కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27
శ్రౌత కక్షలు
కొన్ని దశాబ్దాలుగా శ్రౌత కర్మకాండ లలో తమ తండ్రిగారి పై కక్షలున్నాయని కపిలవాయి సోదరులు చెప్పారు .ఇవి శ్రౌతకర్మలు చేయించటం లో,శ్రౌత పరిజ్ఞాన విషయం లొ ఉండేవి .ఇవి శ్రౌతకర్మకాండలు ఆరంభమైన నాటినుండే ఉండేవట .ముఖ్యంగా దర్శ ,పూర్ణమాస విషయం లో, యజమాని విషయం లొ బాగా కనిపించేవి .యజ్ఞేశ్వర శాస్త్రిగారు విజయవాడలో1975లొ స్వగృహం లొ ఉన్నప్పుడు ,అక్కడి దెందుకూరి యాజులుగారితో ఈ స్పర్ధలు బయట పడ్డాయి .అనేక సభలు సమావేశాలలో ఇద్దరిమధ్యా చర్చోప చర్చలు జరిగాయి.ఈ కక్షలకు ముఖ్య కారణం దెందు కూరివారు శ్రౌత కార్యాలకు కోనసీమ వారిని ఆహ్వాని౦చే వారు కాదని ,తర్వాత పిలిచినా కొనసీమనుంచి ఎవరూ రుత్విక్కులుగా వచ్చేవారుకాదని కపిలవాయి సోదరులు ఉవాచ .దెందుకూరి గారు తమిళ వేదపండితులవైపు మొగ్గు చూపి ,సామవేదగానాన్ని ,కోనసీమ యజ్ఞేశ్వర శాస్త్రి గారు బోధించిన’’ ఆంద్ర గాన’’ విధానాన్ని కాదని తమిళనాడు విధానాన్ని ప్రవేశ పెట్టారు .కనుక మేము ‘’ఎవరో చెప్పిన గానాన్ని ఎందుకు అనుసరించాలి ?’’అని సోదరుల ప్రశ్న .
ఒకే సారి అనేక క్రతువులు ఒకే చోట చేయటం విషయం లోనూ అభి ప్రాయ భేదాలొచ్చాయి . యజ్ఞేశ్వరులు ‘’సరైన నిష్ణాతులైన వారు నిర్వహిస్తే ,వారు బంధువులుకాని స్నేహితులుకాని కాకపొతే ,రెండు ప్రదేశాలు ఒకనది లేక కొండ చేత విడదీయబడి ,ఒక చోటి శబ్దం వేరే చోట వినబడనంత దూరం లొ ఉంటేనే అనేక క్రతువులు నిర్వహించాలని ‘’యజ్ఞేశ్వర శాస్త్రిగారు చెప్పారు .క౦చి స్వాములు కొన్ని విషయాలపై తమ అభిప్రాయాన్ని కోరితే అన్నీ పూసగుచ్చినట్లు వివరించి రాసి పీఠానికి అందజేశారు యజ్ఞేశ్వరులు .వీరి అభిప్రాయాలను వారు పూర్తిగా అంగీకరించి ,ఆమోద ముద్ర వేశారు .
యజ్ఞేశ్వర గారి అభిప్రాయాలను లంకావారు సమర్ధించారు .’’అభిచార ‘’విషయం లొ యజ్ఞేశ్వర, లంకా వారలపై తీవ్ర ఆరోపణలు ఉండేవి .వీటికి సమాధానాలు చెప్పటానికి వారిద్దరూ బాగా ముసలి వారైపోయారు ,లంకావారు 1983నవంబర్ లొ దేహం చాలించారు .కనుక’’ డిఫెన్స్’’ ఇవ్వలేకపోయారు .కనుక కోనసీమ ,కృష్ణా శ్రౌతులమధ్య తమిళ గాన, ఆంధ్రగాన వివాదం అలాగే ఉండిపోయింది .
