కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21
ఇప్పుడు కాకినాడ లోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొందాం
1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు
కాకినాడకు చెందిన బ్రహ్మ శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వ తోముఖ సోమయాజిగారు శాండిల్య గోత్రీకులు .తండ్రిగారు బ్రహ్మశ్రీ భమిడిపాటి శేషాద్రి సోమయాజులుగారు ఆహితాగ్ని ,ఘనాపాటీ,వేద భాష్య ప్రవీణులు .శేషాద్రిగారు 1935లో అగ్ని స్టోమం తన 26 ఏళ్ళవయసులో చేశారు .అప్పుడు మిత్రనారాయణ గారి వయసు 5.వేద ,శ్రౌతాలలో శేషాద్రిగారు’’డిస్టింక్షన్ సర్టి ఫికేట్ ‘’పొందారు .ఉర్లాం పట్టా ,బెజవాడ పట్టా దారు కూడా .ఇవి ఈనాడు గొప్పగా చెప్పుకొనే హార్వర్డ్ ,ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీలనుండి పొందే పి.హెచ్ .డి .లకంటే ఎక్కువ .అర్ధాంగి శ్రీమతి సూర్య సోమిదేవమ్మగారి తండ్రి ,తాత ,సోదరులు అగ్ని స్టోమం చేసినవారే . శేషాద్రి దంపతులకు ముగ్గురు కొడుకులు ,ఏడుగురు కుమార్తెలు .ఇద్దరు కొడుకులకు శేశాద్రిగారే వేదం నేర్పి వేదపండితులను చేశారు .ఇద్దరూ సర్టిఫికేట్ పొందినవారే .ఒక ఆడపిల్లను మాత్రం వేదపండితుడికిచ్చి పెళ్లి చేశారు .లంకావారు భమిడిపాటి వారికంటే మూడేళ్ళు చిన్నవారు .లంకా కూడా భమిడిపాటి శిష్యుడే .లంకావారు అగ్నిహోత్రం ప్రారంభించేనాటికి మిత్రనారాయణ గారికి లంకావారి ఏకైకపుత్రిక అనసూయ గారితో వివాహమైంది .దీనితో లంకావారికి ఆహితాగ్నిఅల్లుడు లభించాడన్నమాట .
శేషాద్రి దంపతుల పెద్దకొడుకు మిత్రనారాయణగారు 1930లో జన్మించారు .16ఏళ్ళ వయసులోనే వేద విద్యనంతటినీ కపిళేశ్వరపురం దగ్గరున్న కోరుమిల్లి లో తండ్రి గారి వద్దనే అభ్యసించారు .నేదునూరు కు కోరుమిల్లి ఉత్తరాన ఉంటుంది .ఇదే దువ్వూరి యాజులుగారి ఆవాస భూమి .తూర్పుకు ప్రవహించే గౌతమి గోదావరి కి ఎడమ గట్టుమీద ఉంటుంది .15ఏళ్ళ వయసులో అనసూయగారు ఈ అత్యంత విశాల గోదావరి దాటి కోరుమిల్లికి కాపురానికి వచ్చారు .మిత్రనారాయణ దంపతులకు ఏడుగురు సంతానం .మొదటి సంతానం పొందగానే 1955లో శ్రౌతం లో ప్రవేశం కోసం ‘’ఆధానం ‘’,’’అగ్ని స్టోమం ‘’ చేశారు .అల్లుళ్ళు ,మామగారి కుటుంబం ప్రోద్బలంతో స్వయంగా 22 వ ఏట తండ్రి అయిన దానికంటే కంటే నాలుగేళ్ల ముందే ’’ ఆహితాగ్ని’’ అయ్యారు మిత్రనారాయణగారు .మిత్రనారాయణగారి ‘’అగ్నిస్టోమం’’కు బాబళ్ళశాస్త్రిగారు , ,బులుసు చయనులుగారు ,లంకా లక్ష్మీనారాయణ గారు ,బులుసు వ్యాఘ్రేశ్వరుడు గారు, బులుసు కామేశ్వర సోమయాజిగారు వంటి దిగ్దంతులు హాజరయ్యారు .దువ్వూరి యాజులు గారొక్కరే రాలేదు ,అగ్ని స్టోమం అవగానే మిగిలిన శ్రౌత కర్మల విషయం పై దృష్టి పెట్టి 1970కి ముందే’’చయనం’’,’’సర్వతో ముఖం ‘’లను నేదునూరు లో నిర్వహించారు .సర్వతో ముఖానికి నాలుగు వైపులా ఉన్న అగ్ని హోత్రాలలు నిర్వహించటానికి 72 మంది ఋత్విక్కులు అవసరం .గోదావరి డెల్టాలో 50ఏళ్ళ క్రితం బ్రహ్మశ్రీ రెండు చింతల యాజులు గారు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మిత్రనారాయణ గారు చేసి రికార్డ్ నెలకొల్పారు .దీనితో మిత్రనారాయణగారు ‘’మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు ‘’అయ్యారు .
