కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22
1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు -2
తన’’ సర్వతో ముఖ యాగం ‘’గురించి మిత్రనారాయణ గారు ‘’సర్వతో ముఖ౦ అయ్యాక నాకు శ్రౌతం అంటే విరక్తి కలిగింది .’’అన్నారు .అందుకనే చాలా ఏళ్ళు శ్రౌతాలకు ,,రుత్విక్కులపై పర్య వేక్షకులుగా ఉన్నారు .1998లో ఆయన విశిష్టమైన 8 పౌండరీకాలకు,2 వాజ పేయాలకు బ్రాహ్మ లేక ఆధ్వరులు పై పర్య వేక్షకులుగా ఉన్నారు .చాలా వాటికీ అంటే నక్షత్రేష్టి,,పంచ రత్న యాగం లలో ఉద్గార్ గా, హోత గా మచిలీపట్నం మొదలైన చోట్లఉన్నారు .చివరికి 2005 జనవరి చివరలో విజయవాడ లో జరిగిన పౌ౦డరీకానికి బ్రహ్మగా ఉండి 75ఏళ్ళ మిత్రనారాయణ బాగా అలసిపోయి ,కాకినాడ వచ్చి విశ్రాంతి తీసుకొన్నారు .
కాకినాడలో ఏడేళ్ళు నిత్యాగ్ని హోత్రం చేసి ,ఆతర్వాత స్వస్తి పలికారు .మళ్ళీ అగ్రయనం ,శ్రావణ పశు ,దర్శ ,పౌర్ణమాస క్రతువుల్లో ప్రాయశ్చిత్తం జరిపి పునః అగ్ని హోత్రం చేశారు .మంచి ఇల్లు కట్టుకొనే సంకల్పం తో కూడా కొంతకాలం ఆపేశారు .చివరకు కాకినాడ సమీపం లో విశాలమైన గృహం నిర్మించుకొని గృహపవేశం చేశారు . కానీ అగ్ని హోత్రం జోలికి పోలేదు .దీనికి కారణాలు చాలాఉన్నాయి అగ్నిహోత్ర౦ గది పూర్తికాకపోవటం ,భార్య ఆరోగ్యం బాగులేకపోవటం ,ఇష్టి నిర్వహణకు తగినంత ఋత్విజులు లభ్యం కాకపోవటం .
కాకినాడటౌన్ విపరీతంగా పెరిగిపోయి కోనసీమ అగ్రహారం ఒంటరిదైపోయింది .వేదపండితులు విద్యార్ధులు క్రమంగా తగ్గిపోయారు .1988లో ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వందేళ్ళు జీవించి మరణించాక కాకినాడ లో వైదిక విద్యకూడా దూరమైందని మిత్రనారాయణ అన్నారు .1992లో ఒక రిటైర్ ఇంజనీర్ కు రోజుకు ఎనిమిదిగంటలు వేదం నేర్పారు .తైత్తిరీయ సంహిత నాలుగవ కాండ క్రమ పాఠంలో ఉండగా ,మిత్రనారాయణ గారుకళ్ళు మూసుకొని తన్మయంతో సంత చెబుతుంటే , ఆ 60ఏళ్ళ ఇంజనీర్ విద్యార్ధి పుస్తకం చేతిలో పెట్టుకొని బిగ్గరగా వల్లెవేస్తుంటే ,ఆయనకు తన తండ్రి గారివద్ద యాభై ఏళ్ళక్రితం వేదాధ్యయనం చేసిన రోజులు గుర్తుకొచ్చేవి. ఈ సన్ని వేశాన్ని ఆంగ్ల దొరకు తెలియ జేస్తుంటే ,ఒక్క అక్షరం కూడా మారకుండా ఇంతకాలం వేదం ఎలాకాపాడబడిందో అర్ధమై ఆనందంతో కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి .తర్వాత కాకినాడ బయట ఒక వేదపాఠశాల వెలిసి౦ది .అయితే దానికి శ్రౌతం లో నిష్ణాతులెవరూ ఉపాధ్యాయులు లేరు .వారి అభ్యర్ధన మేరకు మిత్రనారాయణగారు 10-12ఏళ్ళ వయసుగల అయిదుగురు విద్యార్ధులకు తైత్తిరీయ సంహిత లోని ఆధాన ,అగ్ని స్టోమ,అగ్ని చయన భాగాలను నేర్పారు .
