వైజాగ్ ప్రసాద్ అసలుపేరు’’ కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు’’ .విశాఖపట్నం లోని గోపాలపట్నంలో జన్మించాడు .సంతానం లో చివరివాడు .ముగ్గురు అక్క చెల్లెళ్ళు .తండ్రి స్కూల్ టీచర్. ప్రసాద్ నాటక రంగ నటుడు .స్నేహితులు ‘’వైజాగ్ ప్రసాద్ ‘’అని పిలిచేవారు . బాల్యం లోనే తల్లి చనిపోవటం తో మేనమామ ఇంట్లో పెరిగి .ఎస్ ఎస్ ఎల్ సి చదివాడు .మేనమామ పేరుపొందిన పురోహితుడు .14 గ్రామాలకు ఆయన పౌరోహిత్యం చేసేవాడు .అన్నీ వాచో విధేయంగా ఉండేవని మేనమామ ను గుర్తు చేసుకొని ,కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు .నాటకాల పిచ్చిలో పడి’’ఏం బిబి ఎస్ సీట్ పోగొట్టుకొని బి.ఏ. చదివాడు ‘.వైజాగ్ లోని ‘’హిందూస్థాన్ షిప్ యార్డ్ ‘’లో ఉద్యోగం చేశాడు .భమిడిపాటి కామేశ్వరరావుగారి ‘’దంతవేదాంతం ‘’మొదలైన అన్ని నాటికలలో నటించాడు ;’’గరీబ్ హటావో ‘’నాటిక తన నట జీవితం లో ‘’గ్రేటెస్ట్ వెంచర్ ‘’అన్నాడు. దీన్ని 150 సార్లు ప్రదర్శించామనీ ,అలహాబాద్ లోకూడాదీన్ని మల్టి లింగ్యువల్ నాటికల పోటీలో ప్రదర్శించిన ఘనత తమదని ఆనందంగా చెప్పాడు .700కు పైగా నాటకనాటికలలో నటించిన అనుభవం ప్రసాద్ ది .
సినీ ప్రవేశం చేశాక ,వైజాగ్ నుంచి వచ్చాడు కనుక కూడా ఇండస్ట్రీలో ఐడెంటిటీ కోసం అందరూ వైజాగ్ ప్రసాద్ అన్నారు .జంధ్యాల డైరెక్ట్ చేసిన ‘’బాబాయ్ అబ్బాయ్ ‘’సినిమాతో తెరంగేట్రం చేశాడు .మొదట జంధ్యాల గారే ఈయన్ను ‘’వైజాగ్ ప్రసాద్ ‘’అని పిలిచాడు .30 సంవత్సరాలు సినీ రంగాన నటనతో 320 కి పైగా చిత్రాలతో అలరించిన కేరక్టర్ ఆర్టిస్ట్ ప్రసాద్..అనేక తరాల నటులతో నటించిన అనుభవం ఆయనది 2000 వరకు షిప్ యార్డ్ లో ఉద్యోగం చేస్తూనే ఏడాదికొక సినిమాలో నటించాడు .నువ్వూ నేనూ సూపర్ హిట్ అయ్యాక పూర్తిగా సినిమాలకే అ౦కితమైపోయాడు .హైదరాబాద్ లో స్థిరపడ్డాడు .ఉదయ కిరణ్ కు వైజాగ్ ప్రసాద్ తండ్రిగా నటించటం ఇష్టం ఉండేదికాదు .కాని డైరెక్టర్ తేజ ఈయన నాటకాలు చూసి ప్రభావితుడై ఆ పాత్రకు ప్రసాద్ మాత్రమే సరిపోతాడని చెప్పి ఒప్పించాడు .అప్పటికే కళాతపస్వి విశ్వనాథ్ తీసిన రెండు సినిమాలలో నటించిన అనుభవం కూడా ఉంది ‘’నువ్వూ నేనూ సినిమా నాతోబాటు చాలామందికి భిక్ష పెట్టింది ‘’అన్నాడు దాని విజయాన్ని చూసిపొంగిపోయి .ఉదయ కిరణ్ తో ‘’కలుసుకోవాలని ‘’సినిమాకూడా చేశాడు .