కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26
శ్రీ కపిలవాయి రామశాస్త్రి గారు
శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రిగారి రెండవ కుమారుడు సర్వ స్వతంత్రుడుగా,ఆత్మ విశ్వాసం తో పెరిగారు . చాలా విశాలహృదయులు .అన్నగారితో కలిసి శ్రౌతకార్యాలకు అప్పుడప్పుడు వెళ్ళినా ,అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆస్థాన వేదపారాయణ విద్వాంసులుగా ఉన్నారు .చాలా వినయంతో ఉంటారు .అన్నగారు ‘’వెంకటేశ్వర చతుర్వేది ‘’అని బిజినెస్ కార్డ్ లు వేయి౦చు కొంటే ,దానికి భిన్నంగా ఉంటారు .అధర్వ వేదం లొబ్రాహ్మణాలు కూడా నేర్చి ‘’త్రివేది ‘’అనిపించుకొన్నారు .1998లొ అన్నవరం దేవాలయం దశావతారాలకు యజ్ఞం చేశారు .దీనికి రామ శాస్త్రిగారు అధ్వర్యులుగా వ్యవహరించారు .వెంకటేశ్వర్లుగారు మొదలైన చాలామంది ఆంద్ర దేశం లోని వేదపండితులు అగ్నిహోత్రాలలొ నెయ్యి,సమిధలు వేసే పనిలో ఉన్నారు .మధ్యలో వచ్చే ఖాళీ సమయాలలో అన్నదమ్ములిద్దరూ చేసే క్రియా పరమార్ధాన్ని అందరికి అర్ధమగునట్లు వివరించేవారు .ఇద్దరికీ తండ్రిగారే గురువు అని మనకు తెలుసు .అన్నదమ్ములిద్దరికీ సమాన పారితోషికమే దేవస్థానం అందించింది .
కపిలవాయి వారి బజారులో శాస్త్రిగారు అయిదు అంతస్తుల సౌధం నిర్మించుకొన్నారు .ఇద్దరు కూతుళ్ళకు వివాహం చేశారు .కొడుకు అగ్ని హోత్ర శర్మ వీరితోనే ఉండేవారు .అయిదవ అంతస్తులో విలువైన 150ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భద్ర పరచారు . సౌధం 20 14 కు అత్యంత ఆధునిక సదుపాయాలతో అమెరికన్ హర్మ్యం లాగా తయారైంది .శాస్త్రి గారికి 11 వ ఏట కాశి లొ ఉపనయనం జరిగింది .అన్నగారు వెంకటేశ్వర శాస్త్రి తైత్తిరీయం పూర్తీ చేసి ఘనం కాక ఋగ్వేదం లొ పడ్డారు .ఈయన అధర్వ వేదం దారిన పడ్డారు ..అన్నగారు అగ్నిహోత్ర పరికరాలను చూపించేవారు కాదు .వీరు మాత్రం అతిధులు అడిగితె తమవద్ద ఉన్న ఆరణి,జుహు ,ఉపభ్రుత్ ,చమస మొదలైనవి చూపెట్టేవారు.బ్రా హ్మలు కాని వారు తరులేవరైనా ఇంటర్వ్యూ చేయటానికి వస్తే భోజనానికి ఆహ్వానించేవారు సంభాషణ సమయం లొ టీ కాని కాఫీ కాని ఇచ్చేవారు ,అవసరమైతే అతిది ఉండటానికి సౌకర్యంకల్పించేవారు .
వీరి సతీమణిశ్రీమతి బోనపల్లి మారుతిగారు భర్తకు సమానంగా వేదం శ్రౌతాలలో బాగా అవగాహన ,ఆకళింపు ఉన్నవారు .పురుషులతోపాటు వేదం, శ్రౌత చర్చలు చేసేవారు .వేదపండితుని కుమార్తె ,ఆహితాగ్ని అయిన తాతగారి ఇంట గుంటూరు జిల్లా రేపల్లె అగ్రహారం లో పెరిగారు.వెంకటేశ్వరగారి భార్యగారిదీ ఈ అగ్రహారమే .కపిలవాయి సోదరులు ఈమెతాతగారి శిష్యులే .గురువుగారింట్లోనే ఆరునెలలు ఉండి నేర్చుకున్నారు .వీరిలో తమ్ముడు రామశాస్త్రిగారికితన మనవరాలినిచ్చి శిష్యుడి వివాహం చేశారు గురువుగారు .16 వ ఏట భర్తతో కాశీలో కాపురం పెట్టినప్పటికే ఆమెకు శ్రౌతం లో ప్రక్రియలపై గొప్ప అవగాహన ఉండేది .కాశీలో మొదటి ఆరేళ్ళు యజ్న పాయసం మొదలైన అగ్నిహోత్రునికి నివేది౦ప బడినవి మాత్రమే భుజించేవారు.ఇందులో ఆమెకు సత్పుత్రుడు కలగాలనే తీవ్ర సంకల్పమూ ఉండేది .చాలామంది వేద పత్ని ల కంటే మారుతిగారు పూర్తిగా వైదిక జీవితానికే అంకితమై ఉన్నారు .శ్రౌతకర్మలలో ఏవైనా లోపాలు జరిగితే తప్పనిసరిగా చెప్పి సరి చేయించే నేర్పు ఆమెది .ఆమె గారి పరిశీలన అంత నిశితంగా ఉండేదని చెప్పుకొనేవారు .
