గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

 331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

డా||జి.ఎం.రామశర్మ

అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. కమనీయ శ్లేష యమక కవితా కలాపాలతో,రమణీయ గీర్వాణాంధ్ర భాషలలో తలస్పర్శియైన పాండితీ ప్రకర్షతో, రసిక స్తవనీయ సరసావధాన సల్లాపాలతో నాలుగు దశాబ్దాల పాటు సారస్వత ప్రియులను సముల్లాస పరచిన మహనీయ మనీషి గౌరీభట్ల వారు. వృత్తి పౌరోహిత్యమైనా సాహిత్య సౌహిత్యాలే ప్రవృత్తిగా గలిగి వెలిగిన నిరాడంబర వ్యక్తి, కవితా శక్తి రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ తల్లికి అపురూపమైన అక్షర సృజనల నీరాజనాలిచ్చిన విద్వత్కవి తల్లజుడాయన. ఆ తేజోమూర్తి జీవన సౌరభాలను పంచే ప్రయత్నమే ఈ వ్యాసం.

రామకృష్ణ శాస్త్రి కాళయుక్తి నామ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి (1919 సం.) రోజున చిలుకమాంబా నారాయణ శాస్త్రి పుణ్యదంపతుల వంశ సపన్మణిగా జన్మించారు. ఇప్పటి సిద్ధిపేట జిల్లాలోని తొగుట మండలంలోని వెంకట్రావుపేట వీరి స్వగ్రామం. స్వయంగా అష్టావధాని, సంస్కృత భాషా కోవిదుడు అయిన తన తండ్రి నారాయణ శాస్త్రి వద్ద బాల్యంలో ప్రాథమికంగా అమరకోశం, శబ్దమంజరి, రఘువంశం మొదలైన వాటిని అభ్యసించిన రామకృష్ణ కవి. సికింద్రాబాదులోని మున్నాలాల్‌ సంస్కృత పాఠశాలలో తన తదనంతర విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అక్కడ వారి ప్రధాన విద్యాగురువులైన తూములూరు శివరామకృష్ణ శాస్త్రి వద్ద, సిద్ధాంత కౌముది, అలంకార శాస్త్రం కావ్య నాటకాలను చదువుకున్నారు. తండ్రి నుండి అనువంశికంగా అలవడిన కవితా కళతో అటు గురువుల దృష్టిని ఇటు తోటి విద్యార్థుల మనస్సులను ఆకర్షించారు రామకృష్ణ శాస్త్రి. విద్యా వ్రతాన్ని పూర్తి చేసుకున్న గౌరీభట్ల సగౌరవంగా సుశ్లోకులైన తన గురువును ఈ క్రింది శ్లోకంలో శ్లేషయుక్త పదాలతో కీర్తించారు.

శ్లో|| కృష్ణప్రేమ్ణి సుభాషిణే చ కలయ న్నీలాంశుకం సద్వ్రజే
యోవైక్షాంతిషు కుంభజాతమతమః ప్రాప్త్యాం స్వశిష్యావనే
సత్త్రాణే కుముదాత్మ సంపది హరిశ్చంద్రః స్వయం సూనృతే
తం వందే శివరామ కృష్ణ విదుషం తూమ్లూరువంశ్యం గురుం

ఇందులో తన విద్యాగురువును పలుకుల లాలిత్యంలో శుకమహర్షితోను, రామ చిలుకతోను, రేపల్లిలోని బలరామునితోను, సహనంలో భూమితోను, శిష్యరక్షణలో ద్రోణాచార్యునితోను, సాధుజన రక్షణలో విష్ణువుతోను, కలువలకు కళా సంపదను ప్రసాదించడంలో చంద్రునితోను, సత్యం పలకడంలో హరిశ్చంద్రునితోను సారూప్యం చేసి ఉల్లేఖాలంకార సంకలితంగా ప్రశంసించడం చాలా ఉదాత్తంగా ఉంది. గురువును ఇలా తనివిదీర శ్లాఘించిన వినయశీలియైన శిష్యరత్నానికి విద్య కరతలామలకమవడం విస్పష్టం. శ్లేషయమక కవితా విన్యాసాలు ఈ కవి దిగ్గజానికి వప్రక్రీడలు. ఇందుకు మాఘకావ్యం తనకు మార్గదర్శకమని ఆయన చెప్పేవారు.