మధ్యవయసులో మిత్రనారాయణగారు అందంగా స్పురద్రూపిగా ,మామగారు లంకావార౦త ఎత్తుతో ,చెవులకు స్వర్ణకుం డలాలతో వాద ప్రతివాదాలలో చేతులూ ,తలా ఊపుతున్నప్పుడు ఆ కుండ లాలు కూడా ఊగుతూ, స్వర్ణ కా౦తులను వెదజల్లేవి 1992ఏప్రిల్ లో కాకినాడలో ఆయనకు రాజమండ్రిలోని వేద భాష్య ప్రవీణులు శ్రీ రేమెళ్ళసూర్య ప్రకాశ అవధాని గారు ముఖ్య అతిధిగా గొప్ప సన్మానం జరిపారు ,మామగారు లంకావారు వృద్ధాప్యం తో ప్రయాణం చేయలేక రాలేక పోయారు .మిత్రనారాయణగారికి చాలా సన్మానాలు ,పట్టా ప్రదానాలు జరిగాయి .అందులో ముఖ్యమైనవి మద్రాస్ ,కంచి ,తిరుపతి ,రాజమండ్రి ,ఢిల్లీ వి సుప్రసిద్ధమైనవి .సత్కార సమ్మానాలంటే చివరికి విసుగనిపించేది ‘’మీకు సన్మానం చేస్తాం ,మీతో ఫోటో దిగుతాం ,మీ విగ్రహం పెడతాం ‘’అని చాలామంది ఉవ్వి ళ్ళూరించే వారని చెప్పారు .వీటివలన అంకిత భావం ,ఆత్మజ్ఞానం కోల్పోవటం జరుగుతుందని బాధ పడ్డారు .
శతాబ్దం చివరకు మిత్రనారాయణ గారు శరీరం బలహీనమై,వయసు భారమై ఇక తాము ఎన్నో ఏళ్ళు జీవి౦చలేము అని తెలుసుకొన్నారు .ఒత్తు జుట్టు బట్టతల అయింది .శరీరం కృశించి ,ముఖం పొడవై చెవికు౦డలాలు భారమై కిందికి వేలాడేవి .కొత్త శతాబ్దం లో మొదటి దశాబ్దం వరకు సమాజం లోని యువకులు ,వృద్ధులు ఆయనను అత్యంత గౌరవంగా ఆదరించారు. ‘’అరుగో !శ్రౌతం లో అద్వితీయులు ,స్వయం పోషకులు ,సర్వ స్వతంత్రులు ,ఏ విషయం పైన అయినా సాధికారంగా ,పాండిత్యం ఉట్టిపడేట్లు ప్రసంగించగల దిట్ట శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సోమయాజులు గారు ‘’అని ఉప్పొంగిపోతూ చెప్పుకొనేవారు అని శ్రీ దువ్వూరి యాజులు గారు అన్నారు . .దువ్వూరి ఫణి గారు మిత్రనారాయణగారిని ‘’మానాన్న గారు యాజులుగారికంటే ‘’త్రికాండ ‘’విద్వత్తులో మిత్రనారాయణ గారు ఘనులు .కర్మ ,ఉపాసన ,జ్ఞానం మూడింటిలో మిత్రనారాయణగారికి సాటి వేరెవరూ లేరు ‘’అని నిష్కర్షగా నిర్దుష్టంగా నిస్సంకోచంగా చెప్పారు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-18-ఉయ్యూరు
1-
.
—