కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20
1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి -2
సౌమ్యులైన శ్రీ కామేశ్వర సోమయాజి గారి దంపతులు సంభాషించేటప్పుడు కళ్ళల్లో కాంతులు పెదవులపై చిరునవ్వు దర్శనమిస్తాయి .అందరు ఆహితాగ్నుల భార్యలకంటే సోమయాజిగారి భార్య సావిత్రిగారు శ్రౌత ధర్మం పాటించే వారి జీవితాలలో ఉన్న సూక్ష్మ విషయాలు కూడా తెలియజేసేవారు . ఈ దంపతులు అగ్నిహోత్రం చేసే పవిత్ర పరికారాలను చూపించేవారు .అగ్ని హోత్రం ఆరిపోతే ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ వెలిగించేవారు .అగ్ని హోత్రం తో తమకున్న గాఢ అనుబంధాన్ని సవివరంగా తెలియ జేసేవారు .సోమయాజిగారికి ఉన్న విజ్ఞానం సావిత్రిగారికీ ఉండేది .ఈ దంపతులు 35ఏళ్ళు నిరాటంకంగా అగ్ని హోత్రారాధన చేసిన ధన్యజీవులు .ఇంటర్వ్యు చేసేవారొస్తే వారికి కాఫీ టీ కొబ్బరి నీళ్ళు ఇచ్చి సంభాషించేవారు .అన్నవరం లోని కపిలవాయి రామ శాస్త్రి గారి పత్ని శ్రీమతి మారుతి గారికి ఎలాంటి సంభాషణా చతురత, విషయ స్పష్టీకరణ ఉందో సావిత్రిగారికి కూడా ఉన్నది .మగవారితో చక్కగా మాట్లాడుతూ అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం అందించటం లో వీరిద్దరూ దిట్టలు..
కామేశ్వర సోమయాజిగారు సుమారు 30 శ్రౌత కార్యక్రమాలకు ఆహ్వాని౦పబడ్డారు .వీటిలో వాజపేయం ,పౌ౦డరీకం ,చయనాలు కూడా ఉన్నాయి .కొన్నిటిలో ఋత్విక్కుగా ,అధ్వర్యునిగా కూడా ఉన్నారు .వీరి దగ్గర చదువుకున్న శిష్యులెవరూ తైత్తిరీయాన్ని పూర్తి చేయలేకపోయారు.సోమయాజిగారు 30మందికి పైగా విద్యార్ధులకు విజయవంతంగా స్మార్తం నేర్పారు .80ఏళ్ళు దాటినాకూడా ,ఇంకా నేర్పుతూనే ఉండటం విశేషం .వీరంతా హైదరాబాద్,ఇతర ప్రాంతాలలో స్మార్త పండితులుగా పేరు తెచ్చుకొన్నారు .కామేశ్వర సోమయాజి గారి వేద విధానం ఆంద్ర దేశమంతటా అవిచ్చిన్నంగా కొనసాగుతోంది.అది ఆయనకు దక్కిన గొప్ప అదృష్టం .2010లో కామేశ్వర సోమయాజిగారు 84 వ ఏట మరణించారు .నేదునూరు పరిధిలో శ్రీరామపురం ,వ్యాఘ్రేశ్వరం అగ్రహారాలలో కామేశ్వర సోమయాజిగారే చిట్టచివరి ఆహితాగ్ని .మిత్రనారాయణగారు ఈ పరిధికి వెలుపల ఉన్న ఆహితాగ్ని .
2-శ్రీ పుల్లెల లక్ష్మీనారాయణ సోమయాజులు గారు (1920-1999)
వ్యాఘ్రేశ్వార అగ్రహారం లో 1960లో స్థిరపడిన మూడవ ఆహితాగ్ని శ్రీ పుల్లెల లక్ష్మీ నారాయణగారు .కౌండిన్య గోత్రీకులు .1920లో వసిష్ట గోదావరి తీరం లోగన్నవరం కాలువ ప్రక్కనున్న నరేంద్ర పురం లో జన్మించారు .1970లో అగ్నిస్టోమం చేసి పుల్లెల లక్ష్మీనారాయణ సోమయాజులయ్యారు.అర్ధాంగి కామేశ్వరిగారు సోమి దేవమ్మ అయ్యారు .ఆహితాగ్ని తండ్రిగారికి ఈయన ఒక్కరే కుమారుడు .తొండవరం లోని మేనమామ శ్రీపాద లక్ష్మీనరసింహ సోమయాజి గారు లక్ష్మీనారాయణ గారు శ్రౌతం నేర్వటానికి గొప్ప ప్రేరకులయ్యారు .
గంగలకుర్రుకు దక్షిణాన ఉన్న తొండవరానికి చెందిన ఆహితాగ్ని గారి మనవరాలు శ్రీమతి కామేశ్వరి గారినిచ్చి లక్ష్మీనారాయణగారికి వివాహం చేశారు .వివాహం 1936లో వైనతేయ గోదావరినది గుర్రపు నాడ లాగా వంపుతిరిగిన చోట ఆమెకు 10.ఆయనకు 16 వయసులో జరిగింది .ఈ దంపతులకు నలుగురుపుత్రులు ,నలుగురు పుత్రికలు .కుమార్తెలెవ్వరికీ వేదపండితులతో వివాహం కాలేదు .కుమారులెవరికీ కూడా వేదం అబ్బలేదు ..మధ్య వయసు దాటిన ఈ దంపతుల కుమారులు ఆర్ధిక బాధలనుభావించారు .తండ్రిగారి లాగే తామూ ఆహితాగ్ని కావాలనుకొన్న లక్ష్మీనారాయణ గారు అగ్నిహోత్రం ఏర్పాటు చేసుకోవటానికి ఒక ప్రత్యేక ఇంటికోసం ఎదురు చూశారు .
