గౌతమీ మాహాత్మ్యం -19
29-అగ్ని తీర్ధం
సర్వక్రతు ఫలాన్నిచ్చే అగ్ని తీర్ధ విశేషాలు బ్రహ్మ నారదమహర్షికి తెలియ జేశాడు .అగ్ని సోదరుడు జాతవేదసుడు గొప్ప హవ్య వాహనుడు .ఒకసారి ఋషులు గౌతమీ తీరం లో చేసిన యాగ హవ్యాన్ని దేవతలకు తీసుకు వెడుతుంటే ,దితికొడుకు మధువు అనే వాడు నేర్పుగా అందరూ చూస్తుండగానే సంహరించగా దేవతలకు హవ్యం చేరలేదు .తనసొదరుడు మరణించాడని తెలుసుకొన్న అగ్ని కోపం తో గంగా జలంలో ప్రవేశించగా దేవతలు ,మానవులు అందరూ ప్రాణాలు కోల్పోయారు .పితృ దేవతలు మిగిలిన దేవగణం,ఋషులూ ఆ ప్రదేశానికి వచ్చి అగ్ని లేకుండా జీవి౦చలేము అని బాధపడి అగ్నిని –
‘’దేవాజ్జీవయ హవ్యేన,కవ్యేన చపిత్రూ౦స్తథా-మానుషానన్నపాకేన బీజానాం క్లేదనేనచ’’
అగ్ని దేవా !హవ్యాలతో దేవతలను ,కవ్యాలతో పితరులను ,అన్నం వండటానికి ,బీజాలను క్షేదనం చేయట౦ ద్వారా మానవులను బ్రతికించు .’’అని స్తుతించగా అగ్ని ‘’ఈపనులన్నీ సమర్ధంగా చేసే నాతమ్ముడిని చంపేశారు .నేను హవ్యవాహనుడనైతే నన్నూ చంపేస్తారేమో ?’’అనగా దేవతలు ఆలోచించి ‘’అగ్నీ !మేము నీకు ఆయుస్సు కార్యం లో ప్రీతి ,వ్యాప్తి లో శక్తి ,ప్రయాజాలు ,అనుయాజాలు (యజ్ఞభాగాలు )కూడా ఇస్తాం .నువ్వు దేవతల ముఖానివి .కనుక మొదటి ఆహూతి నీకే .తర్వాతే హవ్యా ద్రవ్యాన్ని మేము పొందుతాము ‘’అనగా అగ్ని సంతోషించి దేవతలకోరికపై సర్వ వ్యాపకుడై సర్వ సమర్దుడయ్యాడు .అప్పటినుంచి అగ్ని దేవుడు –జాత వేదసుడు ,బృహద్భానుడు ,సప్తార్చి ,నీలలోహితుడు ,జలగర్భుడు , శమీ గర్భుడు ,,యజ్న గర్భుడు అనే పేర్లతో పిలువబడ్డాడు .తదాది ఇహ ,పరాలలో అగ్నిసర్వ గతుడయ్యాడు .దేవతలు అగ్నిని ప్రతిష్టించిన తీర్ధమే అగ్ని తీర్ధం .ఇక్కడే ఏడువందల పుణ్య తీర్దాలున్నాయి –
‘’అగ్ని ప్రతిస్టితం లింగం తత్రాస్తే అనేక వర్నవత్ – తద్దేవ దర్శనాదేవ సర్వ క్రతు ఫలం భవేత్ ‘’
అగ్ని చే ప్రతిస్టింపబడిన శివలింగం అనేక వర్ణాలతో శోభిస్తుంది .అలాంటి శివ దర్శనం వలన సమస్త క్రతువులు చ సినంత ఫలం కలుగుతుంది .
30-ఋణవిమోచన తీర్ధం
కక్షీవంతుని కొడుకు పృధు శ్రవసుడు వైరాగ్యభావం తో పెళ్లి చేసుకోలేదు .అందుకని అగ్నికార్యమూ చేయలేదు .ఇతని చివరి తమ్ముడు అన్నకు పెళ్లి కాకపోవటం వలన ‘’విరి విత్తి’’గా ఉంటూ పెళ్లి చేసుకోవటానికి సందేహింఛి అగ్నికార్యమూ చేయలేదు .పితృదేవతలు వారిద్దరినీ వివాహాలు చేసుకొని తమ రుణ విముక్తి చేయమని చెప్పారు .పెద్దవాడు ‘’నేను పెళ్లి చేసుకోను .ఋణం ఏమిటి ?మనిషికి ఎందుకు మూడు రుణాలు ?’’అంటే చిన్నవాడు అన్నకు పెళ్ళికాకుండా తానూ చేసుకోను అన్నాడు . అప్పుడు పితరులు వారిద్దరినీ గౌతమీ స్నానం చేసి తర్పణాలు విడవమని సలహా చెప్పారు .
కక్షీవంతుని పెద్దకొడుకు పృధు శ్రవసుడు ,గంగాస్నానంచేసి శ్రద్ధతో పితరులకు తర్పణాలు వదిలి ముల్లోకాలరుణాలు తీర్చుకొన్నాడు .అప్పటినుంచి అది ఋణవిమోచన తీర్ధంగా ప్రసిద్ధి చెందిందని నారదమహర్షికి బ్రహ్మ తెలిపాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-18-ఉయ్యూరు
—