ఉదయ కిరణ్ ‘’డాడీ డాడీ ‘’అనే ప్రసాద్ ను ఎప్పుడూ పిలిచేవాడని చెప్పాడు .ఉదయ కిరణ్ మరణం అందరికీ బాధ మిగిల్చినదని చెప్పాడు .నిజంగా తనభార్యకు తాను నాటకాలలో ,సినిమాలలో నటించటం అస్సలు ఇష్టం లేదని ,తన ప్రవర్తనతో ఆమె మనసు మార్చగలిగానని ,అలాంటి అడ్జస్ట్ మెంట్ మెంటాలిటీ లేకపోతె కష్టం అనీ అన్నాడు .డబ్బులు వచ్చిమీద పడుతున్నప్పుడు ఖర్చులు పెంచేసి అవకాశాలు తగ్గగానే ఖర్చులు తగ్గించుకోలేక డిప్రెషన్ లో పడతారు .’’జాగ్రత్తగా ఖర్చుచేయకపోతే ఇండస్ట్రీ లో ఎవరూ మనల్ని ఆదుకోరు మనజీవితాలను మనమే తీర్చి దిద్దుకోవాలని ‘’సినీ నీతి సూత్రం చెప్పాడు .
వైజాగ్ ప్రసాద్ భార్య విద్యావతి .ఈ దంపతులకు రత్నప్రభ ,రత్నకుమార్ కూతురు కొడుకు .ఇద్దరూ సాఫ్ట్ వేర్ రంగం లో రాణించారు .అమ్మాయి అమెరికాలో, అబ్బాయి లండన్ లో స్థిరపడ్డారు .
2017లో విడుదలైన చిత్రం ‘’ఇది మా ప్రేమకథ’’ప్రసాద్ ఆఖరి సినిమా.తేజ దర్శకత్వం వహించిన ‘’నువ్వు –నేను ‘’సినిమా లో ఉదయ కిరణ్ తండ్రిగా వైజాగ్ ప్రసాద్ నటన నభూతో గా ఉన్నది .దీనితో ఆయనకు ఆఫర్లు వెల్లువగా వచ్చి పడ్డాయి .ఆయనకు దీటుగా హీరో ఉదయ కిరణ్ కూడా ఊపేశాడు .నీరాజనం సినిమాలోనూ వైజాగ్ ప్రసాద్ నటన బాగా గుర్తి౦పు పొందింది .’’భద్ర ‘’సినిమాలో హీరో రవి తేజ మేనమామగా ,’’జై చిరంజీవ ‘’లోహీరోయిన్ భూమిక తండ్రిగా డాక్టర్ పాత్రలో మెప్పించాడు .అగ్ర శ్రేణి హీరోలందరితో చేసినా ,వర్క్ హాలిక్ అయిన ప్రసాద్ ఎవరితోనూ సన్నిహితంగా మెలగలేదు. తనపనేదో తను చూసుకొని వచ్చేవాడు .
బుల్లితెర పై అనేక సీరియళ్ళలో నటించాడు ప్రసాద్ . దాదాపు రెండేళ్లుగా అనారోగ్యం తో బాధ పడుతున్నాడు .ఇప్పటికే రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది .ఈ20 తేది ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు మూడోసారి స్ట్రోక్ రావటం తో సోమాజిగూడా యశోదా హాస్పిటల్ లో చేర్చారు .అప్పటికే అంతా అయిపోయి, వైజాగ్ ప్రసాద్ 75 వ ఏట తుదిశ్వాస విడిచాడు .
వెడల్పైన ముఖం ,స్పష్టమైన ఉచ్చారణ ,రాజసం ఉట్టిపడే మూర్తిమత్వం ,అద్భుత నటనా సామర్ధ్యం ,గొప్ప నడవడిక తో తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వం వైజాగ్ ప్రసాద్ ది. ఆయన మృతి నాటక, సినీ రంగాలకు తీర్చలేని లోటు..ఆయన ఆత్మకు శాంతికలగాలని , ఆకుటుంబం సాంత్వన పొందాలని కోరుకొందాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-18-ఉయ్యూరు