ఊసుల్లో ఉయ్యూరు -61 ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాదా కృష్ణమూర్తి

ఊసుల్లో ఉయ్యూరు -61

ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాదా కృష్ణమూర్తి

27-10-18 శనివారం ఉయ్యూరులో సుమారు తొంభై ఏళ్ళ వయసులో మరణించిన శ్రీ మంత్రాల రాధాకృష్ణమూర్తి గారి తో నామొదటి  పరిచయం 1950-51లో .అప్పుడే మేము హిందూపురం నుంచి ఉయ్యూరు వచ్చేశాము .ఆయన ఉయ్యూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో గుమాస్తాగా పని చేస్తున్నట్లుజ్ఞాపకం .సన్నగా పొడవుగా పాంటు షర్ట్ తో ఉండేవారు .ఆయన స్థితిపరులు, ఎరువుల వ్యాపారి మానాన్నగారి శిష్యుడు అయిన  శ్రీ యడవల్లి శ్రీరామమూర్తి గారి పెద్దల్లుడు .శ్రీమతి మంగమ్మగారి భర్త . ఆకాలం లో రాదాకృష్ణమూర్తిగారిని మగవాళ్ళందరూ’’ యడవల్లి వారల్లుడు ‘’అనీ ,ఆడవాళ్ళంతా ‘’మంగమ్మగారి మొగుడు ‘’అనే పిలిచేవారు .ఆతర్వాత పాలిటెక్నిక్ కాలేజి  బెజవాడ తరలి వెళ్ళిపోవటం తో ,ఈయనకూడా అక్కడికే వెళ్లి పనిచేశారని జ్ఞాపకం .తర్వాత ఉద్యోగం మానేసి ,ఉయ్యూరులోనే ఉంటూ వ్యవసాయం చూసుకొనే వారు .విష్ణ్వాలయం వెనక బజారులో యడవల్లి వారి లోగిలి  ఉండేది .శ్రీరామమూర్తిగారి తమ్ముడు కూడా ఎరువులకోట్లో వ్యాపారం చూసేవారు .వాళ్ళ కొట్లోనే మా నాన్నగారికాలం లోనూ , ,నేను వ్యవసాయం చూసేమొదటి రోజుల్లోనూ  అరువు తీసుకొని ఎరువులు కొనేవాళ్ళం .ఆయనకు మొహమాటం అస్సలు  ఉండేదే కాదు . నిక్కచ్చిమనిషి .అక్కడే శ్రీ చిలుకూరి వెంకటేశ్వర్లుగారు గుమాస్తాగా పని చేస్తూ ,మా బజారులోనే అద్దెకుండేవారు .మా ఇంట్లో తద్దినాలకు భోక్తగా యడవల్లి వారి పర్మిషన్ తో వచ్చేవారు .వీరి కుటుంబం,  వీరబ్బాయిలు, అమ్మాయిల తో మాకు చాలా సాన్నిహిత్యం ఉండేది .

  నేను వ్యవసాయం చేసే రోజుల్లో గౌండ్ల కుర్రాడు ఎర్రగా ఉండే కృష్ణ అనేవాడు పాలేరు తనానికి వచ్చాడు .వాడు అప్పుడే మంత్రాలవారి చిన్నపాలేరుగా  మానేసి ,మాదగ్గర చేరాడు . . మా శ్రీ సువర్చలాంజ నేయస్వామి బజారులో అంటే రావి చెట్టు బజారు లో మంత్రాలవారు డాబా కట్టుకొని ,పశువుల శాలను ప్రక్కనే ఏర్పాటు చేసుకొని ఎడ్లు ,బండీ ,పెద్దపాలేరు ,చిన్నపాలేరు లను  మైంటైన్ చేసేవారు . ఆయన వ్యవసాయం గురించీ ,యాజమాన్యం గురించీ పాలేరు కృష్ణ కథలు గాథలుగా  నాకూ, మా అమ్మకు వర్ణించి చెప్పేవాడు . ఈయన పెద్దపాలేరు  నిఘామాను చాకలి అతను .చాలా శ్రద్ధగా వ్యవసాయం చేసేవాడు .ఇతని తమ్ముడు హైస్కూల్   లో నా క్లాస్ మేట్.అంతకు మించి మాద్దరికీ పెద్దగా పరిచయం లేదు .గురజాడ డొంకలో కాలవ చివరి భూములు మావి .మాకు కాలవ నీళ్ళు రావాలంటే మంత్రాల వారి తడుపు అయ్యాకే వాళ్ళు వదిల్తే మధ్యలో వాళ్ళ తడుపులు పూర్తయితేనేకాని మాచేలో నీళ్ళు అడుగు పెట్టేవికావు .మంగమ్మగారి చెల్లెళ్ళలో ఒకరిద్దరు హైస్కూల్ లో నాక్లాస్ మేట్లని ,అందులో ఒకమ్మాయి భర్త కాకినాడ పాలిటెక్నిక్ లో లెక్చరర్ అనీ తర్వాత ప్రిన్సిపాల్ అయ్యారని గుర్తు .ఒకావిడ ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో మా కోడలు శ్రీమతి సమత తోపాటు  టీచర్ గా పనిచేస్తోంది మంత్రాలవారబ్బాయిలు హైస్కూల్ లో నా స్టూడెంట్స్ .ఒకతను మా అబ్బాయికి మంచి దోస్తు .ఇద్దరూ క్రికెట్ ఆడేవారు ఇక్కడి కాలేజిలో . మంగమ్మగారు చాలా పెద్దమనిషి తరహా గా వ్యవహరిస్తారు .ఈ దంపతులు మా ఇంట్లో జరిగిన శుభాకార్యాలన్నిటికీ తప్పక వచ్చేవారు .