మిత్రనారాయణగారికి దగ్గర బంధువైన దువ్వూరి యాజులుగారే గొప్ప ప్రేరణ .ఈ జంట ఎప్పుడూ కోనసీమ లో ఎక్కడ ఏ శ్రౌతకార్యం వచ్చినా కలిసి నిర్వహించేవారు .1950-60కాలం లో ఇష్టి,అగ్రయనం ,శ్రావణ పశు నిర్వహణలకు ఋత్విక్కుల కొరత ఉండేదేకాదు .7ఏళ్ళ వ్యవధిలో మిత్రనారాయణ గారు నిత్యాగ్ని హోత్రులుగా ఉంటూనే నాలుగు అద్వితీయమైన శ్రౌతకార్యాలు నిర్వహించి ప్రశంసలు పొందారు. కాని మామగారు లంకావారి లాగా మిత్రనారాయణ గారు కొడుకులకు వేదవిద్య నేర్పటం లో అంతగా సఫలీకృతులవ్వలేదు .ఇతరుల పిల్లలకు బోధించిమాత్రమే సంతృప్తి పడాల్సి వచ్చింది .ఈ వేదబోధ ఆయన 70ఏళ్ళ వయసు దాటే వరకు నిరాఘాటంగా సాగింది .
వేదపండితులకు ‘’పారాయణ ప్రోగ్రాం ‘’ను ప్రారంభించటానికి తిరుపతి దేవస్థానానికి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు గొప్ప ప్రేరణ ,స్పూర్తి కలిగించారని మిత్రనారాయణ గారు స్పష్టం చేశారు .ఆయన ఈ ఆలోచన చేయకపోతే వేదపండితులకు ఆర్ధిక వనరులు సమకూరేవికావు అన్నారు .
బ్రాహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు కోరుమిల్లికి తూర్పునున్న బాంక్ కెనాల్ పై ఉన్న ‘’దంగేరు ‘’గ్రామం లో 1888లో జన్మించారు .కాకినాడలో స్థిరపడ్డారు .’’శతమానం భవతి ‘’అన్నట్లు నూరేళ్ళు పూర్ణ ఆయుర్దాయం తో జీవించారు .కాకినాడ లో ఉన్న ’’ జానకీ జాని ‘’అని పిలువబడే శ్రీ సామవేదం జానకిరామ శాస్త్రిగారు ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంగ్లిష్ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైరయ్యారు .కాకినాడ కేన్సర్ ఆస్పతి ఎదురుగా ఉండే ఎల్ .బి .నగర్ లో స్వంత ఇంట్లో ఉండేవారు .1994లో రాజమండ్రి లో మూడు రోజులపాటు ఆత్మీయులు, మహాకథకులు, అఖిలభారత సాహిత్య పరిషత్ అధ్యక్షులు మాన్యులు శ్రీ ఆర్ .ఎస్. కే .మూర్తి గారి ఆధ్వర్యం లో నిర్వహించబడిన సభలలో నాకూ మా బావమరది ఆనంద్ కు పరిచయమయ్యారు .వయసులో మాకంటే చాలాపెద్ద అయినా ,ఎంతో చనువుగా ఆప్యాయంగా ఆ మూడురోజులు మాతో గడిపారు .ఆయనకు వాల్మీకి రామాయణం వాచో విదేయం.కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిముఖ్య శిష్యుడుకూడా .కల్పవృక్ష రామాయణం పై అధారిటీ .ఆ తర్వాత మా ఇద్దరిమధ్యా ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్ సంభాషణలు జరిగాయి .కాకినాడ వెళ్ళినప్పుడల్లా జానకీ జానిగారిని చూడకుండా వచ్చేవాళ్ళం కాము నేనూ మా శ్రీమతీ .ఒక సారి మా అమ్మాయి విజయలక్ష్మి ని కూడా వారింటికి తీసుకు వెళ్లాను .ఆయన అర్ధాంగి గారు మంచి కాఫీ ఇచ్చేవారు .వాకిటిదాకా వచ్చి సాగనంపే సౌజన్యం వారిది .వారితో తీయించుకున్న ఫోటోలు పంపమని చెప్పేవారు అల్లాగే పంపేవాడిని .
