గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )

   శ్రీ ముత్యం పేట గౌరీశంకర శర్మ తెలంగాణా మెదక్ జిల్లా దుబ్బాకమండలం లచ్చపేట లొ శ్రీ నాగ లింగ శాస్త్రి ,శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లొ ఉంటున్నాడు .వేములవాడ రాజరాజేశ్వరీ కళాశాలనుంచి సంస్కృత౦ లొ బి. ఏ.,ఉస్మానియా యూనివర్సిటినుండి తెలుగు సంస్కృతాలలో  ఎం ఏ . డిగ్రీలుపొంది కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ఎం ఫిల్ అందుకున్నాడు .

 శంకర శర్మబాల్యమిత్రుడు ముదిగొండఅమరనాధ శర్మతో కలిసి   సంస్కృతం లొ మహాకాళీ సుప్రభాతం ,శ్రీ రామ చంద్ర సుప్రభాతం ,చాము౦డేశ్వరీ స్తోత్రం రాశాడు . ముదిగొండ అమరనాధ శర్మతో కలిసి 10 సంస్కృత ఆంద్ర అస్టావవధానాలు చేశాడు .భువన విజయ సాహిత్య రూపకాలలో  ధూర్జటి ,పెద్దన ,గా 50 ప్రదర్శనలిచ్చాడు .వైదిక ధర్మ కర్మ నిష్ణాతుడు .20 07 లొ నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ‘’కలాసుబ్బారావు స్మారకపురస్కారం ,20 08  లొ సద్గురు శివానంద మూరర్తిగారి సమక్షం లొ శైవ క్షేత్రం లొ అమరనాధ శర్మతో కలిసి అష్టావధానం చేసి పురస్కారం పొందాడు 2009లోసత్యసాయి సేవాట్రస్ట్ బూర్గుపల్లి గజ్వేల్ వారిచే ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం ,సిద్ధిపేట స్వర సాధన వారి చే ‘’ఉపాధ్యాయ రత్న ‘’పురస్కారం ,2011 లొ వంశీ అంతర్జాతీయ సంస్థచే ఉగాది పురస్కారం ,గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా మెదక్ జిల్లా ఉత్తమ భాషోపాధ్యాయ పురస్కారం ,కలెక్టర్ చే సన్మానం అందుకొన్నాడు ఆకాశవాణిలో అమరవాణిసంస్కృత ప్రసంగాలు చేశాడు శైవమత ప్రబోధిని మాసపత్రికకు అయిదేళ్లుగా సహాయ సంపాదకుడు .

334-శ్రీ నోరి నరసి౦హోదాహరణకర్త –ముదిగొండ అమరనాథ శర్మ (1968 )

 దుబ్బాక వాస్తవ్యుడైన ముదిగొండ అమరనాథ శర్మఅనర్గళంగా సంస్కృత రచన చేయగల దిట్ట . 15-7-1968 న మెదక్ జిల్లా దుబ్బాకమండలం లచ్చం పేట లొ జన్మించాడు తలిదండ్రులు శ్రీమతి శ్రీ సిద్ధమణి శివారాధ్య .6 వ తరగతినుంచి బియే ఓ ఎల్ వరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీ సంస్కృత కళాశాలలో చదివాడు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి  తెలుగు సంస్కృతంలలో ఎం ఏ డిగ్రీలను ,పిహెచ్ డి  పొందాడు .సికందరాబాద్ సర్దార్ వల్లబాయి పటేల్ డిగ్రీకాలేజి లొ సంస్కృత ఉపన్యాసకుడు .

  మా టివిలో ‘’శివ గీతా ప్రవచనం ‘’అమరవాణీ ప్రసంగపాఠాలు రేడియో ప్రసంగాలు శ్రౌత శైవంపై ఉపన్యాసాలు ఇస్తున్నాడు భువన విజయం లొ ధూర్జటి పాత్ర పోషిస్తాడు .బాల్యమిత్రుడు ముత్యంపేట గౌరీ శంకర శర్మతోకలిసి సంస్కృత తెలుగు అష్టావధానాలు 10 చేశాడు .ఈ జంటకవులు శ్రీ మహాకాళీ సుప్రభాతం  శ్రీ రామ చంద్ర స్వామి సుప్రభాతం ,శ్రీ చాము౦డేశ్వరీ సుప్రభాతం ,సద్గురు శివానందాస్టకం  రాశారు .శ్రౌత శైవ  సేవలో  జీవితం ధన్యం చేసుకొంటున్నారు .శైవ మహా పీఠం ఆస్థాన పండితుడు .సద్గురు శ్రీ శివానందమూర్తి  శ్రీ నారా చంద్ర బాబు గార్లనుండి సంస్కృత పండిత పురస్కారాలు అందుకొన్నాడు .