2005లొ ఒక రోజు ఆమె తన విశాలభవనం లొ మూడునెలల మనవడిని ఉయ్యాల ఊపుతుంటే,ఒళ్ళంతా నలుగు పెట్టి తలంటి పోస్తుంటే ఇరుగమ్మ ,పొరుగమ్మలు ఆశ్చర్యం గా చూసేవారు ..పిల్లాడు నడక మొదలుపెడితే ,అరికాళ్ళకింద అరిసెలు వేసి నడిపించారు .ఇవన్నీ చేస్తున్నా భర్తకు అగ్నిహోత్ర విధిలో యధావిధిగా సహకరించేవారు .అదే ఏడాది రామ శాస్త్రిగారు తిరుపతిలో జరిగిన ‘’పౌ౦డరీకం ‘’కు ‘’ఉద్గాత ‘’గా ఉన్నారు .చిన్ననాట,యవ్వనం లొ ఎప్పుడో పౌండరీకం చూశారు.మళ్ళీ 25ఏళ్ళ తర్వాత ఉద్గాత గా ఆహ్వానిస్తే సమర్ధంగా చేయించగలనా అనే సందేహం వచ్చిందట .ఆవిషయం వివరిస్తూ ఆయన ‘’దీర్ఘకాలం వ్యాధితో ఉన్నామా తాత గారు కలలో కన్పించి భయం లేదు బాగా చేయించగలవుఅని చెప్పారు .,కలలోనే దానికి సంబంధిన చార్టులను ఏర్పాటు చేసే పనిలోపడ్డాను ,ఇంతలో గాలి వచ్చి వాటిని చెల్లా చెదురు చేసింది. కంగారుపడ్డాను .’’వెతకండి వెతకండి ‘’అని అరిచాను .అప్పుడు ‘’అవి పొతే పోయాయి లే.వాటికోసం దిగులు పడకు ‘’అనే మాటలు వినిపించాయి .మానాన్న గారిని ‘’రేపు నేను ‘’పౌండరీకం’’ఎలా చేయించగలను “”అని అడిగాను . ఆయన ‘’భయపడకు .నేను నీ వెంట ఉంటాను ‘’అన్నారు .’’తెల్లవారి లేచిచూస్తే ఇదికలా నిజమా అని ఆశ్చర్యపోయాను ‘’అని చెప్పారు శాస్త్రిగారు .
అన్నదమ్ములిద్దరి మధ్యా పోలికలే ఎక్కువ .వెంకటేశ్వర్లుగారి ముగ్గురు కుమార్తెల వివాహాలు అయ్యాయి .పెద్దమ్మాయి సీతా నాగ లక్ష్మి కంప్యూటర్ సైన్స్ లొ డిగ్రీ పొంది,ఇంగ్లిష్ టీచర్ గా పని చేస్తూ గుంటూరుజిల్లాబాపట్లలోని వేదపండితుడుపవన కుమార శర్మతో వివాహమైంది .సుందరి అయిన ఈమె అత్యద్భుత గాత్రం తో భక్తీ గీతాలను,మంత్రాలను సుస్వరంగా ఆలపించే నైపుణ్యం కలది .ఈమెకంటే మూడేళ్ళ చిన్నదైన అగ్నివతి నాగలక్ష్మికి ద్రాక్షారామానికి వేదపండితునితతో వివాహం జరిగి బెజవాడ లొ భర్తతో కాపురం ఉంటోంది .చిన్నకూతురు స్వాహాదేవి కి 11 వ ఏటనే 1998లొ తూర్పుగోదావరి జిల్లాఏలేశ్వరానికి చెందిన స్మార్త బ్రాహ్మణుడు,తండ్రిగారి శిష్యుడి కిచ్చి వివాహం చేశారు . వీళ్ళు మాత్రమే తూ .గో.జి లో ఉంటున్నారు .
2005లొ పెద్దకుమార్తె సీతా నాగలక్ష్మి ,బాపట్ల శ్రీ భావనారాయణ దేవాలయం లొ వేదపండితుడుగా ఉన్న పవన్ కుమార్ దంపతులు తాము బాపట్లలో ‘’ఆధానం ‘’చేయ బోతున్నామన్న కమ్మని వార్త తెలియ జేశారు .ఒక దశాబ్దం తర్వాత కూడా రామ శాస్త్రిగారు ఆ పని చేస్తారేమో అని ఎదురు చూశారు .2016లొ శాస్త్రిగారు రిటైర్ మెంట్ సన్నాహం లొ ఉన్నారు .
1998మేనెలలో ఉపనయనం అయిన అగ్ని హోత్ర శర్మ అగ్నికార్యం చేశాడు .తండ్రిచాటున యవ్వన ప్రాదుర్భావంలోనే ఋత్విక్కుగా ఉన్నాడు..14వ ఏట తొమ్మిదో క్లాస్ చదువుతూ,తైత్తిరీయంలొ పదపాఠం నేర్చాడు .తండ్రిఉద్గాతగా , బాబాయిహోతగా తిరుపతిలో జరిగిన ‘’పౌండ రీకం ‘’లో’’ప్రస్తారుడు ‘’గా ఉన్నాడు .దీనికి ముందేఒక అగ్ని స్టోమానికి ‘’సుబ్రహ్మణ్యుని గా వ్యవహరించాడు .దీనితో శ్రౌతం లొ నిష్ణాతుడు అనిపించుకున్నాడు .2014కు బాపట్ల శంకర విద్యాలయంలో సామవేద ఉపాధ్యాయునిగా , అక్కడే యజుర్వేద పారాయణ కూడా చేసి మంచి కీర్తి సాధించాడు .రామ శాస్త్రిగారి శ్రౌత సంప్రదాయం కుమారుడికి ,,మనవడు మారుతి రామ యజ్నేశ్వరుని వరకు కొనసాగింది .ఇవీ కపిలవాయి రామ శాస్త్రిగారి కుటుంబ విశేషాలు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-10-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
—