శతావధాని, విద్యోపాసకులు విఠాల చంద్రమౌళి శాస్త్రి (చుంచన కోట) ఆధ్యాత్మిక గురుత్వంలో రామకృష్ణ కవి కవితలకు దేవతాబలం తోడై క్రొత్త కోమలత సంతరించింది. దాని అవధాన కళ మొగ్గతొడిగింది. ఆ పరంపరలో సికింద్రాబాదులోని కన్యకాపరమేశ్వరీ ఆలయం వారి తొలి అష్టావధానానికి వేదికైంది. వారు 1940 నుండి 1980 వరకు తెలంగాణలోని సికింద్రాబాదు, వేములవాడ, నిజామాబాదు, వరంగల్లు, యాదగిరిగుట్ట, సిద్ధిపేట, మెదక్‌, నాచారంగుట్ట మున్నగు వివిధ ప్రాంతాలలో 45 వరకు అష్టావధానాలు చేసి విద్వదవధానిగా వర్తమాన అవధాన కవులకు మార్గదర్శకులయ్యారు. తెలంగాణ మాగాణంలో అవధాన భారతిని అవిశ్రాంతంగా నాట్యమాడించిన గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ వీరి శిష్య రత్నమే. వీరి ఇద్దరు కుమారులు డా|| జి.యం. రామ శర్మ (శతావధాని), డా|| జి. రఘురామశర్మలకు కూడా వారే అవధాన గురువుగా కావడం వివేషం.

రామకృష్ణ శాస్త్రి తన నూనూగు మీసాల నూతన యౌవనంలో (25వ ఏట) యాదాద్రి దేవస్థానంలో ఆశు కవితా ప్రదర్శన నిచ్చి అప్పటి ఆస్థాన పరీక్షక పండిత వర్గ మైన మల్లాది దక్షిణా మూర్తి, ఖండవల్లి నరసింహ శాస్త్రి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి (పంచ సహస్రావధాని), కాసుల నృసింహ సోమయాజులు, అన్నావఝుల నృసింహావధాని, వంగీపురం నరసింహాచార్యులు మొదలగు విద్వాంసుల చేత లిఖిత పూర్వకంగా ‘కవి శార్దూల కిశోర’ బిరుదాన్ని అందుకున్నారు. అది వారి ప్రతిభకు సువర్ణ కిరీటం తొడిగిన రోజు (చిత్రభాను నామ సం|| మార్గశీర్ష పూర్ణిమ)

ఆయన రచించిన ఏకవీర కుమారీయమను రెండర్థాల కావ్యానికి దేవీ భాగవతం, కుమార సంభవం ఆధార గ్రంథాలు. శ్రీ మహావిష్ణు కుమారుడైన ఏకవీరుని కథను (దేవీభాగవతం) పార్వతీ పరమేశ్వరుల కొడుకైన కుమారస్వామి కథను ఈ కావ్య వస్తువుగా గ్రహించి ప్రతిపద్యంలోను హృద్యంగా రెండు కథాంశాలను అనుసంధానిస్తూ కావ్య సవ్యసాచిత్వాని సాధించారు శాస్త్రి. మచ్చుకు ఒక్క పద్య పారిజాతాన్ని ఇచ్చట పరిశీలిద్దాం.

”అచ్చటి నగరామల సత్వమ ! యిదమిత్థ
మనగరాదు, గన్పట్టు నెందును గనుగొన
నందు నమదమరాళీ సమాగమములు
శుక ముఖోద్గత శ్రుతిహిత సూక్తి కళలు”

ఈ పద్యంలో ఏకవీర కథా భాగ పరంగా వైకుంఠాన్ని కుమార స్వామి, కథాంశ పరంగా కైలాసాన్ని కవి అభివర్ణించాడు. ఆహా ! ఆ వైకుంఠ నిర్మల శోభ (నగర+అమల సత్వమ!) ఇంతా అంతా అని చెప్పరానిది. ఎక్కడ చూచినా శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ ఉండే అమర (దేవతల) సమూహాలే (నమత్‌+అమరాళీ సమాగమములు) కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా శుకాది మునులచే వివరించబడిన వేదవిహిత భక్తి పరిమళోక్తులే (శుకముఖోద్గత శ్రుతి హితసూక్తి కళలు) వినిపిస్తున్నాయి. అని వైకుంఠ వర్ణన సంపన్నమైంది.