                       బ్రాహ్మణ సంఘం పునరుద్ధరణ

 ఉయ్యూరు లో బ్రాహ్మణ సంఘం నామ మాత్రంగా పని చేసేది .అప్పుడు నా సహాధ్యాయి మా గురువుగారు శ్రీ వేమూరి శివరామకృష్ణయ్యగారి కుమారుడు  దుర్గయ్యగారు అనే  శ్రీ వేమూరి దుర్గా ప్రసాద్ ధర్మపురి సంస్కృత కాలేజీ నుంచి మానేసి ఇక్కడికొచ్చి స్థిరపడి ,మొదట్లో కొంచెం ఇబ్బందులు పడినా కెసీపి వాళ్ళ స్కూల్ ఆర్. కే .ఎం .లో తెలుగు పండిట్ ఉద్యోగం సంపాదించి అక్కడే రిటైరయ్యాడు  అందరితో చాలా చనువుగా ఉండేవాడు .అప్పుడు మేమందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణసంఘాన్ని పునరుద్ధరించాలని సంకల్పించాం .అప్పటికి ప్రెసిడెంట్ కం సెక్రెటరి’’ టైప్ మాస్టారు ‘’గా అందరు పిలిచే  శ్రీ సీతం రాజు సత్యనారాయణ గారు .నేను మంత్రాల రాధాకృష్ణగారు, దుర్గయ్య ,గోవిందరాజు వెంకటేశ్వర్లుగారు ,కొలచల చలపతి,వేగరాజు బ్రదర్స్ ,కోట బ్రదర్స్ ,చావలి ఆంజనేయులుగారు  మొదలైనవారందరం కలిసి దుర్గయ్యగారిని బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షునిగా, నేను వైస్ ప్రెసిడెంట్ గా ,రాదాక్రిష్ణమూర్తిగారు  సెక్రెటరిగా  గోవిందరాజు వెంకటేశ్వరరావు గారు కోశాధికారిగా ,సత్యనారాయణగారు గౌరవాధ్యక్షులుగా ,మిగిలినవారిని సభ్యులుగా చేసి ఒక ఎడ్ హాక్ బాడీఏర్పాటు చేశాం .సంఘాన్ని రిజిస్టర్ చేయించే బాధ్యతదుర్గయ్య , మంత్రాల , గోవింద రాజు  గార్లు తీసుకొని అతి త్వరలోనే రిజిస్టర్ చేయించారు .మొదటిసారిగా ఉయ్యూరు లో వృద్దతరం వారిని సన్మానించా లనుకోని ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్త శ్రీ కోటశ్రీరామమూర్తిగారినీ ,శివాలయం అర్చకులు శ్రీ మామిళ్ళపల్లి పురుషోత్తం గారిని ఒక ఉగాది నాడు  సన్మానించాం.ఆతర్వాత సీతంరాజువారిని, రామాచార్యులు గారిని అలా సత్కరించాం .సామూహిక ఉపనయనాలు నిర్వహించాం .వివాహవేదిక కూడా జరిగింది .ప్రతి ఉగాది మధ్యాహ్నం శ్రీ విష్ణ్వాలయం లో బ్రాహ్మణ సంఘం సమావేశం జరిపి వేదపండితులను ,వేద విద్యార్ధులను ఆహ్వానించి సత్కరించి ,నగదు పారితోషికాలిచ్చాం ,కార్తీక వనసమారాధనలు నిర్వహించాం .చుట్టు ప్రక్కల మండలాలకూ విస్తరి౦పజేశాం .శివాలయం లో శ్రీ శంకర జయంతి జరిపాం .ఇలా దిన దిన ప్రవర్ధమానంగా సంఘం అభి వృద్ధి చెందింది .ఊళ్ళో కి వచ్చిన చదువుకున్న బ్రాహ్మణులకు ,పేద బ్రాహ్మణులకు ఆర్ధిక సాయం అందించాం .ప్రతినెలా తప్పకుండా కార్యవర్గ సమావేశం నిర్వహించాం .ఈకార్యక్రమాలకు రమణ పంతులు బాపిరాజు  యెన్డి.ఎస్.,,ప్రభాకర్ వగైరా  లంతా అత్యుత్సాహంగా సహకరించారు .వీరందరినీ సమీకరించి ,సమన్వయ పరచటం మంత్రాలవారు చేసేవారు .ఏపనికైనా కాలికి బలపం కట్టుకొని తిరిగే వారు .మంత్రాలవారు ఉంటె కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందనే ధీమా ఉండేది .నవ్వుతూ నవ్విస్తూ బాధ్యతగా  పని చేసేవారు చేయించేవారు .ఉగాదినాడు వారింట్లో ఆబ్దీకం ఉండేది .దాన్ని యధావిధి గా నిర్వహించి, బ్రాహ్మణసంఘ కార్యక్రమం లో పాల్గొనేవారు. అంతటి అంకితభావం ఆయనది.ఈసంఘం లో అందరం కలిసి పనిచేయటం తో మా ఇద్దరిమధ్యా పరిచయం బాగా పెరిగింది. ఒకరంటే ఒకరికి గౌరవభావమేర్పడింది .ఇక ఇప్పుడు మంత్రాలవారు తెల్లలుంగీ ,పైన చొక్కాతోనే ఎప్పుడూ ఉండేవారు .అప్పటికి ఉయ్యూరు లో లబ్ధ ప్రతిస్టు లైన పురోహితులు బ్రహ్మశ్రీ వంగల సుబ్బావధానులుగారు, శ్రీ కోట కృష్ణమూర్తిగారు వృద్ధాప్యం లో ఉండటం గ్రామాంతరం వెళ్ళిపోవటం తో పెద్ద శూన్యమేర్పడింది .అప్పుడు దుర్గయ్య ఆలోచించి శ్రీ పుచ్చా సూర్యప్రకాశ శాస్త్రి గారిని గౌరవంగా ఆహ్వానించి ఇక్కడే ఉండేట్లు వసతి సౌకర్యాలు కలిపించాడు .దీనికి మంత్రాలవారు చాలా దోహదం చేశారు .మాబోటివారం చేతనైంత చేయగలిగాం .ఆయన ఇక్కడే స్థిరపడి ఇల్లుకూడా కొనుక్కున్నారు .మొదట్లో మేము చేయిఅందించినా , ఆయన చొరవ ,పాండిత్యం ,మాటకారి తనంతో బాగా అల్లుకు పోయారు .  

