కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23
1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు -3(చివరిభాగం
పట్టి సీమ శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం లో ఒక శివరాత్రి రోజు సుమారు రెండు వ౦దలమంది వేదపండితులు వేద పఠన సమావేశం లో మిత్రనారాయణగారు పాల్గొని ,వారి సామర్ధ్యాన్ని అంచనా వేశారు .స్వస్తి వచనం నిర్దుష్టంగా చెప్పగల వేరొక ఆరుగురి ని ఆహ్వానించి స్వస్తి చెప్పించి ఘనంగా వారికి పారితోషికాలు ఇప్పించారు .మరొక సారి దువ్వూరి యాజులుగారి బదులు మిత్రనారాయణగారు వేద విద్యార్ధులను పరీక్షించే బోర్డ్ లో సభ్యులుగా ఉన్నప్పుడు ప్రధమ,ద్వితీయ,తృతీయ శ్రేణి విద్యార్దులను ఎంపిక చేయమన్నప్పుడు’’ఇందులో శ్రేణి అంటే ఏమిటి ?వందమంది వీళ్ళు వేర్వేరుప్రాంతాలనుంచి వచ్చారు .వీరిలో ఏ ఒక్కరినో ఎంపిక చేసి క్లాస్ ఇవ్వటం కుదరదు .వీరెవరూ పాస్ కు అర్హులుకారు .అందుకని నేను ప్రేక్షక పాత్ర వహించి మిగతా సభ్యుఅలనే నిర్ణయించమని చెప్పాను ‘’అన్నారు .వేదసంస్కృతం గురించి మాట్లాడుతూ ఎవరికీ సరైన అవగాహన లేదన్నారు .మిత్రనారాయణగారు ప్రాచీన సంప్రదాయ పరిరక్షకులలో ఒకరే కాక ,ఆధునికకాలం లో జరుగుతున్న అనర్దాలపై మంచి విమర్శకులుకూడా .
ఈ నాటి వేదవిద్యార్ధులు ఇంగ్లిష్ కూడా నేర్వటాన్ని ‘’హూణ విద్యా ప్రవేశం తో వేదం ,శ్రౌతం భ్రస్టు పట్టాయి .వైదిక జీవితం కనుమరుగైంది అందులోని ఆత్మదెబ్బతిన్నది .ఇది హూణ విద్య కాలం .వేదం లో నిష్ణాతుల తరం గడిచిపోయింది సరైన రుత్విజులు లేరు .ఉన్నవారికి సాధికారత లేదు .ఇప్పుడు జరుగుతున్న శ్రౌతకార్యాలన్నీ రసహీనమే ‘’అంటారు . దక్షిణాదికి పర్యవేక్షకునిగా వెళ్ళటాన్ని గురించి మాట్లాడుతూ ‘’ఉద్దేశ్యాలు పవిత్రంగా లేనప్పుడు ,అక్కడ జరిగే క్రియలూ సత్ఫలితాలనివ్వవు .చెరుకు గడ నుంచి తీసిన రసం రుచికాని , దాని పిప్పి నుంచి తీస్తే రాదుకదా ‘’అన్నారు .కృష్ణాజిల్లాలో యజ్ఞయాగాదులు చేయించేవారు డబ్బు గుంజటం మీదనే దృష్టిపెట్టటం బాధాకరం అంటారు .
మిత్రనారాయణ గారి ఆహితాగ్ని తండ్రి గారు 1989లో చనిపోయినపుడు ‘’బ్రహ్మ మేధం ‘’చేయటానికి ,సమర్ధులు ,నిష్ణాతులైన వారిని పిలిపించటం చాలా కష్టమైంది .ఆయనకు అత్యంత ఆప్తుడు స్నేహితుడే నిర్దాక్షిణ్యంగా ‘రావటానికి నిరాకరించాడు .అప్పుడు ‘’వాళ్ళు దీనికి వస్తే తాము కూడా చస్తామన్న భయం ‘’అని దెప్పారు .తానే పుస్తకం దగ్గర పెట్టుకొని బ్రహ్మమేధం చేశానని గర్వంగా చెప్పారు మిత్రనారాయణగారు .’’బ్రహ్మ మేధం లేని అన్త్యేస్టి కుక్కగతే’’అన్నారు .ధర్మ శాస్త్రం పై అంతటి అపార విశ్వాసం ఆయనకు .
1988లో బాబళ్ళ శాస్త్రి గారు డెల్టాలో శ్రౌతకర్మలు ఇంకో పదేళ్ళు మాత్రమె జరుగుతాయిఅని చెప్పారు .దాదాపు ఆయన అన్నట్లే జరిగింది .శతాబ్దం చివరలో బులుసు కామేశ్వర సోమయాజి ,మిత్రనారాయణగారు మళ్ళీ అగ్నిహోత్రం ప్రారంభించాలని నిర్ణయించారు .అగ్నులన్నీ ఆరిపోయాయి .సంతృప్తిగా ఆధానం చేయటానికి ఇద్దరికీకుదరలేదు .లంకావారి అల్లుడు మిత్రనారాయణగారు లంకావారు ,దువ్వూరి వారు లాగా పాతతరానికి చెందినవారే .పంచాంగాలను బట్టే నడిచేవారు. చెప్పటం కూడా తెలుగు సంవత్సరాల పేర్లతోనే అంటే నందన శర్వరి మొదలైన పేర్లతో నే గత చరిత్ర గుర్తు చేస్తారు .దువ్వూరి యాజులు గారిలా శ్రౌత విద్యనూ కులవిద్యగా భావించారు .ఇంటికి అతిదులెవరైనా వస్తే భార్య అనసూయగారు మనవరాలు కాఫీ లేక టీ లుఇచ్చి మర్యాద చేస్తారు .మిత్రనారాయణ,అనసూయ దంపతులకు 13మంది మనవలు మనవరాళ్ళు .ఆయన గదిలో 200 ఏళ్ళనాటి తాళపత్ర గ్రంథాలున్నాయి.వీటిలో కొన్ని వేదపండితులైన ఆయన తాతగారు రాసినవికూడా ఉండటం విశేషం . ఆహితాగ్ని గారైన తండ్రిగారికి వారినుంచి ఈయనకు తరతరాలుగా సంక్రమించి గ్రంథ నిధి.ఒక సారి విసుగుపుట్టి దేశం లో ఈ ప్రాంతంలో మిగిలిఉన్న వైదిక శ్రౌతిఅనిపించుకోవటం ఇష్టం లేకపోయింది .అందుకే దానినుంచి విరమించారు. కాని ఒకసారి ఎవరో ఫోన్ చేసి ఫోన్ లో వేద పఠనంవినిపించమని బ్రతిమిలాడారు కానీ ఇష్టపడలేదు . ఆయన స్నేహితుడి బలవంతం పై పఠనం చేసి ,యెలాఉ౦దని ఆయన్ను అడిగితే రికార్డింగ్ చాలా అద్భుతంగా వచ్చిందని సంతోషంగా చెప్పారట .ఫోన్ చేసినాయన వెయ్యిన్నూట పదహారు రూపాయలు గౌరవ పారితోషికంగా పంపాడు .అప్పుడు ‘’ఎంత ఉత్కృష్టమైన ది ఈ వేదవృత్తి ?రోజుకో ఫోన్ కాల్ ఇలా వస్తే చాలు సంతోషంగా ఉంటుంది ‘’అన్నారు ఆనందంగా బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-18-ఉయ్యూరు