 .సంస్కృతం లొ చాలారచనలు చేసినా   నోరి నరసింహ శాస్త్రి గారి 114జయంతి సందర్భంగా శాస్త్రిగారిపైసంస్కృతం లొ  ‘శ్రీ నరసి౦హోదాహరణ ‘’అనే స్తుతి లఘు కృతి రాశాడు .దీనికి డా ముదిగొండ శివప్రసాద్ ఆశీరామోదం రాశారు . సాధారణంగా ఉదాహరణ రచన చేయటానికి కవులు ఇష్టపడరు .ముఖ్యంగా దేవతా స్తుతికే ఉదాహరణ రాస్తారు .ఒక్కోసారి మానవోత్తములపైనా రాశారు .రుషి తుల్యుడైన కవి సమ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారిపై రాసినది కనుక గ్రంధము సుగంధమైనది అన్న ముదిగొండ శివ ప్రసాద్ గారి మాట అక్షర సత్యం .అమరనాధశర్మ రచన గుణబందురమై శోభిల్లింది ఇందులోని ఒకటి రెండు ఉదాహర శ్లోకాలను ఉదహరిస్తాను

-నోరి వంశ కులోత్పన్నం –కవి  సమ్రాద్విభూషితం –నరసింహ శాస్త్రిణ౦ వందే –నానా శాస్త్ర విశారదం ‘’

1-ప్రధమా విభక్తిః-

శ్రీమన్నోరి కులోద్భవో విజయతే శ్రీ నారసి౦హాభి ధో –ధీరోదాత్త కవిత్వ తత్వ లసితో రమ్యార్ధభావాన్వితః

సచ్చారిత్ర వినూత్న లక్షణయుతో సత్యవ్రతీ సాత్వికో –శ్రీ చక్రాంకిత మానసో గురువరో విజ్ఞాన కోశాన్వితః

మహా లక్ష్మ్యా సుపుత్రోయం హనుంచ్చాస్త్రి తోషకః –నరసింహ మహా ప్రాజ్ఞః జీయా దాచంద్ర తారకం ‘’

ప్రశస్త స్తోత్రియ ప్రమాణ విద్యయా విరాజతే –వివేక నిత్య సత్య తత్వ చిన్మయాఖ్య దీక్షయా

సమగ్ర కావ్య నాటకాది నవ్యభావనాన్వితో –నృసింహ సత్కవీశ్వరోహి నిత్య నూత్న భావుకోః’’

2-సప్తమీ విభక్తిః

రాస్ట్రే స్మిన్ ‘’త్వయి ‘’కావ్య దివ్య రచనా నిర్మాణ పారీణతా –లోకేస్మిన్ భవదీయ దివ్య గరిమా భో భూయతే సర్వదా

విశ్వేస్మిన్ వరగేయ నాటిక కథా’’యుష్మాసు ‘హృద్యాన్వితా –శ్రీ విద్యాచ ‘’భవత్సు ‘’శాక్తమహిమా నిత్యం దారీ దృశే ‘’

శ్రీ శృంగేరీ విరూపాక్ష –పీఠాదీశ్వర సన్నిధౌ –శాస్తార్ధ చింతనం కృత్వా –కృత కృతాశ్చశాశ్వతం ‘’

పా౦డిత్యే ‘’కవనే ‘’పురాణ కథనేశ్రీ చక్ర నిత్యార్చనే –వేదాంతే శృతి గోప్య దివ్య విషయే వాక్యార్ధ చర్చాన్వితే

వక్తృత్వేచకుటుంబ పోషణ విదావధ్యాపనే దార్మికే –సర్వత్రాపి ‘’భవత్సు ‘’నవ్య పటుతా సందృశ్యతే సర్వదా ‘’

3-సార్వ విభక్తికం

‘’విశ్వేస్మిన్ కవిరాట్ ‘’త్వమేవ ‘’గణవాన్ జ్ఞానీతి’’త్వామేవ ‘’హి-త్వయ్యే తత్ప్రతి భాతిశబ్ద నిచయో ‘’తుభ్యం ‘’నమోసజ్జనాః

‘’త్వద్వైనూత్న’’ విశేష భావ మఖిలం సంప్రార్ధ్యతే సర్వదా –పాండిత్యం ‘’తవ ‘’సార్వకాలికమహో ‘’త్వయ్యై వ ‘’విజ్ఞానిదీ   సర్వత్రాపి విరాజతే బహుదా స్తోతుం సమాయా౦తిచ

ముదిగొండ సువంశేన –అమరానాదాఖ్య శర్మణా-రచితం నరసింహస్య –ఉదాహరణ వాజ్మయం ‘’

ఈ సంస్కృత ఉదాహరణ శ్లోకాలకు ఆయన మిత్రుడు శ్రీ ముత్యం పేట గౌరీ శంకరశర్మ తెలుగు అనువాదమూ చేశాడు .