తర్వాత కాలం లొ వైదిక విధి లొ కొన్ని సమస్యలొచ్చాయి. ఇవి తెలుసుకోవటం చరిత్రను తెలుసుకోవటమే అవుతుంది .చాలా ఉత్సాహంగా ఉంటాయి కూడా .కపిలవాయి వారి ఆరోపణ లొ దెందుకూరి వారి ఋత్విక్కులు రజస్వల కాని పిల్లలను పెళ్లి చేసుకోన్నారనేది ఒకటి .కనుక వారికి రుత్విజ అర్హత లేదంటారు .రెండోది దెందుకూరి గారు శ్రౌతాన్ని వ్యాపారంగా మార్చేశారని.డబ్బుకోసం కక్కుర్తి పడి కొన్నిటిని అతి తక్కువ సమయం లో అంటే చేయాల్సిన సమయంకంటే సగం సమయం కూడా తీసుకోకుండా , యజమాని అమాయకత్వాన్ని’’ కాష్’’ చేసుకొని సమయమంతా డబ్బు మీదే లగ్నం చేస్తున్నారని, చేసి లాభం పొందుతున్నారనేది.. దెందుకూరివారు కోనసీమలో సరైన వారులేక ,ఇక్కడి తమ సంపాదన చూసి ‘’అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ‘’అనే సామెత రుజువు చేస్తున్నారు ‘’అంటారు .
దువ్వూరి యాజులు గారు చేసిన పౌండ రీకానికి దెందు లూరివారు ఆర్ధిక సహాయం చేశారు .దీనితో వీరిద్దరిమధ్య సయోధ్య కుదిరి ,శ్రీరామపురం ,నేదునూరు వేదపండితులు దూరమయ్యారు .ఒక రకంగా దువ్వూరి వారిని ‘’కొనేశారు ‘’అంటారు కపిలవాయి ,దెందుకూరి వర్గాలకు చెందని తటస్థులైన వేదపండితులు .వీరే ‘’శ్రౌత కక్షలు అంతానాటకం ,రాజకీయం ‘’అన్నారుకూడా .దువ్వూరి ,దెందు లూరి కుటుంబాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ‘’గొల్లపల్లి ‘’వేదపండిత కుటుంబాలతో వివాహాలు ఇచ్చిపుచ్చుకున్నట్లుగా జరిగాయి .
బ్రహ్మశ్రీ దెందు కూరి అగ్ని హోత్ర సోమయాజులుగారు
దెందుకూరి అగ్ని హోత్ర యాజులుగారి కుటుంబం లొ 15తరాల వేదం పండితులున్నారు .ఆయన త్రేతాగ్ని హోత్రులు ‘.కుమారుడు శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజులు గారుకూడా అగ్ని హోత్రం చేస్తారు .పెద్దయాజులుగారి వద్ద పెద్దపెద్ద ప్లాస్టిక్ సంచులలో సంస్కృత ,తెలుగు గ్రంథాలున్నాయి.ఇద్దరి కలర్ జిరాక్స్ ‘’రెస్యూమ్స్’’ కూడా అందరికి పంచి పెడతారు . రూపాయలలో కాని, డాలర్లలో కాని ‘’ఇష్టి’’ కోసం ధన సాయం అర్దిస్తారు .ఈ అభ్యర్ధనలు ఏదోఒక సారి మాత్రమే కాదు .పదే పదే అడగటం వారికి పరిపాటి .ఈ లక్షణం ఇప్పటివరకు మనం చెప్పుకొన్న ప్రసిద్ధ కోనసీమ శ్రౌతుల విషయం లొ లేనేలేదు .ప్రపంచ౦ సుభిక్షం గా ఉండాలనే వారు కాక్షించి చేశారు తప్ప స్వంత లాభం కోసం కానేకాదు .అంతా అయ్యాక యజమానులు యెంత ఇస్తే అంతే స్వీకరించారే తప్ప ముందుగా బేరసారాలు ఉండేవికావు వారి విషయం లో.