   2002 లో మేము అమెరికా మొదటిసారి వెళ్లి తిరిగి వచ్చేసరికి బ్రాహ్మణ సంఘం పరిస్థితి  క్షీణించింది .దుర్గయ్య రిటైరై ,స్వగ్రామం పెదముత్తేవి వెళ్ళిపోయాడు .సంఘం బాధ్యత ఎవరూ తీసుకోలేదు .అప్పుడు సమావేశాలంటే గోవిందరాజులవారి అరుగుమీదే రాత్రిళ్ళు ఎక్కువ గా జరిగేవి .అందరు నన్ను బాధ్యత తీసుకోమన్నారు .నాకు దేవాలయం ఉంది ,సాహిత్య సేవ ఉంది .పూర్తి కాలం దీనికి పెట్టలేనుకనుక ఇంకెవరైనా తీసుకొంటే మంచిది అన్నాను .ఎవరూ ముందుకురాలేదు .దుర్గయ్య రెండు మూడు సార్లు వచ్చి ఎవరికైనా అప్పగిద్దామని చూశాడు .వాడూ విసిగిపోయాడు ఇక్కడి వీళ్ళ తీరు చూసి .అప్పుడప్పుడు నాతో రహస్యంగా ‘ఒరేయ్ !ఇందులో’’ ఒక గ్రూప్’’ ఏర్పడి వెనకనించి పెత్తనం చేయాలనిచూస్తోంది .నా నోరు గట్టిది కనుక నాదగ్గర వాళ్ళ ఆటలు సాగలేదు.దబాయించి ఎదురు నిలిచి ఇప్పటిదాకా లాక్కొచ్చా ‘’అన్నాడు నాకూ అది నిజమే అనిపించింది .నేను తీసుకొను బాధ్యత అని చెప్పగానే  మంత్రాలాయన ,గోవిందరాజులాయన కొంతకాలం  నాపై గుర్రుగా చూసేవారు .కనిపిస్తే పలకరించేవారుకూడాకాదు  .చాలామంది నన్నే బాధ్యత తీసుకోమనేవారు నాకు వద్దని నిష్కర్షగా చెప్పేవాడిని .తర్వాత రమణ పంతులు, గరుగుమీద సోమయాజులవారబ్బాయి  లతో ఒక కార్యవర్గం ఏర్పాటు చేసి నడపటం మొదలెట్టారు .వీరిని’’ బాక్ డ్రైవింగ్ ‘’చేస్తూ దుర్గయ్య చెప్పినవర్గం డామినేట్ చేస్తూ ఏ పెత్తనం ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారని విన్నాను.నేను సభ్యత్వం తీసుకోవటమూ మానేశాను .నన్నూ వాళ్ళు పిలవటం మానేశారు .బాపిరాజు ఉద్యోగం నుంచి రిటైరయ్యే దాకా ఇలానడిపి   తర్వాత బాపి రాజుకు పూర్తి పెత్తనం అప్పగించికార్యక్రమాలు చేస్తున్నారు .బాపిరాజుమాత్రం కార్యక్రమాలు నాకు తెలియజేస్తూ హాజరుకమ్మని కోరేవాడు. వీలయితే  వెడుతున్నాను .