ఆధారం -ఈ పుస్తకాన్ని నిన్నసాయంత్రం బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శర్మగారు నాకు అందజేయగా దాని ఆధారంగా ఈ ఇద్దరు గీర్వాణకవులపై రాశాను.

335-శ్రీ నృసింహ సాంఖ్య దర్శన కర్త –శ్రీ రాణీ నృసింహ మహాగ్ని చిత్ (1860)

శ్రీ రాణీ నృసింహ మహాగ్ని చిత్ గారే శ్రీ శృంగేరీ విరూపాక్ష పీతాదిపులైన జగద్గురు  బోధానంద భారతీ స్వామి .వీరు 1860 డిసెంబర్ 13 తూర్పు గోదావరిజిల్లా ఎనుగులమహల్ అగ్రహారం లొ శ్రీ రాణీ అనంత శాస్త్రి శ్రీమతి లక్ష్మీదేవి దంపతులకు శ్రీ నరసింహస్వామి వర ప్రసాదంగా  జన్మించారు . 8 వ ఏట ఉపనయనం జరిగి శ్రీ కర్రా సింహాద్రి శాస్త్రిగారి వద్ద సంస్కృత సాహిత్య ,జ్యోతిష విద్యలను నేర్చారు .12 వ ఏట పూనా లొ ‘’కేరో లక్షణ ఛత్రే’’గారి శిష్యులై పదేళ్ళు  వేద వేదా౦గ  పారీణులయ్యారు  . లోకమాన్య బాలగంగాధర తిలక్ వద్ద ఆంగ్లవిద్య నేర్చారు .

   12 వ ఏట తలిదండ్రులతో దేశాటన చేస్తూ ఒరిస్సాలోని కటక్ లొ జ్యోతిశ్శాస్త్ర పండితులను వాదం లొ ఓడించి సత్కారం పొందారు 22 వ ఏట విజయనగరం మహారాజా ఆనందగజపతి సంస్థాన పండితులయ్యారు .ప్లవనామ సంవత్సర అధికమాస వివాద సందర్భంగా రాజమండ్రి జ్యోతిష సభలోపాల్గొని తనవాదానికి విజయం పొంది ‘’దైవజ్ఞ సార్వ భౌమ ‘’బిరుదుపొందారు .రాజావారి ఆస్థానంలో ఉంటూనే చిన్నవయసులోనే ‘’ఆహితాగ్ని ‘’అయి ,యజ్ఞం చయనం,బృహస్పతి నవాన్తరాది శ్రౌతకర్మలలోప్రసిద్ధి చెంది ‘’నరసింహ మహాగ్ని చిత్ (చయనులు )అయ్యారు. విశాఖ అంకితం జగ్గారావు సంస్థానం లొ ‘’దివాను ‘’పదవి పొంది అసమాన లౌకిక ప్రజ్ఞతో అపర యుగంధర మహామంత్రి అనిపించారు .కశింకోట సంస్థానాధిపతి శ్రీ మారెళ్ళ వేంకట చలం పంతులు గారి అభ్యర్ధనపై ‘’వైదిక బోర్డ్ ‘’ప్రెసిడెంట్ గా  రెండేళ్ళు న్నారు.