1980నాటికీ కోనసీమలో శ్రౌతకార్యాలు చివరి దశకు చేరుకొంటే ,180మైళ్ళ పడమర లొ ఉన్న కృష్ణా తీరాన విజయవాడలో అప్పుడప్పుడే మొదలయ్యాయి.2005కు కృష్ణా జిల్లాలో 20 మంది ‘’ఆహితాగ్ని’’లున్నారని,అందులో 12 మంది బెజవాడలోనే ఉన్నారని దెందు కూరి చెప్పారు . నిత్యాగ్ని హోత్రులలో దెందుకూరి తండ్రీ కొడుకులు ,రెండు చింతల ,విష్ణు భొట్ల ,కప్పగంతుల ,మద్దూరి మొదలైన కుటుంబాల వారున్నారు .1965లొ దెందు కూరిగారు విజయవాడలో ‘’అగ్ని స్టోమం ‘’చేసి ,తర్వాత అనేక శ్రౌత కార్యాలు నిర్వహించి ‘’బహు యాజి ‘’ అనిపించుకొన్నారు .వాజపేయం ,సర్వ తో ముఖం ,అరుణ కేతు ,మూడు పౌండ రీకాలు మొదలైనవి చేసిన ఘన చరిత్ర ఆయనది .ముగ్గురుకొడుకులకు నేర్పారు . ఇద్దరు కూతుళ్ళను వేదపండితులకిచ్చి వివాహాలు చేశారు . ఒక’’ వేద సభ’’ స్థాపించి కృష్ణాజిల్లాలో వైదిక వ్యవస్థకు బలం చేకూర్చారు .
శ్రౌత కక్ష ఉన్నా , కపిలవాయి వెంకటేశ్వర్లు గారు దెందు కూరి వారి 18 శ్రౌతకార్యాలలో లంకావారిలాగా రుత్విజులుగా చూపిన సర్వ సమర్ధతను మెచ్చుకొని, తమ విశాల హృదయన్ని ఆవిష్కరించారు .. దెందు కూరిగారి తండ్రీ ,పెద్దన్నపౌండరీక యాజులుగారు కూడా ‘’ఆహితాగ్ను’’లే .తండ్రిగారు గుంటూరు జిల్లా నల్లపాడు నుంచి ఇక్కడి విజయవాడకు వచ్చారు . డయాబెటిస్ ,నరాల బలహీనత ,కీళ్ళ నొప్పులు ఉన్నా ,అన్నిటినీ అధిగమించి దెందు కూరి యజ్ఞేశ్వర సోమయాజులుగారు ,కోనసీమలోని కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి ,,రెండు చింతల యాజులు గార్ల రికార్డ్ లను అధిగమించి ,కొత్త రికార్డ్ సాధించి,స్థాపించి , తమకు ,కృష్ణాజిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.బెజవాడలో చాలా సార్లు దెందు కూరి యాజులు గారిని వేదసభలలో,యజ్ఞ, యాగాలలో,పీఠాధిపతులు విచ్చేసి నపుడు చూశాను .పొట్టిగా నుదుట దట్టమైన విభూతి రేఖలతో మెడలోరుద్రాక్షలతో ,మొకాలిపైకి బిగి౦చికట్టిన అంగోస్త్రం,పైన ఉత్తరీయం ,చేతిలో దర్భలకట్ట తో కనిపించేవారు .
అన్నవరం వారి దేవస్థాన సర్వీస్ లొ ఉన్న కపిలవాయి రామ శాస్త్రి గారిని దేవస్థానం 2014 ఫిబ్రవరి-మార్చి లొ నెల్లూరు జిల్లా మాదిరాజు గోడూరు గ్రామం లో జరిగిన ‘’వ్యూధ పౌండ రీకం ‘’కు సలహాదారుగా ఉండమని పంపింది దీనికి’’ యజమాని’’ కపిలవాయి రెండు చింతల కృష్ణ చయనులుగారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్