ఒకసారి వారింటికి వెడితే ,అయన నన్ను ‘ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు తెలుసా “”?అని అడిగితే నోరు వెళ్ళబెట్టాను .అప్పుడు ఆయన ‘’మా శ్రీమతి మేనమామగారే గణపతి శాస్త్రి గారు .మహా గొప్ప సంస్కృత, వేదవిద్వాంసులు .కాకినాడలోనే ఉండేవారు ‘’అన్నారు .అప్రతిభుడనయ్యాను .గణపతి శాస్త్రిగారి గురించి విన్నానేకాని, పూర్తిగా తెలియదు .గీర్వాణం-3లో వారి గురించి రాసి ఋణం తీర్చుకోన్నాను .జానకీ జాని గారి తండ్రి జానకిరామ శర్మగారు రామాయణ కావ్యం రాశారు .దీన్ని నాకు జానకీజానిగారు పంపితే చదివాను. కలకండ పద్యాలవి .జానకీ జానిగారు ‘’రామాయణ పావని ‘’రాశారు .మంచి కథకులుకూడా. ఎన్నో బహుమతులు పొందారు.ఆయన రాసిన ‘’యధాకాష్టం చ కాష్టం చ’’కథానిక చాలా గొప్పగా తత్వ బోధకంగా ఉంటుంది . ఆయన కథా సంపుటాలు నాకు పంపితే వాటిపై సమీక్ష రాసి వారికి పంపితే పరమానందంగా ఫీలయ్యేవారు. ఫోన్ చేసి ఆనందాన్ని తెలియజేసేవారు .మనపుస్తాకాలూ వారికి పంపేవాడిని .ఏమైనా రాస్తున్నారా అని అడిగేవారు తానేమి రాస్తున్నారో చెప్పేవారు .కాకినాడ, విశాఖ, రాజమండ్రి లలో ధార్మిక ప్రసంగాలెన్నో చేసేవారు .ఎక్కువగా వాల్మీకి విశ్వనాధ రామాయణాలమీదే ప్రసంగించేవారు .ఆ వివరాలు కరపత్రాలు పంపేవారు .నేనూ మనవి పంపేవాడిని .ఎన్నెన్నో సంమానాల౦దుకొన్న బహుముఖప్రజ్ఞా శీలి జానకీ జాని .
ఒకసారి ఏలూరుదగ్గర తమ తమ్ముడి ఇంట్లో ఉంటున్న తల్లిగారిని చూడటానికి వస్తున్నానని ఉయ్యూరు కూడా వస్తానని ఫోన్ చేస్తే, రెండే రెండు రోజుల వ్యవధిలో సాహితీ మిత్రులను మా డాబా పై అంతస్తులో సమావేశ పరచి వారితో విశ్వనాథ రామాయణం పై మాట్లాడమంటే రెండు గంటలపాటు ప్రసంగించి మమ్మల్ని’’ రసగంగ’’లో ముంచి తేల్చారు ఘన సత్కారం చేసి వీడ్కోలు పలికాం .ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి పేరుతో ఈ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి .
గణపతి శాస్త్రిగారు మిత్రనారయణగారికి కాకినాడ లో1977లో ఒక ఇంటిని కుదిర్చి దగ్గరలో ఉన్న జగన్నాయిక పురం లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో వేదపారాయణకు ఏర్పాటు చేయించారు .అద్దె లేని ఆ ఇంట్లో ఉంటూ తన 9 మంది సంతానాన్నిమిత్రనారాయణ గారు పోషించారు .నిత్యం స్నానం సంధ్యావందనం ,అగ్నిహోత్రం చేయటం ,టిఫిన్ చేసి దేవాలయానికి వెళ్లి ఉదయం 8నుండి 10వరకు వేదపారాయణ చేయటం నిత్య కృత్యం .ఉదయం 11గంటలకు ఇంటికి చేరి .మాధ్యాహ్నిక సంధ్యావందనం అగ్నిహోత్రం చేసి భోజనం చేసి మధ్యాహ్నంఒక విద్యార్ధికి వేదం నేర్పేవారు .రాత్రిభోజనం నిద్ర .1992కు వేదపారాయణ జీతం నెలకు వెయ్యి ,1998కి 1800 రూపాయలయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-18-ఉయ్యూరు
1-
.
—