  మహాగ్ని చిత్ గారు సంస్కృతం లొ ‘’నృసింహ సాంఖ్య దర్శనం ‘’ అనే శంకరాద్వైతాన్ని గణిత శాస్త్రం తో నిరూపించే భాష్య ప్రయుక్త సూత్ర గ్రంథం రచించారు .వీరి విజ్ఞాన ప్రాభవానికి జగద్గురు  పీతాధిపతులు ‘’సాంఖ్యా చార్య ‘’బిరుదుతో సత్కరించారు .37వ ఏట ‘’సూర్య గ్రహణము –శుద్ధాద్వైత ప్రతిపాదకము ‘’అని నిరూపిస్తూ ‘’చిత్సూర్యా లోకము ‘’అనే సంస్కృత నాటకాన్ని వేదాంతపరంగా ,శృంగారపరంగా రాశారు .ఇవే కాక తిధికల్పవల్లి ,చూడామణి కాలమానోపపత్తి మొదలైన అరుదైన జ్యోతిష గ్రంథ రచన చేశారు .’’యోగ దర్శనం ‘’అనే వేదాంత గ్రంథమూ రాశారు .భార్య మరణించగా మూడు తరాలనుండీ వస్తున్న  సన్యాసాశ్రమాన్ని స్వీకరించి శ్రీ విశ్వావసు సంవత్సర సంక్రమణ పర్వదినాన తురీయాశ్రమాదిపతులై శ్రీ శృంగేరీ విరూపాక్ష మఠం ను తూర్పు గోదావరిజిల్లా మండపేట లొ అధిస్టించి 17 సంవత్సరాలు పీఠాదిపతిగా ఉండి ‘’పరతత్వో పన్యాసం ‘’గ్రంథాన్ని శంకరాద్వైతానికి సంధానిస్తూ రచించారు .పీఠానికి శ్రీ కళ్యాణా నంద స్వామి వారిని అభి షిక్తులను చేసి విరమణ పొందారు .ఇప్పడు ఈపీఠం గుంటూరులో విరాజిల్లుతోంది .తర్వాత ఎనిమిదేళ్ళు బ్రహ్మ నిస్టా  గరిస్టులై విజయవాడ దుర్గా క్షేత్రం లొ ప్రజోత్పత్తి చైత్ర బహుళ అష్టమి గురువారం సిద్ధి పొందారు .కృష్ణ లంకలో వీరి సమాధి దర్శించవచ్చు

336-హంస కిరణావళీ కర్త –  శ్రీ రాణీ వేంకటాచలపతి ప్రసాద మహాగ్ని చిత్(1890 )

  శ్రీ రాణీ వేంకటాచలపతి ప్రసాద మహాగ్ని చిత్ గారు శ్రీ రాణీ నృసింహ మహాగ్ని చిత్ గారి పుత్రులే .కోనసీమ వాడ పాలెం లొ 11 9-1890 జన్మించారు.బాల్యంలోనే వేదవేదాంగాలు నేర్చారు .విజయవాడ చేరి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ గా 36సంవత్సరాలు సేవ చేశారు .విద్యార్ధులకు వైద్య విద్య నేర్పటం లొ వీరి విధానం ఆసక్తిగా ఉండేది .విదేశాలను౦డికూడావచ్చి వీరివద్ద శాస్త్రాలు నేర్చుకొనేవారు .

  ప్రసాద మహాగ్ని చిత్ గారు సంస్కృత గ్రంథాలు చాలా రాశారు .అందులో శ్రీ చక్ర ప్రాసాదము ,మాతృకా ప్రాసాదము ,సాంఖ్య వేదాంతప్రాసాదీయ భాష్య ముక్తాఫలము ,బ్రహ్మావగత్యో  పన్యాసము ,హంస కిరణావళీ,భానభాస్కరము విమర్శనామృతము ,సారోప దర్శనం మొదలైనవి ,  వీరి సంస్కృత గ్రంధములు అంత తేలికగా కొరుకుడు పడవు .ఇది గ్రహించి తర్వాత వారే తెలుగు అనువాదాలు రాసి సరళం చేశారు .తండ్రిగారి ‘’నృసింహ సాంఖ్య దర్శనం ‘’కూడా అర్ధం చేసుకోవటం కష్టమే .దీనికి ‘’చక్రవాకీ ‘’అనే తెలుగు తాత్పర్యం రాసి జ్జ్ఞాసులకు అందుబాటులోకి తెచ్చారు .వీరి సారోపదర్శనం ,భానభాస్కరం లకు కూడా తెలుగు తాత్పర్య గ్రంథాలను శిష్యమండలి ప్రచురించారు   తండ్రిగారిలాగానే యజ్ఞయాగాది చయ బృహస్పతి నవాంత కర్తలు .పండిత శిరోమణి .శ్రీ విద్యా బ్రహ్మవిద్యా విద్వద్వరే ణ్యులు వీరుసన్యాసం స్వీకరించి శ్రీ పరిపూర్ణ ప్రకాశానంద భారతీ స్వామి ‘’నామధేయులై  ప్రస్తుతం తురీయాశ్రమం స్వీకరించి విజయవాడలో ఉంటున్నారు .

   ఆధారం –బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిన్న సాయంత్రం నాకు అందజేసిన ;;శ్రీ రాజ్ఞీ నృసింహ మహాగ్నిచిత్ ప్రణీత ‘’నృసింహ సాంఖ్య దర్శనం’’(సంస్కృత తెలుగుచక్రవాకీ  వ్యాఖ్యానం ),శ్రీ పరిపూర్ణ ప్రకాశానంద భారతీ స్వామి వారి ‘’సారోప దర్శన ,భానభాస్కర శ్చ ‘’.

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19 11- 18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.