ఆహా! ఈ కైలాస పర్వత శోభ (నగ రామ లసత్వమ!) వర్ణనాతీతం. ఎక్కడ చూచినా మందించిన నెమళ్ళ గుంపులే (అందున మద మరాళీ సమాగమములు) కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా రామచిలుకలచే వెల్లడి చేయబడిన చెవుల కింపగు పలుకుల కళలే (శుక ముఖ+ఉద్గత శ్రుతిహిత సూక్తి కళలు) వినిపిస్తున్నాయి. అని కైలాస వర్ణన సంఘటించింది. ఇలా పద్యంలోని మొదటి, మూడవ పాదాల్లో శబ్దశ్లేష, నాల్గవ పాదంలో అర్థశ్లేష చమత్కార భరితమై చమక్కుమంటున్నాయి. ఇదే రీతిలో ఈ ద్వ్యర్థి కావ్యంలో పరమహిమాలయము (పరమ హిమాలయము, పర మహిమాలయము), సహజపావని (సహ జపావని, సహజ పావని), ఈ శుభవనము (ఈశు భవనము, ఈ శుభ వనము) భ్రమరహిత (భ్రమ రహిత, భ్రమర హిత), మున్నగు పదాల శబ్దల శ్లేషలు, సుమనః పుంజము (దేవతా బృందము, పుష్ప సముదాయము), నీలకంఠ (శివుడు, నెమలి) మొదలైన పదాల అర్థశ్లేషలు సుధీవరులైన చదువరులను ఆకట్టుకొంటున్నాయి.

విశేషమేమంటే కావ్యం ఇంత శ్లేషమయం అయినప్పటికి పద్యాలు లేశమాత్రమైనా క్లేశమయం కాక నిరర్గళ ప్రవాహతుల్యమై సాగాయి. సుందర ప్రబంధశైలీ బంధురమైన ఈ కావ్యాన్ని కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాచ్య విద్యావిభాగం తెలుగు పిడిసి కోర్సు పాఠ్యాంశంగా (సుమారు మూడు దశాబ్దాల క్రితం) ఏర్పరచి ఈ కావ్యపు విలువను గుర్తించడం ప్రమోదప్రదం. ఈ ద్వర్థి కావ్యంతో పాటు శ్రీరామకృష్ణ కవి కవన బృందావనం పేర శ్రీ శివ యశోదుతిః, భారత సంగ్రహః, మున్నగు కావ్య ఖండికలను, శ్రీ గోపబాల మానస పూజా, చుంచన రాజరాజేశ్వరీ స్తవము (ఆశువుగా రచించినది) మొదలైన రచనలను చేసి సాహిత్యారామాన్ని సంపన్నం చేశారు.

వివాహాది కార్యక్రమాల్లో ఆశీర్వచనంగా వారు చెప్పే శ్లోకాలు, పద్యాలు కూడా శ్లేష చిత్రాలతో పరిమళించేవి. ఏ సమావేశాల్లోన యినా వారి చుట్టూ చేరి కూర్చున్న వారికి పసందయిన కవిత్వపు విందునందించడం ఆయన నైజమై ఉండేది. ఆయన చిత్ర కవిత సహృదయులకు గిలిగింతలకు గలిగించేదిగా ప్రసరించేది. మచ్చుకు రెండు మూడింటిని ముచ్చటిస్తాను.

శ్లో|| భారోంతరే ‘సు’ వర్ణశ్చే ద్భాసురః స్యాత్తనూమతాం
తదేకాభావతః సమ్య క్సచ భారాయ కల్పతే

భావం :- భారములో (భారః+అంతరే) అనగా బరువైన మూటలో సువర్ణం (బంగారం) ఉన్నచో ఆ భారము (సు అను వర్ణం మధ్యలో చేరడం వల్ల) భాసురమగును అనగా ప్రకాశవంతమగును. ఆ భారము మధ్యలో సువర్ణం (బంగారం/సు అను అక్షరం) లేనిచో అది కేవలం భారముగానే మ్రోతకోలుగా మాత్రమే మిగులుతుందని మనో రంజకమైన చిత్రశ్లేష ఇక్కడ ప్రదర్శింపబడింది.

ఇట్లే మానవ దానవ శబ్దాలను చమత్కార సమున్మేషంగా ఉపయోగిస్తూ వారు చెప్పిన ఈ దిగువ శ్లోకాన్ని పరికిద్దాం.
సర్వదా మద సంబంధాత్‌ మానవో దానవో భవేత్‌
సర్వదా దమ సంబంధా దానవో మానవో భవేత్‌

భావం :- మద సంబంధం వల్ల మానవుడు దానవుడవుతాడు దమ(మనో నిగ్రహం) సంబంధం వల్ల దానవుడు కూడా మానవుడవుతాడు – అని సామాన్యార్థం. లోతుగా విచారిస్తే – మ కార స్థానంలో దకారం వచ్చి చేరడం (మద సంబంధం) వల్ల ద కార స్థానంలో మకారం వచ్చి చేరడం వల్ల (దమ సంబంధం) దానవ పదం మానవ పదంగా మారుతుందని శాబ్దిక చమత్కారం ఇక్కడ స్పష్టమవుతుంది.