  మంత్రాల రాదాక్రిష్ణమూర్తిగారు ఆరోగ్యం బాగుండక దాదాపు నాలుగైదేళ్ళనుంచి  ఇంట్లో నుంచి బయటికి రావటం లేదు .రెండేళ్ళక్రితం ఒకసారి ఇంటికి వెళ్లి పలకరించిన జ్ఞాపకం .అప్పుడే మేము జరిపిన ఐదురోజుల శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమాలలో ఒక రోజు దేవాలయానికి వచ్చారు .అదే చివరి సారి చూడటం .ఆయన శ్రీమతిగారు ఊళ్ళో పెద్దముత్తైదువు . అందరికీ ఆవిడంటే విపరీతమైన గౌరవం మర్యాద .మా గుడికార్యక్రమాలకు తప్పకుండా  ఆవిడా, కుమార్తె పద్మజ  వస్తారు .పద్మజ కు సంగీతం లో ప్రవేశం ఉంది. మేము గుడిలో జరిపే త్యాగరాజ ఆరాధనకు వచ్చి కమ్మగా పాటలు  పాడుతుంది . ఈమె కూతుళ్ళు ఇద్దరూ నేను ఫ్లోరాలో పని చేసినప్పుడు చదివి  బిటెక్ పాసై వివాహాలు జరిగి అమెరికాలో సెటిల్ అయ్యారు .పద్మజ భర్త మా రమణ కు మంచి స్నేహితుడు .వీడు ఆ అమ్మాయిని అక్కా అనిపిలుస్తాడు ఆ అమ్మాయి తమ్ముడూ అని అని పిలుస్తుంది . తండ్రిని అనునిత్యం కనిపెట్టుకొని ఉండే ఒక కుమారుడూ తరచుగా దేవాలయానికి వస్తాడు .మిగిలిన కొడుకుల్లో వాళ్ళు ఎప్పుడు ఉయ్యూరు వచ్చినా  శ్రీ సువర్చలాన్జనేయస్వామి ని దర్శించకుండా వెళ్లరు .  

  ఇలా అందరికీ తలలో నాలుకగా చురుకైన బ్రాహ్మణసంఘ కార్యదర్శిగా , స్నేహశీలిగా ,సంస్కార వంతునిగా ,సమాజ సేవా దృక్పధం ,అర్ధులకు ఆర్ధిక సాయం అందించే దాత గా గుర్తింపు పొందిన శ్రీ మంత్రాల  రాదా కృష్ణ మూర్తి గారు మరణించటం తీరనిలోటు .వారి ఆత్మకు శాంతికలగాలని, వారి కుటుంబం ఈ దుఖం నుంచి నెమ్మదిగా తేరుకోవాలని ,ఆకుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను .

   సుమారు ఏడెనిమిది నెలల క్రితం బ్రాహ్మణ సంఘం ట్రెజరర్ గా దీర్ఘకాలం పనిచేసిన తొంభై ఏళ్ళు దాటిన శ్రీ గోవిందరాజు వెంకటేశ్వరరావు గారు మరణించారు . వృద్దతరం ఇలా కనుమరుగవుతోంది .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-18-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.