వాన్ని తెలియ జేస్తోంది .ఆమె 46ముక్తక శ్లోకాలను ప్రేమ ,నీతి రాజకీయం,ప్రకృతి ,సౌందర్యం ,ఋతువులు ,కీటకాలు ,కోపం ,నైచ్యం ,ప్రవర్తన నియమావళి ,నాయికల స్వభావాలపై రాసింది .రాసిన వాటిలో ప్రస్తుతం లభ్యమైనవి 6శ్లోకాలే . సార౦గధరుని ‘’పధ్ధతి ‘’లో ఉదాహరించిన ప్రముఖ నలుగురు కవయిత్రులలో మొదటి పేరు ఈమెదే .

సంస్కృత సంప్రదాయం లో అంతవరకూ ఎవరూ రాయని గొప్ప శ్లోకం శీలాభట్టారిక రాసినట్లు విమర్శకులు ఆమె ప్రతిభను మెచ్చుకొన్నారు –అదే ఇది –

1-‘’ఎవరు నా కన్యత్వాన్ని దోచుకొన్నది ?నా  పెళ్లికొడుకే కదా.ఆ చైత్రమాస  వెన్నెల రాత్రులలో ,కదంబ  వృక్షాల కింద,మాలతి పుష్ప సుగంధాలలో నేనెవరో నాకు తెలిసింది .అయినా నా హృదయం నర్మదానదీ తీరం లో మళ్ళీ ప్రేమ కేళి కోరుతోంది ‘’

ఈశ్లోకం ఆమె  మళ్ళీ ప్రియుడి పొందుకోస౦ ఆత్రపడుతోందని ,కనుక కవయిత్రి మధ్య వయసు స్త్రీ అయి ఉంటుందని ,వివాహానంతర సుఖం కంటే ప్రియా  ప్రియురాలుగా వారిద్దరి పెళ్ళికాక ముందు ప్రేమ వ్యవహారం మధురాతి మధురంగా ఉండి ఉంటుందని విమర్శకులు ఊహించారు  .ఇదంతాకాదు వారిద్దరిమధ్య ఉన్నది జీవేశ్వర పరమేశ్వర సంబంధం అన్నాడు 16వ శతాబ్ది వేదాంతి ‘’చైతన్యుడు’’

2-భార్య కోసం తపించే భర్త వేదన

‘’తన ప్రియతమ దూరమై నందుకు  అతని  గుండెలో కోర్కె రగిలింది .దీనితో నిద్ర అతన్ని వదిలేసింది .కృతజ్ఞుడిని ఎవరు ఆరాధిస్తారు ?’’

3-ఒక నిరుపేద తనభార్యకు తగినంత ఆహరం నగలు పెట్టలేకపోతున్నాననే వేదన

‘’నగలు గాజులు లేని నాభార్యను చూస్తేగుండె తరుక్కుపోతోది .అన్నం వండే మట్టి కుండ, అందులో ఉడికించటానికి ఏదీ లేకపోవటం చూసి నా హృదయం దహించుకుపోతోంది ‘’

4-శీలా భట్టారిక బహుముఖ ప్రజ్ఞను , విద్వాంసులతో వాదిస్తే ,బహు గ్రంథపఠనం చేస్తే ,మేధావులతో భావాలు పంచుకొంటే జ్ఞాన విజ్ఞానాలు ఎలా వికసిస్తాయో విశదీకరించే శ్లోకం  .దీన్ని అందరూ ఉదాహరించారు –

‘’గ్రంథాలన్నీఔపోసన పట్టి ,రచనలో సేద్యం చేస్తూ ,,  ప్రజ్ఞాపాటవాలతో విద్వాంసులతో  చేసే చర్చలూ గోస్టులు ,తనకంటే పై స్థాయి మేదావులతో భావాలు పంచుకోవటం తో, మనిషిలోని జ్ఞానం సహస్ర దళపద్మం సూర్య  రశ్మి కి విచ్చుకున్నట్లుగా వికసిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-18-ఉయ్యూరు

 

 

 

 

 

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.