కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19
ఇప్పటి వరకు సీతారామ పుర ,కామేశ్వరీ అగ్రహారాలోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం .ఇప్పుడు వ్యాఘ్రేశ్వర అగ్రహారం లోని వారి గురించి తెలుసుకొందాం .
1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి
శ్రీరామపురం లోశ్రీ బులుసు చయనులు గారి గూర్చి ముందే ముచ్చటించుకొన్నాం .ఇప్పుడు ఈ ఆగ్రహారానికి కూతవేటు దూరం లో అరటి కొబ్బరి తోటల ప్రకృతిలో ఉన్న వ్యాఘ్రేశ్వర అగ్రహారం లో ఉన్న బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి గారి గురించి తెలుసుకొందాం .అమలాపురం లాక్ ఐన ముక్కామల మెయిన్ రోడ్డు దగ్గర చిన్న గ్రామం వ్యాఘ్రేశ్వరం ఉంది .ఇక్కడి శివుని పేరు వ్యాఘ్రేశ్వరుడు కనుక గ్రామానికి ఆపేరోచ్చింది .మట్టి రోడ్డుమీదనే నడక, బండీ ప్రయాణం .సీతారామపురం నుంచి సైకిల్ మీదవస్తే పది నిమిషాలు పడుతుంది .చాలా ప్రశాంతమైన పల్లెటూరు .మోటారు కార్ల రణగొణ ధ్వనులు వినిపించవు .చాలాకాలం క్రితం ఒక బ్రాహ్మణుడికి ఇక్కడ ఒక పులి చెట్టుకింద కనిపిస్తే, ప్రక్కనే ఉన్న బిల్వ వృక్షం ఎక్కి ప్రాణాలు కాపాడుకొన్నాడు మారేడు చెట్టుమీదే ‘’వ్యాఘ్రేశ్వర మహా పూజ ‘’చేశాడు .పూజ పూర్తయ్యే టప్పటికి కింద ఉన్న’’ పులి శివ లింగం’’ గా మారి ఆశ్చర్యం కలిగించింది .అప్పటినుంచి ఈ ప్రదేశాన్ని వ్యాఘ్రేశ్వర పురం అన్నారు .తర్వాత వ్యాఘ్రేశ్వరం అయింది .
ఇక్కడున్న బులుసు కుటుంబం లో ఇద్దరు అన్నదమ్ములున్నారు .పెద్దాయన పేరు గ్రామనామమే వ్యాఘేశ్వరుడు .రెండవ ఆయనపేరు కామేశ్వర .పుల్లెల వారి కుటుంబానికి దగ్గరే వీరిల్లు .బులుసు సోదరులు ,పుల్లెల ఆయన వ్యాఘ్రేశ్వరం లో ఆహితాగ్నులు .బులుసు సోదరుల తండ్రిగారు ముంగండ లో స్కూల్ మాస్టర్ .ఆయన ఆహితాగ్నికాడు ఆయన తండ్రీ ,తండ్రి గారి సోదరులు మాత్రం ఆహితాగ్నులే .పెద్దాయన అనంత గారు చయనం చేయటానికి వెడితే ,సోదరులిద్దరు శ్రౌతాన్ని తాతగారు ,మేనమామల వద్ద నేర్చారు .దీనికి తోడు వీరి ఆసక్తిని రెట్టిపు చేశారు శ్రీ రెండు చింతల యాజులుగారు అనే వ్యాఘ్రేశ్వర పూర్వ విద్యార్ధి ,మరొకరు కోనసీమ లో పుట్టిన శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్రుడు.
1967 ఏప్రిల్ లో బులుసు సోదరులు ఇద్దరు అగ్ని హోత్రం ఏర్పాటు చేసుకొని రోజు విడిచి రోజు యజ్ఞాన్ని రుత్విక్కుతో కలిసి ముందుగా వ్యాఘ్రేశ్వర ఆధానం చేస్తే , తర్వాత కామేశ్వర గారు ఆధానం చేశారు .వెంటనే వ్యాఘ్రేశ్వరుడుగారు అగ్నిస్టోమం చేసి ‘’బులుసు వ్యాఘ్రేశ్వర సోమయాజి ‘’అయితే కామేశ్వర కూడా అగ్ని స్టోమంచేసి బులుసు కామేశ్వర సోమయాజి అయ్యారు .ఇద్దరి భార్యలు సోమి దేవమ్మ అని పించుకొన్నారు .
పెద్దవారిన వ్యాఘ్రేశ్వరులకుఆహితాగ్ని అయిన తాత గారి ఆస్తి ఇల్లు సంక్రమించాయి .దీనిప్రక్కనే కామేశ్వర కూడా స్వగృహం ఏర్పాటు చేసుకొన్నారు .కామేశ్వరగారు అన్నగారిని మేనమామ చేసి నట్లు చయనం చేసి చయనులు అనిపించుకోమని ప్రోత్సహించారు .ఆయన మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పి తమ్ముడినే చేయమని ప్రోత్సహించాడు .సరే అన్నాడు తమ్ముడు .తమ్ముడు కామేశ్వర చేసే ‘’అగ్ని చయనా’’నికి కావలసిన ఏర్పాట్లన్నీ అన్న వ్యాఘ్రేశ్వరుడు గారే చేశారు.దురదృష్ట వశాత్తు అకస్మాత్తుగా వ్యాఘ్రేశ్వారు సోమయాజి గారు మరణించారు .విరక్తి పొందిన కామేశ్వర ఇక అదనపు క్రతువుల జోలికి పోకుండా కామేశ్వర సత్యవతి దంపతులు నిత్యాగ్ని హోత్రం తో సరిపెట్టుకున్నారు .
కామేశ్వర సోమయాజి గారు 1926లో జన్మించి ,7వ ఏట ఉపనయం చేసుకొని,ఆరు మైళ్ళ దూరం లో ఉన్న ఇందుపల్లి లో శ్రీ రాణి హయగ్రీవ అవధాని గారి వద్ద ,13ఏళ్ళువేదం నేర్చారు .ఈ అవధాని గారే సామవేదం వారికికూడా మూడవ వేదగురువు .కామేశ్వరగారు ఆపస్తంభ సూత్రాలను అన్నగారు వ్యాఘ్రేశ్వరుని వద్దనే అభ్యసించారు .వేద విద్య పూర్తి కాకమునుపే 20వ ఏట సావిత్రి గారిని పరిణయమాడారు.ఈ దంపతులకు 10 మంది సంతానం –ఆరుగురు కుమారులు నలుగురు కుమార్తెలు .బులుసు సోదరులు తమ కుమారులకు వేద౦ నేర్పలేకపోయారు.కాని కుమార్తె ను మాత్రంకామేశ్వరి అగ్రహార వేదపండితుడు శ్రీపాద మాణిక్య అవధాని ఘనాపాటీ కు ఇచ్చి వివాహం చేసి తృప్తి చెందారు .ఆసక్తి ఉంటె ఈయన ఆహితాగ్ని కాగలడు .
సశేషం
రేపు 17-10-18 బుధవారం దుర్గాష్టమి శుభా కాంక్షలతో
మీ- గబ్బిటదుర్గా ప్రసాద్ -16-10-18-ఉయ్యూరు