ఒకసారి అష్టావధానం చేస్తున్న సందర్భంలో అప్రస్తుత ప్రసంగం చేసే ప్రాశ్నికుడు శాస్త్రిని వరునికి వానరునికి తేడా వివరించండని అడగ్గా ఆయన అద్భుతంగా శ్లోకపాదరూపంలో ఈ విధంగా సమాధానమిచ్చారు.

”నరశ్చ వానరశ్చైవ వాలోపయుత ఏవచ”
వానరుడు (కోతి) తోకతో కూడిన వాడు (వాల+

ఉపయుతః) ఇక నరుడేమో వా-లోపయుతుడు. అనగా వానర శబ్దంలో ఉండే ‘వా’ అను అక్షరం లేనివాడని సమన్వయం (నరునికి వానరుని శబ్దపరంగా ‘వా’ అనే అక్షరమే తేడా). ఇటు వంటి పదాల మెరుపులు వారి అవధానాలలో శ్రోతలను మైమరపించేవి.

వారు చేసిన అష్టావధానాలు రాశిలో తక్కువైనా వాసిలో మిన్న. సంస్కృతంలోను తెలుగులోను అవధానాలు చేసిన దిట్టమైన కవి దిగ్గజం శాస్త్రి. వారి అష్టావధానంలో నిషిద్దాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఛందోభాషణ చదరంగం, వ్యస్తాక్షరి, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలుండేవి. వారి అవధాన పద్య పూరణలలోని నైపుణాన్ని రేఖా మాత్రంగా దర్శిద్దాం.

1970 సం||లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధిపేటలో అష్టావదానం చేసినప్పుడు ఒక ప్రాశ్నికుడు ”శంకరుడెత్తె వెండిమల శైలతానూభవ తాపమందగన్‌” అను అసంగతమైన సమస్యనీయగా రామకృష్ణ శాస్త్రి దాన్ని అవలీలగా పూరించి పరాశరం గోపాల కృష్ణమూర్తి వంటి ఆనాటి సభలోని విద్వాంసుల మన్ననలందుకున్నారు. ఆ పూరణ ఈ విధంగా ఉన్నది.

ఉ|| పంకజ సూతిచే వరము బాపురె పొందుచురావణుండికే
ణాంక కిరీటు గొల్చి వరమంది ప్రహమతికై కటా సురల్‌
జంకగ, శంకరుండుమను జంకను బెట్టుచు జంక, లోకనా
శంకరుడెత్తె వెండిమల శైలతనూ భవ తాపమందగన్‌

ఇందులో బ్రహ్మచేత వరాన్ని పొంది గర్వంతో రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని కదిలించిన సన్నివేశాన్ని కన్నుల ముందుంచాడు కవి. సమస్యలోని శంకర పదానికి పైన ‘నా’ చేర్చగా రావణ పరంగా లోకనాశంకరుడు (లోకాలను నాశనం చేయువాడు) అను అర్థం ఏర్పడి ఆ సమస్య చక్కగా పరిష్కరించబడింది.

మెదకులో జరిగిన మరొక అవధానంలో వారికి దత్తపదిగా పూరి, సాంబారు, ఉప్మా, వడ – పదాలిచ్చి భారతార్థం వచ్చేటట్ల పూరించుమనగా ఈ క్రింది పద్యం జాలువారింది.

మ|| ఇన పుత్రాదులెదో సెబాసన జనాసృక్పూరితో గ్రాహవా
వనికిన్‌ దింపకు బావ! చూడుమిల సాంబారూఢి భీష్మించి, పా
వని కేల న్గద ద్రిప్పి, క్రీడి తన చాపమ్మూని బాణాగ్ని రా
ల్చిన నాడా ఉపమన్యు వయ్యు నెవడాలించున్‌ త్వదార్తధ్వనుల్‌

శ్రీ కృష్ణుడు దుర్యోధనుణ్ని హెచ్చరిస్తున్న సన్నివేశాన్ని వర్ణించే పై పద్యం రమణీయ రసమందిరమై, సుకుమార పద సుందరమై అందాలతో సందడి చేస్తున్నది. ప్రత్యేకంగా వివరిస్తే కాని తెలియనంతగా దత్తపదులు పై పద్యంలో మెత్తగా ఒదిగి పోయాయి.