వ్యాఘ్రేశ్వరానికి దక్షిణాన ఉన్న చోట భార్య కామేశ్వరిగారి అక్కగారు వీరు౦డటానికి ఒక నివాసం ఏర్పాటు చేస్తే కుటుంబాన్ని 1962లో అక్కడికి మార్చారు . ముక్కామల ,నేదునూరు,శ్రీరామ పురం లు వ్యాఘ్రేశ్వరానికి ఎలా దగ్గరో, శ్రౌతానికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంటుందో ఇదీ అలాగే ఉన్నది .దువ్వూరి యాజులుగారి పౌండ రీకం ,బాబళ్ళ శాస్త్రిగారి’’అరుణ కేతుకం ‘’ లంకా బులుసు వారల యజ్ఞాలు చాలా ప్రేరణ కలిగించాయి .
లక్ష్మీనారాయణ ,కామేశ్వరి దంపతులు కొత్త చోట అగ్ని హోత్రం ఏర్పాటు చేసుకొని ,రెండు పూటలా అగ్ని కార్యం నిర్వహిస్తూ ,పౌర్ణమి, పాడ్యమి రోజుల్లో ‘’ఇష్టి’’చేస్తూ ,ప్రతి సంవత్సరం ‘’అగ్రయనం ‘’చేశారు .లంకావారి లాగానే సోమ యాగం చేయటానికి చాలాకాలం నిరీక్షించాల్సి వచ్చింది .చివరికి లంకావారు అధ్వర్యులుగా ,మిత్రనారాయణగారు ‘’బ్రహ్మణ్యులు ‘’గా ,కోనసీమలోని 18మంది రిత్విక్కులుగా ‘’1970లో అగ్ని స్టోమం నిర్వహించి మనోభీష్టం నెరవేర్చుకొన్నారు .
లక్ష్మీనారాయనగారికి అగ్నిహోత్రం అన్నా ఇష్టిఅన్నా పరమ ఆరాధనా భావం .కొడుకులతో కలిసి పొదలలో , పాములభయం ఉన్న చోట్ల చప్పుళ్ళు చేస్తూఎండు కట్టెలను పోగేసి తెచ్చి అగ్నిహోత్రానికి ఉపయోగించేవారు .ముఖ్యంగా పంటలకాలం లో అమావాస్య ,పౌర్ణమి రోజులలోను ,దీపావళి సమయం లోనూ’’ అగ్రయనం ‘’చేయటానికి చాలాఉత్సాహ పడేవారు .ఒక్కసారిమాత్రమేఅగ్నిస్టో మం ‘చేసిన వెంటనే ‘’శ్రావణ పశు ‘’చేశారు .మిగిలిన ఏ శ్రౌత కర్మల జోలికీ పోలేదు .’
శ్రౌతం డబ్బు వచ్చే వృత్తి అనుకోలేదు .కనుక కుటుంబ ఆర్ధికస్థితి ఎప్పుడూ వొడిడుడుకులతోనే ఉండేది.1986లో ఆయన 66 వ ఏట తిరుపతి దేవస్థానం వారి దృష్టిలో పడి వృద్ధ పండితులుగా మాత్రమే గుర్తించి వేదపఠనం లేని పెన్షన్ ఇచ్చారు .నెలవారీ డబ్బు రావటం తో కొంత తేరుకున్నారు .చివరికాలం లో రుత్విజులలేమి తో కొంత కలత చెందారు .తెలుగు పండిట్ అయిన కొడుకు ఆసరాగా నిలబడ్డాడు .1996లో కామేశ్వరీ సోమిదేవమ్మగారు 70వ ఏట మరణించారు .ఆమెతోపాటు త్రేతాగ్నులు’’ బ్రహ్మ మేధం ‘’తో పాటు దూరమయ్యాయి .ఈ బ్రహ్మమేదాన్ని శ్రీరామపురానికి చెందినదువ్వూరి యాజులుగారు ,వ్యాఘ్రేశ్వరానికి చెందిన బులుసు కామేశ్వర సోమయాజిగారు దగ్గరుండి చేయించారు .లక్ష్మీనారాయణ దంపతుల ముసలితనం వలన అంతకు మూడేళ్ళకు ముందే అగ్ని హోత్రం ఆగిపోయింది .’’లౌకిక ఆరణి’’,స్త్రీలకు మాత్రమే ఉన్న మరొక ‘’సభ్యోక్తి ‘’అగ్నిలను మాత్రమే జాగ్రత్తగా కాపాడి ,రెండేళ్ళ తర్వాత చనిపోయినలక్ష్మీ నారాయణ సోమయాజులుగారి అన్త్యేష్టి కి ఉపయోగించారు .వీరితో పుల్లెల వారికుటుంబం ఆత్మ విశ్వాసంగా , గర్వంగా చెప్పుకొనే ‘’వేదం లో ఉన్నాము ‘’అనే మాట కూడా దూరమై పోయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-18-ఉయ్యూరు