ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ
–అవునండీ బాబూ నిజ్జం గా నిజం .ఈ చెట్టు సంరక్షణ బాధ్యత మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేబట్టింది.వి ఐ పి, వి. వి ఐ పి లకంటే ఘాట్టి భద్రతే అని పిస్తుందికదా .యస్సూఅనుమానమే లేదు సారూ .ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుంది ?అంత సెక్యూరిటీ దానికెందుకు ? తెలుసుకొందాం
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ కు సమీపం లో sanchi దగ్గర ఈ వృక్షం ఉంది . ఈ చెట్టు దగ్గరకు కొమ్ములు తిరిగినా ఎంతటి వారినైనా అనుమతించనే అనుమతించరు .ఈ సెక్యూరిటీ ఎప్పటి నుంచి అమల్లో ఉంది అంటే 2012 డిసెంబర్ లో శ్రీలంక అధ్యక్షుడు రాజభక్షే ఇక్కడికొచ్చి ఒక బోధి వృక్షాన్ని నాటినప్పటి నుంచి .ఈ బోధి వృక్ష రక్షణ కోసం నాలుగు హోమ్ గార్డ్ లను నియమించి పగలూ రేయీ తేడాలేకుండా కాపలా కాయిస్తూ రక్షిస్తున్నారు .షిఫ్ట్ లావారీగా పని చేస్తూ దానికి నీళ్లు పెడుతూ పోషించటం కూడా వారి విధే
15 ఎకరాల విస్తీర్ణం లో భారీ ఫెన్సింగ్ తో ఈ బొధి వృక్షం రక్షింపబడుతోంది .సరే అన్నీ బాగానే ఉన్నాయికానీ ఈ చెట్టుకు ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు అనే అనుమానం కలగటం సహజం .గౌతమబుద్ధుడు గయలోని బోధి వృక్షం కింద దీర్ఘ తపస్సు చేసి ,జ్ఞానోదయం పొంది బుద్ధుడు అయ్యాడని మనకు తెలుసుకదా.. అంతటి జ్ఞానోదయాన్ని కలిగించిన ప్రభావం బోధి వృక్షానికి ఉన్నదనే నమ్మకం బౌద్ధులకున్నది .ఈ విశ్వాసాన్ని హిందువులుకూడా అంగీకరిస్తారు .కనుక బౌద్ధ హిందువులకు ఈ బోధి జ్ఞానబోధిగా దర్శనమిస్తుంది .
ఈ బోధి వృక్షానికి నీరు అందించటానికి ప్రత్యేకంగా వేరే వాటర్ టా0క్ నిర్మించారు .దీని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చూడటానికి వారానికొక డాక్టర్ వచ్చి పరీక్షించి సూచనలిస్తాడు.మొత్తం మీద మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ పవిత్ర బోధివృక్షం పోషణ ,పెంపకం రక్షణ కోసం ఏటా 24లక్షల రూపాయలు అంటే నెలకు సుమారులక్షన్నర రూపాయలు ఖర్చు చేస్తోందన్నమాట .
అసలిది అసలైన బోధి వృక్షమా ?అనే సందేహమొచ్చింది .ఎందుకంటె 3 వశతాబ్దం లోనే గయ లోని అసలైన బోధి వృక్షాన్ని శ్రీ లంక తీసుకు వెళ్లి ”అనుభవా పురం ”లో నాటుకున్నారని మహా బోధి సొసైటీ వారు తెలియ జేశారు . అట్లా0టప్పుడు ఒక నకిలీ బోధి చెట్టుకు ఇన్ని లక్షలు ఖర్చు చేయటం సమంజసమా అని ప్రశ్నించేవారూ ఉన్నారు .పొలాలకు నీరు అందక పంటలు పండక మధ్య ప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేవలం ఒక చెట్టు కోసం ఇంత ఆర్భాటం ఇంతటి వి ఐ పి ట్రీట్ మెంట్ అవసరమా అని ప్రభుత్వాన్ని రైతు సంఘాలు నిల దీస్తున్నాయి .మనుషులప్రాణాలకంటే ఈ చెట్టు రక్షణే ముఖ్యమని భావించే ప్రభుత్వ విధానాన్ని మానవ హక్కుల సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి .కానీ అధికార యంత్రా0గాయానికి కళ్ళూ చెవులు ఉండవవుకదా .ప్రజల మానసిక బాధలు వారికి” కేరే ఝాట్ ”. .ఇప్పటికి ఈ చెట్టుపై సుమారు కోటి న్నర రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం . మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం ఈ బోధి వృక్షం ఏ జ్ఞాన బోథ చేయలేదేమో ?
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-18 -ఉయ్యూరు