నాచగిరి దేవస్థానంలో జరిగిన అష్టావధానంలో గౌరీభట్ల సత్యనారాయణ శర్మ ప్రాశ్నికుడుగా ఉంటూ ఖరారే, హరారే, మురారే, పరారే అనే దత్తపది నిచ్చి విష్ణుపరంగా పూరించుమనగా శాస్త్రి స్పందించి ఆ పదాలను శ్లోకంలో ఇమిడించి రసరమ్యంగా అందించారిలా…

శ్లో|ఖరారే!మహీజామనశ్చౌర్యసూరే -హరారే-స్సుమేషోఃస్వయంస్యాఃపితారే !
మురారేసదతాపసాంతసశౌరే!పరారేత పాణే! నమో హృత్పురారే !

ఖరుడనే రాక్షసునికి విరోధివైన, సీతాచిత్తాన్ని అపహరించుటలో ఆరితేరిన పండితునివైన, శంకరుని శత్రువైన మన్మథునికి తండ్రివైన, అహరహమూ మునుల మనస్సులలో విహరించే వాడవైన, హృదయంలో పదిలంగా పరమ శివుణ్ణి భద్ర పరచుకున్న వాడవైన (హృత్పురారే!), చక్రపాణివైన (పర+అర+ఇతపాణే) ఓ మురారీ! నీకు నమస్కారము – అని ఆ శ్లోకంలోని సుకుమార సురభిళ భావం. ఇక్కడ విశేషించి ప్రాశ్నికుడిచ్చిన పదాలను క్రమంగా శ్లోకంలోని ప్రతిపాదంలోని ఆదిలో ప్రయోగించి వాటికి సమాంతరంగా ప్రతిపాదాంతంలో అంత్యప్రాసను జోడించి శోకానికి ఇంపును,మంచి ముక్తాయింపును కలిగించిన వైనం శ్రోతల్ని ముగ్ధుల్ని చేస్తున్నది.

వారు బంధ కవిత్వంలో కూడా తన ప్రజ్ఞా సమున్మేషాన్ని ప్రదర్శించారు. గవాక్ష, నాగ, ఛురికా, పద్మ, చక్ర బంధాలను వారత్యంత నిపుణంగా సంధించారు. కవి స్వదస్తూరితో ఏర్పరచిన ఈ నాగ బంధ చిత్రాన్ని చిత్తగించండి!

శ్రేష్ఠమైన ఆకారం కలిగిన, తెల్లని దేహవర్ణం కలిగిన ధీరులకు సౌఖ్యాన్నిచ్చే మహిమగలిగిన, శ్రీ కృష్ణునికి ప్రీతి గలిగించుట్టి ఓ పూరారీ! (శివా!) నీవు నాకు ఆనందాన్ని కలిగించు ! అని ఆ శ్లోక భావం.

32 అక్షరాల అనుష్టుప్పు శ్లోకమది. మెలికలు తిరిగిన ఆ నాగబంధంలో 28 అక్షరాలు నేర్పుతో కూర్పు చేయబడినవి. శ్లోకంలో రా,మ,కృ,ష్ణ అను అక్షరాలకు పునరావృత్తి ఉన్నది. కాబట్టి ఆ అక్షరాలను బంధంలోని 4 సంధి స్థానాలలో (కర్ణికలు) ఏర్పరచడమైనది. సంధి స్థానాలలోని ఆ ఆక్షరాలు కవినామం (రామకృష్ణ) కావడం ఒక విశేషం. శ్లోకాదిలోని శ్రీకారం నాగబంధంలో తల (పగడ) భాగంలో, శ్లో అంత్యాక్షరమైన ‘రు’ వర్ణాన్ని తోక భాగంలోను సంధించడం మరొక విశేషం. ఇలాంటి బంధ కవిత కూర్చడాని కవికి అసమాన శబ్ద శక్తి అనితర సాధ్య భావయుక్తి అవసరం.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి (నాంపల్లి) హైదరాబాదు ప్రతిభా పురస్కారం, మౌళిత్రయ స్మారక పురస్కారం (సిద్ధిపేట), డి.ఎ.ఎల్‌.ఎన్‌. మూర్తి స్మారక పురస్కారం రామకృష్ణ శాస్త్రిని వరించి వారి ప్రతిభకు గుర్తింపునిచ్చాయి. తన రచనల ఆనవాళ్ళను ఈ సాహితీ కేదారంలో ఉంచి 2007 సం||లో శాస్త్రిగారు కీర్తి శేషులయ్యారు.

ఆధారం –తెలంగాణ మాసపత్రిక(అక్టోబర్ 2018) లో డా.జి .ఏం .రామ శర్మగారి ‘’కవి శార్దూల కిశోర ‘’గౌరీ భట్ల ‘’వ్యాసం

 

 గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.